ఆఫ్రికన్ రవిశంకర్

ఏనార్బర్లో ఉండగా నాకు వివిధ దేశాల సంగీతాల పరిచయం జరిగింది. అలా ఒక ఆఫ్రికన్ సంగీతపు కచేరీకి వెళ్ళాను. వేదిక మీద ఆరేడుగురు వాద్య కారులు ఉన్నారు. అందరి చేతుల్లోనూ రకరకాల తాళ వాయిద్యాలు. అందరూ యువకులు. రంగురంగుల ఆఫ్రికను నేతదుస్తులు ధరించి ఉన్నారు. ఒక పెద్దాయన మాత్రం వేదిక మధ్యలో కుర్చీలో కూర్చుని గిటార్ వాయించారు. ఆయన వయసు అరవై పైనే. కొద్దిగా బట్టతల అవుతున్న నెరిసిన తలకట్టు. నలుపు తెలుపు సమపాళ్ళలో కలిసిఉన్న దట్టమైన బవిరిగడ్డం. అల్లోనేరేడు పండురంగులో నల్లగా నిగనిగలాడుతున్న వొంటిరంగు. పొట్టిగా దృఢమైన శరీరంతో నిటారుగా కూర్చున్నారు. భంగిమలో ఒక రాజసం. ఆయన వస్త్రధారణకూడా మిగతావారికంటే భిన్నంగా ఉంది. మోకాళ్ళ కిందకి దిగిన నీలపు రంగు లుంగీలాంటి బట్టకట్టారు. పైన చొక్కా లేదు. రంగురంగుల ఆఫ్రికన్ నేత దుప్పటిని ఒక భుజమ్మీంచి వేసుకుని అంగవస్త్రంలాగా ధరించారు, రెండో భుజం నగ్నంగా ఉంది. ఆయన వాయిస్తున్న ఎకోస్టిక్ గిటార్ కూడా పాశ్చాత్య గిటార్లకంటే పరిమాణంలో చిన్నదిగా ఉంది. దాన్ని పాం వైన్ గిటార్ అంటారట. ఆయన తీగల్ని మీటే తీరు, దాన్నించి వెలువడిన శబ్దంలో ఒక సన్నటి విషాదపు జీర. గిటార్ వాయిస్తూనే మధ్య మధ్య గొంతెత్తి వాళ్ళ భాషలో పాట కూడ పాడారు. అచ్చం మన పల్లెపదాల్లాగా జానపదగేయాల్లాగా అనిపించింది. అప్పుడప్పుడూ, పల్లవిలాంటి ఒక వరుసని పక్కవాయిద్యాలు వాయిస్తున్న యువకులందరూ కూడా కలిసి పాడారు.

