పునీత - కథ - కమామిషు

కథలకి కమామిషులు చెప్పడం రాయడం నా పాలసీకి విరుద్ధం.
కథ అర్ధం చేసుకోవడానికి అవసరమైన విషయాలన్నీ కథలోనే ఉండాలి. దాన్ని గురించి మళ్ళీ వివరణలూ విచారణలూ నాకు పడవు.

అట్లాంటిది ఈ పునీత కథ గురించి మిత్రులు లలితగారు కొన్ని ఆసక్తి కరమైన ప్రశ్నలు వేశారు. దాంతో కొంచెం ఆలోచించక తప్పింది కాదు నాకు. రచయితగా నాకున్న పరిమితులని, రచనా ప్రక్రియలో నాకు నేను కట్టుకుంటున్న గోడల్ని, ఈ కథ నేపథ్యంలో తడిమి చూసే అవకాశం చిక్కింది. ఆ ఆలోచనని కొద్దిగానైనా పంచుకోవాలని ఈ ప్రయత్నం. అంతేకాని, ఇప్పుడైనా, ఇది నా కథకి వివరణ కాదు.

ప్ర 1. ఈ విషయం పై ఇష్టంగా, ఓ మాదిరి కసితో వ్రాసే వారు చాలా మందే ఉంటారు. మీరు కూడానా? 
జ. నేను కాదు. 
నేను వేరు, నా పాత్రలు వేరు.  నా పాత్రల పట్ల నేను "కోల్డ్" గా వ్యవహరించాననే వ్యాఖ్యలు కూడా వచ్చాయి ఇంతకు మునుపు. నా పాత్రల భావోద్వేగాలనించి నేను కచ్చితంగా దూరంగా ఉంటాను. ఈ కథలోనూ అంతే.

ప్ర 2. మనం ఎలా పెరిగామన్నది మన చేతిలో లేదు కానీ మనం ఎలా ఎదగాలి అన్నది మన చేతిలో ఉందని తెలుసుకోవడం వల్ల వయసొచ్చాకైనా పెంపకాన్ని తిట్టుకుటూ కూర్చునే దుస్థితినుంచి తప్పించుకోవచ్చు కదా. closeknit communityలో పెరిగినప్పుడు ఒక్క మాటైనా చర్చ్లో ఫాదర్ కానీ, ఇతర సన్నిహితులు కానీ చెప్పకుండానే అతను పెరిగి ఉంటాడా? కనీసం కినేషా విషయంలో గొడవ జరిగిన తర్వాతైనా? ప్రపంచం అంటే తల్లిదండ్రులు మాత్రమే కాదు.

నిజమే. కానీ ఈ కథ అలా మొదలవలేదు.
ఈ కథ మొదట మొలకెత్తిన రూపం - ఒక నడి వయసు మగవాడు, నిలకడైన ఉద్యోగం లేక, ఒక జీవితాదర్శం లేక తెగిన గాలిపటంలా ఉన్నవాడికి అకస్మాత్తుగా ఒక లక్ష్యం, ఒక ప్రేమించ దగిన వస్తువు, ఒక జీవితాదర్శం దొరికింది.

మరికొన్ని అదనపు పరిమితులు వాటంతట అవే రూపుదిద్దుకున్నాయి
రాస్తున్నది నేను కాబట్టి ఆ వ్యక్తి ఇండియన్-అమెరికన్ అయుండాలి.
ఇప్పటికి చాలా మంది హిందూ అమెరికన్లని గురించి రాశాము కదా, ఒక క్రిస్టియను తెలుగు కుటుంబం అయితే ఎలా ఉంటుంది. ఇక్కడ నిజానికి ఆ కుటుంబం హిందువైనా, ముస్లిమైనా, క్రిస్టియనైనా కథలో జరిగిన పరిణామాలు పెద్దగా మారవని నా అభిప్రాయం. ఇది మతపరమైన పరిణామం కాదు అని సూచించడానికి క్రిస్టియను కుటుంబాన్ని ఎన్నుకున్నాను. నేను పెరిగిన వూళ్ళో ఇటువంటి క్రిస్టియను కుటుంబాలు నాకు బాగా పరిచయమే.
ఇక అతను దిగజారడం, మళ్ళి అతనికి జీవితంలో ఆశ కలగడం రెండూ ఒకే సంఘటన నించి జరిగితే బాగుంటుంది.  .. ఇదొక అంతస్సూత్రం అన్న మాట. అలాగ యుక్త వయసులో ప్రియురాలు, కుటుంబం ఆ బంధాన్ని నిషేధించడం, ఆ ప్రియురాలిద్వారా పుట్టిన పాప అతనికి మళ్ళీ జీవితాదర్శం కల్పించడం అలా ఏర్పడింది.
ఈ స్థితికి చేరేటప్పటికి ఈ అంశాలన్నీ సిద్ధాంతానికి ఏగ్జియంస్ లాగా, కథకి మూల స్తంభాలుగా ఏర్పడిపోయాయి. అంటే ఇక మీదట నేను ఏ What if సినారియోలు పరిచినా, ఈ మూలస్తంభాలు కదలవు.

