కర్నాటక సంగీతాన్నిఆస్వాదించడం ఎలా - 2

మొదటి టపా ఇక్కడ.

గతవారపు ఎసైన్మెనంటుకి సమాధానాలు బాగానే వచ్చాయి. కొందరు పక్కదారి పట్టారు గానీ చాలామంది సరిగ్గానే పోల్చారు. ఒకరిద్దరు రాగం పేరు కూడా చెప్పారు. మంచిదే. సంగీతం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టాక రాగాల ప్రస్తావన లేకుండా పని జరగదు. కానీ అది ఇప్పుడే కాదు. మరి కొన్ని టపాలు అయ్యాక రాగాలు, వాటి విశేషాల్లోకి వెళ్దాము.

ఇక్కడే మరొక్క గమనిక కూడా. కొంతమంది సినిమా పాటల ఉదాహరణలు చెప్పమని అడిగారు. ఈ వరుసటపాల ఉద్దేశం కర్నాటక సంగీతాన్ని పరిచయం చెయ్యడం. దాని పట్ల ఆసక్తి పెంపొందించడం. విని ఆనందించడంలోని మెలకువలు చెప్పడం. అసలు మౌలికంగా సినిమా సంగీతం వేరు, కర్నాటక సంగీతం వేరు. సందర్భం వచ్చిన చోట్ల అలాగే చెప్పుకుందాం సినిమా పాటల ఉదాహరణలు. కానీ ముందే చెబుతున్నాను, సినిమా పాటల ప్రస్తావన చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. వ్యాఖ్యల్లో పాఠకులెవరైనా వాటిని ఉదహరిస్తే నాకేం అభ్యంతరం లేదు. Carnatic Fusion సంగీతం గురించి కూడా ఇదే సూచన.

సంగీతం ఆస్వాదించాలంటే ఏం చెయ్యాలి?
నేను నా ఫేస్బుక్కు పేజీలో ఈ టపాల గురించి చెప్పగానే మా పెద్దక్క ఒక మంచి వ్యాఖ్య రాసింది - సంగీతాన్ని ఆస్వాదించడమంటే ఏవుందీ, కర్ణపుటాలు తెరిచి విని ఆనందించడమే - అని. తను సరదాకి రాసిందేమో గాని, సంగీతం వినడం మొదలు పెట్టేవారికి ఈ సలహా మట్టుకు అక్షరసత్యం మాత్రమే కాదు మూలమంత్రం కూడా.
సంగీతం ఆస్వాదించడానికి మొదట కావలసింది వినడం.
ఏం వినాలి? ఎలా వినాలి? ఎక్కువ పరిచయం లేకుండా ఇప్పుడు వినాలి అనుకునేవారికి ఎదురయ్యే ప్రశ్నలివి.

ఏం వినాలి - వనరులు
1) నేను వినడం మొదలు పెట్టినప్పటికంటే ఈ రోజున బోలెడు వనరులు శ్రోతలకి సులభంగా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా జాలంలో. ఇదొక మంచి పరిణామం.
నాకు తెలిసిన కొన్ని వనరుల్ని కింద ఇస్తున్నాను. మీకు తెలిసినవి ఇంకా ఉంటే చెప్పండి.

Music India Online    http://mio.to/#/
Raaga                       http://www.raaga.com
Youtube                   http://youtube.com

ఈ మూడు సైట్లనీ పరిశోధించండి. Search చెయ్యడం, ప్లేయర్ని ఉపయోగించడం ఇటువంటివి కొంచెం ముందే సాధన చేసి అలవాటు చేసుకుంటే తరవాత అవసరమైనప్పుడు వెతుకులాటలో సమయం వృధా చేసుకోనక్కర్లేదు. ఈ సైట్లలో సభ్యత్వం తీసుకోవడం వల్ల ఏమైనా అదనపు ప్రయోజనం ఉన్నదేమో మరి నాకు తెలియదు. వీటిని తరచూ ఉపయోగించేవారు ఎవరైనా చెబితే బాగుంటుంది.

2) మీ బంధుమిత్రులలో సంగీతాభిమానులు ఎవరైనా ఉన్నారేమో కనుక్కోండి. ఉంటే గనక వారి వద్ద నించి డిజిటల్ రూపంలోగాని, లేక డిస్కు/కేసెట్ రూపంలో గానీ అరువు తీసుకోవచ్చు. ఇదొక పద్ధతి. దీనివల్ల ఇంకో ప్రయోజనం ఉన్నది - ఆయా బంధుమిత్రులతో వారికీ మీకూ వీలు కుదిరితే ఒక చోట కూర్చుని కలిసి వినవచ్చు, కొంత సంగీత చర్చ చేసే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా మీ సంగీత పరిధి విస్తరించే అవకాశం ఉంది.

ఇప్పుడే తొందరపడి డబ్బు పెట్టి సీడీలు గట్రా కొనెయ్యొద్దు. సంగీతం వినడంలో మీకంటూ ఒక అభిరుచి ఏర్పడనివ్వండి, దాన్ని బట్టి మెల్లగా కొనుక్కోవచ్చు.

