నలుపూ తెలుపూ సినీమా .. ఆ .. ఆ!

ఇప్పుడే ది ఆర్టిస్ట్ (The Artist) చూసి వస్తున్నా.

నా చిన్నప్పుడు విజయవాడలో అడపాదడపా పాత నలుపు తెలుపు సినిమాలు వేస్తుండేవాళ్ళు. తరవాత్తరవాత కూడా .. బహుశా కొత్త రిలీజులు రాకపోవటం వల్లనో ఏమో .. పాత సినిమాలు థియెటర్లలో ఆడుతూనే ఉండేవి. ఇలాగే మల్లీశ్వరి, దేవదాసు లాంటి, నేను పుట్టక ముందు తీసిన క్లాసిక్సు థియెటర్లో చూసే భాగ్యం దక్కింది.

అమెరికా వచ్చాక నాకిదొక పెద్ద ఫిర్యాదు సినిమాల విషయంలో - కొత్త సినిమాలు తప్ప పాత సినిమాలు కనబడేవి కావు, టీవీలో తప్పించి. నా అదృష్టం కొద్దీ ఫిలడెల్ఫియా నగరంలో ఆ సమయంలోనే రిట్జ్ అనే థియెటర్లు తెరిచారు. వీళ్ళు మామూలు రోజుల్లో అనేక ఆర్ట్, ఇండిపెండెంట్, విదేశీ కొత్త సినిమాలున్నూ, వేసవి నెలల్లో ఒక్క రెండు వారాల పాటు పాత క్లాసిక్సునీ వేసే వారు. అలా కొన్ని హాలీవుడ్ అద్భుత దృశ్యకావ్యాల్ని వెండి తెరమీద చూసే అదృష్టం దక్కింది.

ఇప్పుడీ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే, మొన్న ఆస్కార్ బహుమతి ప్రదానోత్సవం టీవీలో చూస్తూ కించిత్ విచారంతో కూడిన నిట్టూర్పు విడిచాను .. హా, ఈ సినిమాలేవీ నేను చూడలేక పోతినే .. ఇక డిస్కులే శరణ్యమా .. అని. ఇవ్వాళ్ళ యధాలాపంగా వూళ్ళో ఏం సినిమాలాడుతున్నాయో అని చూస్తే, దగ్గర్లోనే ఆర్ట్ సినిమాలు ఆడే మేపుల్ థియెటర్లో ఆస్కార్ పంట పండించుకున్న అనేక సినిమాలు ఆడుతున్నట్టు తెలిసింది. ఆహా ఏమి నా భాగ్యమని, బెస్టు ఫిలిము, బెస్టు ఏక్టరు బహుమతులు కొట్టేసింది గదాని ది ఆర్టిస్టుకి హాజరయ్యాను, మిత్రుడు క్లూనీని కాస్త వెనక్కి తగ్గమని హెచ్చరించి.

ఆసక్తికరమైన కాన్సెప్టు. దుజార్డిన్ చాలా అందంగా ఉన్నాడు (ఈ విషయం ఆస్కార్ షో చూస్తూ ఫేస్బుక్కులో ఒకటికి రెండు సార్లు వక్కాణించాను - Don't worry. I am secure in my masculinity to admire another man's good looks). కథ .. ఈ కథ ఇప్పటికి కొన్ని వందల సినిమాల్లో .. హాలీవుడ్లోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ, తెరకెక్కి ఉంటుంది. ఒక విధంగా ఇది మూగ చిత్రాల తారలైన రుడాల్ఫ్ వేలెంటినో, ఛాప్లిన్ వంటి మహామహుల జీవితాల్లో వారెదుర్కున్న ఆటుపోట్లని తరచి చూసుకోవడం అనుకోవచ్చు. అఫ్కోర్సు, ఛాప్లిన్ జీవితాన్నే దర్శకులు రిచర్డ్ ఎటెన్‌బరో సినిమాగా మలచారు అనుకోండి. ఐతే, పై పై పొరలను వలిచేస్తే .. సినిమా 1920-30లలో హాలివుడ్ ని గురించి కాదు అనుకుంటే - ప్రగతిని నిర్లక్ష్యం చేసేవాడి గతి అథోగతే .. అని సూచించే కథ అని నేననుకుంటున్నా. నిజానికి ఈ కథ, కథానాయకుడు జార్జి వేలెంటిన్ పాత్ర వేపు నించి చూస్తే విషాదాంతం అయుండాలి. ఎందుకంటే, అతను ది ఆర్టిస్ట్ అయితే కావచ్చును గానీ, సినిమా మొత్తంలోనూ అతని గర్వము, ఆత్మాభిమానము, .. ఒక్క మాటలో చెప్పాలంటే దుర్యోధనుడికి ఉన్నలాంటి ఆభిజాత్యం .. hubris .. అతన్ని ఎప్పుడూ మనిషిని కానివ్వదు. పెప్పీ యొక్క ప్రేమ ఆ మార్పుని తీసుకొచ్చిందా అంటే .. నమ్మడం కష్టమే.

పెప్పీగా వేసిన అమ్మాయి, Berinice Bejo బాగా చేసింది. స్టూడియో బాసుగా జాన్ గుడ్‌మెన్ కి ఒక్క అవార్డు నామినేషన్ కూడా రాకపోవడం అమానుషం. తన యజమాని ఎంత దిగజారినా, ఒక ఏడాదిపాటు జీతమియ్యకపోయినా అతన్ని వదిలి పెట్టకుండా కని పెట్టి ఉన్న విశ్వాసపాత్రుడైన షాఫరుగా జేం్‌స్ క్రామ్వెల్ కూడా చాలా బాగా చేశారు. పెప్పీ మొట్తమొదటి సారి స్టూడియోలో అడుగు పెట్టి ఎక్‌స్ట్రాల లైనులో కూర్చుని ఉండగా ఆమె పక్కన (బహుశా తాను కూడా ఎక్‌స్ట్రా పాత్ర కోసం వేచిఉన్నట్టు) వెటరన్ మహానటుడు మాల్కం మాక్డొవెల్ (కలిగులా, ఎ క్లాక్వర్క్ ఆరెంజ్) కనబడ్డం గిలిగింతలు పెట్టింది. సాంకేతికంగా సినిమా బాగున్నట్టే. ముఖ్యంగా ఆ సమయపు హాలీవుడ్ కథని అదే పద్ధతిలో (మూగ పద్ధతిలో) చెప్పాలని డిసైడవటమే దర్శకుడికి ముఖ్యమైన నిర్ణయం అయుంటుంది. అది డిసైడవంగానే మిగతావన్నీ అలా అలా చట్రంలో ఇమిడిపోయాయి. నేపథ్య సంగీతానికి చాలా అవార్డులు వచ్చాయి, నాకైతే చాలా విపరీతమనిపించింది. సైలెంట్ ఫిల్ము తియ్య బూనిన దర్శకునికి నిశ్శబ్దపు విలువ తెలియకపోవడం బాధగా అనిపించింది.

ఆస్కారు బహుమతి గొప్ప సినిమాకి తార్కాణం కాదు అనే భావన మనసులో స్థిరపడిపోయినా (బహుశా English Patient గెలిచినప్పట్నించీ అనుకుంటా) ఈ సినిమాకి బెస్టు పిక్చరు, బెస్టు డైరెక్టరు అవార్డులు ఎందుకొచ్చాయబ్బా అని కించిత్ మీమాంస తప్పనిసరిగా జరిగింది థియెటర్లోనించి బయటపడి కారు దగ్గరికి నడుస్తుండగా. నాకేమనిపించిందంటే .. నాస్టాల్జియా కళాయి పూత పూసిన మధురానుభూతులనే మాయా దర్పణంలో హాలీవుడ్ తనని తాను చూసుకుంది ఈ సినిమాలో. మనమైనా అంతేగా - ఆ మాయలో పడితే బయటపళ్ళేము. హాలీవుడ్డూ అతీతం కాదు, తాను సృష్టించుకున్న మాయలో తానే కూరుకు పోవడానికి (Much Like Velentin's character sinking into the quick sand in "Tears of Love"!)


