నిరంతర సంఘర్షణ

కొన్ని కొన్ని లక్షణాలు .. మరి అవి ఎలా అలవడతాయో కానీ, మనిషితో పాటే స్వతస్సిద్ధంగా పుట్టినట్టూ, మజ్జాగతంగా ఉన్నట్టూ అనిపిస్తుంటాయి. ఒక మనిషి వ్యాయామం లేకుండా బతకలేడు. మరో మనిషి కుర్చీలోంచి కాలు కదిపితే కందిపోతానేమోనని ఫీలైపోతుంటాడు. ఒక మనిషికి పనియే దైవం. ఇంకొకరికి ఎలా పనెగ్గొట్టి ఏ సినిమాకి పోదామా అని ప్రాణం పీకుతూంటుంది. ఇలా .. కోకొల్లలు. వీటిల్లో ఏవి నిజంగా స్వతస్సిద్ధమో ఏవి అలవరుచుకున్నవో ఏవి బయటి ప్రపంచం కోసం వేసే వేషమో ఎవడు చెప్పగలడు?

నా మట్టుకి నాకు ఒక దైనందిన కార్యాచరణ క్రమం లేకపోతే పిచ్చెక్కినట్టుగా ఉంటూ ఉండేది - ఒక డైలీ రొటీన్ ఉండాలి అన్న మాట. అలా ఒక పద్ధతి లేకుండా రోజులు గడిపేసే వాళ్ళని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉండేది. విడ్డురంగానూ, ఎబ్బెట్టుగానూ కూడ ఉండేది. కించిత్ అసూయగా కూడా ఉండేదేమో. నా మట్టుకి నాకు నా రొటీన్ లేకపోతే నా ప్రపంచం తల్లకిందులు ఐపోతుందేమోనని లోలోపల నాకు భయంగా ఉండేది.

మళ్ళీ అంతలోనే ఆ రొటీన్‌లో ఇమడటంలోనే ఏదో ఒక అసంతృప్తి. ఏదో ఒక అలజడి. ఏదో ఒక చిన్న తిరుగుబాటు మనస్తత్వం. ఆఫీసుకి ఎనిమిదింటికల్లా చేరుకోవాలి. అంటే ఇంటో ఏడున్నరకల్లా బయల్దేరాలి. నిద్ర లేచినప్పటినించీ ఆఫీసుకి బయటకి కాలు పెట్టేవరకూ నాకు కనీసం గంటన్నర సమయం కావాలి తయారయ్యేందుకు .. అంటే ఆరింటికన్నా లేవాలి. అలారం మోగుతుంది. హబ్బా, ఈ వొక్కరోజూ ఇప్పుడే లేవకపోతే ఏమైంది - ఇంకో పావుగంట పడుకుంటా.

అదయిందా - మంగళారం సాయంత్రం ఆరింటికి జిం కి వెళ్ళేందుకు ముహూర్తం. పొద్దున ఇంట్లోంచి బయల్దేరేప్పుడు చక్కగా గుర్తు పెట్టుకుని జిం బేగు సర్దుకుని మరీ మయల్దేరుతానా, రోజంతా, ఆహా ఇవ్వాళ్ళ సాయంత్రం జిమ్ము జిమ్ము అనుకుంటూ ఉత్సాహంగా పని చేసుకుంటుంటానా, ఏ మూడింటికో మొదలుపెడుతుంది, బుర్రలో పురుగు తొలవడం. ఇవ్వాళ్ళ జిమ్ముకి పోకపోతే ఏంపోయింది, హబ్బ, ఇవ్వాళ్ళ బద్ధకంగా ఉంది, మానేద్దాంలే. అయ్యో అసలే లంచి లేటుగా తిన్నా, ఇంకా భారంగా అనిపిస్తోంది, ఇవ్వాళ్టికి వొద్దులే ..

