పునీత - కథఇవ్వాళ్ల సోమవారం. ఇంకా వారం సరిగ్గా మొదలన్నా కాలేదు. .. ఇవ్వాళ్ల రెండు విచిత్రాలు జరిగాయి.

ఆఫీసుకి వెళ్తూనే నా మేనేజర్ పాల్ దగ్గర్నించి ఈమెయిల్.
క్రిస్, పదింటికి మీటింగ్. ఫలాని కాన్ఫరన్సుగదిలో.
ఈడికేం కావాలో సోమవారం పొద్దున్నే అనుకుంటూ నా పనిలో మునిగిపోయా. మీటింగ్ టైమయిందని కంప్యూటరు హెచ్చరించింది. నోటుపుస్తకం తీసుకుని గది కెళ్తే అక్కడ పాల్‌తో బాటు ఇంకో మేనేజర్ కూడా ఉన్నాడు. ఇంత తతంగం నా ఉద్యోగం ఊడగొట్టడానికి. పొద్దునే ఒక మెయిలు పెట్టుంటే అసలు ఆఫీసుకి వచ్చేవాణ్ణి కాదుగా. ఆహా .. ఈ వారం భలే గొప్పగా మొదలైంది అనుకుని ఇంటికి బయల్దేరాను. నిజానికి ఇది పెద్ద విచిత్రం కాదు, రేపో ఎల్లుండో జరుగుతుందని నేను ఎదురు చూస్తున్నదే. నా జీవితంలో గత పదేళ్ళుగానూ జరుగుతూ ఉన్నదే. అందుకే పెద్ద ఫీలవలేదు.
పదిన్నరకి ఆఫీసు వదిలి పెట్టాను. పదకొండుకల్లా ఎపార్టుమెంటు కాంప్లెక్సుకి వచ్చేశాను. వస్తూ వస్తూ దార్లో స్టెర్లింగ్ హైట్సులో హాల్ రోడ్డు మీద బుషేమీ లిక్కర్ షాపులో రెండు సీసాల స్మిర్నాఫ్ వోడ్కా కొనుక్కొచ్చాను. ఇంతకు మునుపు తాగేవాణ్ణి కాదు. అమ్మ ఉండేది. రెండేళ్ళ కిందట అమ్మ పోయాక తాగడం మొదలెట్టాను. అపార్టుమెంటు కాంప్లెక్సుకి చేరే లోపల ఒక సీసా పావు వొంతు తేలికపడింది. నా బుర్రలో ఒక జోరీగ సుర్రు సుర్రని సుడులు తిరుగుతోంది. బలే సమ్మగా ఉంది. అలవాటు చొప్పున మెయిల్ బాక్సు తెరిచాను కాబోలు. ఎదురుగా ఉంది ఉత్తరం. తెల్ల కవరు. మామూలు ఉత్తరం లాంటి తెల్ల కవరు. పైన నీట్ గా నీలపుసిరాతో రాసిన నా పేరూ ఎడ్రసూ. నాకు ఉత్తరమొచ్చింది. ఇదే రెండో విచిత్రం. అప్పుడే ఇంత కిక్కెక్కేసిందా అని కళ్ళు నులుముకుని చూశాను, పోనీ ఇంకెవరిదైనానేమో అని. నాదే. అదిగో నా పేరు - క్రిస్టొఫర్ తాడిపర్తి. నా ఈ ముప్ఫయ్యేడేళ్ళ జీవితంలో నాకంటూ ఎప్పుడన్నా ఉత్తరమొచ్చిందా? వెరైజన్ బిల్లులూ, కార్నివాల్ క్రూజ్ ఆఫర్లూ కాదు - నిజ్జంగా ఒక మనిషి రాసిన ఉత్తరం. ఈమెయిలు కాదు, నిజమైన కాయితమ్మీద రాసిన ఉత్తరం, నిజమైన కవర్లో, పైన నిజమైన చేతి రాతలో నా ఎడ్రసుతో. ఏమో వచ్చిందేమో ఎప్పుడన్నా. ఈ మధ్యకాలంలో అయితే కాదు. కొన్ని యేళ్ళయి ఉండొచ్చు.

సీసాలోంచి ఇంకో గుక్క తాగి, తలుపు తెరుచుకుని ఇంట్లోకొచ్చాను. తాళాలతో బాటు ఉత్తరాన్ని కూడా పక్కనున్న బల్ల మీద పడేసి, రెండు సీసాలూ పట్టుకుని వెళ్ళి సోఫాలో చతికిల బడ్డాను. ఎదురుగా టీవీ. దాని పక్కన అమ్మా నాన్నా ఫొటో. అలా చూస్తూనే ఇంకో గుక్క తాగాను. ఫొటోలోనించి అమ్మ కళ్ళు నన్నే చూస్తున్నై. ఇంకో గుక్క. అమ్మ కళ్ళు పెద్దవయ్యాయి. ఇంకో గుక్క. అమ్మ కళ్ళు కోపంగా, అసహ్యంతో నిండి. ఇంకో గుక్క. అమ్మ కళ్ళు కాళిక కళ్ళల్లే. గటగట నాలుగు గుక్కలు.
*** *** ***

క్రిస్టొఫర్ ఆ రోజు బడి ఐపోయాక గంటన్నరసేపు ఫుట్ బాల్ ఆడుకుని వచ్చాడు, అమ్మ చేతిలో ఏం తిట్లు తినాల్సి వస్తుందో అని భయపడుతూ. పదో తరగతి పరీక్షలు ఇంకా రెణ్ణెలల్లో ఉన్నాయి. కానీ ఆశ్చర్యంగా నిర్మలాదేవి వాణ్ణి తిట్టకపోగా, వాడు ఇంట్లోకి రాగానే కేకు పెట్టింది. వాళ్ళ కుటుంబానికి అమెరికా వలస వెళ్ళే అవకాశం వచ్చింది ఆ రోజు, ఫేమిలీ ఇమిగ్రేషన్ అట. తిట్లూ తన్నులూ తప్పాయని సంతోషపడ్డాడు క్రిస్టొఫర్. కానీ ఈ సంఘటన తన జీవితాన్ని ఎలా మార్చేస్తుందో వాడికి ఆ క్షణంలో తోచలేదు.