3) మీరు నివాసం ఉండే చోట సంగీత కచేరిలు నిర్వహించే సభలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోండి. సంగీతం వినడంలో ఉత్కృష్టమైన అనుభవం ప్రత్యక్ష కచేరీ వినడంలోనే లభిస్తుంది. ప్రత్యక్ష కచేరీలతో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు గానీ దాని వల్ల వచ్చే ఆనందం దృష్ట్యా ఇబ్బందుల్ని భరించొచ్చు. సాధ్యమైనంత వరకూ కచేరీలకి వెళ్ళండి. చెన్నైలో త్వరలోనే మ్యూజిక్ సీజను మొదలవబోతున్నది. బహుశా బెంగుళూరులోనూ హైదరాబాదులోనూ కూడా కచేరీలు బాగానే జరుగుతుంటాయి. అమెరికాలో పెద్దనగరాలన్నిటిలోనూ కచేరీలు నిర్వహించే సభలు ఉన్నాయి.

4) టీవీ, రేడియో. నా చిన్నప్పుడు సంగీతాభిరుచికి ప్రాణం పోసింది రేడియో. నేను ఇంజనీరింగ్ చదువుకి ఆర్యీసీకి వెళ్ళిపోయిన కొత్తల్లో రేడియో సంగీత కచేరీలని విపరీతంగా మిస్సయ్యాను. ఆ వియోగం భరించలేక, మా కుటుంబ సన్నిహితులు ఒక ప్రొఫెసరుగారుండేవారు, ఒక ఆదివారం నాడు పొద్దున ఎనిమిదింటికి వాళ్ళింటికి వెళ్ళి, రేడియో పెట్టండి, కచేరీ వినాలి అని అడిగి, గంటసేపు వినిమరీ వచ్చాను. ఆ పిచ్చి అలాంటిది. ఆలిండియా రేడియో శనివారం రాత్రుళ్ళు సుమారు 9.30 నించీ గంటన్నరసేపు శాస్త్రీయ సంగీత కార్యక్రమం నడిపేది. దేశం మొత్తం అదే బ్రాడ్‌కాస్ట్. అందులో మూడు వారాలు హిందుస్తానీ, ఒక వారం కర్నాటక సంగీతం వచ్చేది. ఇది కాక, సంవత్సరానికి ఒక నెల రేడీయో సంగీత సమ్మేళనం అనే పేరిట, దేశంలో వివిధ నగరాల్లో కచేరీలు జరిపి, తరవాతి నెలలో ఆ కచేరీల రికార్డింగుని బ్రాడ్‌కాస్ట్ చేసేవారు. ఆ పైన చెన్నై కేంద్రం డిసెంబరు జనవరి నెలల్లో జరిగే చెన్నై సంగీతోత్సవాల కచ్చేరీలు కొన్నిటిని ప్రసారం చేసేవారు. మరిప్పుడంతా ఎఫ్ఫెం రాజ్యమేలుతున్నది. పరిస్థితి ఏంటో నాకు తెలియదు. అలాగే టీవీ సంగతి కూడా నాకు తెలియదు. కానీ యూట్యూబులో దొరుకుతున్న విడియోలని చూస్తే దూరదర్శన్‌లోనూ వివిధ ఛానెళ్ళలోనూ కర్నాటక సంగీతం బాగానే వినిపిస్తున్నదని తెలుస్తున్నది. అంచేత మీకు అందుబాటులో ఉన్న టీవీ, రేడియోలలో కర్నాటక సంగీత కార్యక్రమాలు ఏమి వస్తున్నాయి, ఏయే వేళల్లో వస్తున్నాయి గమనించి వినే ప్రయత్నం చెయ్యండి.

ఏం వినాలి - రూపాలు
ఇది నిజానికి చాలా జటిలమైన సమస్య. అలవాటు లేని వాళ్ళకి సంగీతం అంతా ఒకలాగే వినిపించవచ్చు, కానీ దానిలోకి దిగి లోతులు తడమడం మొదలైతే అర్ధమవుతుంది, అంతా ఒకలా ఉండదని. సినిమా సంగీతంలో ఎంత వైవిధ్యం ఉన్నదో కర్నాటక సంగీతంలోనూ అంత వైవిధ్యం ఉన్నది. గాత్రం ఉంది, వాయిద్యాలు ఉన్నై. బాణీలు ఉన్నై, కొన్ని కొన్ని పారంపర్య గతమైన కుటుంబాల పద్ధతులున్నై. అటుపైన వ్యక్తిగతమైన శైలులు ఉన్నాయి. హాయిగా ఉయ్యాల ఊపుతున్నట్టు పాడేవారొకరు, జడివాన పడుతున్నట్టు పాడేవారొకరు. మెరుపులు మెరిపించేవారొకరు, పిడుగులు కురిపించేవారొకరు. చమక్కులు చేసేవారొకరు, వయ్యారాలు పోయేవారొకరు. అలాగే పాటల్లోనూ ఎంతో వైవిధ్యం. వీటన్నిటినీ వీలైనంత విస్తృతంగా రుచి చూసి, మీ అభిరుచిని పెంపొందించుకుని, మీకు ఏది నచ్చుతోంది అని గుర్తించుకోవాలని నా కోరిక. నా ఉద్దేశంలో ప్రారంభ దశలో గాత్రం వినడం వల్ల ఎక్కువ లాభాలున్నాయి. అందులోనూ మనకి పరిచయమైన గొంతులు వినడంతో ప్రారంభిస్తే దారి మరి కాస్త సులభం అవుతుంది. ఇక్కడ ప్రస్తావించే సంగీతజ్ఞులందరూ నాకు దైవసమానులే, అందుకని ప్రత్యేకంగా గౌరవ వాచకాలు వాడడం లేదు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, యేసుదాసు, గరిమెళ్ళ బాలకృష్ణప్రసాదు (అన్నమాచార్య ప్రాజెక్టు ఆస్థాన విద్వాంసులు), సుధా రఘునాథన్, ఉన్నిక్రిష్ణన్ - ఈ గాయకుల గాత్రం మీరు ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. ప్రస్తుతానికి పైన ఇచ్చిన వనరులలో వీరి పాటలను వెతికి పట్టుకుని వినడం మొదలు పెట్టండి. ఇంకా ఏమేం వినాలో వచ్చే టపాల్లో చాలా వివరాలు వస్తాయి.

ఎలా వినాలి?
ఇప్పటికే ఈ టపా చాలా పొడుగైంది. ఈ విషయాన్ని తరువాయి టపాలో ఇంకా వివరంగా చర్చిద్దాముకాని, ఇప్పటికి ఒక క్లుప్తమైన సలహా చెబుతాను.
Listen widely. Listen deeply. Listen frequently.

గతవారపు ఎసైన్మెంటు
గాత్రం ఎమ్మెస్ సుబ్బలక్ష్మి. నేనిచ్చిన రికార్డింగు ఏ సినిమాలోదీ కాదు, ఒక ప్రత్యక్ష కచేరీలో రికార్డింగు. ఈ పాట హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతుల సృష్టి. ఖమాస్ అనే రాగంలో ఉన్నది. శంకరాభరణం సినిమాలో ఉపయోగించిన బ్రోచేవారెవరురా అన్న మైసూరు వాసుదేవాచార్యుల కృతి కూడా ఇదే రాగంలో ఉండడమే కాక, వింటున్నప్పుడు ఈ పాటకి చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఇప్పటికి విని ఉండకపోతే, రెండు పాటలనూ మరోసారి విని పోల్చి చూడండి. ఇది ఎటువంటి పాట, ఈ రాగం ఏవిటి, రెండు పాటలు ఒకే రాగంలో ఉన్నంత మాత్రాన ఒకేలా వినిపిస్తాయా? ఈ విశేషాలన్నీ నెమ్మదిమీద చర్చిద్దాం, సోదాహరణంగా.

ఈ వారం ఎసైన్మెంటు
ఇది సుమారు 20 నిమిషాల నిడివిగల పాట. అమెరికాలో జరిగిన ఒక ప్రత్యక్ష కచేరీలో రికార్డు చేసినది. ఈ పాట మొత్తం, మొదటినించీ చివరిదాకా శ్రద్ధగా వినండి. ఇది మీకు తెలిసిన పాటే. కాకపోతే ఇక్కడ సంపూర్ణమైన కర్నాటక స్వరూపంలో, వాద్య సంగీతంలో వినిపిస్తున్నది. ఈ పాటలో ఏమేమి వాయిద్యాలు వినిపించాయి? వినడంలో మీరు ఇంకా ఏమేమి విశేషాలు గమనించారు? మూడు నాలుగు వాక్యాలు రాయండి. ఉదాహరణకి రికార్డింగులో సుమారు ఏడు నిమిషాలు గడిచాక (ఇక్కడ చప్పట్లు మోగినై) గానీ అసలు పాట మొదలు కాలేదు. అప్పటిదాకా ఏమి జరిగింది? ఎసైన్మెంటులో రెండో భాగం - పైన చెప్పిన జాల వనరులు ఒకదానిలో ఇదే పాటని ఎవరైనా గాయకులు పాడిన గాత్ర రూపంలో వినండి. ఏ సైటులో ఏ గాయకులు పాడినది విన్నారో ఇక్కడ చెప్పాలి. నేనిక్కడ ఇచ్చిన వాద్య రూపానికీ, మీరు విన్న గాత్రరూపానికీ ఏమి తేడాలు గమనించారు? పోలికలు గమనించారు? దీన్ని గురించి ఒకట్రెండు వాక్యాలు చెప్పండి. రెండు రూపాల్లో మీకు ఏది నచ్చింది?

Comments

థాంక్సు బాసు. పాటలు పిచ్చిగా వినటం అలవాటుంది. ఎక్కువ సినిమా పాటలే వినేవాణ్ణి. పరమ పామరుడి టైపు నేను. నేను శాస్త్రీయ సంగీతం వినటం ఎక్కువయ్యిన కారణం ఇతరులు నమ్ముతారో లేదో తెలీదు. వస్తున్న తెలుగు సినిమా పాటల్లో తెలుగు లేక, కాస్త హాయయిన తెలుగు కోసం శాస్త్రీయ సంగీతాన్ని వినటం ఎక్కువయింది. కానీ ఈ మధ్య ఇంతకూడా ఈ సంగీతం గురించి తెలుసుకోలేక పోయానే అనే బాధ మాత్రం కలుగుతోంది. నాకు తెలిసిన చాలామంది సాహితీ మితృలకున్న అవగాహన చూస్తే అసూయ కూడా కలుగుతుంది నాకు. అంచేత, నేను నీకు ఇప్పుడు తాంబూలం ఇచ్చి గురుస్థానాని ఇచ్చేశాను. శ్రద్ధాగా చదువుతున్నాను.