ఆయన కోనిమో అంపోన్సా (Konimo Daniel Amponsah). ఘనా దేశస్థుడు. కచేరీ ముగిసిన తరవాత వేదిక వెనక్కి వెళ్ళి ఆయన్ని కలిసి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నన్ను చూస్తూనే నువ్వు ఇండియానించి కదా అన్నారు  నాకు మీ సంగీతం చాలా నచ్చింది, దీన్ని గురించి చెప్పండి కొంచెం అనడిగాను. ఇప్పుడు కాదు, నేనింకా ఊళ్ళో నెలరోజులు ఉంటాను, మా అబ్బాయి దగ్గర. ఇంటికొచ్చి కలవమని నెంబరిచ్చారు. మొదటిసారి ఏదో ఒక అరగంట గడుపుతాను అనుకుని వెళ్ళినవాణ్ణి సుమారు నాలుగ్గంటలు ఆయనతో గడిపి వచ్చాను. మనిషి మొదట ముక్తసరిగా ఉన్నట్టు ఉన్నా, తన దేశాన్ని గురించీ, తన సంగీతాన్ని గురించీ చెప్పవచ్చేప్పటికి ఆయనలో పూర్తిగా మరోశక్తి ఏదో పూనుతుంది. అలుపు లేకుండా మాట్లాడతారు. ఆయన మాట్లాడే తీరు ఎంతో మృదువుగా హాయిగా ఉంటుంది. బ్రిటీషు యాసకి ఒక తేనెపూత పూసినట్టు ఉంది ఆయన ఇంగ్లీషు మాట్లాడే పద్ధతి. చక్కగా తాతయ్య కథ చెప్పినట్టు చెబుతారు విషయమైనా. పూట ఎక్కువగా సంగీతాన్ని గురించే మాట్లాడుకున్నాము. ఆయన తమ దేశమైన ఘనాలోనూ, ఇతర ఆఫ్రికను దేశాల్లోనూ, ఐరోపాలోని వివిధదేశాల్లో, అమెరికాలో సంగీతంకోసం విస్తృతంగా పర్యటించారు. ఎన్నో రికార్డులిచ్చారు. అనేక అంతర్జాతీయ వేదికలమీద ప్రదర్శన లిచ్చారు. మన తబలా ఉస్తాద్ జాకీర్ హుస్సేన్తో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నానని చెప్పారు. ఆఫ్రికను సంగీతంలో ఒక్కొక్క మూడ్ సృష్టించడానికి ఒక్కొక్క డ్రం ఉంది. పైన చెప్పినట్టు ఒక్క వేదిక మీద  ఢమరుకంలాంటి చిన్న ఢక్క దగ్గర్నించీ ఒక మనిషిని సులభంగా తనలో ఇముడ్చుకునే పేద్ద ఢంకా దాకా వివిధ పరిమాణాల్లో బోలెడు డ్రంస్ ఉంటాయి. అట్లాంటిది జాకీర్ కేవలం రెండు చిన్న డ్రంస్తో (తబలా) రకరకాల శబ్దాల్ని సృష్టించడం కోనిమోకి చాలా ఆశ్చర్యం కలిగించింది. జాకీర్ అంటే చాలా గౌరవం వెలిబుచ్చారు.

ఇలా కోనిమో ఏనార్బర్లో గడిపిన నెలరోజుల్లో ఆయన్ని నాలుగు సార్లు కలిశాను. ఆయన ఎన్నో కబుర్లు చెప్పినా అప్పటికి ఆయనగురించి నాకు పెద్దగా తెలియదనే చెప్పుకోవాలి. తరవాత అక్కడా ఇక్కడా ఆయన గొప్పతనం గురించి మెల్లగా తెలిసి వచ్చింది. ఆయన వాళ్ళ దేశంలో కేవలం గొప్ప పేరు పొందిన వ్యక్తి మాత్రమే కాదు, ఘనా ప్రభుత్వం ఆయన్ని ఒక జాతీయనిధిగా గుర్తించి సత్కరించిందట. అంటే మనదేశంలో ఒక రవిశంకర్, ఒక బిస్మిల్లాఖాన్, ఒక బాలమురళీకృష్ణ లాగా అన్నమాట. ఇది తెలిసి, నాకు పరిచయమైన నిరాడంబరమైన వ్యక్తిని తలుచుకుని ఎంతో ఆశ్చర్యపోయాను.

