Thursday, February 9, 2012

తెలుగు కథల్లో క్లిషేలు - 2

పాత్ర చిత్రణలో ఇంకో రకం క్లిషే అస్తిత్వవాదాలకి సంబంధించిన కథల్లో కనిపిస్తుంది. స్త్రీవాద కథల్లో మగ పాత్రలన్నీ ఒక్కలాగానే ఉంటాయి. ఈ కథల్లో మగవాడైన వాడు ఎప్పుడూ ఒక్క సున్నితమైన ఆలోచన, ఒక్క మంచి పని కూడా చెయ్యలేడు - తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, మొగుడు కానీ, ఆఫీసులో సహోద్యోగి కానీ, ఆఖరికి కొడుకు కానీ - మగాళ్ళంతా ఇంతే అన్న ధోరణిలో ఉంటాయి. దళిత కథల్లో దళితేతర కులాల పాత్రలూ, ముస్లిము కథల్లో ఇతర మతాలవారూ కూడా ఇదే బాపతు. అలాంటి మనుషులు లేరని నేనూ అనను. ఉన్నారు. అట్లాంటి పాత్రల చిత్రణ, విమర్శ జరగాలి, తప్పకుండా, ఆయా పాత్రల ఆధిపత్య స్వభావాల్ని, కాలం చెల్లిన భావాల్ని కడిగి ఎండయ్యాలి - నిజమే. ఐతే, ప్రతీ మనిషికీ ఎన్నో కోణాలు ఉంటాయి. పరస్పర మానవ సంబంధాల్లో ఎన్నో పార్శ్వాలు ఉంటాయి. కథ స్వతహాగా క్లుప్తమైన ప్రక్రియ కాబట్టి రచయిత ఆయా కోణాలని, ఆయా పార్శ్వాలని కథకి అవసరమైనంత వరకే ఆవిష్కరిస్తాడు. ఆ లిమిటెడ్ ఫోకస్‌ని అంగీకరించినప్పుడు కూడా, పాత్ర అంటూ సృష్టించాక ఆ పాత్రకి కొంత స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. ఇవేమీ పట్టించుకోకుండా తయారు చేసే మూస పాత్రలు మూసలోంచి వచ్చినట్టుగానే ఉంటాయి తప్ప సజీవంగా ఉండవు. కథ రాయడంలో రచయిత చెప్ప దల్చుకున్న విషయమేవిటి అనేది పూర్తిగా మరుగున పడిపోతుంది ఇటువంటి విపరీతమైన చిత్రణలతో. లేదా పాఠకుడికి మొహమ్మొత్తి వెగటు పుడుతుంది.