ఇలా ఎన్నో. వోకే. పొద్దున్నే లేవడం అంటె కొంచెం కష్టం - ఏదో ఒక రోజు ఇంకాస్సేపు పడుకోవాలనిపిస్తుంది - సరే. జిమ్ము కూడా కొంచెం కష్టంతో కూడుకున్న పనేకాబట్టి అప్పుడప్పుడూ మానెయ్యాలనిపిస్తుంది - వోకే. కానీ ఇలాగే, ఇంకా చాలా పనులు, చెయ్యాల్సిన పనులు, ఇష్టమైన వ్యాపకాలు - వాటిని పెట్టుకున్న సమయానికి చెయ్యబుద్ధి కాదు! పోనీ ఏంటీ యెదవ రొటీన్, అని దాన్ని కాలదన్ని పూర్తి బొహీమియన్ జీవితం గడుపుదామా అంటే .. హమ్మో, ప్రపంచం తలకిందులైపోదూ అనే భయం.

కానీ ఓ తమాషా తెలుసా - ఆ రోజు, ఆ అనుభవం రానే వచ్చింది, ఒకటికి రెండు సార్లు. అంటే అప్పటిదాకా నేను అలవాటుపడిన దైనిక చర్య ఒక్కమారుగా అస్తవ్యస్తమైపోవడం - కానీ ప్రపంచం తలకిందులు కాలేదు. నేనే మారాను దానికి తగినట్టు. నా అలవాట్లనీ, ఆలోచనా పద్ధతినీ మార్చుకున్నాను. అప్పుడు అదొక కొత్త జీవన విధానమయింది. దాని రిధం, దాని రొటీన్ దానికున్నది. అప్పుడప్పుడూ అదీ విసుగు పుడుతూ ఉంటుంది. తరచి చూస్తే తోచినదేవిటంటే, బుర్రంటూ ఉన్నాక అది అప్పుడప్పుడూ కాస్త వెరైటీ కోరుతుంటుంది. ఇది కూడ అందరు మనుష్ఉలకీ సమపాళ్ళలో ఉండదు. కానీ ఎంత రొటీన్ దాసులైనా ఎప్పుడో ఒకప్పుడు, ఎంతో కొంత మార్పు కోరుకుంటారు. అది సహజం. ఆ విషయం తెలుసుకుని దాన్ని సంబాళించుకుంటే .. రొటీన్ కూడా వెరైటీగానే ఉంటుంది!




Comments

:) నిజమే!
కానీ నా సమస్య మీకు రివస్ర్....ఎప్పుడూ రొటీన్ అన్నది ఎరుగను. రొటీన్ అంటే చిరాకు. ఒక పద్ధతిగా రోజు గడపడం నచ్చదు. ఎప్పుడు ఏది కావాలంటే అది చెయ్యాలి. ఇవాళ కాసేపు పడుకోబుద్ధేస్తోందా..సరే. రాత్రి ఎక్కువసేపు మేలుకుని పుస్తకం చదువుకోవాలనిపిస్తోందా, చేసేద్దాం. ఇవాళ సబ్జెక్ట్ పుస్తకాలు అస్సలు చదవాలనిపించట్లేదా, మానేద్దాం. వాకింగ్ కి వెళ్ళాలనిపిస్తోందా, వెళదాం అనే మనస్త్వత్వం తో ఉన్నాను. చదువుకునేవరకూ ఈలాంటి పద్ధతి లేని పద్ధతి బాగానే చెల్లింది. ఉద్యోగం, పెళ్ళి తరువాత పద్ధతి లేకుండా ఉండడం కష్టం అనిపిస్తోంది. పద్ధతి గా ఉండాలని గత రెండేళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నాను..ఉహూ కుదరట్లేదు. ప్రతీ రోజు పడుకునే ముందు అనుకుంటాను రేపటినుండీ అన్ని పనులు టైం ప్రకారం పద్ధతిగా చెయ్యాలి. టైం మేనేజ్మెంట్ తెలియాలి...అప్పుడే చెయ్యలేకపోతున్న్ అపనులు చెయ్యొచ్చు...అని పదే పదే నాకు నేను చెప్పుకుంటాను. కానీ ఊహూ..ఒక్కరోజైనా అనుకున్నట్టు లేచి పనులు చేస్తే ఒట్టు. నాకప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది...ఇప్పుడు కూడా పద్ధతి లేని పద్ధతి చెల్లిపోతోంది కాబట్టే నేను రొటీన్ కి అలవడలేకపోతున్నానేమో అని!

