భరతవాక్యం

2011లో తానా సభల సావనీరు ప్రముఖ అమెరికా తెలుగు కథకుడు కె.వి. గిరిధరరావు గారి సంపాదకత్వంలో వెలువడింది. అమెరికాలో ఉంటూ భరతనాట్యం నేర్పించడం గురించి మా వూళ్ళో ఉండే ఇద్దరు ప్రముఖ నాట్య గురువుల అనుభవాల్ని ఇంటర్వ్యూగా రాశాను ఆ సావనీరులో.ఆ గురువులిద్దరూ, సంధ్యశ్రీ ఆత్మకూరి, రూప శ్యమసుందర సహృదయులు, నాకు ఆత్మీయులు. ఇద్దరితోనూ కొన్ని నాట్యకార్యక్రమాల నిర్వహణలో పాలుపంచుకునే అదృష్టం నాకు కలిగింది ఇదివరలో. నాట్యం పట్ల ఇద్దరికీ ఉన్న తపన నాకు తెలుసు.

మొన్న వారాంతంలో జాలమిత్రులతో ఈ విషయమై (అమెరికాలో భారతీయ సాంప్రదాయ విద్యల్ని పిల్లలకి నేర్పించడం) మాట్లాడుతుంటే ఈ ఇంటర్వ్యూలు గుర్తొచ్చాయి. పుస్తకం వెతికి పట్టుకుని మరోసారి చదువుకున్నాను. అప్పుడిలా తోచింది.

ఎందుకు ఇంటర్వ్యూలు?  
మంచి ప్రశ్నే.  
అమెరికాలో తెలుగు వలస సమాజం ఇంకా ఎదుగుతున్నది - పూర్తిగా స్థిరపడిపోలేదు. ఇంకా అనేక విధాలుగా అనేక రూపాల్లో మారుతున్నది. ఎన్నో నగరాల్లో మనవాళ్ళు గొప్పగొప్ప దేవాలయాలు నిర్మిస్తున్నారు, సంస్థలు నెలకొల్పుతున్నారు. ఇంకా చాలా చేస్తున్నారు. ఎవరికోసం ఇదంతా? వీటన్నిటి మధ్యా మన సమాజం అస్తిత్వం ఏవిటి అని అప్పుడప్పుడూ తరిచి చూసుకోవడం మంచిది. ఏడాదికో రెండేళ్ళకో ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకున్నట్టు అప్పుడప్పుడూ ఆగి మన సమాజం, దాని ఉనికి, దాని పయనం - ముందు వెనకలు బేరీజు వేసుకోవడం మనకి ఉపయోగిస్తుంది. మన కళలూ మన జీవితంలో విడదీయరాని భాగమే.  

గురువులు మనవాళ్ళే.  
వీరి దగ్గర నేర్చుకుంటున్నది మన పిల్లలే.  
వారి సమస్యలు మన సమస్యలే, వారి తృప్తి మనకి కూడా తృప్తి.  
అలాగ ఇంటర్వ్యూలు మనకి ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను.

ఆ ఇంటర్వ్యూలని ఇక్కడ చదవచ్చు.

Comments

నమస్కారం,

నాట్యానికి ఎక్కువ సాధన కావాలి, సంగీతానికి అంత అక్కరలేదు అని వ్రాసారు. ఏ కళకైనా సాధన ఎంతో ముఖ్యం. అప్పుడే రససిద్ధి కలుగుతుంది. ఒక కళకి ఎక్కువ కష్టపడాలి, ఇంకో దానికి అంత అక్కరలేదు అని మీలాంటి విజ్ఞులు వ్రాయటం అంత సమంజసంగా లేదు. మీరు నాట్యాన్ని గొప్పగా చిత్రించాలంటే సంగీతాన్ని తక్కువ చేయక్కర్లేదు.
అనురాధగారు, మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. నేను రాసింది మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. సాధన మధ్యలో అంతరాయం ఏర్పడినా కవిత్వంలోనూ సంగీతంలోనూ తిరిగి కళని సాధించవచ్చు, నాట్యంలో అది సాధ్యం కాదు అని రాశాను. సంగీతాన్ని తక్కువ చెయ్యలేదు.