ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో
ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగ్గలడో
ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలై మగ్గిపోదో
ఎక్కడ చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో
ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో
అక్కడికి, ఆ స్వేఛ్ఛాస్వర్గంలోకి, భగవంతుడా నా
ఈ దేశాన్ని మేలుకొలుపు!
- విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్
***
అదొక యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ కోర్టు.
ఆనరబుల్ జడ్జి జూడి గారు వచ్చి ఉచితాసన మలంకరించారు.
సంయుక్తరాష్ట్రముల
సహాయ న్యాయవాది కాన్నీ రూబిరోసా లేచి, కోర్టువారికి అభివాదం చేసి తరువాతి కేసుని విచారించటానికి అనుమతి కోరారు.
అమెరికా సంయుక్త రాష్ట్రములు వెర్సస్ దుంపలపాటి సుబ్బారావు
ప్రభుత్వన్యాయవాది
రూబిరోసా కేసు పూర్వాపరాలను ఇలా వివరించారు.
"ముద్దాయి సుబ్బారావు అనేక చలనచిత్రాలను పైరేటెడ్ కాపీల ద్వారా తాను వీక్షించుటయే కాక, సదరు చిత్రాల హక్కుదారులైన నిర్మాతలు, పంపిణీదారులకి తగిన ప్రతిఫలం ముట్టచెప్పకుండానే, తగిన అనుమతులు పొందకుండానే ఆయా చిత్రాలను కాపీచేయించి పంపిణీ చేయుచున్నారని అభియోగము మోపబడినది. తద్వారా ఆయా హక్కుదారులకు న్యాయంగా రావలసిన ఆదాయము కోల్పోయి తీవ్రమైన ధన
నష్టం సంభవించింది. అంతేకాక ఈ
ఘనత వహించిన అమెరికా సంయుక్త రాష్ట్రములలో కాపీరైటెడ్ మెటీరియల్సుని తగిన అనుమతి లేకుండా కాపీ చెయ్యడం చట్ట రీత్యా నేరం. అందుచేత ముద్దాయి సుబ్బారావుపై తత్సంబంధ క్రిమినల్ కేసు ఆరోపించడమైనది. కోర్టువారు నిజానిజములను విచారించి ఈ
ముద్దాయికి
తగిన శిక్ష, కఠిన శిక్ష విధించవలెనను ప్రభుత్వమువారు కోరుచున్నారు."
ముద్దాయి సుబ్బారావు తనకు న్యాయవాది అక్కర్లేదనీ, తన
తరపున తానే వాదించుకుంటాననీ కోర్టు అనుమతి పొందాడు.
ప్రభుత్వ న్యాయవాది సుబ్బారావుపై మోపిన అభియోగానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టువారికి వివరించసాగారు.
***
ఏవండోయ్ రామకృష్ణ గారూ, ఈ
విడ్డూరం విన్నారా?
హలో ప్రకాష్ గారూ, ఎవిటండీ, ఏం
జరిగిందీ, ఏవిటా విడ్డూరం?
విడ్డూరమా,
విడ్డూరమున్నరా?
మన సుబ్బారావు లేడూ?
ఏ సుబ్బారావండీ? మన
తెలుగు సమితి కల్చరల్ సెక్రటరీనే?
అబ్బ, ఆతను కాదండీ. డీవీడీ సుబ్బారావంటారు అందరూనూ .. అదే, అతని లాస్టు నేము ఏంటో చప్పున గుర్తుకి రావట్లేదు.
ఓ డీవీడీ సుబ్బారావా? తెలియకేం. మొన్నేగా బిజినెస్మేన్ డీవీడీ ఇచ్చి వెళ్ళాడు. ఏం
జరిగిందేం?
అతన్ని అరెష్టు చేశార్టండీ!
హయ్యబాబోయ్,
అరెష్టే? ఎందుకూ?
ఎందుకేవిటండీ?
ఆ దిక్కుమాలిన డీవీడీలు పైరసీగా కాపీలు చేసి అమ్మేస్తున్నాడని.
ఏంటీ, డీవీడీ కాపీ చేసినందుకు అరెష్టా? ఇది నిజంగా విడ్డూరమే!
అదే మరి, ఇదేవన్నా మన
ఇండియాలాగానా?
ఈ దేశంలో అవేవో కాపీ రైట్లూ అవీ ఏడిచాయిగా?
ఐతే మాత్రం?
ఆఁ అసలు నేను ఎప్పణ్ణించోనే అనుకుంటూనే ఉన్నాలేండి.
ఏవని అనుకున్నారూ?
ఇతగాడిలా విచ్చల విడిగా వచ్చిన సినిమా అల్లా వచ్చినట్టు కాపీలు చేసి పంచి పెడుతూంటే, ఇలాంటిదేదో అవుతుందని నాకు డౌటుగానే ఉంది.
డౌటుగా ఉంటే సుబ్బారావుని హెచ్చరించకపోయారూ?
ఆఁ మధ్యలో నేనేవర్ని, ఇంకోళ్ళ సంగతి నాకెందుకు?
అంతే లేండి, మంచికి రోజులు కావు.
అంతే అంతే. ఉంటా రామకృష్ణగారూ, ఇంకా మనవాళ్ళందరికీ కాల్స్ చెయ్యాలి
ప్రకాష్ ఫోన్ కట్ చేశాడు.
తన మొబైల్ వంకే చూస్తూ రామకృష్ణ ఆలోచనలో పడ్డాడు - పాపం సుబ్బారావు ఎలాంటి ఇబ్బందిలో పడ్డాడు?
***
హాయ్ రాబర్ట్, ఈ
విషయం విన్నావా?
హల్లో జో, ఏంటి ఏం
విషయం?
మా యింటి పక్కన ఇండియన్ లేడూ? రావ్! అతన్ని అరెస్ట్ చేసి పట్టుకుపోయారు!
అదేంటి? అతను చాలా క్వయెట్ అనుకున్నానే? ఏం
చేశాడు అకస్మాత్తుగా?
ఏమో మరి. ఐనా ఈ
ఫారినర్స్
ని నమ్మలేం!