మీకొచ్చినట్టు ఆ రోజు, ఆ అనుభవం నాకెప్పుడొస్తుందో...నేనెప్పుడు రొటీన్ కి అలవాటుపడతానో! :)
తృష్ణ said…
ఒక పద్ధతి లేకుండా రోజులు గడపడం కూడా ఒక రొటీనే కొందరికి...:) ఒక పధ్ధతికి వాళ్ళెప్పటికీ అలవాటు పడలేదు.
రవి said…
నాకు పద్ధతి, కార్యాచరణ అంటే అస్సలు నచ్చదు. ఈ రోజు ఈ పని ఈ టైముకు జరగాలి అని ఎవరు ఎందుకు కోరతారో కూడా అంతుబట్టని విచిత్రమైన ప్రాణిని నేను. దురదృష్టమో, లేక విధి నాకు పాఠం నేర్పాలనుకుందో, సరిగ్గా అలాంటి వాతావరణంలో ఎనిమిది సంవత్సరాలుగా పని చేస్తున్నాను!

పంజరం లాంటి ప్రపంచంలో ఊచల లాంటి మనుషుల మధ్యనుండీ బయటపడి విశాలవిశ్వంలో పక్షిలా పయనిస్తూ, డబ్బు, సంసారం, ఎథిక్సూ ఇలాంటి గొడవల్లేకుండా, ఇతరులని ఇబ్బంది పెట్టకుండా ఆనందంగా జీవించగలగటం మనిషికి సాధ్యమేనా? బహుశా కాదేమో!
ఈ పోస్ట్ నా గురించే రాసారా? నాకు వీకెండ్ అయిపోయాక..హమ్మయ్య back to రొటీన్ అనిపిస్తుంది. రెండు మూడు రోజులు వర్కింగ్ అయ్యాకా..వీక్ ఎండ్ ఎప్పుడు వస్తుంది అని అనిపిస్తుంది..
ఈ పోస్ట్ నా గురించే రాసారా? నాకు వీకెండ్ అయిపోయాక..హమ్మయ్య back to రొటీన్ అనిపిస్తుంది. రెండు మూడు రోజులు వర్కింగ్ అయ్యాకా..వీక్ ఎండ్ ఎప్పుడు వస్తుంది అని అనిపిస్తుంది..
Anonymous said…
ప్రతి రోజూ ఎంతో కొంత కొత్తదనం లేకపోతే మనిషికీ యంత్రానికీ తేడా ఏముంటుంది?
అవునండీ రొటీన్ లో కూడా కాస్త మార్పు వుంటేనే వుత్సాహంగా వుంటుంది . ఎప్పుడూ ఒకేలా వుంటే ఏంబాగుంటుంది ? గుడ్డెద్దు చేలో పడ్డటుగా వుంటుంది .
నాకయితే గత కాలపు సన్యాసుల్లా, మన ఎంటీవోడిలా ఉదయం మూడుగంటలకే బ్రహ్మముహూర్తంలో లేచి రొటీన్ మొదలు పెట్టాలని వుంటుంది. ఖంగారు పడకండి - కేవలం అలా అనిపిస్తుందంతే. మా పెద్దమ్మాయి రొటీన్ చెప్పాలి - పాఠశాల రోజుల్లో ఉదయం 5:30 కే చక్కగా లేస్తుంది. పాఠశాల లేని రోజుల్లో కంప్లీట్ రివర్స్. ఉదయం 5:30 కి పడుకొని మేము లేపకపోతే సాయంత్రం 5:30 కి లేస్తుంది. కొన్నేళ్ళ క్రితం అనగా తను అంతర్ముఖి అని తెలియకముందు మరీ పొద్దుపోయి లేస్తే ఏం బావుంటుందీ, ఎవరయినా చూస్తే ఏమనుకుంటారూ అనీ పొద్దునే(!) అనగా పదిగంటలకయినా పక్క మీది నుండి లేవమని పోరుపెట్టేవారం. ఈమధ్య కాస్త ఫర్వాలేదు - 2:30 ఉదయం నుండి 2:30 సాయంత్రం వరకు పడుకుంటుంది.