చివరిమాటకి ముందుమాట .. నా దృష్టిలో ఈ సినిమాకి తార అగ్గీ (జార్జి వేలెంటిన్ పెంపుడు కుక్క, మరియు అతని సినిమాల్లో సహతార).

చివరిమాట .. ఈ సినిమా చూసినంత సేపూ నాకెందుకో అన్నగారు నందమూరి తారకరామారావుగారు మదిలో మెదులుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఆ ఫీలింగ్ తోసివేయలేకున్నాను.

Comments

Vasu said…
ఇది చూడాలన్న మాట ఐతే ..

"మొన్న ఆస్కార్ బహుమతి ప్రదానోత్సవం టీవీలో చూస్తూ కించిత్ విచారంతో కూడిన నిట్టూర్పు విడిచాను .. హా, ఈ సినిమాలేవీ నేను చూడలేక పోతినే "

షేం టు షేం .
నిరుడు నామినేట్ అయిన వాటిలో .. ఒక్కటి మిస్ అయ్యాను .. ఈ సారి ఒక్కటీ చూడలేదు ..
అవునండీ...అన్న గారు ....యెస్.వి.ఆర్ గారు
హాలివుడ్ లొ పుట్టి ఉంటె యెంతొ బాగుండెది
Anonymous said…
Don't worry. I am secure in my masculinity to admire another man's good looks.:);)
అన్నగారికీ దీనికీ సంబంధమేంటీ? హీరోపాత్ర లక్షణాల్లో ఆయన కనబడ్డారా ఏంటి?
pi said…
My feelings Exactly! My fav film of the Melancholia received 0 nominations.But again when did the Academy like art anyway. Must say one pleasant surprise was Tree of Life. Watch if you havent. Big screen recommended.

Coming to classics, we have a few theaters that screen classic films, Stanford, Castro, Roxie, etc.(You are welcome to be jealous ;))
Kottapali said…
Vasu, మీకు కనీసం తగిన సాకు ఉంది :)

శశికళగారు మీరు నన్ను పూర్తిగా అపార్ధం చేసుకున్నారని చెప్పడానికి ఆనందిస్తున్నాను.

పక్కింటబ్బాయి .. అన్నగారి కనెక్షను - అదే నాకూ అర్ధం కాలేదు, కానీ ఆ భావం పట్టి విడువలేదు. ఒకటి బహుశా ఆ నటుడి అందం కావచ్చు. తన సినిమా కెరీర్లో కనీసం తొలి పదేళ్ళపాటు రామారావు తెరమీద గొప్ప అందంగా కనిపించేవాడు. పక్కన గ్లామర్ హీరోయిన్లు వెలతెల పోయేవారంటే అతిశయోక్తి కాదు. అదొక కారణం. రామారావు నాకు తెలిసి ప్రగతిని నిర్లక్ష్యం చెయ్యలేదు. నిజానికి వచ్చిన అవకాశాలన్నీ బాగా ఉపయోగించుకున్నాడు. ఏమో మరి. ఆ ఫీలింగ్ నాకే సరిగ్గా అర్ధం కాలేదు.

pi .. Tree of Life చూసి తరించాను తల్లీ తరించాను. మా చిన్నమ్మాయితో కలిసెళ్ళాను. సినిమా మధ్యలో అనుమానం వచ్చి దానిచ్ ఎవిలో గొణిగాను - మనం సరైన థియెటర్లోకే వచ్చామా, పొరబాట్న పక్కన సినిమా దీనిలో మిక్సై పోయిందా అని :)
జెలసీ ఎందుకు? కనీసం మీరైనా చూడ గలుగుతున్నందుకు ఆనందమే. ఇక్కడ కూడా కొన్ని వెన్యూస్ ఉన్నాయి. కానీ ఒకట్రెండు షోలు మాత్రమే వేస్తారు. ఆ సమయంలో మనకి తీరి చావదు.
SRRao said…
శ్రీ నారాయణస్వామి గారికి
శ్రీరామనవమి శుభాకాంక్షలతో...........

జగదభిరాముడు శ్రీరాముడే !