అక్కిరాజు
sri said…
vaatapi ganapatimbhaje, flute,violin and mridangam. Other sites chudaledu.
flute high pitch hayu gaa vundi
నాగన్న said…
చక్కటి ప్రయత్నం.
Unknown said…
చాలాబాగుంది.చెన్నై నుంచీ మార్గళి మహోత్సవ్ అనీ ఒక నెల పాటు జయా టీవీ లైవ్ కచేరీలు ప్రసారం చేస్తుంది కానీ మన విజయవాడ కేబుల్ ఆపరేటర్లు ఇప్పుడు వాటి ప్రసారం ఆపేశారు .మూడేళ్ళకిందటిదాకా నేను రోజూ సాయంత్రం ఈ కచేరీలు తప్పకుండా వినేదాన్ని. ఈ అసైన్ మెంట్ మళ్ళి ఒక హుషారు కలిగిస్తోంది.నాకు సంగీతం వినడం ఇష్టమే కానీ అన్ని రాగాలు కనుక్కోలేన.ఇది మాత్రం హంసద్వని అనుకుంటున్నాను
Kottapali said…
అక్కిరాజు, You are most welcome. ఈ మాత్రం దానికి గురువనీ తాంబూలమనీ పెద్దమాటలెందుకు? I do hope you enjoy this little journey and derive some benefit from it.

Sri, good. ఇంకొంచెం లోతుగా వినండి. మిగతా సైట్లలో ఒక గాత్రం కూడా వినండి.

సత్యవతి గారు, మీరొచ్చి ఇటో లుక్కేసినందుకు చాలా సంతోషం. సంగీత ఆస్వాదనలో రాగాల్ని గుర్తు పట్టడం ఒక భాగమే. దాన్ని గురించి కూడా ఇక్కడ మాట్లాడుకుందాం. ఐతే చాలామంది శ్రోతలకి అదొక క్విజ్ లాగా, పోటీలాగా ఉండడం గమనించాను. రాగం గుర్తు పట్టాక, అదొక పెద్ద పని ఐపోయినట్టు, ఇక వారికి ఆ పాటలో ఆసక్తి పోతుంది. అలా కాక, రాగం గుర్తుపట్టడాన్ని దాటి, వినడంలోని ఆనందాన్ని నేర్పించాలని నా ఉద్దేశం.

నాగన్న, నెనర్లు.
Vasu said…
---ఇది ఎటువంటి పాట, ఈ రాగం ఏవిటి, రెండు పాటలు ఒకే రాగంలో ఉన్నంత మాత్రాన ఒకేలా వినిపిస్తాయా? ఈ విశేషాలన్నీ నెమ్మదిమీద చర్చిద్దాం, సోదాహరణంగా ---

ఎపుడెపుడా అని వెయిటింగ్ ఇక్కడ...

అసైన్మెంటు పూర్తి చేశాక విని మళ్ళీ కామెంటు తా మాష్టారు .
pi said…
Beautiful Hamsadhwani! Who are the instrumentalists?

For those who are starting out should also listen to U. Srinivas's version. Nasy, may be should also post raghuvamsa sudhambudhi. Tad overused in films, but a song most can relate to and very perky raaga.
Krishna said…
పైన ప్రస్తావించిన సంగీతజ్ఞులందరితో బాటు, మల్లాది సోదరులు (Malladi Brothers) ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలో ఉన్నారు. ముఖ్యంగా తెలుగువారిగా మనం వారి ఉచ్చారణని బాగా ఆస్వాదిదించవచ్చు.
Srinivas said…
నారాయణ స్వామి గారికి

ఈ మధ్యే నేను కర్నాటక సంగీతం వింటున్నాను. గాత్రంలో పలికించే కల్పిత స్వరాలను బాగా ఎంజాయ్ చేస్తాను. ఆలాపన అంతగా "అర్థం" కాదు. నచ్చడమో, నచ్చకపోవడమో ... "ఎందుకో బాగ తెలియదు". నాలాంటివారికి మీ వ్యాసాలు ఎంతో ఉపయోగపడతాయి.

రాబోయే మీ పోస్టుల కోసం ఎదురు చూస్తాను.

అభినందనలతో
శ్రీనివాస్
Krishna said…
"ఆలాపన" అంటే బోరు అనేవారిని చాలామందిని చూశాను (మా ఆవిడతో సహా). మళ్ళీ వాళ్ళలో చాలామంది నేరవల్ (సాహిత్య ప్రస్తారం), స్వరకల్పన అంటే ఇష్టపడే వాళ్ళనీ చూశాను.
pi said…
@Krishna, Alapana is an aquired taste! Keep listening, you will start enjoying it.
Kottapali said…
@pi, Krishna already enjoys it. He's commenting about others.
ధన్యవాదాలు నారాయణస్వామిగారు. ఇప్పటికే రెండు సార్లు మీ ఆడియే విన్నాను. రెండు సార్లు బాలమరళీకృష్ణ గారిది విన్నాను. ప్రస్తుతము జేసుదాసుది వింటున్నాను. అంతకు ముందు ఘంటసాలది కొన్ని పదులసార్లు విన్నాను (వినాయకచవితి సినిమా అనుకుంట).