అంతర్ముఖుల వ్యక్తిత్వం గురించి చెప్పడం కోసం కూడా ఈ కామెంటును వినియోగించుకున్నాను. ఎక్ష్ట్రావర్టుల మరియు ఇంట్రావర్టుల రోటీనులలల్లో తేడా వుండొచ్చు. అది అందరూ అర్ధం చేసుకోగలగాలి.
Anonymous said…
కొన్ని పనులు చేసి తీరాలి రొటీనుగా! తరవాత మన ఇష్టం, మార్పు చేసుకోవచ్చు.
>>అప్పటిదాకా నేను అలవాటుపడిన దైనిక చర్య ఒక్కమారుగా అస్తవ్యస్తమైపోవడం - కానీ ప్రపంచం తలకిందులు కాలేదు.>>
>>రొటీన్ కూడా వెరైటీగానే ఉంటుంది!>>

మాష్టారు గారు, ఇప్పుడున్న కాలంలో వెరీటై (కొత్తగా) అంటూ ఏమి లేదనిపిస్తోంది. మనం చేసే పనిని కూడ కొంచెం కొత్తగా చేస్తే అదే వెరైటీ.. :), అదే మీరు చెప్పిన చివరి లైను..సూపరు.

అదే Shiv Khera గారు "You Can Win" లో చెప్పింది "Winners don't do different things, they do things differently", కనుక వెరైటీగా అలోచించండి..జిమ్‌కెలిపోండి.. :),

ఇక మనిషన్నాక కాసింత విసుగు, అసూయ..(రెడ్ చిప్ లక్షణాలు, రోబో) :) ఉండాలి.
(my view only)
Kottapali said…
ఆ. సౌమ్య. అవును. బయటి వత్తిళ్ళ వల్ల రొటీను అలవాటవుతుంది అనుకుంటా. పలాని టైముకి పిల్ల్లని స్కూలుకి పంపాలి, పలాని టైముకి ఆఫీసులో ఉండాలి - ఇత్యాది. గ్రాడ్యువేట్ స్టూడెంట్ లైఫ్, ముఖ్యంగా పీహెచ్‌డీ దీనికి పూర్తి విరుద్ధం.

తృష్ణ - పూర్తిగా రొటీన్ లేని వాళ్ళు ఎవరూ ఉండరనుకుంటా.

రవి - బహుకాల దర్శనం. అవును. ఇలా మనస్తత్వానికి సరిపడని పరిస్థితుల్లో ఇమడ్డం కష్టమే. కానీ ఇదివరకటి (పది-ఇరవయ్యేళ్ళ కిందటి) ఉద్యోగ పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ఉద్యోగస్తులకి తమ సమయం మీద తమ స్వయంనియంత్రణకి ఎక్కువ తావున్నది.
Kottapali said…
@ ప్రవీణ, కదా! :)
@ bonagiri - నిజమే. కానీ కొత్తదనం మరీ ఎక్కువైతేనే ..
@మాలాకుమర్ - నిజమే.
@ శరత్ - బావున్నై మీ అనుభవాలు. దీనికీ అంతర్ముఖత్వానికీ ఏమీ సంబంధం లేదనుకుంటా. రాత్రంతా మేలుకుండి పగలు నిద్రపోవడం సర్వత్రా టీనేజర్ల జన్మహక్కు!
Kottapali said…
@kashtephale - అదే అదే - ఒక్కోసారి ఆ కొన్ని రొటీను ఎంగేజిమెంట్ల గురించే వస్తుంది పేచీ.

@ గిరీష్ - బహుకాల దర్శనం. అవును, కాస్త వెరైటీ కలుపుకోవడం వల్ల బుద్ధి చమత్కృత మవుతుంది.
నేనూ, అస్సలూ రొటీన్ అనేది లేకుండా (సౌమ్య చెప్పినట్టు) ఉండేదాన్ని, అదొక అదృష్టం. అలాంటి అద్భుత మైన జీవితం కనీసం కొన్నేళ్లు గడపలేకపోతే .. బ్రతుకే వ్యర్థం :)
దాదాపు పిల్లలు పుట్టెంత వరకూ అంతే.