కోనిమో చెప్పిన తన జీవిత విశేషాలు కొన్ని. ఘనా పశ్చిమ ఆఫ్రికాలో ఒక చిన్న దేశం. స్వాతఅంత్ర్యానంతరం పరిపాలన ప్రజాస్వామ్యాన్ని స్వీకరించినా సమాజంలో రాచరికపు ప్రాముఖ్యత తగ్గిపోలేదు. కోనిమో అసలు పేరు డేనియెల్ అంపోన్సా. ఆయనకి చిన్నతనాన్నుండే సంగీతంలో అభిరుచి ఏర్పడి చేతికి దొరికిన వాయిద్యమల్లా వాయిస్తుండేవాడు. ఈయన చిన్నప్పుడే ఒక అక్కయ్య అప్పటి రాజవంశపు వ్యక్తిని పెళ్ళాడ్డంతో అక్కతో కలిసి రాజధానిలో రాజప్రాసాదానికి వచ్చేశాడు కోనిమో. అప్పుడప్పుడే ఆధునిక విద్య వ్యాపిస్తున్న రోజులు. జెర్మను క్రైస్తవ మిషనరీలు నడిపే పాఠశాలలో కొంతకాలం చదివాడు. అక్కడ వాళ్ళ చలవన పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నాడు, ముఖ్యంగా చర్చిలో ఆర్గాన్ వాయించడం. రాజప్రాసాదంలో పెరగడం వల్ల ఆయనకి మర్యాద, చక్కని భాష, చతుర సంభాషణ, ఇటువంటి పైపై లక్షణాలతోపాటు ఘనా దేశపు సాంప్రదాయ పద్ధతులపట్ల లోతైన అవగాహన ఏర్పడింది. అతని చిన్నతనంలో చాలామంది స్థానిక విద్వాంసులు, కళాకారులు రాజుగారి మెప్పు పొందడానికి రాజప్రాసాదానికి వస్తుండేవారు. సైన్సులో డిగ్రీ పొంది 1951లో రాజధానిలోని విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ విభాగంలో లాబ్ టెక్నీషియన్గా ఉద్యోగంలో చేరాడు. ఖాళీ సమయమంతా సంగీత సాధనలోనే. అందరు యువకుల్లాగానే పాశ్చాత్య రీతులపట్ల మోజు. జాజ్ సంగీతం అంటే విపరీతమైన ఆరాధన. తోటి యువకుల్ని కూడగట్టి ఏదో ఒక వాద్య బృందం తయారు చేసి ప్రదర్శన లిస్తూనే ఉండేవాడు. ఉద్యోగపు తొలిరోజుల్లో జరిగిన ఒక సంఘటన తన జీవితాన్ని మార్చేసిందని కోనిమో నాకు చెప్పారు. ఒకరోజు సాయంత్రం విద్యార్ధుల హాస్టల్లో ఈయన గిటారు వాయిస్తూ సాంప్రదాయక పాటలు పాడుతూ పిట్టకథలు చెబుతూ ఉంటే విద్యార్ధులు మంత్రముగ్ధులైపోయి భోజనానికి వెళ్ళకుండా ఉండిపోయారు. ఇదేమిటా అని వెతుక్కుంటూ వచ్చిన వార్డెనుగారు (ఒక ఫిజిక్సు ప్రొఫెసరు) కోనిమో సంగీతాన్నీ మాటల్నీ విని ప్రశంసించి ఇదే నీ జీవిత లక్ష్యం చేసుకో అని చెప్పారు.

ఆక్షణానికి మాటల్ని పెద్దగా పట్టించుకోకపోయినా, అవి కోనిమోని వదిలి పెట్టలేదు. ఆయన దృష్టిని పూర్తిగా తన జాతి సంగీతంపైకి, సాంప్రదాయ పద్ధతులపైకి ఫోకస్ చేశాయి. అలాగని ఆయన తన ఉద్యోగం వదిలి పెట్టలేదు. 38 ఏళ్ళు కెమిస్ట్రీ లాబ్లో పని చేసి ఛీఫ్ టెక్నీషియన్గా రిటైరయ్యారు. తనకి ఆసక్తికరమైన జాజ్ సంగీతాన్నీ వదిలి పెట్టలేదు. ఒక పక్కన సాధనా కొనసాగిస్తూనే వచ్చారు. విదేశాలు పర్యటించినప్పుడల్లా ఆయాచోట్ల గొప్ప జాజ్ కళాకారులతో కలిసి ప్రదర్శనలిచ్చారు, రికార్డులిచ్చారు. కానీ ఆయన తన జీవితంలో సింహభాగాన్ని ఘనాదేశపు సాంప్రదాయ సంగీతానికే అంకితం చేశారు. దేశమంతా, పల్లెపల్లెకీ పలుమార్లు పర్యటించి మరుగున పడి ఉన్న జానపదగాయకుల్ని, వాద్యకారుల్ని బయటికి తీసుకొచ్చారు. వాళ్ళ పద్ధతులన్నీ అధ్యయనం చేసి తన సంగీతంలో ఇముడ్చుకున్నారు. అప్పటినించే తన పాటలన్నీ తమజాతి భాష అయిన "త్వి" భాషలోనే రాశారు. పల్లెల ఆచారాలు, సామెతలు, పిట్ట కథలు, జానపదకథలు, ఇట్లాంటివాటి నెన్నిటినో తన పాటల్లో పొందు పరిచారు. వివిధ సాంప్రదాయ విద్యలు కనుమరుగై పోకుండా, కొత్త తరం యువతీ యువకులకి తెలిసి వచ్చేట్టు సాంప్రదాయ సంగీత పాఠశాల నొకదాన్ని నెలకొల్పి యువతరం వారు కూడా తమ సాంప్రదాయాల్ని సాంప్రదాయ కళల్ని చూసి, నేర్చుకుని గర్వపడేట్టుగా తయారు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే కోనిమో లేకపోతే దేశపు సాంప్రదాయ సంగీతం ఎప్పుడో అంతరించి పోయిఉండేది, లేదా ఎవరికీ తెలియకుండా ఏదోమూల కొనఊపిరితో ఉండేది. ఆయన చేసిన సేవకి గుర్తింపుగానే ఘనా ప్రభుత్వం కోనిమోని అత్యుత్తమ స్థాయి పౌరసత్కారంతో జాతీయనిధిగా గుర్తించి గౌరవించింది.
Another informative article about Konimo 