అంచేత లలితగారు అడిగిన ప్రశ్నకి అన్వయిస్తే ..  క్రిస్ నడివయసులో ఒక దిగజారిన స్థితిలో ఉండడం దగ్గరే కథ పుట్టింది.  వేరే ఏ చర్చి ఫాదర్ ద్వారానో మిత్రుల ద్వారానో అతను మంచిగా ప్రభావితుడైనట్టు చూపించవచ్చు కదా అంటే, అది ఇప్పుడిక అసాధ్యం ఐపోయింది.

ప్ర 3. "హోప్" ని ప్రవేశపెట్టిన తీరు పంచ్ ఇచ్చినా, ఇంకో విధంగా, తక్కువ నాటకీయంగా ప్రవేశపెడితే బాగుండునేమో. అంటే కూతురిగానో ప్రేయసిగానో, ఇంకో వ్యక్తి, లేదా సంబంధంగా కాక ఇంకే విధంగానైనా, మార్పు కలిగించే సన్నివేశంలా ప్రవేశపెడితే బావుండునేమో.
జ. సాధారణంగా నా కథల్లో ఆఖరి నిమిషం ట్విస్టులూ పంచులూ ఉండవు. దీని ముగింపు కూడా మరికాస్త విపులంగా రాయాలనే మొదటి ఉద్దేశం. కానీ అప్పటికే నిడివి ఎక్కువైంది. ఈ కథని మళ్ళీ గనక సవరిస్తే, ముగింపుని తిరగరాస్తాను. ఐతే ఒక విషయం. క్రిస్ లో అప్పటికే మార్పు మొదలైంది. ఆ మార్పుని గుర్తించే ఫాదర్ మార్క్ అతనికి హోప్ ని ప్రసాదించారు. ఆ విధంగా క్రిస్ కి జీవితంలో రెండో ఛాన్స్ దొరికింది, క్రిస్ పునీతుడయ్యాడు. కనీసం ఆ ముగింపులో సూచించాలని, సూచించానని నేను అనుకున్నది ఇది.  

నా స్వగతం కొంచెం .. కథ రూపుదిద్దుకున్న పరిణామం కొంచెం

క్రిస్ దిగజారడానికి, తనజీవితాన్ని తాను నాశనం చేసుకోడానికి తల్లి నిర్మలాదేవి మనస్తత్వం కారణమైందా అనేది చాలా మంది పాఠకులని బాధించిన ప్రశ్నయేమోనని నాకనిపించింది, దీని మీద వచ్చిన వ్యాఖ్యలన్నీ చదివాక.

ఇంతకు మునుపు చెప్పినట్టు కథకి కేంద్ర బిందువు, ప్రస్తుతంలో క్రిస్ పూర్తిగా దిగజారిపోయి జీవితంలో అట్టడుగున పడి ఉండడం. ఇది స్టార్టింగ్ పాయింటు. నేను రాసుకున్న మొదటి విస్తరణలో అతన్ని కినేషా నించి విడదీసి నిర్బంధించినది అతని తండ్రి అన్నట్టుగా రాసుకున్నాను. బెల్టు దెబ్బలు, బేస్మెంటులో చీకటి గుయ్యారంలో నిర్బంధించడం వంటి బీభత్సమైన దృశ్యాలు కూడా రాశాను. అవేవీ తృప్తినివ్వకపోగా, ఏదో లోపించినట్టు అనిపించింది. అప్పటికే పద్ధెనిమిదేళ్ళ వాడై, క్రీడాకారుడు, దృఢకాయుడైన క్రిస్ తనే తిరిగి ఆ తండ్రిని నాలుగు దెబ్బలు పీకి ఉండును, మానసికంగా ఎంత దీన స్థితిలో ఉన్నా. సో, కథ అక్కడ ఆగిపోయింది. అలా ఈ సమస్య మీద ఆలోచిస్తున్నప్పుడు, ఈ అభ్యంతరం తల్లి దగ్గర్నించి వస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. కొడుకు మీద తల్లి ప్రభావం, అధికారం సున్నితంగా సటల్ గా ఉంటుంది, తండ్రి అధికారంతో పోలిస్తే. అలా నిర్మలాదేవి పాత్ర, ఆమె వ్యక్తిత్వము రూపు దిద్దుకున్నాయి.