ఛ, అదేంటీ, అలా అంటావు? అదీ కాక రావ్ చాలా మంచి నైబర్ అనీ, ఇంకా మీ
కుర్రాడికి
అప్పుడప్పుడూ
లెక్కలు హెల్ప్ చేశాడని చెప్పావ్ కదా!
చేస్తే? సో వాట్?
ఏం లేదు. అంత మంచోడైతే .. మరిలా .. అరెస్ట్ ..
అదే అంటున్నా ఈ
ఫారినర్స్
తో ఎవడు ఎవడో ఏంటో తెలీదు. పైకి బాగా చదువు కున్నట్టు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో .. మనలాగే ఉన్నట్టు కనిపిస్తారు. కానీ లోపల?
ఆఁ, లోపల? ఏముంది?
అదే! ఎవడికి తెలుసు లోపల ఏం
చేస్తారో? అప్పట్లో ముస్లిం టెర్రరిస్టులూ ఇలాగే ..
అంటే? రావ్ కూడా టెర్రరిస్టు పనులేవన్నా .. ?
అహ, రావ్ టెర్రరిస్టని కాదు .. ఏం లేకుండా అరెస్టెందుకు చేస్తారు? ఏదో చేసే ఉంటాడు కదా?
హమ్మ్ .. అదీ నిజమే.
అందుకే అంటున్నా రాబర్ట్, ఈ
ఫారినర్స్‌ని నమ్మలేమని.
అంతేలే, జో.
అయ్యో పాపం సుబ్బారావు అని జాలిగా అనుకుంటూ తన
కుక్కని నడిపించుకుంటూ రాబర్ట్ తన
ఇంటివేపుకి
దారి తీశాడు.
***
ఏవమ్మా భారతమ్మా, అంతా కులాసా?
రా వదినా, రా.
ఏదో అలా ఉన్నాం.
నీకేవమ్మా,
కొడుకూ కోడలూ అమెరికాలో ఉండి రెండు చేతులా సంపాదిస్తున్నారాయెనూ ..
ఏం సంపాదనలే వదినా. ఆ
సంపాయించిన
దాంతో వాళ్ళేవన్నా మమ్మల్ని ఉద్ధరించాలా, ఊళ్ళేలాలా? ఏదో వాళ్ళ కుటుంబం వాళ్ళు సవ్యంగా చూసుకుంటే చాలు.
అవునే భారతీ, రోజూ మాట్లాడుతూ ఉంటారా నీ
కొడుకూ కోడలూ నీతో?
రోజూనా? ఇంకా నయం.
అదేవిటమ్మా
అట్లా అంటావూ? మా
అన్నయ్యగారి
బావమరిది కూతురూ అల్లుడూ కూడా అమెరికానేగా? ఆ
పిల్ల రోజూ ఫోన్ చేస్తుందిట. వీళ్ళు చేసినా చెయ్యొచ్చుట. అదేదో వన్నేజి ఫోనని ఉందిటగా - అంతా ఫ్రీయేట.
ఏమోమరి, నాకు తెలీదు. అయినా రోజూ ఫోను చేసిమరీ మాట్లాడుకోటానికి ఏవుంటుంది. పైగా వాళ్ళ ఉరుకులు పరుగుల మధ్య తీరొద్దూ?
అంతేలేమ్మా.
అయినా మాట్లాడాలనే మనసుంటే మార్గముండక పోతుందా? మాట్లాడుకోడానికి మాటలే ఉండవా? అద్సరే గానీ, ఇది విన్నావా భారతీ?
ఏవిటది వదినా?
మీ పక్కవీధి కాలనీలో పార్వతిగారు లేదూ? వాళ్ళబ్బాయి సుబ్బారావు కూడా అమెరికాలోనేగా ఉన్నాడూ? ఆ
అబ్బాయిని
అక్కడ పోలీసులు జెయిల్లో పెట్టారుట.
నిజమా? అయ్యో పాపం!
పాపం అంటావేమిటి? అక్కడికి పోయి ఏం
వెధవ పనులు చేశాడో?
ఛ, ఆ అబ్బాయి అలాంటివాడు కాదే.
ఏమో మరి. మా
అన్నయ్యగారి
బావమరిది కూతురు నిన్ననే ఫోన్ చేసినప్పుడు చెప్పిందిట. అక్కడ మనవాళ్ళంతా గోలగోలగా చెప్పుకుంటున్నారట. టీవీలో కూడా వచ్చిందిట. నిప్పులేకుండా పొగ వస్తుందా?
మా వాళ్ళు ఉండేదీ అటు దగ్గరే. పోయిన వేసవి మేం అటు వెళ్ళినప్పుడు వాళ్ళింటికి రెండు మూడు సార్లు వెళ్ళాము కూడా. చాలా మర్యాదగా ఉన్నారు మొగుడూ పెళ్ళామూనూ. ఒకసారి వాళ్ళ పాప పుట్టిన రోజు ఫంక్షను అనుకుంటా. తెలుగు ప్రముఖులు పెద్దవాళ్ళు చాలా మందే వచ్చారు కూడాను.
ఏమో మరి, ఏ
పుట్టలో ఏ పామున్నదో. మీవాడికి తెలుసంటున్నావుగా, ఒక
సారి కనుక్కోరాదూ ఏం
జరిగిందో? మనక్కూడా తెలుస్తుంది.
లేదులే వదినా. ఐనా చెప్పాల్సింది ఉంటే వాడే చెబుతాడు.
అంతేలే. ఉంటానమ్మా ఇక.
చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ కి
టైమవుతోంది.
నిష్క్రమిస్తున్న
ఆ సదరు వదినగార్ని చూస్తూ భారతి మనసులోనే నిట్టూర్చింది. పాపం పార్వతిగారు - కొడుకేవన్నా నేరం చేశాడో లేదో గాని, ఇప్పుడు ఈ
వదినగారి పుణ్యమాని ఇక్కడ ఈవిడ తలెత్తుకో లేకుండా తయారయ్యేట్టు ఉంది పరిస్థితి.