(ఇదివరకు పాలపిట్ట పత్రికలో ప్రచురితమైన ఒక వ్యాసంలోని భాగం). 

మిత్రుల కోరిక మీద వెతికితే యూట్యూబులో కొన్ని విడియోలు దొరికాయి.

Comments

Vasu said…
"బవిరిగడ్డం" -- ఈ పదం ఇదే వినడం ..


నిండు కుండా తొణకదు అంటే ఇదేనేమో ..

చాలా బావుంది వ్యాసం .. మంచి పరిచయం (నాకు )
కోనిమో గారి పేరు ఎప్పుడూ వినలేదు నేను ..

మీరు కలిసిన గొప్పోళ్ళతో.. ఎందరో మహానుభావులు లాటి పుస్తకం వెయచ్చేమో ..ఆలోచించండి .
పువ్వు తాబి అబ్బినట్టు మంచి కళాకారుడు, మంచి వ్యక్తి కూడా అన్నమాట.
వాసుగారి సూచన గురించి ఆలోచించండి.
Kottapali said…
వాసు, బవిరిగడ్డం అనే మాట వినలేదా, విచిత్రమే.
నిజమే, నిండు కుండ తొణకదు. పుస్తకం రాసేంత ఉందో లేదో, ఇదిగో ఇలా నెమరు వేసుకోవడం మొదలు పెట్టాను. చూద్దాం.
జ్యోతిర్మయి, నెనర్లు.
ఆసక్తిగా ఉంది.
వారి సంగీతాన్ని ..ఒక బిట్ వినిపించే సౌలభ్యం ఉందా అండీ! మీరు ఆడియో కూడా జతపరిస్తే చాలా బాగుండేది. నాలాటి బద్దకస్తులకి వెతుక్కునే బాధ తప్పును.
ధన్యవాదములు.
ఆసక్తికరమైన ఆర్టికల్ స్వామిగారు.వనజగారు చెప్పినట్టు ఆయనది ఓ ఆడియో క్లిప్ ఏదైనా జతచేస్తే బాంగారానికి తావి అబ్బినట్టే......చదివించింది
Anonymous said…
అసలా ముఖంలోనే ఏదో సాత్వికత ఉంది. మంచి పరిచయం.
Kottapali said…
వనజవనమాలి, వాసుదేవ్, నెనర్లు.
ఆయన పద్ధతి అంతా ఎప్పుడూ లైవ్ మ్యూజిక్ తప్ప కేసెట్లు సీడీలు పట్టుకుని తిరిగే వారు కాదు. నేను హాజరైన ప్రత్యక్ష ప్రదర్శనలలో రికార్డు చేసి పెట్టుకోవాలని నాకు తోచలేదు. జాలంలోనే ఎక్కడన్నా దొరుకుతుందేమో చూడాలి.
puranapandaphani, నిజం. ఒక కళని (ఆ మాటకొస్తే ఏ పనిలోనైనా) తదేకంగా ఉపాసించడంలో ఒక ఉన్నత స్థాయికి చేరిన వ్యక్తులకి ఒకలాంటి ఋషిత్వం సిద్ధిస్తుందని అనుకుంటూ ఉంటాను నేను.
Pranav Ainavolu said…
Interesting... Thanks for sharing! :)
తృష్ణ said…
బిట్స్ పెట్టి మంచి పని చేసారు. చాలా బావుంది.Thanks for sharing.
వీడియో ..లు పెట్టి సంగీతాన్ని వినిపించినందుకు కౄతజ్ఞతలు..
anrd said…
మంచి వ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదములండి.