మెట్టినింటి ఘోష మరోసారి

మామూలు శనివారపు పార్టీయే, అప్పుడప్పుడూ కలుస్తూ ఉండే మిత్రులే, కలిసినప్పుడల్లా కలబోసుకునే ఊసులే.

ఏవిటయ్యా సంగతీ అంటే, జగను అరెస్టు మతలబులేవిటి, తెలంగాణా రావణకాష్టంలో కొత్తగా ముట్టించిన కట్టెపుల్ల ఏవిటి, పవన్ కళ్యాణ్ కొత్త సినిమా హిట్టా ఫట్టా .. ఇలా అలుపులేకుండా అంతు లేకుండా. కానీ పూట నాకెందుకో పుట్టినింటి ఊసులు కొంచెం విసుగనిపించాయి. అక్కడున్న ఎవ్వరికీ ఆంధ్రదేశంలో జరుగుతున్న రాజకీయాలతో ప్రత్యక్ష - పరోక్ష సంబంధం ఏమీ లేదు. రియలెస్టేట్ వ్యాపారులు కారు. సినిమా వ్యాపారులు కారు. ఆయినా ఇదో ఆసక్తి.

అవునుగదా మరి ఎన్ని వేల మైళ్ళ దూరం వచ్చినా, వదిలి పెట్టి ఎంత కాలమైనా మనది తెలుగు గడ్డ, మనం తెలుగు బిడ్డలం.
అది మన పుట్టినిల్లు.

అమెరికా నా మెట్టినిల్లు అని అప్పుడెప్పుడో నా బ్లాగులో రాసుకున్నా.

మగవాడికి మెట్టినిల్లేవిటని మీరు ముసిముసి నవ్వులు నవ్వుకోవచ్చు, మరేం పరవాలేదు. కానీ ఒక్క క్షణం నిదానంగా ఆలోచించి చూస్తే మీకే అర్ధమవుతుంది నేను రాసిన వాక్యంలో సత్యం ఉన్నదో లేదో. మనిషి జీవితాన్ని ప్రభావితం చేసి దిశా నిర్దేశం చేసే సాంఘిక శక్తుల పోలికని బట్టి చూస్తే, కొత్తగా పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళే కొత్తకోడలికి జరిగే అనుభవం ఏదైతే ఉందో, స్వదేశాన్ని విడిచి మరో ప్రాంతానికి, దేశానికి వలస వెళ్ళిన ప్రతి వలసదారుకీ ఇంచుమించు అటువంటి అనుభవమే జరుగుతూ ఉంటుంది. కొత్త పిలుపులకి అలవాటు పడాలి, కొత్త అలవాట్లు నేర్చుకోవాలి. భోజన పద్ధతుల దగ్గర్నించీ, వేషభాషల దాకా మార్పులు తప్పవు. ఇవన్నీ మీరు ఇప్పటికే అనుభవించి ఉంటారు. సరే, ఇవన్నీ బాహ్యరూపాలు.

లోలోపల మనసు మూలాల్లోంచీ జరగవలసిన ముఖ్యమైన మార్పు మరొకటుంది. వధువు తన భర్త కుటుంబాన్ని తన కుటుంబంగా, భర్త బంధుగణాన్ని తన బంధువులుగా అంగీకరించాలి, ఆహ్వానించాలి. అమెరికాకి వలసవచ్చి, అమెరికా మెట్టినిల్లయిన మనం అమెరికను సమాజాన్ని మన సమాజంగా భావిస్తున్నామా? ఆహ్వానిస్తున్నామా?

మిగతా విషయాలు జాక్సన్‌విల్ తెలుగు సమితి వారి తాజా పత్రికలో 15వ పుట నించీ ..


http://taja.us/pdf/Magazine_2012.pdf

Comments

Totally agree with you! However I noticed that most of the young adults (16-22) here in my state maintain a striking balance between Indian and American culture. All of them have strong etical and moral values. undoubtedly most of that should be credited to this country (ofcourse partially to our upbringing) . And as you said, it's time for us to come out of that shell thinking we are not Americans by birth and try to get invloved in all sort of community activities and contribute to the society as responsible citizens living in USA.
కానీ, ఒక మౌలిక బేధం మాత్రం ఉన్నది. నేటి వాస్తవ పరిస్తుతులు ఎలా ఉన్నా, పెళ్ళి చేసుకునే ముందు బహుశః ఎవరూ విడాకుల గురించి ఆలోచించరు. కానీ వలసపోయిన చాలా మంది మటుకు, ఎదో ఒకనాడు నా దేశానికి తిరిగివెళ్ళె రోజు వస్తుందని ఎదురు చూస్తుంటారు. ఆ ఎదురు చూపులే, సంస్కృతినుండి విడివడనీయకుండా అడ్డుపడతుంటాయని నా అభిప్రాయం.
Anonymous said…
పుట్టినింటిపై ప్రేమను మెట్టినింటికీ పంచాలంటారు.. బాగుబాగు.
Kottapali said…
అందరికీ నెనర్లు.
తెలుగు భావాలు గారు - నిజమే. అమెరికా వలస భారతీయుల్లో ఈ భావన (తిరిగి భారత్ కి వెళ్ళిపోతామని) కొంత అడ్డంకి అని నా అభిప్రాయం కూడా.