***
హైదరాబాదులో
ఒక ఫైవ్ స్టార్ హోటల్లో తెలుగు సినిమా పంపిణీదార్ల సంఘం ఒక
ప్రెస్ కాన్ఫరెన్సు జరిపింది. అక్కడ వారు చేసిన ప్రకటన సారాంశం ఇది -
దుంపలపాటి
సుబ్బారావనే
పరమ కిరాతక గూండా అమెరికాలో ఒక
గొప్ప మాఫియా వ్యవస్థని నిర్మించి, తన
చట్టవిరుద్ధమైన
కార్యకలాపాల
ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీని చావుదెబ్బ తియ్యడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ
సుబ్బారావు
మాఫియా చేస్తున్న పనులు చట్ట విరుద్ధమే కాక నైతికంగా అధర్మం కూడా. అమెరికా ప్రభుత్వం వారు ఇప్పటికైనా అతన్ని అరెస్టు చెయ్యడం ఎంతో శుభపరిణామం. సుబ్బారావుని కఠినంగా శిక్షించి, తద్వారా తెలుగు సినిమా పైరసీని సమూలంగా నాశనం చెయ్యాలని, తెలుగు సినిమా ఇండస్ట్రీని రక్షించాలని డిమాండ్ చెయ్యడానికి అమెరికా అధ్యక్షుని వద్దకి తక్షణమే ఒక
హైలెవెల్ డెలిగేషన్ హైదరాబాదు నించి అమెరికాకి ప్రయాణమవుతున్నది.
కాన్ఫరెన్సు
ముగిసి అందరూ బయటికి నడుస్తుండగా ఒక
నిర్మాత ఇంకో పంపిణీదారుతో అంటున్నాడు - కాదుటండీ మరి! ఇంకో రెండు వారాల్లో మా
గిగా వోల్టేజ్ స్టార్ సినిమా రిలీజ్ చేస్తున్నాం కదా! అమెరికా అంటే ఎంతలేదన్నా ఇరవై కోట్ల మార్కెట్టండీ!
***
హలో? తెలుగు ఎసోసియేషను ప్రెసిడెంటు గారాండీ?
అవునండీ. మీరెవరు?
నన్ను రాజగోపాల్రావు అంటార్లేండి.
ఓ, మీరా డాట్రు గారూ. నమస్కారం.
నేను తెలుసునా మీకు?
అయ్యో భలే వారే. ఈ
ఏరియాలో మీరు తెలియని తెలుగువాళ్ళెవరు చెప్పండీ? మన
ఎసోసియేషనుకి
మూల స్తంభాలు కదా మీరు! చెప్పండి. వాట్ కెనై డూ
ఫర్యూ?
న్యూస్ చూస్తూనే ఉన్నారు గదా! ఎవరో సుబ్బారావుట. విడియో పైరసీ కింద అరస్టయ్యాట్ట.
ఆఁ, ఆఁ. తెలుసండీ.
మనవేవన్నా
చెయ్యలేమా?
ఏం చేద్దామంటారండీ?
అదే, మన ఎసోసియేషన్ తరపున .. ఇలాగ మనవాళ్ళు అరెస్టయితే .. మన తెలుగు సమాజం మొత్తానికీ ఎంత అప్రతిష్ట? రేపు గవర్నర్ బేంక్వెట్లో
ఎవరన్నా ఈ ఊసెత్తి, మీవాడేనటగా అంటే, నాకెంత తలవంపులుగా ఉంటుంది?
హమ్మ్ .. ఐతే ..
అహ, అసలు ఆలోచించండి. ఐనా తెలుగు సినిమాల పైరేటింగ్ ఏంటండి ఛీప్ గానూ? దాని గురించి అరెస్టవడమా? అరెస్టయినా ఏదో ఒకట్రెండు బిలియన్ల స్టాక్ ట్రేడింగ్ కేసులోనో అయితే .. మన ఫాయాకి తగినట్టు అదొక అందం చందంగా ఉంటుంది. మరీ లోక్లాస్గా
తెలుగు సినిమాల్ని పైరేట్ చేసి అరెస్టవడం ఏంటండీ?
సార్, మీరు చెప్పేది నిజమే కానీ, ఇంతకీ ..
ఈ సుబ్బారావుకీ మన
తెలుగు సమాజానికీ ఏవ్హీ సంబంధం లేదని రేపొక ప్రెస్ కాంఫరెన్సు పెట్టి ..
హమ్మ్, సార్! బహుశా కుదరదేమోనండి. సుబ్బారావుగారు మొన్నే ఉగాది ఫంక్షనప్పుడు మెంబర్షిప్ కట్టారు.
ఓ అలాగా? ఐతే మరీ మంచిది. ప్రెస్ కాంఫరెన్సు పెట్టి అతని సభ్యత్వాన్ని రద్దు చేసి, ఎసోసియేషను నించి బహిష్కరిస్తున్నామనీ, అతని కార్యకలాపాలని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామనీ ప్రకటన ఇవ్వండి.
అంటే, సార్. ఇప్పుడూ ..
ఇది బాధ్యత గల
పౌరులుగా మనం చెయ్యాల్సిన మినిమం పని సార్. లేకపోతే, రేపు మన
అమెరికన్ల
మధ్య మనకందరికీ ఎంత తలవంపులు? ఇంక మీరాపనిమీద ఉండండి. రేపటి న్యూస్లో
రావాలిది. ఉంటా. థేంక్యూ?
ఎసోసియేషను
ప్రెసిడెంటు
కట్టయిన ఫోనుకేసి నిస్తేజమైన కళ్ళతో చూస్తూండి పోయాడు.
ఇంతలోనే మళ్ళీ ఫోను మోగింది.
హలో? తెలుగు ఎసోసియేషను ప్రెసిడెంటు గారాండీ?
అవునండీ. మీరెవరు?
నా పేరు రామకృష్ణండీ. సుబ్బారావుగారి కేసు విషయమై కాల్ చేస్తున్నాను. ఈ
విషయంలో మన ఎసోసియేషన్ తరపున ఏవన్నా చెయ్యాలండీ!!
అదే అదే, సరిగ్గా ఆ
విషయమే ఆలోచిస్తున్నాను. ఏం
చేద్దామని
మీ ఉద్దేశం?
మన తెలుగు వాడికి ఇలా జరుగుతోందంటే ఎంత అప్రతిష్టండీ?
అదే అదే, సరిగ్గా నేనూ అదే అనుకుంటున్నా!
మనం ఉపేక్షించకూడదండీ. పెద్ద సంఖ్యలో తెలుగువార మందరమూ కూడి రేలీగా కోర్టుహౌసుకి వెళ్ళి, కోర్టు ముందు ధర్నా చేసి, సుబ్బారావుకి మన
మద్దతు ప్రకటించాలి. అయినా మన
సినిమాలు మనిష్టం. దాని మీద ఈ
అమెరికా ప్రభుత్వం జులుం ఏంటండి? సుబ్బారావు వొంటరివాడు కాదు, అతడొక సంఘటితమైన శక్తి అని కోర్టుకే కాదు, అమెరికా మొత్తానికీ తెలియాలి.
అంటే .. ఇప్పుడూ .. ఎలాగంటే ..
మీరు అంగీకరిస్తారని నాకు తెలుసు. మీరు కమిటీతో మాట్లాడి ఒప్పించండి. నేను మన
కుర్రాళ్ళందర్నీ
పోగేసే పనిలో ఉంటాను.
మళ్ళీ కట్టయిన ఫోన్ కేసి వెర్రిగా చూసి రెండు చేతుల్తో తలపట్టుకుని కింద కూలబడ్డాడు తెలుగు ఎసోసియేషను ప్రెసిడెంటు.
***
ఫెడరల్ కోర్టు.
జడ్జి జూడీ ముద్దాయి సుబ్బారావుతో ఇలా అన్నారు - "ముద్దాయిగా మీ
మీద మోపబడిన అభియోగాలకు సంబంధించిన సాక్ష్యాలను ప్రభుత్వం వారు వివరించారు. మీరు కూడా అవన్నీ విన్నారు. మీ
తరపు వాదన ఇప్పుడు మీరు వినిపించవచ్చు."
సుబ్బారావు
లేచి నిలబడ్డాడు.
బైలిఫ్ ఒక గ్రంధాన్ని తీసుకొచ్చి, "ఈ బైబిలు మీద ప్రమాణం చెయ్యండి," అన్నాడు.
సుబ్బారావు
- క్షమించండి,
నాకు బైబిలు మీద నమ్మకం లేదు.
జడ్జి జూడీ - పోనీ మీ
మతగ్రంధమైన
భగవద్గీత తెప్పించనా?
సుబ్బారావు
- నాకు భగవద్గీత మీద కూడా నమ్మకం లేదు. దయచేసి టాగోర్ సినిమా తెప్పించండి.
జడ్జి జూడీగారు ఒక
నిమిషం నెవ్వెర పోయి, ఈ
కేసుకోసం ప్రత్యేకంగా రప్పించబడిన భారతీయ సహాయకునితో చర్చించారు. అతను వెళ్ళి సుబ్బారావు ఇంటి సోదాలో పట్టుబడిన పైరేట్ డిస్కుల్లోనించి టాగోర్ సినిమా డిస్కునొకదాన్ని సంపాదించి సుబారావు ముందు పెట్టాడు.
సుబ్బారావు
- మా మెగాస్టార్ టాగోర్ మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను.
జడ్జి జూడీ - సుబ్బారావుగారు, మీరు చూడబోతే బాగా చదువుకున్నవారిలా ఉన్నారు, మంచి ఉద్యోగంలో ఉన్నారు, ముచ్చటైన కుటుంబం. ఎందుకు పైరసీ లాంటి నీచమైన పనికి ఒడిగట్టారు. ఇది నేరమని తెలియదా?
సుబ్బారావు
- తెలుసు యువరానర్. ఆంధ్ర దేశం మొత్తమ్మీద ఉన్న థియేటర్లు రెండు వేల ఐదువందల నలభై మూడు. ఏ
సెంటర్లలో
ఉన్న థియెటర్లు ఒక
వెయ్యి ఏడు వందల డెబ్భై నాలుగు. గత
ఏడాది విడుదలైన తెలుగు సినిమాలు రెండు వందల అరవై తొమ్మిది. అంటే సగటున వారానికి ఐదు పాయింట్ రెండు సినిమాలు రిలీజయ్యాయి. అందులో నేరు సినిమాలు నూట ఇరవయ్యయిదు. మొత్తం తెలుగు సినిమా చేసిన బిజినెస్ రెండు వేల రెండు వందల అరవైమూడు కోట్లు కాగా, నేరు సినిమాలు అమెరికాలో మాత్రం చేసిన బిజినెస్ ఆరొందల ఎనభైనాలుగు కోట్ల పై
చిల్లర.
ప్రభుత్వ న్యాయవాది కాన్నీ - మీరు చెప్పిన గణాంకాలన్నీ చాలా ఇంప్రెసివ్గా
ఉన్నాయి, కానీ వాటికీ మీ
మీద మోపిన అభియోగానికీ ఏవిటి సంబంధం?
సుబ్బారావు
- ఉన్నది, కాన్నీ గారూ, ఉన్నది. మీరు మీ
మీ మల్టీప్లెక్సుల్లో రిలీజు రోజున కూడా క్యూలో నిలబడ నక్కర్లేకుండా టిక్కెట్టు కొనుక్కుని హాయిగా సినిమా చూస్తారు. ఒకేళ థియెటర్లో మిస్సయితే, కేబుల్లో పే
పర్ వ్యూ, వెంటనే అన్ని దుకాణాల్లోనూ డీవీడీలు విరివిగా దొరుకుతాయి. మరి మా
సంగతి ఏవిటి?
జడ్జి జూడీ - మీ సంగతి అంటే?
సుబ్బారావు
- ఇది నా ఒక్కడి విషయం కాదు, యువరానర్. పుట్టినగడ్డని వదిలి పొట్ట చేతబట్టుకుని విదేశాలకి వలస వచ్చిన ప్రతి తెలుగువాడి గుండె ఘోష.
జడ్జి జూడీ - ఎందుకా ఘోష?