నిర్మలాదేవి సులభంగా తృప్తిపడదు. ఒక ప్రభుత్వాసుపత్రి డాక్టరు భార్యగా, ఒక చిన్న క్రిస్టియను బడి ప్రిన్సిపాలుగా విజయవాడలాంటి వూళ్ళో మగ్గుతూ, ఇద్దరు పిల్లల తల్లిగా ఇమిడిపోవడం ఆవిడ ఉద్దేశం కాదు. ఎగరాలి పైకెగరాలి. రెక్కల సత్తువ అందుకే ఇచ్చాడు దేవుడు. డా. థామస్‌తో పెళ్ళైనప్పటినించీ ఆయన కెరీర్‌ని ముందు ఆకాశానికెత్తాలని ప్రయత్నించింది. ప్రభుత్వాసుపత్రికి అలవాటు పడిపోయిన ఆయన ప్రాణం ఆవిడ స్కీములకి లొంగలేదు. ఆయన్ని వదిలేసి తన పరిధిలో చేతికందిన చిన్నచిన్న వ్యాపారాలు మొదలు పెట్టింది. చీటీలు కట్టింది. బీమా ఏజెన్సీ చేసింది. చర్చిలో అత్తమామల పరపతీ, బడిలో తన అధికారమూ, ఆస్పత్రిలో భర్త అధికారాన్నీ పూర్తిగా వినియోగించుకుంది. పిల్లలిద్దర్నీ చిన్నప్పటినించీ తన లక్ష్యాలకి తగినట్టు తీర్చి దిద్దుతూ ఉన్నది. కూతురు జెన్నిఫర్ మంచి ప్రైవేటు జూనియర్ కాలేజిలో కామర్సు గ్రూపుతో ఇంటరు చదువుతోంది. ఆమె ఎంబీయే చదవాలి. క్రిస్టొఫర్ డాక్టరవ్వాలి. ఒట్టినే డాక్టరవడం కాదు, అమెరికాలో న్యూరోసర్జన్ అవ్వాలి. ఎటొచ్చీ వాడికి ఆటల మీద ఉన్న ధ్యాస చదువు మీద లేదు. నిర్మలాదేవి దృష్టిలో ఈ వలస ఆహ్వానం సరిగ్గా రావలసిన సమయంలోనే వచ్చింది. కొడుకునీ కూతుర్నీ కూర్చోపెట్టి, అమెరికాకి ఎలా వెళ్ళాలో, అమెరికాలో తమ భవిష్యత్తు ఎంత ఉజ్జ్వలంగా ఉండబోతుందో ఉత్సాహంగా చెబుతున్నది.

డా. థామస్ కి ఇప్పుడు ఉన్నట్టుండి అమెరికాకి వలస వెళ్ళాల్సి రావడం ఏమీ నచ్చలేదు. తన ఇష్టప్రకారంగా నడిచే ఉద్యోగం. సాయంత్రం పూట క్లబ్బు కెళ్ళి రెండు రౌండ్లు డ్రింక్సు, నాలుగు రౌండ్లు బ్రిడ్జీ, ఊళ్ళో కావలసినంత గౌరవం, చుట్టూతా బంధువులూ స్నేహితులూ. కానీ ఈ విషయంలో ఆయన ఇష్టాయిష్టాలకి తావులేదు. నష్టం రాకుండా త్వరితంగా నగదు ముట్టే వస్తువులూ ఆస్తులూ అన్నీ అమ్మేశారు. ఆన్నీ నిర్మలాదేవే జాగ్రత్తగా పద్ధతి ప్రకారంగా నిర్వహించింది. ఇక్కణ్ణించి ఏమేమి పట్టుకెళ్ళాలో, కొత్తగా ఏమేమి కొనాలో అన్నీ సమకూర్చుకోవడం అంతా యుద్ధ ప్రాతిపదికన జరిగింది. నిర్మలాదేవి ఒక జెనరల్. జెన్నిఫర్ ఆమెకింద లెఫ్టెనెంట్. డా. థామస్‌కి కానీ క్రిస్టొఫర్ కి గానీ పెద్ద పని లేదు, వస్తువుల్ని పాక్ చెయ్యడం తప్ప.
***

ఫోను మోగడంతో మెలకువొచ్చింది. అక్క! టైము ఐదున్నర చూపిస్తోంది. పేగులు కరకరలాడుతున్నాయి. నోరంతా పచ్చిగా ఉంది. సీసా తీసి నోటినిండా వోడ్కాతో నోరు పుక్కిలించి మింగాను. ఫోను అదే అగిపోయింది. ఏవన్నా తినాలి. పేగులు కరకర. ఫోను మళ్ళీ మోగుతోంది. మళ్ళీ అక్కే. మాట్లాడాలని లేదు. ఫోను అక్కడే ఒదిలేసి బాత్రూముకి పోయొచ్చాను. ఉత్తరం గుర్తొచ్చింది. పేగులు కరకర. టర్కీ శేండ్విచ్ చేసుకుని తిన్నా వోడ్కా నంచుకుంటూ.

ఉత్తరం గుర్తొచ్చింది. ఆకలి తీరింది గానీ తల దిమ్ముగా ఉంది. ఇప్పుడా ఉత్తరం చదవబుద్ధి కాలా. ఫోను తీసుకుని అక్క మెసేజి విన్నాను.

"ఒరే క్రిస్, నీకేవన్నా ఉత్తరమొచ్చిందా ఇవ్వాళ్ళ? నువ్వు ఫోనెందుకు ఎత్తట్లేదు? ఇదిగో, ఆ ఉత్తరం తెరవకు, ఓకే? పారేశెయ్యి. కాదు కాదు, స్టవ్ మీద నిప్పులో కాల్చేసెయ్యి, ఓకే? మెసీజి చూసుకోగానే ఫోన్ చెయ్యి."

ఏంటిది? ఇన్వెస్టుమెంట్ బేంకుల్లో పని చేసీ చేసీ ఈ జెన్నిఫర్ కి పిచ్చేవన్నా ఎక్కిందేమో? ఉత్తరమేంటీ? ఓ అవును, ఉత్తరం, వచ్చింది కదా. వోకే. అవునూ, నాకు ఉత్తరం వచ్చినట్టు అక్కకి ఎలా తెల్సు? తనే పంపిందా? తనే పంపితే చదవకుండా కాల్చెయ్యమంటదేంటి? హమ్మ్. ఏదో మిస్టరీ. ఇప్పుడీ మిస్టరీ ఒద్దు, ఏ హిస్టరీ వొద్దు. మిస్టరు స్మిర్నాఫే ముద్దు.
***

తాడిపర్తి కుటుంబం అమెరికాలో మిషిగన్ రాష్ట్రంలో ట్రాయ్ అనే నగరానికి వచ్చారు. ట్రాయ్ లో ప్రసిద్ధి చెందిన సెయింట్ అనాస్టసియా కేథలిక్ చర్చిలో చేరారు. ఆ చర్చిలో అందరూ విద్యాధికులూ, ట్రాయ్ నగరంలోని ప్రముఖులూ ఉంటారని ముందుగానే విచారించి నిర్మలాదేవి ఈ నిర్ణయం తీసుకున్నది. డా. థామస్ అయిష్టంగానే ఏదో చిన్న ఉద్యోగంలో చేరి, అంతకన్నా అయిష్టంగా మెడికల్ పరిక్షలకి చదవడం మొదలెట్టాడు. నిర్మలాదేవి ఒక బేంకులో టెల్లరుగా చేరి తన కుటుంబ వృక్షం వేళ్ళూనుకోవడానికి ఏమేం చెయ్యాలో పథకాలు వెయ్యడం మొదలెట్టింది. జెన్నిఫర్ విషయం కొంచెం కష్టమయింది. నేరుగా కాలేజీలో చేరేందుకు ఆలస్యమయింది. అందుకని ముందు ఓక్లాండ్ కమ్యూనిటీ కాలేజిలో వ్యాపారవిద్యకి సంబంధించిన కోర్సులో చేరింది. క్రిస్టొఫర్‌ పదోతరగతి మళ్ళీ చదవాల్సి వచ్చింది కానీ ప్రఖ్యాతి గాంచిన ట్రాయ్ హైస్కూల్లో సీటు దొరికింది.

ఎటొచ్చీ డా. థామస్ విషయంలోనే నిర్మలాదేవి అంచనాలు అనుకున్నట్టుగా సాగలేదు. పైపై అజమాయిషీకి బాగా అలువాటు పడిన డా. థామస్ ఆవయసులో అమెరికా వైద్య ప్రవేశపరీక్షలు గట్టెక్కలేకపోయాడు. రెండేళ్ళు ఆ పరీక్షలతో కుస్తీ పట్టి బోలెడు డబ్బులు తగలేశాక అతను చేతులెత్తేశాడు నావల్ల కాదని. పరిస్థితులు వేరేగా ఉంటే నిర్మలాదేవి అతన్ని సులభంగా విడిచిపెట్టి ఉండేది కాదు గానీ సరైన ఆదాయం లేకపోవడమూ, ఈ పరీక్షల పేరిట ఖర్చు విపరీతంగా జరుగుతుండడమూ గమనించుకున్నాక వేరే దారులు వెతకక తప్పలేదామెకి. అతను అప్పటికే అక్కడికి కొంత దూరంలో ఉన్న భారతీయ గ్రోసరీ షాపులో పని చెయ్యడం వల్ల దానికి సంబంధించిన అనుభవం కొంత అబ్బింది. ట్రాయ్ చుట్టుపక్కల భారతీయ జనాభా బాగా పెరుగుతుండడం గమనించింది ఆవిడ. పప్పులు ఉప్పులు కావాలంటే కనీసం పది మైళ్ళ దూరం పోవాల్సి వస్తోంది. బాగా ఆలోచించి భారతీయ గ్రోసరీ షాపు తెరవడానికి నిర్ణయించింది.

చర్చిలో తను పెంపొందించుకున్న స్నేహాల బలంతో ఆమె దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చురుకుగా సాగించింది. ఎప్పటిలాగానే జెన్నిఫర్ ఆమెకి తగిన లెఫ్టినెంట్. అప్పటికే జెన్నిఫర్ వేషభాషల్లో అమెరికను పోకడలని బాగా సాధించింది. డా. థామస్ కేవలం ఒక విగ్రహమూర్తి. చూస్తుండగానే ట్రాయ్ కి నడిబొడ్డులాంటి కూడలిలో ఒక చిన్న షాపు తెరిచారు. అందులో అన్నిరకాల పప్పులు, ఉప్పులు భారతీయ తిండి పదార్ధాలతో పాటు తెలుగు, హిందీ, తమిళ సినిమాల విడియో టేపులు అద్దెకివ్వడం కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు మాత్రం నిర్మలాదేవి అంచనా సరిగ్గా పనిచేసింది. డా. థామస్ కి కూడా ప్రాణం హాయిగా ఉంది. గల్లాపెట్టి దగ్గర కూర్చోవడం, వచ్చే పోయే కస్టమర్లతో బాతాఖానీ వెయ్యడం - అంతే ఆయన చెయ్యాల్సింది. వ్యాపారం నడవడానికి వెనక జరగాల్సిన తతంగమంతా ఎలాగూ నిర్మలాదేవే చూసుకునేది జెన్నిఫర్ సహాయంతో.

***

వోడ్కా మత్తు మెత్తగా హాయిగా ఉంది. కౌచ్‌లో పడుకోవడంతో నడుము నొప్పెడుతున్నా లేవబుద్ధి కాలేదు. మధ్య మధ్యలో ఫోను మోగుతోంది. కిటికీలోనించి సూర్యకాంతి నేరుగా మొహమ్మీద పడి ఇంక భరించరాకుండా అయింది. లేవక తప్పలేదు. ఫోను తీసుకుని టైము చూశాను. మూడు చూపిస్తోంది. వారం మంగళారం. పక్కన టేబుల్ మీదికి చెయ్యి పోనిచ్చి బాటిల్ కోసం తడిమాను. ఖాళీ. నిన్న రెండు బాటిల్స్ తెచ్చినట్టు గుర్తు? బలవంతంగా కౌచ్ లో లేచికూర్చుని రెండోదాని కోసం వెతికాను. అది పక్కకి దొర్లిపోయి ఉంది - అదీ ఖాళీ. వోకే. నో ప్రాబ్లం. బయటికెళ్దామని కారు తాళాలకోసం చూస్తే, తాళాల కింద ఉత్తరం.

నిన్న అక్క మెసేజి గుర్తొచ్చింది.

అనాలోచితంగా కవరు తెరిచాను.

ప్రియమైన క్రిస్టొఫర్,

ఎలా ఉన్నావు? నేను గుర్తున్నానా?

నువ్వు మరిచిపోయావేమోగాని, నేను మాత్రం నిన్నెప్పుడూ మర్చిపోలేదు. నువ్వు చర్చి కార్యక్రమాలకి రావడం మానేసినా, తరవాత నేను ట్రాయ్ నించి బదిలి ఐ వెళ్ళిపోయినా నిన్ను నేను గమనిస్తూనే ఉన్నాను.

అప్పటి నీ స్నేహితురాలు, కినేషా గుర్తుందా? ... .. ..