కానీ, ఇప్పుడు దాదాపూ, ప్రతి పనీ, సమయపాలన, multitasking తో చాలా పధ్ధతి గా చేస్తున్నాను :-(
నేనూ ప్రతి రోజూ దాదాపు.. 'ఈ ఒక్కపూటా.. వర్క్ ఔట్ వద్దులే,బట్టలు రేపు సద్దుకుందాం లే' అనుకుంటాను.కానీ, ట్రెడ్ మిల్ పక్కనే రెండు కుర్చీలేసి పిల్లల్ని చదివించుకుంటూ, లేదా, పిల్లలకి ఏదో మంచి కథ చెప్తూ,వారితోనూ, చిన్న పనులు చేయిస్తూ, బట్టలు మడత పెట్టించటం అవీ చేస్తుంటాను.


చక్కటి ఆర్టికల్.. ధన్యవాదాలు!
Sujata M said…
:) Sooper.

నాకూ పద్ధతి లేదు. ఇష్టం వచ్చిన పని ఇష్టం వచ్చినట్టు చెయ్యడం, ఎక్కువ పన్లు పోస్టు పోను చేసుకుంటూ పోవడం, ఒక్కసారి గాభరా గా చేస్తూండడం, మూడ్ ప్రకారం నడుచుకోవడం - ఇదీ నా జీవన విధానం. ఇదో బద్ధకపు రొటీన్ !
మీ వ్యాసం చాలా స్పష్టం గా సూటిగా వుంది .దీనికి వచ్చిన వ్యాఖ్యలన్నీ చదివాను .జీవితం చాలా నిత్యనూతన మయిన దండి .అది ఓ క్రమ పద్ధతి లో సాగిపోతేనే దానికో అందం .సృష్టి చూడండీ ఎంత క్రమ పద్ధతిలో నడుస్తుంటుందో !మన దేహము లోని విభిన్న భాగాలు ఎంత సమన్వయము తో పని చేస్తు ఉంటాయో సృష్టి లో అద్భుతమయిన విషయమేమిటంటే మానవ దేహ నిర్మాణము !ఈ విషయం ఏదయినా అవయవము మనకు ఆరోగ్యపర మయిన ఇబ్బందిని కలిగిస్తే అప్పుడు దాని క్రమత గురించిన విలువ మనకు తెలుస్తుంది అలాగే మనం పనిచేసే వృత్తి లో సమయపాలనకు ఎంతో ప్రాధాన్యత వుంది .అదే కదా మన సంసారాల లోని సుఖ సంతోషాలకు మూలాధారం మరి దాన్ని ఎంతో ఇష్టం గా మార్చుకోవాలి గదా !సెలవుల్లో కొంత సరళం గా ఉండవచ్చు .ఏది ఏమయినా బలవంతం గా కటోరం గా వుండటం కన్నా ఇష్టంతో, బాధ్యతతో క్రమతను అలవాటు చేసుకుంటే అదెప్పుడు రొటీన్ గా వుండదు.కొన్ని సార్లు క్రమం తప్పుతుంటాము.తప్పుతున్నామని తెలిసిన మరుక్షణం క్రమత లోకొస్తేసరి.
మన కిష్టమయిన పనులు చేస్తుంటే దానికదే క్రమశిక్షణ .మరి ఇష్టం లేని వృత్తుల్లో వున్నప్పుడు .దానిని వదిలి వేస్తే మనం బ్రతకలేము అనుకుంటే దాన్ని ఇష్టం గా మార్చుకొని క్రమం లో ఉండవలసిందే గదా !
ఇక సెలవుల్లో మన కిష్ట మయిన పనులు మన అభి రుచులు అన్ని కొద్దిగా అటు ఇటుగా చెయ్యవచ్చు.ఎన్నాళ్ళుగానో వాయిదా వేసుకున్నపనులు సెలవుల్లోఇష్టం గా పూర్థిచెసుకొవచ్చు .ఏది ఏమయినా సమయ పాలన జీవితానికి చాలా అవసరం .అదే సమయం లో కొంత సరళత అవసరం ఈ సమతూకం పాటిస్తే సరి.కాని దాన్ని ఎంతవరకు పాటిస్తాము అన్నది వ్యక్తిగతం గా ఎవరిష్టం వారిది.