ఇంత వరకు నాకు ఏమి అర్థము అయినది అంటే.. ఏమో నాకే తెలియటము లేదు. Confused.
lalithag said…
ఇంకెక్కడో ఏదో సంభాషణలో ఎవరో శాస్త్రీయ సంగీతం ఆస్వాదించడం కష్టం అన్నారు. ఆ వెంటనే మీ వరుస టపాలు మొదలయ్యాయి :) పోయిన వారం అసైన్మెంటు విని సుబ్బలక్ష్మి గారే అనుకున్నాను. కానీ అంత సులువుగా అడుగుతారా అని అనుమానం వచ్చి ఆగిపోయాను. ఈ సారి అసైన్మెంటు వినడానికి ఎంతో బాగుంది. వినడం మొదలు పెట్టాక మీరు వ్రాసినదీ, వ్యాఖ్యలూ అన్నీ మర్చిపోయాను. అంటే మొదటినుంచీ ఆస్వాదిస్తూ వచ్చాను. చదివినప్పుడేమో ఆలాపనలూ అవీ నాకు అంత నచ్చవేమో అనుకున్నాను. తీరా పాట అందుకున్నాక అప్పుడు ఆ విషయం గుర్తుకు వచ్చి నవ్వుకున్నాను.
ఎవరైనా పెట్టుకుని వింటూ ఉంటే అటు వైపు ధ్యాస మళ్ళడమే కాక అందులో లీనమూ ఐపొయే అవకాశం చాలా ఉంది. కష్టమల్లా, మొదలు పెట్టడం. ఎప్పుడో ఒక్కో సారి మనసు అటు లాక్కెళ్ళి మరీ వినేలా చేస్తుంది. మీ శీర్షికలో
"ఆస్వాదించడం ఎలా" అన్న ప్రశ్న చాలా సేపు అర్థం కాలేదు నాకు. ఆస్వాదించడం ఎలా ఏంటి? వింటే నచ్చితే ఆస్వాదించడమే. నచ్చకపోతే నచ్చేలా చేసుకోవడం గురించి మీ ప్రశ్న ఐతే మరి తెలియదు.
ఐతే నాకు ఇంకో ప్రశ్న ఉంది. ఎక్కడైనా వెతికి "గిరిరాజసుతా తనయా" పాట (గాత్రం, మంచి ఉచ్ఛారణ, సాహిత్యానికి న్యాయం చేసేలా పాడినది) వినిపించగలరా? నాకు చాలా ఇష్టమైన "శక్తి" బృందం వారి వీడియోల కోసం యూట్యూబ్ లో వెతుకుతుంటే శంకర్ మహదేవన్ పాడిన పాట దొరికింది. అది నాకు వినబుద్ధి కాలేదు. ఎందుకో ఊహించగలరనుకుంటాను. అలా నచ్చకపోవడం సబబేనా? ఎందుకంటే అది గాత్రంలో మాత్రమే నచ్చలేదు. అదే వాయిద్యాలలో పూర్తిగా ఆస్వాదించాను.
Anonymous said…
మొదటిది ఆలాపన, వేణువు,వయోలిన్,మృదగం,ఘటం, వాతాపి గణపతిం. ఇదొక్కటే రాగం తెలుసు హంసధ్వని.
పోల్చి చెప్పగల శక్తిలేదు.
Kottapali said…
Vasu, అన్ని విషయాలు, విశేషాలు వస్తాయి చర్చలోకి. అన్నప్రాసననాడే ఆవకాయ కూడదు కదా. ఎసైన్మెంటులు మాత్రం మరవొద్దు సుమా. అసలు కిటుకంతా వాటిల్లోనే ఉంది.

pi, For those details, you will have to wait till next post.

Krishna, మల్లాది సోదరుల గాత్రం బావుంటుంది. ప్రాచుర్యం సంగతి తెలియదు. వచ్చే రెండు మూడు టపాల్లో మరి కొందరు ప్రముఖ గాయకులని పరిచయం చేస్తాను.
Kottapali said…
Srinivas గారు, చాలా సంతోషం. మీ వంటి వారి కోసమే ఈ సీరీస్. ఆలాపన గురించి వివరంగా చర్చిద్దాం. సంగీతంలో ఆలాపన పెయింటింగులో abstract ఆర్టు వంటిది. అందుకని దాన్ని ఆస్వాదించడానికి వినికిడిని ఇంకొంచెం పదును పెట్టుకోవాలి. అవన్నీ కూడా మాట్లాడుదాం.
Kottapali said…
తెలుగుయాంకి ఈ స్టేజిలో కంఫ్యూజను కూడా మంచిదే. తెలుసుకోవాలి అన్న కుతూహలం పెరుగుతుంది :)

lalithag, సంతోషం. నిజమే. మీరన్నట్టు మొదలు పెట్టడానికే అడ్డంకి అంతా. గిరిరాజ సుతాతనయ .. M.D. Ramanathan గారిది commercial recording ఉండాలి. నేను విన్నాను. జాలంలో దొరుకుతుందేమో ప్రయత్నించండి.

కష్టేఫలే శర్మగారు, శక్తిలేదు అని వొదిలెయ్యకండి. ఆ శక్తిని వృద్ధి చేసుకునేందుకే ఈ కసరత్తు అంతానూ.
Anonymous said…
వామ్మో,

మళ్ళీ మాష్టారు ఉద్యోగం లోకి వచ్చేసేరు ?
ఆన్లైన్ అసైన్మెంట్ ఇచ్చేస్తున్నారు వరసబెట్టి.!


చీర్స్
జిలేబి.
Krishna said…
ఇంతకీ ఈ మురళీగానం ఎవరిదీ నాసీ? రమణి?
Kottapali said…
జిలేబి :)
కృష్ణ .. ఎసైన్మెంటుకి సంబంధించిన వివరాలు వచ్చే పోస్టులో.
నేను చూసేసరికే రెండు క్లాసులైపోయాయా! సరే ఎసైన్మెంటుకి నా జవాబు:

వినిపించిన వాద్యాలు, వేణువు, వయొలీన్, మృదంగం, ఘటం. మరొక తంత్రీ వాద్యం కూడా వినిపించింది. బహుశా వీణ? అలానే ఒక రెండు చోట్ల కంజీరాలా కూడా వినిపించింది. ఇందులో ప్రధాన వాద్యం మురళి, తక్కినవి పక్క వాయిద్యాలు అనిపించాయి.
మొదట (చప్పట్ల ముందు) తాళ వాయిద్యాలు లేని భాగాన్ని ఆలాపన అనవచ్చా? గాయకుడు పాడేది మాత్రమే ఆలాపనా?

యూట్యూబులో ఈ కృతి దొరికినన్ని వెర్షన్లూ (గాత్రంతో ఉన్నవి) వినేసాను. బాలమురళి, సుబ్బలక్ష్మి, యేసుదాసు, చెంబై, సెమ్మంగుడి, ఆర్.డి. రామనాథన్, ఘంటసాల గార్లవి. పాటలు ఒట్టి వాయిద్యాలపై కన్నా నాకు గాత్రంలోనే ఎక్కువ యిష్టం. రామనాథన్ గారి పాట అస్సలు భరించలేకపోయాను. సాహిత్యమ్మీద ఏమాత్రం గౌరవం లేకుండా అక్షరాలను పదాలను విసిరేసి పాడడం నాకు బొత్తిగా నచ్చలేదు. అతని పాట కన్నా పక్క వాయిద్యం వయోలీన్ చాలా బాగుంది. చెంబై వారిది అంత ఘోరంగా లేకపోయినా, దానికి దగ్గరగానే ఉంది. అందుకే అదికూడా నచ్చలేదు, ఆలాపన వరకూ బాగున్నా. వీరిద్దరికన్నా సెమ్మంగుడి వారిది నయమనిపించింది. సుబ్బలక్ష్మిగారికి తిరుగులేదు (అక్కడక్కడ పదాల విరుపులు తప్ప). యేసుదాసు కూడా ఫరవాలేదు. బాలమురళిగారిది చెప్పనక్కర లేదు. సుబ్బలక్ష్మిగారి పాట వింటూ ఉంటే మదపుటేనుగు మీద ఊరేగుతున్నట్లు అనిపిస్తే, బాలమురళి పాట వింటున్నప్పుడు పంచకల్యాణినెక్కి పరుగు తీస్తున్నట్టు అనిపించింది. వీరిద్దరిదీ విన్న తర్వాత ఘంటసాల పాట చాలా హడావిడిగా సాగిపోయినట్లు అనిపించింది. రామనాథం గారి పాటలో వయోలీన్ డామినేట్ చేస్తే, బాలమురళి పాటలో గాత్రం డామినేట్ చేసింది. సెమ్మంగుడి, సుబ్బలక్ష్మి గారి పాటల్లో గాత్ర వాయులీనాలు రెండూ సమపాళ్ళలో నడిచాయి. సెమ్మంగుడివారి పాటలో "ప్రణవస్వరూప" అన్న దగ్గర వేసిన గమకం చాలా నచ్చింది. సుబ్బలక్ష్మిగారి పాటలో "మూలాధార" అనే చోట విన్నప్పుడు, మూలాధారంలో ఉన్న శక్తి ఒక్కసారి పైకి లేచినట్టనిపించింది.

షరా: ప్రతి ఎసైన్మెంటూ యింత నిక్కచ్చిగా చేస్తానని ఆశించవద్దు :)
Kottapali said…
కామేశ్వర్రావుగారు, what can I say? You are my ideal student! :)
సాహిత్యాన్ని ఉచ్చరించడం, పదాల విరుపులు, తమిళ గాయకులు చేసే "ప్రయోగాలు" - ఇవి కూడా చర్చకి తీసుకు వస్తాను కొన్ని ప్రాథమిక పాఠాలు అయ్యాక.
Thank you for such an uplifting comment. You really made my day.
Kottapali said…
One suggestion to all readers. When I ask you to write down your observations about the listening assignments, I am not looking for any music jargon or deep analysis. Just jot down what you heard and felt in the piece. It helps me to know a) that you are listening, and b) that you are observing all that is there to observe. It helps in preparing future posts. Thank you.
అన్నగారూ
మా అమ్మాయిని ఆశీర్వదించండి. తను పాడిన పాటలు ఇక్కడ లభ్యం
http://bhaskar.posterous.com/165325782
Krishna said…
వాయులీనం అంటే వయోలిన్ కాదని నా ఉద్దేశం.

"ఉచ్చ్వాస నిశ్వాసములు వాయులీనాలు" వేటూరి వారు సరైన అర్థంతో వ్రాసినా, కే.వి.మహాదేవన్ వయోలిన్లు కొట్టింఛి భావం మార్చారని నా అభిప్రాయం.
కృష్ణగారు,
నిజమే, వాయులీనం అనే పదం ఆధునిక ప్రయోగమే. పాత నిఘంటువుల్లో ఎక్కడా లేదు.
"సరైన అర్థంతో వ్రాసినా" - అంటే సరైన అర్థం ఏమిటంటారు? వేరే ఏదైనా వాద్యమా?
ఆ పాట సందర్భాన్ని బట్టి (వెనక పాదాలు చూస్తే), అది ఏదో వాద్యాన్ని సూచించడానికే వేటూరి వాడారన్నది స్పష్టం. దానికి తగ్గట్టు "ఉచ్చ్వాస నిశ్వాసా"లను చేర్చారు.
వినడానికి బాగుంది, మరీ అర్థరహితంగా లేదు. అంచేత వయోలీన్‌కి అనువాదంగా నేనా పదానికి స్థిరపడిపోయాను. శ్రీ రవ్వా శ్రీహరిగారి ఆధునిక నిఘంటువులో యీ పదాన్ని చేర్చారు. ఫిడేలు, వయోలీన్ అనే అర్థాలిచ్చారు.
Anonymous said…
మూడు నాలుగు నిమిషాలు గడిచేవరకూ పాట మొదలు కాలేదు కదా. అప్పటివరకూ వాయిద్యాలు చేసిన స్వరసంచారం బహుశా శ్రోతల్ని రసానుభవానికి సిద్ధం చేసేదేమో అనిపించింది. ఎందుకంటే నేను తర్వాత శ్రీ కె.జె.ఏసుదాసు స్వరంలో ఆ పాటని విన్నప్పుడు అలాంటి ఆలాపనో, స్వరసంచారమో లేకుండా హఠాత్తుగా పాట మొదలయ్యేసరికి ఏదో తెలియని ఇబ్బంది కలిగింది. కాసేపటికి తేరుకుని ఆ గానంలో లీనం కాగలిగాను. వెనువెంటనే లైవ్ పాట, ఏసుదాసు పాట వినడం వల్ల నాకు అలా స్ఫురించిందేమో తెలియదు.
సరే ఆ సంగతి వదిలేస్తే నేను గమనించినంతలో మీరు ఇచ్చిన లంకెలోని పాటలో వేణువు, వయొలిన్, వీణ, ఒకటి ఏదో (నేను) గుర్తించలేని తీగ వాద్యం కూడా ఉంది, మృదంగం, ఘటం, (గాత్రం కూడా వినిపిస్తున్న భ్రమ కలుగుతోంది మరి), చప్పట్లు నాకు వినిపించినై.
ఒక స్థాయిలో వయొలిన్వాదన, వీణానాదం, వేణుగానం కలిసి వినిపిస్తూ ఎవరో స్త్రీమూర్తి పాడుతోంది గావుననిపించేలా చేశాయి. మరో విషయం ఎందుకో నాకు అర్థం కాలేదు కానీ మొదట పాట ప్రారంభానికి ముందు చేసిన స్వరసంచారంలో కేవలం వేణువు, కొన్ని తంత్రీవాద్యాలే తప్ప ఘటం, మృదంగం జోక్యం కల్పించుకోలేదు. నేను గమనించి తెల్సుకునదేమంటే-వీణ, వేణువు గాత్రంలా వాయిన్స్తోన్న ఈ కచేరిలో ఘటం, మృదంగం వాటికి సహకార వాయిద్యాలుగా ఉన్నాయి.
ఇక అసైన్మెంటులో రెండవ భాగం- నేను ఈ వాద్య కచేరీ విన్నాకా యూట్యూబ్.కాంలో కె.జె.యేసుదాసు గాత్రంలో వాతాపి గణపతి భజే విన్నాను. నేను గుర్తించిన భేదం ఒకటి ముందుగానే మనవి చేశాను. ఇక ఆయన గీతానికి ఘటం, మృదంగం సహకార వాద్యాలుగా వున్నాయి. ఈ రెండు కచేరీల్లోనూ అది గమనించదగ్గ పోలిక. కాగా ఆయనది లైవ్ లో రికార్డ్ చేసిన ప్రోగ్రాం తాలూకా పాట కాదు(నాకు తెలుస్తోంది).
ఇక నాకు ఏది నచ్చింది అన్న ప్రశ్న అన్నిటిలోకీ కష్టంగా తెఒస్తోంది. ఎందుకంటే- గాత్రంలో పాట వినక ముందు ఆ వాద్య కచేరీలో విని అద్భుతమైన రసస్పందన కలిగించేందుకు బహుశా వాద్యాలకుండే ఒడుపు మానవ గాత్రాలకు ఉండదేమో అనే అనుకున్నాను. తీరా గాత్రం విన్నాకా ఆ అభిప్రాయం సవరించుకోలేదు. కాని గాత్రంలో సాహిత్య సహితంగా వినడం వల్ల ఒక అలౌకిక దృశ్యం స్ఫురించీ, దానితో సంగీతాన్ని మేళవించిన వాగ్గేయకారుని హృదయం అవగతమై ఎంతో మేలు కలిగే అవకాశం ఉందని(ఇంతకన్నా వివరంగా వ్రాయడం సాధ్యపడట్లేదు) అనిపించింది. దేనికదే(సమాధానం దాటవేశానని భావించకండి)
Kottapali said…
Pavan Santhosh, very good observations. ఈ ఎసైన్మెంటుకి నేను ఆశించినదానికన్నా ఎక్కువే రాశారు. ఈ విశేషాలన్నిటినీ వచ్చే టపాలో కొంత వివరంగా చర్చిద్దాము.

క్లాసులో చేరిపోయామొహో అని హడావుడి చేసిన మిత్రులందరికీ .. ఎసైన్మెంట్లు ఎక్కడ?? కనీసం ఇంకో ఐదు ఎసైన్మెంట్లయినా నాకు చేరితే తప్ప తరవాతి టపా రాదు!!
Vasu said…
నా చేత్తో పెట్టుకున్న కాఫీ తాగుతూ ఇది వింటూ శనివారం మొదలెట్టా . ఆనంద్ సినిమాలో చూపించినంత అందం గా అనిపించింది ఈ ఉదయం .

ఆడియో మొదలవగానే కోనసీమలో కొబ్బరాకుల మధ్య నించి లేత సూర్య కిరణాలు తడుతున్నట్టు, పైరగాలి పలకరిస్తున్నట్టు ..ఉంది ..

ఆ వేణువు (ఆలాపనా ??) బాగా నచ్చింది నాకు మిగతా కీర్తన కంటే



మిగతా వాయిద్యాలు - ఘటం , వయోలిన్ , మృదంగం .

నాకు వాయిద్యాల కంటే గాత్రమే ఇష్టం . కానీ ఈ ఆడియో లో వేణుగానం మాత్రం అధ్బుతం .. మాటల్లో చెప్పలేని ఆనందం కలిగింది .

అన్నట్టు మురళి అన్నా వేణువు అన్నా ఒకటేనా ??

బాసురి కర్ణాటక సంగీతానికి అసలా వాడరా హిందుస్తానీ కేనా ??

ఎం ఎస్ అమ్మ ది విన్నాను .. అసల ఆలాపన లేదు; పల్లవి కంటే చరణం బావుందనిపించింది (పల్లవి చరణం అనచ్చా ??)

అన్నట్టు ఈ కీర్తన సంస్కృతం లోనేనా ఉన్నదా ??

బాలమురళి గారిదే బావుంది విన్నవాటిలో . అసల అర్థం తెలియాలంటే ఈయనదే వినాలి ముఖ్యంగా "సంసేవిత చరణం .. " అందరూ భూతాదిసం. సేవిత అని విడగొట్టి అర్థాన్ని చెడగొట్టారు ..


ప్రేక్షకులను ఆకట్టుకునేది, కట్టి పడేసేది , ఆలాపనే నేమో..

ఇప్పుడే గమనించా .. మొదటడి అమ్మ స్తుతి (ప్రత్యేకించి సరస్వతి దేవి మీద కీర్తనలు లేవా ?) ఇప్పుడు సుతుడి (గణపతి) స్తుతి .. బావుంది ..

సమయాభావం వల్ల ఎక్కువ వెర్షన్స్ వినలేదు .. అసైన్మెంటు అంత శ్రద్ధగా చెయ్యలేదు ..




Kottapali said…
Vasu, good observations. Didn't expect anything less from you. True - the choice of songs was very deliberate. If you notice, the first post appeared on first day of Devi Navaratri. Yes, there are songs in praise of Goddess Sarasvati. please check my FB page right now. Posted some more youtube links there.
Kottapali said…
Dasara gift

http://www.youtube.com/watch?v=a_-UV1mLZug
http://www.youtube.com/watch?v=OqM1DAwQi78
http://www.youtube.com/watch?v=u6yiRPx33J4
మాన్యులు శ్రీ నారాయణస్వామి గారికి,

అద్భుతంగా ఉన్నది మీ "కొత్తపాళీ" రచనావళి. ఒక్కటోక్కటీ చదువుతూ, నేర్చుకొంటూ, ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ ముందుకు సాగుతున్నాను.

ఉపాధ్యాయిత రాణిస్తున్న అధ్యాపకులు మీరు.

కృతజ్ఞతతో,
ఏల్చూరి మురళీధరరావు
మేధ said…
నాకు అస్సైన్మెంట్ మాత్రం కనబడడం లేదండీ... :(
మొదటి టపాలో కూడా కనిపించలేదు.. నా బ్రౌజర్లో ఏమైనా మార్చుకోవాలా..?!
Kottapali said…
మేధగారూ, ఈ సాంకితిక రహస్యాలు నాకూ తెలియవు. నేను వాడినది divshare embed పరికరం. ఈ కింది లంకె పని చేస్తుందేమో చూడండి.

http://www.divshare.com/download/19957456-a8d
Anonymous said…
సార్ నా పని నేను చేసేశా. ఇంకెన్నాళ్లు వేచిచూడాలి మూడో అసైన్మెంటుకోసం.
SRRao said…
' కొత్తపాళీ ' నారాయణస్వామి గారూ !

మీకు, మీ కుటుంబానికి విజయదశమి శుభాకాంక్షలు

శిరాకదంబం వెబ్ పత్రిక
మేధ said…
Sorry for the late reply.. I guess office firewall is disabling the embedded player. I will try from my house again.. Thanks for the information :)