***

ఇంట్లో అప్పటిదాకా ఒక కారే ఉంది. దానితోనే సర్దుకుంటున్నారు కిందుమీదవుతూ. జెన్నిఫర్ కాలేజి క్లాసులు, క్రిస్టొఫర్ హైస్కూలు క్లాసులు, నిర్మలాదేవి ఉద్యోగానికి వెళ్ళడం, డా. థామస్ వ్యాపారం - పిల్లలకి తోటి విద్యార్ధులు రైడ్ ఇవ్వడం, చుట్టుపక్కల వాళ్ళు సహాయం చెయ్యడం, ఎలాగో నెట్టుకొస్తున్నారు. వ్యాపారం రెండేళ్ళు నడిచాక, పరవాలేదు, కొంచెం నిలదొక్కుకున్నాం అన్న ధైర్యం వచ్చాక ఇంకోకారు కొనాలని నిర్ణయించింది నిర్మలాదేవి. పాతకారు ఇక తమకోసమే అని జెన్నిఫర్, క్రిస్టొఫర్ ఇద్దరూ సంతోషిస్తున్నారు. తమతమ అవసరాలని బట్టి ఇద్దరూ దాన్ని పంచుకుని వాడుకోవచ్చు నిజానికి. కానీ ఒకరోజు రాత్రి భోజనాల దగ్గర నిర్మలాదేవి నోరు జారి కారు ముఖ్యంగా క్రిస్టొఫర్‌ది, జెన్నిఫర్ ఎప్పుడైనా కావాలంటే వాడుకోవచ్చు అన్నట్టుగా ఒక మాట అన్నది. జెన్నిఫర్‌కి తిక్కరేగి వాళ్ళమ్మతో పోట్లాటకి దిగింది. పిల్లలదగ్గర్నించి ఎదురు ప్రశ్నించని విధేయత తప్ప ఇంకెటువంటి ప్రవర్తన చూడాని నిర్మలాదేవి మొదట తెల్లబోయింది. జెన్నిఫర్‌కి నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. తల్లి శాంతంగా మాట్లాడిన కొద్దీ జెన్నిఫర్ శాంతించకపోగా ఇంకా చెలరేగిపోయింది. క్రిస్టొఫర్, డా. థామస్ ఇద్దరూ మ్రాన్పడిపోయి చూస్తున్నారు. జెన్నిఫర్ కోపంతో ఊగిపోతూ, చూపుడువేలు క్రిస్టొఫర్ మొహమ్మీద ఆడిస్తూ - ఎందుకు వీడికి కారు? వాడి నల్లముండని వేసుకుని షికార్లు తిరగడానికా - అనరిచింది కీచుగొంతుతో.
ఆ రాత్రి నిర్మలాదేవి క్రిస్టొఫర్ గదిలోకి వచ్చింది. పుస్తకం తెరిచి చదివే ప్రయత్నం చేస్తున్నాడన్నమాటే గాని క్రిస్టొఫర్ కళ్ళు అక్షరాల్ని చూడట్లేదు. మనసు ఆందోళనతో, భయంతో నిండి ఉంది. తల్లి లోపలికి రాగానే ఏం జరుగుతుందో అని ఉలిక్కిపడ్డాడు. ఆవిడ సీరియస్ గా ఉంది కానీ శాంతంగానే ఉంది. వాడి భయం పోయేట్టు ముందు వాణ్ణి లాలించింది. బుజ్జగించింది.
ఎవరా అమ్మాయి, ఎక్కడీ వాళ్ళని అడిగింది. నల్లవాళ్ళా? అంటే నిజం నల్లవాళ్ళు కాదు, పోర్టొరికోనించి వచ్చారా? ఓహో, హేంట్రామక్‌లో ఉంటారా? అంత మంచి ప్రదేశం కాదే. పోనీలే, వాళ్ళ నాన్నగారేం చేస్తారూ? లేరా? ఓహో. అమ్మా, అమ్మమ్మా ఉంటారా ఇంట్లో? పన్నెండు చదువుతోందా ఆ అమ్మాయి కూడా? ఓహో. ఏంటీ, చర్చి ప్రోగ్రాములో కలిశారా? మన చర్చితోనే? ఫాదర్ మార్క్ చేసిన ప్రోగ్రాములోనా? ఓహో. బానే ఉంది కానీ, చూడునాన్నా, అసలు మనమేంటో తెలుసా? మన వంశమేంటో తెలుసా? మనది తెలుగు కేథలిక్కుల్లో అతి పురాతనమైన వంశం. మనది చాలా పవిత్రమైన కుటుంబం. తప్పు నాన్నా, మనలాంటి వాళ్ళు ఎవరితోబడితే వాళ్ళతో కలవకూడదమ్మా. నీకెందుకు, నువ్వు చక్కగా అన్నీ మరిచి పోయి కాలేజిలో చేరి చదువుకో. మనం అనుకున్నట్టుగా డాక్టరవ్వు. ఇండియానించి రాజకుమారిలాంటి పిల్లని తెచ్చి నేను చేస్తానుగా నీకు.
రెండు గంటల తరవాత నిర్మలాదేవి ఆ గదిలోనించి బయటికి వెళ్ళేముందు క్రిస్టొఫర్ మళ్ళి ఎప్పుడూ ఆ అమ్మాయిని చూడనని మేరీమాత మీద తల్లికి ప్రమాణం చేశాడు.
***
ఓ కినేషా, కినేషా, కినేషా! కేరమెల్ రంగు కినేషా! కేరమెల్లంత తియ్యటి కినేషా! ఈ అసమర్ధుణ్ణి క్షమించు కినేషా.
బాత్రూములోకెళ్ళి, బాత్ టబ్బులో చల్లటి నీళ్ళు తెరిచి, తల నీటిధారలో పెట్టాను. ఐదు నిమిషాలు చల్లటి నీళ్ళలో తడిసేటప్పటికి బుర్రకి పట్టిన మబ్బులు కొంచెం తొలిగాయి.
***

ఆ క్షణంలో తల్లిని ఎదుర్కోలేక నిర్మలాదేవికి ప్రమాణం ఐతే చేశాడుకానీ ఆ ప్రమాణాన్ని నిలుపుకోవడం చేతకాలేదు క్రిస్టొఫర్‌కి. ఒక వారం రోజులు నిగ్రహించుకున్నాడు కినేషా ఇంటివేపుకి వెళ్ళకుండా. బడివేళ కాని సమయాల్లో నిర్మలాదేవి వాణ్ణి వెయ్యికళ్ళతో కనిపెట్టి ఉంటోంది. చర్చికి సంబంధించిన యూత్ కార్యక్రమాలు, సేవాకార్యక్రమాలకి కూడా వెళ్ళక్కరలేదంది. తల్లి గీసిన గీటు దాటడం క్రిస్టొఫర్‌కి అలవాటు లేదుకానీ ఆ పూట వాడి మనసు అలజడి రేపిన కల్లోలం తల్లిపట్ల విధేయతని నొక్కేసింది. బుధవారం నాడు సాయంత్రం బేండ్ ప్రేక్టీసుకోసం కినేషా తన బడి టీముతోకలిసి ట్రాయ్ మైదానానికి వస్తుందని, మధ్యాన్నం క్లాసులు ఎగ్గొట్టి ఐదు మైళ్ళు నడిచి ఆ మైదానానికి వెళ్ళాడు. కినేషా తన టీముతో బస్సుదిగి మైదానంలోకి వెళ్ళబోతుంటే వెనకనించి పిలిచాడు. కినేషా వచ్చింది. క్రిస్టొఫర్‌కి నోరు పెగల్లేదు. వారం పదిరోజులుగా వాడి మనసు కినేషా కినేషా అని పలవరిస్తూ ఉన్నది కానీ తీరా ఎదురు పడేటప్పటికి ఏం మాట్లాడాలో, అసలు ఏం చెప్పాలనుకున్నాడో వాడికి తోచలేదు. తడబడిపోయాడు. గబగబా ముందుకొచ్చి కౌగలించుకోబోయాడు. కినేషా చెయ్యిచాచి వాణ్ణి అక్కడే నిలబెట్టేసింది.

ఇంకా ఏం మిగులుందని వచ్చావు అనడిగింది. మీ అమ్మ మా యింటికి కాల్ చేసింది, క్రిస్. నా జీవితంలో ఎవ్వరూ ఎప్పుడూ నన్ను అంత అవమానించలేదు. నాగురించి నేను చిన్నతనంగా అసహ్యంగా ఫీలయ్యేట్టు చెయ్యలేదు ఆ రోజు వరకూ. నువ్వంటే చాలానే ఇష్టపడ్డాను క్రిస్. నీవారి పట్ల నువ్వు చూపించే బలమైన అభిమానం, అందరికీ సహాయంగా ఉండాలి అని తాపత్రయపడే నీ మనస్తత్వం, ముఖ్యంగా మిగతా అబ్బాయిల్లా కాకుండా ఆడవారి పట్ల గౌరవంగా మసిలే నీ స్వభావం, వీటన్నిటినీ చాలా ఇష్టపడ్డాను. కానీ నీ కోసం నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేను, క్రిస్. ఇంకెప్పుడూ నాతో మాట్లాడాలని చూడకు. నా దగ్గిరికి రాకు. వెళ్ళిపో.

అనేసి వెళ్ళిపోయింది, వెనక్కి తిరిగి చూడకుండా .. శాశ్వతంగా.

***

.. .. .. అప్పటి నీ స్నేహితురాలు, కినేషా గుర్తుందా?

అప్పట్లో మీ స్నేహంలో మీ అమ్మగారి జోక్యం గురించి నాకు తెలుసు.

కినేషా నాతో మాట్లాడుతూనే ఉన్నది. నాతో కలిసి పనిచేస్తూనే ఉన్నది.

నాకు ట్రాయ్ నించి సెయింట్ పాల్ బదిలీ అయినాక, కొన్నేళ్ళకి ఆమె కాలేజి ముగించి ఉద్యోగానికి మినియాపొలిస్ వచ్చింది. అలా మళ్ళీ నాతో కలిసి సేవా కార్యక్రమాల్లో పనిచేస్తూ వచ్చింది.

దురదృష్టవశాత్తూ కినేషాకి బ్రెస్ట్ కేన్సర్ సోకింది.

ఇంచుమించు పదేళ్ళపాటు దాంతో హోరాహోరీ పోరాడింది కానీ ఆర్నెల్ల కిందట కేన్సర్ ఆమె ప్రాణాల్ని బలితీసుకున్నది.

ఆమె వెళ్ళిపోతూ, నీకోసం ఒక బహుమతి వదిలి వెళ్ళింది. ఈ లెటర్ హెడ్ మీద మా సెమినరీ నెంబర్ ఉన్నది. కాల్ చెయ్యి.

ఈ డొంకతిరుగుడు అంతా ఎందుకు అని నువ్వు అనుకోవచ్చు. కారణం ఉన్నది.

నీ జీవితం అతలాకుతలం అయిందని నాకు తెలుసు. నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్నావనీ నాకు తెలుసు.

ఈ బహుమతిని నువ్వు మనస్పూర్తిగా కోరుకుంటున్నావు అని నాకు తెలియాలి. దానికి నువ్వు కనీసం ఒక మొదటి అడుగు వెయ్యాలి.

నా ఆశ వమ్ము చెయ్యవని ఆశిస్తున్నా.

నీకై ఆ దయామూర్తి మేరీమాతని ప్రార్ధిస్తూ

ఫాదర్ మార్క్
***

కినేషా తన జీవితంలోనించి అదృశ్యం అయినంత మాత్రాన క్రిస్టొఫర్ జీవితం తలకిందులైపోలేదు. అన్నీ యధావిధిగా జరిగిపోతున్నాయి. అప్పటికే పన్నెండో తరగతి దాదాపు పూర్తయి ఉన్నందున వాడి గ్రేడ్స్ బాగా వచ్చాయి. ముందే నిర్మలాదేవి ప్లాన్ చేసినట్టుగా యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌లో సీటొచ్చింది. కొంత యాంత్రికంగానే అయినా వాడి జీవితం బాగానే గడిచిపోతున్నది. ట్రాయ్‌లోనే ఉండి ఉంటే చర్చి కార్యక్రమాలు, తద్వారా మళ్ళీ ఎక్కడైనా కినేషా కనబడుతుందేమోననే కోరికా కలిగేవేమో. కేంపస్‌లో ఉండడం వల్ల అటువంటి సంచలనాలు ఏమీ లేవు. పంతొమ్మిదేళ్ళ పాటు తల్లి ఆదేశాలని ఎదురు ప్రశ్నించకుండా పాటించడం అలవాటైపోయింది వాడికి. దానికి విరుద్ధంగా ప్రవర్తించడం ఎలాగో తెలియదు. పొడుగు వారాంతాలకీ, శలవులకీ తలిదండ్రుల దగ్గరికి వచ్చి వెళ్తున్నాడు. క్లాసులకి వెళ్తున్నాడు, చదువుతున్నాడు, పరిక్షలు రాస్తున్నాడు, గ్రేడ్లు బాగానే వస్తున్నై. అన్నీ సవ్యంగానే జరిగిపోతున్నై. కానీ ఏదో వెలితి.

కాలేజిలో రెండో యేడు నడుస్తుండగా వాడికి మెల్లగా అర్ధమయింది ఆ వెలితి ఏమిటో. మొదట్లో అది కినేషా లేని లోటు అనుకున్నాడు, కానీ కాదు. తనకంటూ స్వంత వ్యక్తిత్వం లేకపోవడం వల్ల ఏర్పడింది ఈ వెలితి. తన కుటుంబసభ్యులతో, ముఖ్యంగా తల్లితో తారసపడినప్పుడల్లా ఈ వెలితి వాడి మనసుని కల్లోలం చెయ్యడం మొదలుపెట్టింది. ఈ వెలితిని పూరించాలంటే తన స్వంత వ్యక్తిత్వాన్ని నింపుకోవాలి. ఇరవయ్యేళ్ళుగా లేనిది ఒక్కసారి రమ్మంటే ఎక్కణ్ణించి వస్తుంది? తన జీవితమంతా తల్లి ఆశయాలని సాకారం చెయ్యడానికే నిర్దేశించబడింది. తల్లి ఆశయాల్ని నెరవేర్చడమే తన జన్మకి ఉన్న ఏకైక లక్ష్యం. తన వ్యక్తిత్వం బలపడాలంటే, ఒకటే మార్గం - తల్లి ఆశయాలని వ్యతిరేకించాలి. ఆవిడ ఆజ్ఞలని ఉల్లంఘించాలి. నిర్మలాదేవి క్రిస్టొఫర్ జీవితాన్ని గురించి ఏమేమి కలలు కన్నదో, వాడు ఏ గొప్ప విజయాలు సాధించాలని ఆశపడిందో వాటన్నిటినీ వమ్ము చెయ్యాలని కంకణం కట్టుకున్నాడు క్రిస్టొఫర్.

ఇప్పుడైనా పెద్ద విప్లవం ఏమీ జరగలేదు. కేకలూ, అరుపులూ ఏం జరగలేదు. నాలుగో సెమిస్టరులో వాడి గ్రేడ్లు దారుణంగా పడిపోయాయి. ఆ గ్రేడ్లు చూసి నిర్మలాదేవి తల్లడిల్లిపోయింది. లాలించింది. కోప్పడింది. నచ్చచెప్పింది. ఆగ్రహించింది. ఆశచూపించింది. వాడు దేనికీ పన్నెత్తి ఎదురు చెప్పలేదు. మళ్ళీ కేంపస్ కి వెళ్ళాడు. అయిదో సెమిస్టర్ అన్ని సబ్జక్టుల్లోనూ ఫెయిలయ్యాడు. ఆ క్రిస్మసు శలవల్లో నిర్మలాదేవి కొడుకుచుట్టూ కట్టుకున్న ఆశాసౌధం కుప్పకూలిపోయింది. నీదారి నీదే, ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు నా కొడుకువి కాదు, అంటూ ఆవిడ అప్పటికి పంజరం తలుపు తెరిచింది.

కానీ ఎగరడానికి క్రిస్టొఫర్‌కి రెక్కలు లేవు. ఒక చిన్న ఉద్యోగాన్నించి మరోదానికి, ఒక గర్ల్‌ఫ్రెండు నించి మరొక గర్ల్ ఫ్రెండుకు, ఎగరలేని పక్షి అసలాటంగా గెంతుతున్నట్టు గెంతుతూ ఉన్నాడు. ఎంబీయే పూర్తి చేసి న్యూయార్కు వెళ్ళిపోయిన జెన్నిఫర్ ఎప్పుడైనా మాట్లాడుతుండేది.

క్రిస్టొఫర్‌కి ముప్ఫై అయిదోయేట నిర్మలాదేవి అకస్మాత్తుగా చనిపోయింది. ఒక అతిధి వెళ్ళినట్టే వెళ్ళాడు ఫ్యూనరల్‌కి. డా. థామస్‌ని జెన్నిఫర్ తమతో న్యూయార్క్ తీసుకెళ్ళిపోయింది. వెళ్తూవెళ్తూ తల్లిదండ్రుల ఫొటో, ఫ్రేం కట్టి ఉన్నది, క్రిస్టొఫర్‌కి ఇచ్చింది. దాన్ని తెచ్చి లివింగ్ రూములో టీవీ పక్కన పెట్టాడు. దానికెదురుగా కూర్చుని వోడ్కా తాగుతూ తల్లి మీద కసి తీర్చుకుంటున్నాడు ఇన్నాళ్ళూ.

***

ఫాదర్ నెంబరుకి ఫోన్ చేశాను.

ఫోన్‌లో ఆయన గొంతు వింటూ ఉంటే మళ్ళీ నేను పదిహేడేళ్ళ క్రిస్‌ని అయినట్టుగా అనిపించింది. ఏడ్చేశాను. ఫోనులోనే ఓదార్చారు.
కినేషా నన్ను క్షమించిందా ఫాదర్ అనడిగాను.
క్షమించింది అనే అనుకుంటాను క్రిస్. లేకుంటే ఈ బహుమతిని నీకిచ్చేది కాదు. అన్నారు.
కినేషా నాకు బహుమతిని ఇవ్వడం ఏంటి ఫాదర్ అన్నాను అయోమయంగా.
నువ్వు ఎలా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావో నాకు తెలుస్తూనే ఉంది. నా ద్వారా కినేషాకీ తెలుస్తూనే ఉంది. అందుకేనేమో, తాను వెళ్ళిపోతూ నీకు ఆశని ప్రసాదించింది, క్రిస్. అన్నారు.

ఆశా?

అవును, క్రిస్. నీ కూతురు. హోప్.

రెండు గంటల్లో మినియాపొలిస్ వెళ్ళే ఫ్లైట్లో ఉన్నాను(తానా 2013 సమావేశాల ప్రత్యేక జ్ఞాపిక కోసం రాసింది)

Comments

Naga Pochiraju said…
super :)
Just loved it :)
Anil Atluri said…
పేర్లు, ప్రాంతాలు మార్చేస్తే ఏ సమాజానికైన సరిపోతుందనుకుంటున్నాను. మరోక డయస్పొర కథ అనుకోవచ్చా?
చివర్న ఆ ట్విస్ట్ బాగా పండింది. హోప్.
Unknown said…
కథ, కథనం చాలా బావున్నాయి కొత్తపాళీ గారు.
Story is really good .. especially the way transition was dealt . i feel its one of the story dealing with reality of american living . the rise and fall of living the american dream

కథ చాలా బాగుందండీ. ముగింపు చాలా అందంగా ఉంది. సృష్టిలో అంతకన్న చక్కని బహుమతి ఇంకొకటుందుందనుకోను.
కధ ఆల్మోస్ట్ మొత్తం చాలా బావుందండీ..
ఎండింగ్ ముందుగానే అర్ధమవ్వడమే కాదు డ్రమాటిక్‌గా అనిపించడమొక్కటే నాకు నచ్చలేదు.

ఇంకొక విషయం -- కొన్ని పదాలు ఇంగ్లీషులోనే బావున్నట్లుంటాయి.. వారాంతాలు వరకూ తెలుగు పర్వాలేదు కానీ పొడుగు వారాంతాలు!?
:))

Kottapali said…
వ్యాఖ్యానించిన అందరికీ నెనర్లు.
ఈ కథకే కాదు, నా రచన దేనిమీదనైనా నిర్మొహమాటమైన విమర్శని ఆహ్వానిస్తున్నాను.
ఉదాహరణకి ఈ కథ మీద వినిపించిన విమర్శలు - వస్తువు పాతదే అని కొందరన్నారు. రెండు గొంతులతో మార్చి మార్చి కథ చెప్పడం పరవాలేదన్నారు. ఇండియాలో జరిగిన ణెపథ్య కథ అంత డీటేల్డుగా చెప్పడం అవసరమా అన్నారు. పేర్లూ స్థలాలూ మార్చినా ఇదే కథ జరగొచ్చు కదా, ఇంతమాత్రానికి ఇది అమెరికను ఇండియను డయాస్పోరా కథ అవుతుందా అన్నారు. ఈ విమర్శలమీదనూ మీ అభిప్రాయాలు చెప్పవచ్చు, లేక మీ మీ విమర్శలు కూడ చెప్పవచ్చు. ముందస్తు నెనర్లు.
కథ చదువుతుంటే సమయం తెలియలేదు. చాలా బాగుంది.
Kottapali said…
నిషి, మీ రెండొ వాక్యం నాకు అర్ధం కాలేదు. ముగింపుని మీరు ముందే ఊహించారా? ఊహించేస్తే డ్రమెటిగ్గా ఉండదే? బుర్ర గోకింగ్స్.

భాష - మోతాదు మించిన తెలుగు వాడకం - ఈ విషయంలో సమతుల్యత సాధించడానికి నేను ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ముఖ్యంగా లాంగు వీకెండు లాంటి అమెరికనిజాలని సూచించేందుకు. దీనిమీద ప్రవాస రచయితలందరం ఒక చర్చ పెట్టుకుంటే బావుంటుంది.
Krishna said…
రెండు గొంతులు (first person, third peron) మార్చి మార్చి వ్రాయటం "dramatic" గా ఉంటుందేమోగాని పామరుడనైన నాకు అంత పండలేదు. కథకి అమెరికా లోని డయాస్పోరా కి సంబంధం ఏమిటో, పైగా "raise and fall of American dream" లాంటి భారీ డైలాగులు ఏమిటో అస్సలు అర్తం గాలేదు!
Kottapali said…
Krishna, ఇతరులు చేసిన వ్యాఖ్యల గురించి నేనేమి చెప్పను? నా కథ గురించి నీ మాట వోకే.
స్వామి గారు, కథ దాల చాల బాగుంది. ప్రేమ విషయంలో, తిరుగుబాటు చేయాల్సిన దాని మీద తిరగుబాటు చేయకపోవడం వల్ల ఒక మనసు- ఉండి- వ్యక్తిత్వం-లేని మనిషి ఎదుర్కొనక తప్పని విషాదాన్ని చాల చక్కగా చెప్పారు. చివర్లో ఆ ముగింపు అక్కర్లేదేమో. నిజానికి ఆ బహుమతి ఏమిటో ఆ పదం చదవగానే ఊహించాను. చివరికి నా ఊహ తప్పని తేలి ఉంటే కథ నాకు మరింత బాగుండేది. (ఒకటి రెండు సార్లు నేను ఇలాంటి తప్పు చేసి ఉండడం వల్ల మీకు చెప్పడానికి సందేహించడం లేదు.)
జీవితం ఎక్కడైనా జీవితమే కదండీ! కథ ముగింపు ఆశ్చర్యంగా ముగిసింది. కఠ నచ్చింది.
బిడ్దలపై విపరీతమైన కాంక్షలు పెన్చుకున్న తల్లిదంరుల నీడలో పెరిగిన బిడ్దలు కళ్ళల్లొ మెదిలారు
సొంత వ్యక్తిత్వం లేకుందా తమకి ఏమి కావాలో తెలుసుకోకుందా ఉన్న క్రిస్ లాంటి వారికి ఇలా హొప్ ఊండటం వరమేమో! :)
బాగుందండీ...ఏక బిగిన చదివాను.
Vasu said…
చాలా మంది చెప్పినట్టు కథ లో రెండు గొంతులు , Spaced flash back structure కొత్తగా ఉన్నాయి , బావున్నాయి.

మీరు చదివిన వాళ్ళని అభిప్రాయాలు నిర్మొహమాటంగా చెప్పమని మొహమాట పెడుతున్నారు కాబట్టి, నేను కూడా రెండు రాళ్ళు వేస్తున్నాను.

కథ చివర్లో ట్విస్ట్ (లాంటిది) ఫోర్సుడ్ గా ఉంది (ఇడియట్ సినిమా లో ఆఖరికి ఐ పి ఎస్ అయిపొనట్టు, గౌతమ్ ఎస్ ఎస్ సి లో ఐ ఏ ఎస్ అయినట్టు )
కథ ఎప్పుడు జరిగిందో తెలియదు కదా , ఇది పోనీ అంత కమ్యూనికేషన్ లేని సమయం లో జరిగిన కథ అనుకుందాం అంటే ఉత్తరాలు అరుదు అన్నారు కనుక గత దశాబ్దం లో జరిగినది అనుకోవాలి . అప్పుడు ఉత్తరం రాయడం రెండో విచిత్రం అయితే కినేశా గురించి తెలియకపోవడం మొదటి విచిత్రం (ఎందుకంటే ఉద్యోగం పోవడం విచిత్రం కాదు అన్నారు గా :) ). ఇంత సోషల్ నెట్వర్కింగ్ ఉన్న కాలం లో కినేశా గురించి, హోప్ గురించి తెలియకుండా ఉండడం నమ్మ సఖ్యంగా లేదు.

మీ కథలు చాలా మటుకు చదివి ఉన్నాను కనుక చెబుతున్నా. నాకు పెద్దగా నచ్చని , ఏదో హడావుడి లో రాసారేమో అనిపించిన కథ ఇదొక్కటే.
Zilebi said…

ఒక పెద్ద నవల గా రాయగలిగిన మేటరు ఉన్నది.

ఓ మూడు తరాలు (వాటి గురించి మీకు ఆల్రెడి తెలిసి ఉన్నట్టు ఉన్నది కథ గమనంలో గమనించినది) గురించి రాయగలిగిన నవల.

పొడిగించి నవలగా ధారావాహికగా చెయ్యవచ్చు (శైలి రెండు విధాలుగా ప్రస్తుతం పూర్వం - కొత్త కాదనుకుంటాను .... కాని ఈ ప్లాట్ కి అదే పట్టుగొమ్మ )

అల్ ది బెస్ట్ !

చీర్స్
జిలేబి
Ennela said…
ఎప్పటి కథో , కామెంటితే బాగుంటుందో లేదో అనుకుంటూ చూస్తే తేదీలన్నీ నిన్న మొన్నటివే.
నాకు కూడా ముగింపు కొంచెం అదోగా ఉన్నప్పటికీ, నాలుగో సెమిస్టరులో క్రిస్ బిహేవియర్ చళ్ళున చరిచినట్టనిపించింది. బాబోయ్ పిల్లలతో జాగర్తగా ఉండాలండోయ్! అప్పుడప్పుడూ నిర్మలా దేవి లాగే ఉంటుంది సగటు తల్లుల మనస్తత్వం.(నాది కూడా కావచ్చు..(స్వగతం))
ఇంతకీ పునీత ఎవరు? కినేషా నా, హోపా ?కథకి ఆ పేరెందుకు పెట్టారో తెలుసుకుందామని!
Kottapali said…
హెచ్చార్కె, వనజ, రాజ్ కుమార్, వాసు, జిలేబి ఎన్నెల - చదివి కామెంటినందుకు ధన్యవాదాలు.

హెచ్చార్కె - ముగింపు వాక్యం - నాక్కూడా ముగింపులు కొంచెం గూఢంగా ఉండడమే ఇష్టంకానీ, ఇక్కడ స్పష్టంగా చెప్పాలేమో ననిపించింది.

వనజ - అవునండీ, మల్లెతీగకి పందిరి అవసరం లాంటి వాడుకలు మన భాషలో చాలా ఉన్నై. కానీ తీగ లేకుండా పందిరి ఉనికి వ్యర్ధం కదా,

వాసు - మీ అభ్యంతరాలు గమనించాను. కథ జరిగిన కాలం: క్రిస్ వర్తమానం (క్రిస్ గొంతులో చెప్పిన కథ) ప్రస్తుత కాలంలో జరుగుతున్నట్టే. సోషల్ మీడియా ఉన్నా అనామకంగా ఉండడం అంత కష్టం కాదు అలా ఉండ దల్చుకున్నవారికి. హడావుడిగా రాయలేదు :)

జిలేబి - మీ ఆశీర్వాదం. రాసేస్తానేమో? గుర్రమెగరావచ్చు.

ఎన్నెల - కొత్త కథేనండీ. అంటే అప్పుడప్పుడూ అలా కొత్త కథలు ప్రచురిస్తూ ఉంటానన్నమాట. నిజంగా చెప్పుకోవాలంటే క్రిస్ పునీతుడు. He was being given a second chance.

ఏ. సూర్య ప్రకాశ్ said…
ఒక నవలిక రాయాల్సినంత ఒక జీవనకాల వస్తువును తీసుకొని ఒక కథగా కుదించినట్లనిపించింది!బాల్యంలో పిల్లల ఇష్టాయిష్టాలను ఖాతరు చేయకుండా తనకు అనుగుణముగా బలవంతముగా మలచాలని చూస్తే జీవితాలు దుఖభాజనాలవుతాయనీ వారయివారు స్వయముగా తమ అభిరుచులననుసరించి వారినే ఎదగనీయాలి!కొత్తపాళీ పదునుతేరి చెయ్యితిరిగి చవులూరించే కథనాన్ని అందించింది!అనుభవాన్ని రంగరించిన నిబ్బుకు నీరాజనాలు!!మరిన్ని రాజనాలు సాహతీక్షేత్రంలో పండించండి!!!
ఏకబిగిన చదివించారు. క్రిస్టోఫర్ వ్యక్తిత్వ చిత్రణ చాలా సహజంగా ఉంది. ముగింపు బావుంది. కథనం అంతా క్రిస్టోఫర్ గొంతు తో నడప గలిగితే ఇంకా బావుండేదనిపించింది!
Anonymous said…
మీకు పిల్లల పెంపకం, వారి మనస్తత్వాలపై పట్టుందని తెలుసు కానీ(తుపాకీ, చక్కని చుక్క కథల్లో గమనించా) మరీ ఇంత ఛెళ్లున చరిచేలా వ్యక్తం చేస్తారనుకోలేదు. మూడో సెమిస్టర్ నుంచి క్రిస్ నిశ్శబ్ద విప్లవం దాదాపు ప్రతి పాఠకుడికీ ఛెళ్లుమనిపిస్తుంది.
Kottapali said…
ఏ. సూర్యప్రకాశ్ గారు, ధన్యవాదాలు. కృషి చేస్తుంటానండీ.

నాగలక్ష్మిగారు, పూర్తిగా పిల్ల గొంతుతోటి కొన్నాళ్ళ కిందట మంచుగూడు రాశాను. నిజానికి ఈ కథ కూడా క్రిస్ గొంతులోనే మొదలు పెట్టానుకానీ, కొన్ని దృశ్యాల చిత్రీకరణకి నప్పక ఇలా నడిపించాను. ఇలా రాయడం నాకు ఇదే మొదటిసారి.

Anonymous, పట్టు ఉన్నది అనేది పెద్దమాట కానీ వారితో కలిసి ఆడుకోవాలనీ వారి మనస్తత్వాలతో సావాసం చెయ్యాలనీ నాకదో పిచ్చి కోరిక.
Mauli said…
కధ పూర్తిగా నచ్చింది అండీ . ఆ అమ్మాయికి అతని తిరుగుబాటు అర్ధం అయింది అన్న భాగం ముఖ్యం గా నచ్చింది . ఇంకా కధ లో ఆసక్తి అతను తనను తాను చెడగోట్టుకోవడం దగ్గరి నుండే మొదలయ్యింది నాకయితే. కాబట్టి అతని దురవస్థలకు కారణం తల్లి అని అనుకోవడం లేదు . తిరగబడి మాత్రం ఏం వ్యక్తిత్వం సాధించాడని తల్లిని నిందిస్తాము. ముగింపు అస్సలు ఊహించనిది , అయినా బాగా వాస్తవికం గా ఉంది . థాంక్స్ , ఒక చక్కని కధ చదివించారు
Anonymous said…
రంధ్రాన్వేషణే అనుకోండి... కానీ కుతూహలం ఆగక కొన్ని సందేహాలు..

తల్లి మాట జవదాటలేని సుమారు 20ఏళ్ళ పిల్లాడికి... ఓ అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకునేంత ధైర్యం ఉంటుందా? అంటే అమెరికా వెళ్ళినా సగటు మధ్యతరగతి తెలుగు మనస్తత్వం వదలని కుర్రాడిగా చూపించారు కదా అని.

12వ తరగతిలో అఫైర్ వల్ల కూతురు పుట్టిందన్నారు.. క్రిస్టోఫర్‌తో పాటు ఆ పూర్టోరికన్ అమ్మాయికీ సుమారు 20 ఏళ్ళుంటాయా. ఎట్‌లీస్ట్ టీనేజ్ దాటి ఉంటుంది కదా. ఆ ఏజ్‌లో అమెరికన్ సొసైటీలో ఉన్న అమ్మాయి ప్రెగ్నెన్సీ రాకుండా కేర్ తీసుకోలేదా?

గర్భం విషయంలో ఆమెది ఇన్నోసెన్సో, ఇగ్నోరెన్సో అనిపించడం లేదు. అంటే.. కావాలనుకునే పిల్లని కన్నదా? ఆ విషయం క్రిస్టో, కినేషా మధ్య ఏ డిస్కషనూ జరగనే లేదంటారా? ఐ మీన్, అతనికి పూర్తిగా తెలీదని నాకైతే అనిపించడం లేదు.

కథ క్రిస్టో కోణం నుంచి నడుస్తున్నప్పుడు ఆ అమ్మాయి గొడవ అంత పట్టించుకునే అవసరం లేదనుకోండి.. కానీ.. ఇప్పుడు క్రిస్టోకి సుమారు 38-40 ఏళ్ళ వయసు అంటే... ఆ పుట్టిన ఆశకి 18-20 ఏళ్ళు ఉంటాయి కదా. తండ్రీ, (బహుశా) తల్లి లా కాకుండా అమెరికా లోనే పుట్టి పెరిగిన 18 ఏళ్ళ పిల్ల.. తల్లి మరణ శయ్య మీద కోరిక కోసం అన్నేళ్ళలో తనను ఒక్కసారి కూడా చూడని తండ్రిని చేరుకోడానికి ఒప్పుకుంటుందా? అది సాధ్యం కాకపోతే... మీ ముగింపు మొత్తం కథనే నీరు కార్చేస్తుంది కదా అని.

ఏళ్ళూ పూళ్ళూ కాదు...కథలో అనుభూతే ప్రధానం అనుకోవచ్చు కానీ... టైం అండ్ స్పేస్ రిఫరెన్సులు కథలోనే ఇచ్చారు కదా అని.


మరో పిడకల వేట.. జెన్నిఫర్‌తో ఆ అమ్మాయిని అంత పెద్ద తిట్టు తిట్టించేశారే? అంటే క్రిస్టోని బురదలో పుట్టిన తామరలాంటి సంస్కారవంతుడిగా చూపిద్దామనా? :)
Kottapali said…
puranapandaphani గారూ, మీరు చెప్పిన విషయాలన్నీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే నేను కథలో జరిగినట్టు చూపించిన సంఘటనలు జరిగే అవకాశమూ లేకపోలేదు. మీరు వేసిన వయసు సంవత్సరాల లెక్కలు సరైనవే. చివరి ప్రశ్న నాకు అర్ధం కాలేదు.
karthik ram said…
బాగుంది , కథ చదవక ముందు టైటిల్ చూస్తాను , కథ ఆసాంతం చదివాక మళ్లీ టైటిల్ చూస్తాను నేను .,ఈ కథ కు పునీత అని టైటిల్ ఎందుకు పెట్టారు ., చెప్తారా ?
sujalaganti said…
కథ ఫరవాలేదు అనిపి౦చేటట్లుగా ఉ౦ది నిర్మొహమాట౦గా చెప్పమన్నారు కాబట్టి రాస్తున్నాను కథా వస్తువు పాతదైనా రాసే విధాన౦ లో కొత్తదన౦ చూపబోయి కొ౦చె౦ అయోమయ౦ అనిపి౦చి౦దని నా ఉద్దేశ్య౦
సుజాత said…
నెరేషన్ చాలా బాగుంది, రెండు వైపులకీ పాఠకుడిని త్వర త్వరగా స్విచ్ చేస్తూ!

ఇలా రెండు గొంతుల్తో చెప్పడం బావుంది. అసలు నెట్ వర్కింగే బలహీనంగా ఉన్న క్రిస్టొఫర్ సోషల్నెట్ వర్క్ జోలికి పోక పోవడం లో ఆశ్చర్యం ఏమీ లేదు.

పునీత అని కినేషానే గా అన్నది మీరు?

నెరేషన్ వల్ల కథ హిట్టు కొట్టింది.


నాకెందుకో చివర్లో "ఏలూరెళ్లాలి" గుర్తొచ్చింది :-)
Kottapali said…
This comment has been removed by the author.
Kottapali said…
Mauli, Thank you so much.

Karthik Ram, I replied to you on FB. Basically, Kinesha remained pure all through and Chris, by being given a second chance, has been cleansed.

Sujalaganti, మీ అభ్యంతరాలు గమనించాను. నిర్మొహమాటంగా చెప్పినందుకు నెనర్లు.

సుజాత, చదివి కామెంటినందుకు నెనర్లు. "ఏలూరెళ్ళాలి" .. నిజమే సుమా, నాకు తట్టనే లేదు. ఆయన వెళ్ళాలని అనుకుని ఊరుకున్నాడు, మా వాడు నేరుగ ఫ్లైటెక్కేశాడు :)
Maitri said…
This comment has been removed by the author.