ఆలోచనలకి సంబంధించిన క్లిషేలు ఇంకో రకం. నిజానికి ఇవి మిగతా రకాల కంటే భయంకరమైనవి. ఎందుకంటే రచయిత తాను అభ్యుదయభావంతో రాస్తున్నాను అనుకుంటూ వెలిబుచ్చే కొన్ని అభిప్రాయాలు, చేసే తీర్మానాలు నిజానికి తిరోగమన భావాలతో నిండి ఉంటాయి - లేదా, ఒక తప్పు దృక్పథాన్ని పాఠకుడిలో నెలకొల్పుతాయి. ఆర్ధిక సంస్కరణలు అమలైన నాటి నుండీ గ్లోబలైజేషన్ వలన కీడే తప్ప మేలు జరగదు అనే ఇతివృత్తంతో టన్నుల కొద్దీ కథలు వచ్చాయి. కోకకోలాని దేశంలోకి తిరిగి అనుమతించారు కాబట్టి మా వూళ్ళో స్థానిక సోడా వ్యాపారం మూతపడింది. జన్యుమార్పిడి విత్తనాలూ, కొత్త ఎరువులూ, పురుగు మందులూ (ఇవన్నీ బహుళజాతి కంపెనీల తయారీలు) రావడం వల్ల రైతులు స్వేఛ్ఛ కోల్పోతున్నారు, మోసపోతున్నారు, అప్పుల పాలై పోతున్నారు. తుదకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సిటీల్లో షాపింగ్ మాల్సూ, పబ్బులూ రావడంతో, కాల్ సెంటర్ వంటి వృత్తులు పెరగడంతో యువత అంతా బరి తెగించి తప్పు దారిన పడిపోతున్నారు. నిజమే, ఇవన్నీ జరిగాయి, జరుగుతున్నాయి. కాదనడం లేదు. ఐతే ఈ కథల్లో అమెరికా అధ్యక్షుడు తుమ్మాడు, ఆంధ్ర ప్రదేశ్‌లో తుపాను చెలరేగింది అన్నట్టుగా ఉంటుంది లాజిక్. ఆర్ధిక సంస్కరణలు ఎందుకు అమలు జరిగాయి, ఆ అమలు జరగడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏమిటి? అప్పుడు రాజ్యాధికారంలో ఉన్న వ్యక్తుల దృష్టి ఏంటి? కోకకోలాకీ మా యింటిపక్కన సోడా షాపుకీ ఏవిటి సంబంధం? మాన్‌శాంటోకీ తెలుగు రైతుల ఆత్మహత్యలకీ ఏవిటి సంబంధం? అసలు తెలుగు రైతు ఎటువంటి మార్కెట్ పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నాడు ఈ రోజున? వ్యవసాయం చేసి లాభ పడినవాడే లేడా? లాభం తీసిన వాళ్ళు ఏం చేసి విజయం సాధిస్తున్నారు? ఇరుక్కుపోయినవాడు ఎటువంటి తప్పు నిర్ణయాల వల్ల ఇరుక్కు పోతున్నాడు? వీటన్నటికీ అంతర్గతంగా ఉన్న ఆర్ధిక, రాజకీయ, సామాజిక అంశాలేవిటి? ఇవేవీ పరిశోధించే తీరిక, పరిశోధించిన విషయాల్ని విశ్లేషించే ఓపిక ఎవరికీ లేవు. దినపత్రికలో వార్త చూడ్డం, కథ రాసెయ్యడం. బాగు పడేవాడు ఎందుకు బాగు పడుతున్నాడు? ఆరిపోయేవాడు ఏయే బలహీనతలవల్ల ఆరిపోతున్నాడు? అబ్బే - బాగుపడేదే లేదు. నో ఛాన్స్! అలా ఉంటే మరిప్పుడు మధ్యతరగతి భారతీయులు కారు, ఇతర ఆధునిక హంగులు సమకూర్చుకోవడం, ఫారిన్ వెకేషన్లకి వెళ్లడం విరివిగా ఎలా సాధ్యపడుతున్నాయో? ఇరవయ్యేళ్ళ కిందట యువతీ యువకులు - ఇంజనీరింగ్ లేక మెడిసిన్ కాకుండా సాధారణ డిగ్రీ చదివితే - అర్ధపావలా జీతంతో ఏదో ఒక అత్తెసరు ఉద్యోగంలో కూరుకుని ఉసూరుమనిపించే బతుకులీడ్చడమే కద! మరి తొంభైలనించీ లక్షలమంది తెలుగు యువతీ యువకులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా ఎలా తయారయ్యారు? ఎలా ఆర్జిస్తున్నారు? ఏవిటీ పరిణామాలు? ఇవేమీ కనబడవు. సాఫ్టు వేరు జీవితాలది అది ఇంకో కథలేండి. దీని దగ్గరికి మళ్ళి వస్తాను తరువాయి టపాలో.