సుబ్బారావు
- ఎందుకా యువరానర్? చెబుతాను. పుట్టినప్పటినించీ సినిమా తప్ప మరొక వినోదం ఎరుగని జాతి మాది. సంగీతం వింటే సినిమా సంగీతమే. టీవీ చూస్తే సినిమాల ప్రోగ్రాములే. ఆటలాడితే సినిమాలకి సంబంధించిన ఆటలే. ఫేషన్ అంటే సినీతారల ఫేషనే. కామెడీ అంటే సినిమా కామెడీనే. ఆఖరికి భగవంతుణ్ణి కూడా సినీతారల రూపంలో తప్ప వేరేగా ఊహించుకోలేము. అంతగా సినిమాతో మమేకమయిన జాతిమాది. తమ
తమ తాహతుకి తగినట్టు ఒక్కొక్క హీరోని ఎంచుకుని, అతన్నే తమ
అభిమాన హీరోగా ఆరాధిస్తూ ఉండే యువత మా
తెలుగు యువత. అభిమాన హీరో సినిమా రిలీజు రోజున అర్ధరాత్రి దగ్గర్నించీ థియేటరుని మహా వైభవంగా అలంకరించీ - అదీ సొంత ఖర్చుతో .. పదో రోజున సక్సెస్ మీట్, ఇరవయ్యో రోజున గ్రాండ్ సక్సెస్ టూర్ - ఇవన్నీ నిర్వహించేది మా
తెలుగు యువత.
గుక్క తిప్పుకోడానికన్నట్టు ఒక్క క్షణం ఆగాడు సుబ్బారావు.
జడ్జి జూడీ - ఏమైంది? మీ
తెలుగు యువతకి ఏమైంది? ఇక్కడ అమెరికాలో కూడా తెలుగు సినిమాలు థియెటర్లలో రిలీజ్ చేస్తున్నారుట కదా!
సుబ్బారావు
- అవును చేస్తున్నారు. కానీ ఫేన్సంటే ఎవరికీ లెక్కలేదు. టిక్కెట్టు రేట్లు ఆకాశాన్నంటేట్టు పెడుతున్నారు. దానిమీద ఎటువంటి నియంత్రణ లేదు. హాలీవుడ్ సినిమాకి పది డాలర్లుండే టిక్కెట్టు తెలుగు సినిమాకి పదిహేను, ఇరవై, పాతిక - ఇంతింతై వటుడింతయై అన్నట్టు పెరిగిపోయి - మొన్న ఉగాదికి రిలీజైన పిక్చరుకి ఏకంగా యాభై డాలర్లకి అమ్మారు మొదటి వారాంతం. బ్లాకులో కాదు, నేరుగా బుకింగాఫీసులోనే. విద్యార్ధులుగా ఉంటూ, కాఫీషాపుల్లో, గేస్ స్టేషన్లలో పని చేసి కష్టపడి సంపాయించిన డాలర్లని అపురూపంగా వాడుకుంటున్న తెలుగు విద్యార్ధులు ఎలా కొనగలరు ఈ
టిక్కెట్లని
అని ప్రశ్నిస్తున్నా యువరానర్?
జడ్జి జూడి గారు కళ్ళు పెద్దవి చేసి తన
సహాయకుని వేపు నిజమా? అన్నట్టు చూశారు. అతను అవునన్నట్టు తలూపాడు.
జడ్జి జూడి గారు సుబ్బారావు వేపుకి తిరిగి, కొనసాగించండి అన్నట్టు సైగ చేశారు.
ప్రభుత్వ న్యాయవాది కాన్నీ - కావచ్చు. ఐనా చదువుకోడానికి వచ్చిన విద్యార్ధులు చదువు మీద శ్రద్ధ పెట్టాలిగానీ వారికి సినిమాలెందుకు?
సుబ్బారావు - పొరబడ్డారు - విద్యార్ధులే కాదు, నావంటి గృహస్తులు మాత్రం ఈ
వ్యామోహానికి
అతీతులు కారు. ఒక
సాధారణ గృహస్తు - ఒక పెళ్ళాం ఇద్దరు పిల్లల్తో యాభయ్యేసి డాలర్లు పెట్టి ఒక్కో టిక్కెట్టు కొంటే - మార్టుగేజు ఏం
పెట్టి కడతాడు. ఏదో సినిమా పిచ్చి చంపుకోలేక, మన
అభిమాన హీరో సినిమా కదా, మనం చూడకపోతే ఎలాగ అని ఫీలైపోయి పొలోమని పోయి జేబులు ఖాళీ చేసుకోవడమే మిగిలేది. ఐటెం సాంగులు, ద్వంద్వార్ధ డయలాగులూ వచ్చినప్పుడు పిల్లల కళ్ళు చెవులూ ముయ్యలేక నానా చావూను. అదే ఇంటో అయితే ఫాస్టు ఫార్వర్డు చెయ్యొచ్చు, సౌండు ఆఫ్ చెయ్యొచ్చు, ఏదో ఒక
తిప్పలు పడచ్చు. అసలు సినిమా అంటూ ఏం
తీస్తున్నారో
ఈ తీసేవాళ్ళకి ఏమీ స్పృహ ఉన్నట్టు లేదు. నూట యాభై పౌండ్లుకూడా బరువు లేని హీరో రెండొందల పాతిక పౌండ్ల బరువున్న వస్తాదులు పదిమందిని ఉత్త చేతుల్తో చావబాత్తాడు - అడిగే వాడు లేడు. మా
అభిమాన హీరో కదాని ఈలలేసి గోలచేస్తాం. భూమికి దిగొచ్చిన అప్సరసలాంటి హీరోయిను బొచ్చులేని కొండముచ్చులాంటి హీరోని చూసి తలమునకలుగా ప్రేమలో పడిపోతుంది - ఇదేమనేవాడు లేడు. మా
అభిమాన హీరో కదాని ఆమోదించేస్తాం. పైన బొంబాయినించో కింద కేరళనించో దిగుమతి అయిన భామ నోట్టో లాలిపాప్ పెట్టుకుని అరువు గొంతుతో తెలుగుని ఇంగ్లీషులో మాట్లాడుతుంది - పట్టించుకునే నాథుడు లేడు. మా
అభిమాన హీరో కదాని దాన్నీ భరించేస్తాం. ఇవి కాక విలన్ల బొబ్బరింతలు, కమెడియన్ల కామెడీలు, ఐటం సాంగులు, మ్యూజిక్ హోరు, హబ్బబ్బో ఆ
కోలాహలం ఇంతింతని చెప్పనలవి గాదు. ఇట్లాంటి యెదవ తొక్కలో సినిమాలు చూడ్డానికి ముప్పయ్యేసి మైళ్ళు డ్రైవు చేసుకు పోయింది కాక మనిషికి యాభై పెట్టి టిక్కెట్లు కొనాలా? ఒక్క డాలరు పెట్టి కొనే పైరేటెడు డిస్కే చాలు.
ప్రభుత్వ న్యాయవాది కాన్నీ - చెత్త అని మీరే అంటున్నారు. పోనీ అసలు చూడకుండా మానెయ్యొచ్చు కదా!
సుబ్బారావు ఎంత అజ్ఞానివమ్మా అన్నట్టు నిరసనగా ఒక
నవ్వు నవ్వాడు.
సుబ్బారావు - తెలుగు ఫేన్ అయిన వాడికి తన
అభిమాన హీరో సినిమా తొలిరోజు తొలి ఆట
చూడలేకపోవడం
ఎంత అవమానమో మీకు అర్ధం కావడం లేదు. స్వదేశంలో ఉన్న తనతోటివారు చూసేసిన సినిమాని తాను చూడ్డానికి ఒక్క రోజు ఆగడం కూడా దుర్లభమే - అటువంటిది నెలరోజులు ఆగాలా? చెత్త అయితే అయింది. అది మా
చెత్త. మా అభిమాన హీరోల చెత్త. దాన్ని చూడకుండా, చూసి ఆనందించకుండా మమ్మల్ని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. పోనీ థియెటర్లోనే చూడనక్కర్లేదు, పోనీ ఆలస్యంగా చూసినా పరవాలేదు, లీగల్ గా
డిస్కు వచ్చినప్పుడే చూద్దాము అనుకుంటే - ఏవి లీగల్ గా
దొరికే డిస్కులు? ఇదివరకు భారతీయ గ్రోసరీ షాపుల్లో ఈ
విడియోలు డిస్కులు అద్దెలకిచ్చే వారు. ఏమయిందో ఏమో, అవన్నీ మూతబడ్డాయి. తెలుగు సినిమా అభిమానులు అటు థియెటర్లలో భారీ డబ్బులు కుమ్మరించలేకా, ఇటు సినిమా చూడకుండా ఉండలేకా నలిగి పోతున్నారు. లేటెస్టు మహేష్ బాబు స్టెప్పులు నీకింకా తెలీదా అని ఒక
బాబుని వాళ్ళ కజిన్ ఎత్తి పొడిస్తే ఈ
బాబు డిప్రెషన్లోకి పడిపోయాడు. శమంతా కట్టిన చీర ఏదో తెలియలేదని తన
ఆడపడుచు వెటకారం చేసిందని ఒక
గృహిణి బార్బెక్యూ లైటర్ ఫ్లూయిడ్ తన
మీద పోసుకుని అగ్నికి ఆహుతి అవబోయింది.
సుబ్బారావు
ఆవేశంగా మాట్లాడుతున్నాడు. అతన్ని ఉపశమింప జెయ్యటానికన్నట్టు ప్రభుత్వ న్యాయవాది కాన్నీ అతని పక్కకి వచ్చి నించున్నది.
సుబ్బారావు - ఎటు చూసినా కుతంత్రం, వెటకారం, దోపిడీ, అవమానం! ఇలా నాజాతి పడుతున్న అవస్థలని చూస్తూ ఎర్రటి ఆవకాయ తింటున్న తెలుగువాడిగా చేతులు ముడుచుకు కూర్చోవడం నా
వల్లకాలేదు.
ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో
ఎక్కడ మానవుడు సగర్వంగా తిరగ్గలడో
ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని సినిమా పేరుతో దోచుకోడో
ఎక్కడ తెలుగువాడు తెలుగు సినిమాని హాయిగా స్వేఛ్ఛగా పూర్తిగా సకుటుంబంగా ఆనందిస్తూ చూడగలడో
అక్కడికి, ఆ స్వేఛ్ఛాస్వర్గంలోకి, భగవంతుడా నా
ప్రవాస తెలుగుజాతిని మేలుకొలుపు!
అని రాశాడు విశ్వకవి రవీంద్రనాథ టాగోర్ తన
గీతాంజలిలో.
అదే స్ఫూర్తితో మా
మెగాస్టార్
పెచ్చరిల్లిన
అవినీతిపై
రక్తాంజలిని
రాశాడు టాగోర్ సినిమాలో. అదే స్ఫూర్తితో నేనూ ఈ
పైరసాంజలిని
రాస్తున్నాను.
అవును. ఇది కేవలం పైరేటెడ్ సినిమాల గొడవ కాదు. మొత్తం తెలుగు సినిమా వ్యవస్థ మీద నా
తిరుగుబాటు.
ఇదొక ఉద్యమం. తెలుగుసినిమాని అభిమానించడమే నేరమైతే - నన్ను శిక్షించండి. అతి కఠినంగా శిక్షించండి. కానీ ఒక్క మాట యువరానర్! నన్ను శిక్షించినంత మాత్రాన ఈ
ఉద్యమం ఆగిపోదు యువరానర్, ఆగిపోదు.
తెలుగు సినిమా విడియో పైరసీ! జిందాబాద్!!
సుబ్బారావు ఆవేశంగా తన
ముందున్న బల్లని గట్టిగా గుద్దాడు.
అతని పక్కనే నించున్న ప్రభుత్వ న్యాయవాది
కాన్నీ మోచేత్తో గట్టిగా సుబ్బారావు డొక్కలో పొడిచింది.
***
ఒక్క దెబ్బకి పక్కలో లేచి కూర్చున్నాడు
సుబ్బారావు.
పక్కన సతీమణి నిద్రకళ్ళతో
నిష్టూరంగా చూస్తూ, "కలవరింతలైతే
ఎలాగో భరించాను. మంచాన్ని
గుద్దుతుంటే మాత్రం ఇంక
నావల్ల కాదు బాబూ!" అంది.
ఎర్రగా కందిన అరచేతిని నిమురుకుంటూ అయోమయంగా చూస్తుండిపోయాడు
సుబ్బారావు.
***
గమనికలు:
1) ఆటా 2012 సావనీరులో తొలి ప్రచురణ, మరి కొంత విస్తరింపచేసి ఇక్కడ బ్లాగు మిత్రులకోసం.
2) జడ్జి జూడీ అమెరికను టీవీలో జనాల పోట్లాటలకు తీర్పులు చెప్పే ఒక నిజజీవిత పాత్ర. ప్రభుత్వ న్యాయవాది కాన్నీ రూబిరోసా అమెరికను టీవీ షో Law and Order లో కనిపించే కల్పిత పాత్ర.
3) మెగాస్టార్, మహేష్ బాబు, టాగోర్ సినిమా - ఎవరో ఏంటో మీకు తెలీకపోతే మీరీ కథ చదవడం అనవసరం.
4) సుబ్బారావుని నేనే. నేనొక్కణ్ణే కాదు, అమెరికాలో నివాసం ఉంటూ తెలుగు సినిమా కావాలని తాపత్రయపడే మీరంతా కూడా!
|
Comments
Very humorous and I thoroughly enjoyed the article. Thank you! :)
సమకాలీన సమస్యని గూర్చి రాసారు.
చాలా ఏళ్ల క్రితం నారాయణరావు హీరోగా "సుబ్బారావుకి కోపం వచ్చింది" అని ఒక సినిమా వచ్చింది. కథలో సుబ్బారావు చివరి మాటల్ని ఆ హీరో గారితో జీవింపజేసి కాస్త 4 లైన్స్ కిందకి దిగేసరికి అసలు సుబ్బారావు ఎవరో తెలిసింది.
తెలుగు సినిమాల కోసం ఒకప్పుడు పాట్లు పడ్డవాళ్ళమే గానీ ఇప్పుడు బ్లాగుల కంపకి చిక్కుకున్నాము. ;)
ఆఖరికి చాలామందిలాగే అంతా కలగా తేల్చేసారు.
కాని నిజంగానే ఇలాంటి వాదాలు కోర్టులో నెగ్గవు కనక సుబ్బారావు ఆక్రోశాన్ని కలలో ఆవిష్కరించాడనుకోవచ్చా..
keep writing.
మానసగారూ .. మీది మరీ జెట్ స్పీడండీ! టపా ప్రచురించిన పావుగంటలోనే మీ వ్యాఖ్య! ఇంతవేగంగా మొదటి వ్యాఖ్య పొందిన టపా నా బ్లాగు హిస్టరీలో ఇదేనేమో! నెనర్లు :)
ఉషగారు, నా బుల్లి కథలు చాలా వాటిల్లో Common Manకి ప్రతీకగా సుబ్బారావు అనే పాత్రని చూపెడుతుంటాను. ఇక్కడా అదే కొనసాగింది.
ప్రసీద - అమెరికాలో సినిమా చూడ్డం అనుభవం ఎలా ఉంటుందో చెప్పాల్నంటే ఇంకో పూర్తి కథ పడుతుంది. ఇది కేవలం cost-benefit analysis మాత్రమే.
శ్రీధర్ గారు, నెనర్లు.
వనజ గారు, నిజానికి నేను సుబ్బారావంత తీవ్రవాదిని కాదు. కానీ మన వాళ్ళు రెండు పనులు చేశాక - 1) క్వాలిటీ సినిమాలు తియ్యడం, 2) ఒక రీజనబుల్ పంపిణీ వ్యవస్థ - అప్పుడు పైరసీని గురించి మాట్లాడితే సమంజసంగా ఉంటుందని నమ్ముతాను. అప్పటి వరకూ మాత్రం నాకు నిర్మాతలమీద, స్టార్లమీద, పంపిణీదారులమీద ఎటువంటి సానుభూతి లేదు.
శ్రీలలితగారు, కలతో ముగించడం నాకూ ఇష్టం లేదు. నా దృష్టిలో అది cop out technique. కానీ అప్పటికే సావనీరుకి కథ ఆలస్యమయింది. నాకు తృప్తికరమైన వేరే ముగింపు ఆలోచించే సమయం చిక్కక cop out చేసేశా. మీరు ఇక్కడ (అమెరికాలో) ఏదైనా తెలుగుసినిమా థియెటర్లో చూస్తే నేను రాసిందాంట్లో పిసరంత కూడ అతిశయోక్తి లేదని ఒప్పుకుంటారు.
ఇప్పుడు ఇంకొకటి తెలుసా? లేటెస్టు తెలుగు తమిళ సినిమా పాటల డేన్సులని పిల్లలని నేర్పేటందుకు ఊరూరా డేన్సు స్కూళ్ళు వెలుస్తున్నాయి. మీరు ఏ ఊరి తెలుగు ఫంక్షనుకి వెళ్ళినా ఐదు నించీ పదేళ్ళ వయసు పిల్లలు, సినిమాలో ఆయా నటీనటులు ధరించిన బట్టల తలదన్నే వస్త్ర ధారణతో ఇటురాయే, సారొస్తారా వంటి ఆణిముత్యాలకి నాట్యం చేస్తున్నారు.
మీపాళీ ఎక్కువగా ప్రవాసాంధ్రుల లేక మీమెట్టినింటి విషయాలు రాస్తుంటారు. కొన్ని తెలిసినవి. అర్థం చేసుకోదగినవి. కానీ చాలామటుకు నాకు గ్రీకుడూ లాటినమ్మా. ఈటపాని పూర్తిగా ఆస్వాదించడానికి గల కారణం నేనూ ప్రవాసాంధ్రుడినే కావడం. నేనుంటున్న ప్రాంతంలో సినిమాహాలు లేదు. హాలుకెళ్ళి చూడాలంటే నాలుగున్నరగంటల పాటు ప్రయాణించి వారణాసికెళ్ళాలి. అక్కడ కూడా తెలుగు సినిమాలు రావు. ఒక సగటు తెలుగోడిగా నాగోడు పట్టించుకునే వాడెవ్వడు? జాలయ్య తప్ప. తోడు నిలిచేవాడేవ్వడు? టొరెంటన్న తప్ప. భుజం తట్టేదెవడు? కామ్‌రిప్పడు తప్ప. చివరి బిట్టు దిగుమతయ్యే దాకా ఈజీవన్మరణ పోరాటమే. ఈ అలుపెరుగని ఎదురీతే. ఈనిర్విరామ శొధనే. (సాయంత్రమే ఈగ టొరెంట్ పెట్టాను.రేపు వారాంతం నయనానందకరం.)
Nice comedy!! :)
కల కాకపోయినా బానే ఉండేది
వరసగా అందరికీ వాతలు పెట్టుకుంటో పోయారు కదా :)
ఎందుకంత ఆయాసం , ఇది ఆయాసం కాదు ఆవేశం ..(ఏదో E V V సినిమా నించీ )
"పుట్టినప్పటినించీ సినిమా తప్ప మరొక వినోదంఎరుగని జాతి మాది. సంగీతం వింటే సినిమా సంగీతమే. టీవీ చూస్తే సినిమాల ప్రోగ్రాములే.ఆటలాడితే సినిమాలకి సంబంధించిన ఆటలే. ఫేషన్ అంటే సినీతారల ఫేషనే. కామెడీ అంటే సినిమాకామెడీనే. ఆఖరికి భగవంతుణ్ణి కూడా సినీతారల రూపంలో తప్ప వేరేగా ఊహించుకోలేము. అంతగాసినిమాతో మమేకమయిన జాతిమాది."
Very well said.
మురళీ ఏదైనా పెద్ద షాపు కెళ్ళినప్పుడు ఖరీదైన సామను చూపించి, "అవన్నీ కొనకుండా మనమెంత డబ్బు ఆదా చేస్తున్నామో చూడు" అని సంతోషపడుతూ వుంటాడు. చోద్యం, అనుకునేదాన్ని.
ఇప్పుడు ఇది చదివి, "తెలుగు సినిమాలు మానేసి మేమెంత డబ్బు ఆదా చేస్తున్నామో, ఎంత మనశ్శాంతిగా వున్నామో" అని నేను మురిసిపోతున్నా!
శారద
మా మనవడి చేత ఏదో గోంగూర పాట చేయిస్తుంటే భరించలేక దానిని రాధాక్రిష్ణుల పాటగా మార్చడానికి నేను పడిన పాట్లు దేవుడికి తెలుసు.
ఇంక ఈ మధ్య కల్పించుకోడం మానేసాను.
చైతన్య - కథ పేరడీ కాదు. పేరడీ అంటే ఎవరైనా ప్రసిద్ధ రచయిత శైలిని అనుకరించటం. ఎనీవే, ఇటువంటి వ్యంగ్య హాస్య ధోరణిలో మరికొన్ని చిన్న కథలు రాశాను ఇదివరలో. కొన్ని నా కథల పుస్తకంలో ఉన్నాయి.
Srinivas Denchanala - thank you andi
Strictly .. Shhh!
Vasu, Ramana, Sarada - thank you.
మా కాలం లో టెంటు 'కొట్టాయి' లో తీరిగ్గా కూర్చుని, పల్లీ లు లాగిస్తూ ఓ యాభై పైసలకు చూసేసేము!
అమెరికా పోయినా వీరికి ఈ సినిమా జాడ్యం వదల లేదంటే , మరి ఇది పూర్వ జన్మ కర్మ వాసనలు కాక మరి ఏమిటో అనిపించక మానదు సుమీ.
సుబ్బారావు అమెరికాలో నే తెలుగు సినిమాలు విపరీతం గా తీసి తెలుగు వారి జాతి గౌరవాన్ని కాపాడి వారి తెలుగు సినిమా 'నేత్ర చాపల్యాన్ని' నివారించాలని దీని మూలం గా సవినయం గా సుబ్బారావుని కోరడ మైనది.
చీర్స్
జిలేబి.
ఇప్పుడు దేశంలోని అన్ని నగరాల్లో తెలుగు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు కాని,ప్రవాసాంద్రుడిగా ఒక అయిదేళ్ళక్రితం వరకు, నేనూ సినిమాలకు మొహం వాచిపోయేవాడిని.
అప్పట్లో ఢిల్లీ ఎ పి భవన్‌లో ఏదో ఒక సంఘం వాళ్ళు రెండో వారంలోనో, మూడో వారంలోనో తీసుకొచ్చి వందరూపాయలకు చూపించేవాళ్ళు.
జిలేబిగారు కొట్టాయిలో కూకోని చెనక్కాయిలు నవులుకుంటూ సినిమాలు చూస్తుండే కాలం పోయి చానాకాలమే అయిందని మీకూ తెలుసు! :)
ఫణిబాబుగారు, అబ్బో ఈ రోగం బాగా ముదిరిపోయిందిప్పుడు! :)
గోపాలకృష్ణగారు, వాళ్ళే నయం. చూసిన సినిమాని చివరి ఫ్రేముదాకా ఎంజాయ్ చేస్తారు. ఎటొచ్చీ నాలాంటివాళ్ళమే, బయటి ప్రపంచం తీసే అద్భుతమైన లోబడ్జెట్ సినిమాలు చూసినాక, కోట్లకి కోట్లు పెట్టి మనవాళ్ళు తీసే సినిమాలు ఎందుకిలా అధ్వాన్నంగా ఉంటుంటాయో అర్ధంకాక, మన భాష సినిమామీద ఆశ చావక కొట్టుమిట్టాడుతున్నాము. In a way, I wish for the innocence and the oblivion of the daily laborer who is totally immersed in the film.
bonagiri, ఒక పటిష్టమైన డీవీడీ పంప్నిణీ వ్యవస్థ ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండదు.
ఖ్రిష్న - అంటే నువ్వు తెలుగు సినిమా చూసి చాలా రోజులైందని అర్ధం. ఏది నిజం, ఏది కల - అంతా మిధ్య! :)
ATA వారి సోవనీరు(2012) లోనే ప్రచురితమైన నా కథ 'చూడకుండా ఉండండి'ని చదివారా ?
భలే చురకలు అంటించారు.
ఆటా సావనీర్ లో నా కథ గానీ చదివారా?