ఐతే నేను ఊహించని ఎఫెక్టు ఒకటి కథలోకి జొరబడింది. క్రిస్ దిగజారడం, మళ్ళీ బాగుపడ్డం నా ముఖ్య ఉద్దేశం అయితే, ఈ మార్పుల తరవాత కథలో ఫోకస్ మొత్తం క్రిస్ మీద నిర్మలాదేవి ప్రభావం అయి కూర్చుంది. ఫెస్ బుక్ లోనూ, బ్లాగులోనూ మిత్రులు వ్యాఖ్యానించేదాకా ఇది నేను గమనించుకోలేదు. రచయితగా ఇది నా పరిమితి.

అంచేత, ఈ కథని మిత్రులు చర్చించడం, దాన్ని గురించి నేను మళ్ళీ ఆలోచించాల్సి రావడం, నాకు చాలా ఉపయోగించింది.
లలితగారికీ, వ్యాఖ్యానించిన మిగతా మిత్రులందరికీ మరోసారి నెనర్లు.

Comments

lalithag said…
మీ కథని అనే కంటే కథ వ్రాయడం, దానికి ఉన్న పరిమితుల గురించిన విశ్లేషణ ఆలోచింపజేసేలా ఉంది. నా వ్యాఖ్యలు అందుకు ఉపయోగపడినందుకు సంతోషంగా ఉంది. మీ విశ్లేషణ, కథ వ్రాయడం మిగిలిన వారి అభిప్రాయాలు కూడా చదువుతున్న కొద్దీ, కథకి ఉండే నిడివి కూడా మీరు చెప్పదలచుకున్నదానికి పరిమితి కల్పించిందేమో అని నాకు అనిపించింది. అదే అభిప్రాయం ఇంకొందరు కూడా వ్యక్తం చేసినట్టున్నారు.
ఇక, మొదటి ప్రశ్న "మీరు కూడానా" అన్న దానికి నేను వివరణ ఇచ్చాను కదా. నా ఉద్దేశం మీ పాత్రలు మీ ఉద్వేగాలని ప్రతిబింబించాయి అని చెప్పడం కాదు. నా ఉద్దేశం, మీ పాత్రలు బలహీనంగా ఉండవు అన్న నా expectation కి సంబంధించినది.
నా అభిప్రాయాలు వ్యక్తం చేసేశాక, మీ జవాబులు, మిగిలిన పాఠకుల వ్యాఖ్యలూ, మీరు ఈ టపాలో పంచుకున్న ఆలోచనలు, నేను కథలు ఎలా చదువుతాను అని మళ్ళీ ఇంకోసారి ప్రశ్నించుకునేలా చేసింది. ప్రతి పాఠకుడు, వారి కథని చదువుతారట, రచయిత వ్రాసినది కాదట :) ఎక్కడో చదివాను. నా విషయంలో అది నిజం అనిపిస్తుంది. కానీ ఇలాంటి చర్చల వల్ల కొద్దిగా ర్చయిత వ్రాసే కథని చదవడానికి దగ్గర అవ్వగలననే ఆశ కలుగుతుంటుంది.
Kottapali said…
లలితగారూ, "రచయిత వ్రాసే కథని చదవడానికి దగ్గర అవ్వగలననే ఆశ" .. :)
"మీ పాత్రలు బలహీనంగా ఉండవు అన్న నా expectation" .. ఈ పాయింట్ కూడా ఈ టపాలో చర్చిద్దాం అనుకున్నాను గానీ దానికి మరికొంత విస్తృతమైన వాతావరణం కావాలి అనిపించింది. దీనిమీద మనం వేరే మాట్లాడుదాం.