ఈ గ్లోబలైజేషన్ కథల్లో సెజ్‌లు, రియలెస్టేట్ కి సంబంధించినవి కొన్ని. వీటిల్లో నేపథ్యం ఎలా ఉంటుందంటే ఏదో పెద్ద కంపెనీ - బహుళజాతిదైతే మరీ మంచిది, డాలర్లతో స్థానిక ప్రభుత్వాన్నీ పోలీసునీ కొనేసి పేద ప్రజల భూమిని స్వాహా చెయ్యడానికి భూతంలా విరుచుకు పడుతుంది. నిజమే - భూమి వాళ్ళది. దాని మీద సర్వ హక్కులు వాళ్ళకి ఉన్నాయి. కాదనను. కానీ దేశాభివృద్ధి జరగాలి అంటే పారిశ్రామికీకరణ కూడా జరగాలి. దానికి భూమి కావాలి. ఎప్పుడో అరవైలలో జరిగిన కమ్యూనిస్టు ఉద్యమాల స్లోగన్లు ఒక పక్కనా, రైతు ప్రాణం భూమిలోనే ఉంది, తన రక్తంతో భూమిని తడిపి పండిస్తున్నాడు లాంటి పనికిరాని సెంటిమెంట్లు మరో పక్కనా పెట్టుకుని ఈ సెఝ్ కథలు రాసేస్తుంటారు. ఈ ప్రజలు అసలే పేద వాళ్ళు. ఒక్కొక్కళ్ళకీ ఉన్నది ఒక ఎకరం, అరెకరం బాపతు. ఏం చేసుకుంటారు ఆ కొద్ది భూమిని? వాళ్ళకి సేద్యం చెయ్యడానికి ఏమేమి వసతులున్నాయి? ఒకేళ సేద్యం సరిగ్గా జరిగి పంట చేతికొచ్చినా మార్కెట్ ఏది వాళ్ళ ఉత్పత్తికి? వాళ్ళకి జరుగుబాటు ఎట్లా? చిన్న కమతాలవల్ల బాగు పడిన వాడెవడూ లేడు. ప్రపంచవ్యాప్తంగానే కాదు, స్థానికంగా కూడా అన్ని పరిస్థితులూ మారుతున్నాయి. ఆ మారుతున్న పరిస్థితులకి తగినట్టుగా ప్రజలు చైతన్యవంతులు కావాలి, బాగు పడాలి, దానికి తగిన ప్రయత్నాలు సర్వత్రా జరగాలి. అంతే కాని కాలం చెల్లిన స్లోగన్లతో సెంటిమెంట్లతో ప్రజల జీవితాలు బాగుపడవు. అలాంటి భావాలు అభ్యుదయ భావాలు కాదు సరికదా, తిరోగమన భావాలు.

ఇంకా ఉంది వడ్డన. కొనసాగుతుంది నా వీలెంబడి.

Tuesday, February 7, 2012

తెలుగు కథల్లో క్లిషేలు

ముళ్ళపూడి రచనల్లో దేనిలోనో ఇద్దరు స్నేహితులు ముచ్చట్లాడుకుంటూ ఉంటారు. ఒకడు రెండోవాణ్ణి అడుగుతాడు, ఎలా వుంది నా సెటైరు? రెండోవాడి జవాబు - చెత్త సెటైరు, చిరిగిపోయిన టైరులాగుంది.

మన తెలుగు రచనల్లో సెటైరులే కాదు, అన్నీ చిరిగిపోయిన టైరుల్లాగానే ఉంటున్నాయి. నాకు కథలతో కాస్త ఎక్కువ పరిచయం కాబట్టి కథలని గురించి మాట్లాడుకుందాం. కథలో మూల సూత్రం దగ్గిర్నించీ, భాష, పాత్రల చిత్రణలు, ముఖ్యాంశాలు, వెలిబుచ్చే భావాలు, అభిప్రాయాలు - అన్నీ క్లిషేలే.

సాధారణంగా క్లిషే అనే తిట్టు పోలికలకీ వాడుకలకీ .. అంటే భాషకి సంబంధించిన విషయాలకి ఉపయోగిస్తుంటారు. పలాని వాడి మొహం చీకేసిన తాటి టెంకలా ఉంది. ఇంకోడి మొహం ఆనందంతో వెయ్యి వోల్టుల బల్బులా వెలిగి పోయింది - ఇలాంటి వర్ణనలు లక్షల్లో చదివి ఉంటాం. అసలుకి అది వెయ్యి వాట్టుల అని ఉండాలి. మనది సైన్సు పాఠం కాదు కాబట్టి సరే, వదిలేద్దాం. అలాగే, నాగుపాము లాంటి జడ, గుప్పిట్లో ఇమిడే నడుము, మన్మథుడి విల్లులాంటి కనుబొమలు .. కోకొల్లలు.

ఇలా బయటికి కనబడే క్లిషేలే కాకుండా కొంచెం లోతుగా, కప్పబడి ఉండే క్లిషేలు కొన్ని ఉంటాయి. ఇవి భావాలకి సంబంధించినవి. కొన్నేమో నేరుగా పాత్రల చిత్రణలోనో, సంఘటనల చిత్రణలోనో పాఠకులకి తేట తెల్లమవుతూ ఉంటాయి. సాధించే అత్తగార్లు, శాడిస్టు షావుకార్లు, ధన-కామ దాహానికి అంతులేని జమీందార్లు, సరసాలు తెలిసిన మొగుణ్ణి అర్ధం చెసుకోలేని చాదస్తపు పల్లెటూరి పెళ్ళాలు - ఇలాంటి పాత్రలు ఇరవయ్యేళ్ళ కిందటే బాగా పాతబడిపోయిన క్లిషేలు. గత ఇరవయ్యేళ్ళల్లో కొన్ని కొత్త క్లిషేలు పుట్టుకొచ్చాయి. ఉదాహరణకి కొన్ని పాత్రలు, దృశ్యాలు - ఇవి నిజంగా నేను చదివిన కథల్లో ఉన్నవే! అంతే కాదు, కథారచయితలుగానూ అభ్యుదయ భావాలు కలవారుగానూ పేరొందిన వారి రచనల్లోనివే.

చిన్నవయసులో భర్తని కోల్పోయిన స్త్రీ అంట్లు తోమి కొడుకుని చదివించి ప్రయోజకుణ్ణి చేస్తుంది. ఇందులో ఒకటి కాదు సవాలక్ష క్లిషేలు ఉన్నై. భర్త చచ్చిపోవడం తప్ప స్త్రీకి చిన్నవయసులో కొడుకుని తనే ఒంటరిగా పెంచాల్సిన అవసరం ఇంకోటి కనబడదు. సరే, భర్త పోయి వంటరిదయింది. చదువు రాదు, ఇంకే పని చేతకాదు కాబట్టి అంట్లు తోమింది. చదువు రాక, ఇంకే వృత్తి చేతకాని స్త్రీకి అంట్లు తోమడం తప్ప వేరే జీవనభృతి లేదా? ఆ బుడ్డాడికి కథ మొదలయ్యే సమయానికి పదేళ్ళనుకుందాం. చదువు పూర్తై ప్రయోజకుడు కావాలనుకుంటే ఇంకో పది పన్నెండేళ్ళు అనుకుందాం. ఆ పది పన్నెండేళ్ళు అంట్లు తోముతూనే జీవితాన్ని ఈడ్చిందా? ఆమెకి ఇంకేం ఆశలు లేవా? స్వంత జీవితం పట్ల శ్రద్ధ బొత్తిగా లేదా? వోకే, ఆవిడ శ్రద్ధ అంతా కొడుకుమీదనే అనుకుందాం. మరి కొంత సంపాయిస్తే కొడుక్కి మరి కాస్త మెరుగైన జీవితాన్ని ఇవ్వచ్చునే - ఊహూ, కుదర్దు. ఆవిడ పన్నెండేళ్ళ పాటూ అంట్లు తోమి వాణ్ణి చదివిస్తే తప్ప అక్కడ వాడి అభివృద్ధికి తగినంత శ్రమ చేసినట్టు కనబడదు. దీనిమీద ఇంకో వేరియేషను ఆవిడ ట్యూషన్లు చెప్పడమో, లేక టీచరుద్యోగం చెయ్యడమో. దీనికీ అంట్లు తోమడానికీ ఆట్టే తేడాలేదని గమనించగలరు. అసలు సంగతేవిటంటే - ఆ స్థితిలో ఉన్న స్త్రీ ఏ విధంగానైనా సమాజంలో పైకెక్కి వచ్చిందని చూపిస్తే కొంపలటుకు పోతాయి.

సరే, అదయిందా. ఆవిణ్ణి కాసేపు ఊపిరి పీల్చుకోనిద్దాం. ఆమె కొడుకు బడుద్ధాయి సంగతేవిటి? ఆవిడ అలా కష్ట పడడమేవిటి, వీడిలా టింగురంగా మంటూ బడికీ కాలేజికీ వెళ్ళడమేవిటి? నిజమే, చదువు, అందునా కాలేజీ చదువు ఒక మెరుగైన బతుకు తెరువుకి దారి తీస్తుంది. కానీ దానికి తగిన స్తోమత లేనప్పుడు పైకి రావడానికి వేరే మార్గాలు లేవా? ఒక ధీరుభాయ్ అంబానీ వీడికెందుకు ప్రేరణ కాడు? చిన్నప్పటినించీ శ్రమ విలువ తెలుసుకోవడం, కష్టపడ్డం, సంపాదనలోని ఆనందం తెలియడం, స్వంత వృత్తి లేదా వ్యాపారంలోని స్వేఛ్ఛ తెలియడం - ఊహూ. ఇవేమీ అక్కర్లేదు. మిగతా అందర్లాగా పొలోమని మనవాడు కూడా బడికే వెళ్ళాలి, కాలేజికే వెళ్ళాలి, సాఫ్టువేరు ఉద్యోగమే చెయ్యాలి.

ఇంకా ఉంది వడ్డన. కొనసాగుతుంది నా వీలెంబడి.

Thursday, February 2, 2012

నిరంతర సంఘర్షణ

కొన్ని కొన్ని లక్షణాలు .. మరి అవి ఎలా అలవడతాయో కానీ, మనిషితో పాటే స్వతస్సిద్ధంగా పుట్టినట్టూ, మజ్జాగతంగా ఉన్నట్టూ అనిపిస్తుంటాయి. ఒక మనిషి వ్యాయామం లేకుండా బతకలేడు. మరో మనిషి కుర్చీలోంచి కాలు కదిపితే కందిపోతానేమోనని ఫీలైపోతుంటాడు. ఒక మనిషికి పనియే దైవం. ఇంకొకరికి ఎలా పనెగ్గొట్టి ఏ సినిమాకి పోదామా అని ప్రాణం పీకుతూంటుంది. ఇలా .. కోకొల్లలు. వీటిల్లో ఏవి నిజంగా స్వతస్సిద్ధమో ఏవి అలవరుచుకున్నవో ఏవి బయటి ప్రపంచం కోసం వేసే వేషమో ఎవడు చెప్పగలడు?

నా మట్టుకి నాకు ఒక దైనందిన కార్యాచరణ క్రమం లేకపోతే పిచ్చెక్కినట్టుగా ఉంటూ ఉండేది - ఒక డైలీ రొటీన్ ఉండాలి అన్న మాట. అలా ఒక పద్ధతి లేకుండా రోజులు గడిపేసే వాళ్ళని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉండేది. విడ్డురంగానూ, ఎబ్బెట్టుగానూ కూడ ఉండేది. కించిత్ అసూయగా కూడా ఉండేదేమో. నా మట్టుకి నాకు నా రొటీన్ లేకపోతే నా ప్రపంచం తల్లకిందులు ఐపోతుందేమోనని లోలోపల నాకు భయంగా ఉండేది.

మళ్ళీ అంతలోనే ఆ రొటీన్‌లో ఇమడటంలోనే ఏదో ఒక అసంతృప్తి. ఏదో ఒక అలజడి. ఏదో ఒక చిన్న తిరుగుబాటు మనస్తత్వం. ఆఫీసుకి ఎనిమిదింటికల్లా చేరుకోవాలి. అంటే ఇంటో ఏడున్నరకల్లా బయల్దేరాలి. నిద్ర లేచినప్పటినించీ ఆఫీసుకి బయటకి కాలు పెట్టేవరకూ నాకు కనీసం గంటన్నర సమయం కావాలి తయారయ్యేందుకు .. అంటే ఆరింటికన్నా లేవాలి. అలారం మోగుతుంది. హబ్బా, ఈ వొక్కరోజూ ఇప్పుడే లేవకపోతే ఏమైంది - ఇంకో పావుగంట పడుకుంటా.

అదయిందా - మంగళారం సాయంత్రం ఆరింటికి జిం కి వెళ్ళేందుకు ముహూర్తం. పొద్దున ఇంట్లోంచి బయల్దేరేప్పుడు చక్కగా గుర్తు పెట్టుకుని జిం బేగు సర్దుకుని మరీ మయల్దేరుతానా, రోజంతా, ఆహా ఇవ్వాళ్ళ సాయంత్రం జిమ్ము జిమ్ము అనుకుంటూ ఉత్సాహంగా పని చేసుకుంటుంటానా, ఏ మూడింటికో మొదలుపెడుతుంది, బుర్రలో పురుగు తొలవడం. ఇవ్వాళ్ళ జిమ్ముకి పోకపోతే ఏంపోయింది, హబ్బ, ఇవ్వాళ్ళ బద్ధకంగా ఉంది, మానేద్దాంలే. అయ్యో అసలే లంచి లేటుగా తిన్నా, ఇంకా భారంగా అనిపిస్తోంది, ఇవ్వాళ్టికి వొద్దులే ..

ఇలా ఎన్నో. వోకే. పొద్దున్నే లేవడం అంటె కొంచెం కష్టం - ఏదో ఒక రోజు ఇంకాస్సేపు పడుకోవాలనిపిస్తుంది - సరే. జిమ్ము కూడా కొంచెం కష్టంతో కూడుకున్న పనేకాబట్టి అప్పుడప్పుడూ మానెయ్యాలనిపిస్తుంది - వోకే. కానీ ఇలాగే, ఇంకా చాలా పనులు, చెయ్యాల్సిన పనులు, ఇష్టమైన వ్యాపకాలు - వాటిని పెట్టుకున్న సమయానికి చెయ్యబుద్ధి కాదు! పోనీ ఏంటీ యెదవ రొటీన్, అని దాన్ని కాలదన్ని పూర్తి బొహీమియన్ జీవితం గడుపుదామా అంటే .. హమ్మో, ప్రపంచం తలకిందులైపోదూ అనే భయం.

కానీ ఓ తమాషా తెలుసా - ఆ రోజు, ఆ అనుభవం రానే వచ్చింది, ఒకటికి రెండు సార్లు. అంటే అప్పటిదాకా నేను అలవాటుపడిన దైనిక చర్య ఒక్కమారుగా అస్తవ్యస్తమైపోవడం - కానీ ప్రపంచం తలకిందులు కాలేదు. నేనే మారాను దానికి తగినట్టు. నా అలవాట్లనీ, ఆలోచనా పద్ధతినీ మార్చుకున్నాను. అప్పుడు అదొక కొత్త జీవన విధానమయింది. దాని రిధం, దాని రొటీన్ దానికున్నది. అప్పుడప్పుడూ అదీ విసుగు పుడుతూ ఉంటుంది. తరచి చూస్తే తోచినదేవిటంటే, బుర్రంటూ ఉన్నాక అది అప్పుడప్పుడూ కాస్త వెరైటీ కోరుతుంటుంది. ఇది కూడ అందరు మనుష్ఉలకీ సమపాళ్ళలో ఉండదు. కానీ ఎంత రొటీన్ దాసులైనా ఎప్పుడో ఒకప్పుడు, ఎంతో కొంత మార్పు కోరుకుంటారు. అది సహజం. ఆ విషయం తెలుసుకుని దాన్ని సంబాళించుకుంటే .. రొటీన్ కూడా వెరైటీగానే ఉంటుంది!