ఓపెనింగ్ బేట్స్‌మెన్ - సిక్స్ నాటవుట్

బాపట్ల ఇంజనీరింగ్ కాలేజిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు, విద్యార్ధులే కాక చాలా మంది ఉపాధ్యాయులు కూడా క్రికెట్ పిచ్చిగాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు కేవలం చదివి విని చూసి తృప్తిపడే రకాలు కాదు - వాళ్ళే ఆడాలి. ఆడితే తప్ప వాళ్ళకి తృప్తి లేదు. అప్పట్లో అదింకా సరికొత్త కాలేజీ కాబట్టి లెక్చరర్లు కూడ కుర్రకారుగానే ఉండేవారు. ఫేకల్టీ మొత్తాన్నీ జల్లించి ఒక టీం తయారు చేశారు. ఈ ఫేకల్టీ టీము వీలైన శనివారపు మధ్యాన్నం ఒక్కో సెమిస్టరు పిల్లకాయల టీముతోనూ ఆడుతుండేది. నాకిప్పుడు సరిగ్గా గుర్తు లేదు - పది ఓవర్లో, ఇరవై ఓవర్లో. మధ్యాన్నం ఒకటిన్నరకల్లా కాలేజి ఐపోయేది. రెండున్నరకి మొదలెడితే సూర్యాస్తమయం లోపు మేచ్ ముగిసేది. పర్మనెంట్ లెక్చరర్లలో ఈ ఆడే పిచ్చి ఉన్న జనాభా ఒక ఐదారుగురు ఉండగా పదకొండు సంఖ్య నింపడానికి మాలాంటి జూనియర్ లెక్చరర్లని కూడా కలిపేసుకున్నారు. నా రూమ్మేటు పవన్ కాలేజి రోజుల్లో యూనివర్సిటీ లెవెల్లో ఆడిన వికెట్ కీపర్. సమర్ధుడైన కీపర్ తనంతట తాను వస్తానంటే వద్దనే టీం ఉండదు కదా. సరే, పవన్ టీంలో ఉన్నాడు కదాని నేనూ బ్రహ్మం కూడా చేరి పోయాం (మేం చేరకపోయినా బలవంతంగా చేర్చబడేవాళ్ళం). పర్మనెంట్ లెక్చరర్లలో చాలా మంది కొత్తగా పెళ్ళైనవాళ్ళు. మధ్యాన్నం ఒకటిన్నరకల్లా కాలేజీ ముగిసిపోతే హాయిగా ఇంటికి పోయి తన నవవధువు కొంగు పట్టుకుని "భావకవుల వలె ఎవరికి తెలియని" పాటలు పాడుకోకుండా ఈ కొపెకు కుర్రకారు లెక్చరర్లందరికీ ఈ క్రికెట్ పిచ్చేవిటో నా బ్రహ్మచారి బుర్రకర్ధమయ్యేది కాదు.

మేచ్ ఉన్న రోజుల్లో హాస్టలు మెస్సులోనే భోంచేసి, డిపార్టుమెంటులోనే భుక్తాయాసం తీరేలా ఓ చిన్నాతి చిన్న కునుకు తీసి ఇక ఆటకి సిద్ధమయ్యే వాళ్ళం. నేను ఏడో క్లాసు తరవాత క్రికెట్ ఆడిన గుర్తు లేదు. మా టీం కేప్టెన్ నన్ను బౌలింగ్ చేస్తావా బేటింగ్ చేస్తావా అనడిగాడు. ఏదీ చెయ్యను అని చెప్పాను. బౌలర్లు చాలా మందే ఉన్నార్లే, నువ్వు బౌలింగ్ చెయ్యాల్సిన అవసరముండదు అని భరోసా ఇచ్చాడు. అంతవరకూ ఓకే. బేటింగ్ లైనప్ లో నన్ను ఎక్కడ ఉంచాలా అనేది ఇంకో సమస్య అయింది. మొదట ఆడిన మేచిల్లో ఒకటి నించీ ఐదు దాకా వేరువేరు స్థానాల్లో ఉంచి చూశారు. ఎక్కడ ఉంచినా పెద్ద తేడా ఏం లేదు. నా స్కోరు ఎప్పుడూ మూడుకి దాటలేదు. మా టీములో అసలే బౌలర్లు ఎక్కువ కాబట్టీనూ, ఆనవాయితీగా బౌలర్లు చివరకి బేట్ చేస్తారు కాబట్టీనూ, సున్నా కంటే మూడు మేలనుకోబట్టీనూ నా హవా అలా నడుస్తూ వచ్చింది. శివశంకర్, బ్రహ్మం నాకు లాగానే మజా చెయ్యడానికి వచ్చేవాళ్ళు కానీ, బేటింగ్ ఓ మాదిరిగా చేసేవాళ్ళు. పవన్ సరే సరి, మంచి కీపర్. పవన్ కీపింగ్ చూసి స్టూడెంట్లే ఏడిచే వాళ్ళు, సార్, మీరే స్టూడెంటయి ఉంటే యూనివర్సిటీ మేచిలన్నీ గెల్చేవాళ్ళం అని. శరత్, సోమయాజులు, కోటేశ్వర్రావు .. అందరూ మంచి బౌలర్లు. అందరు బౌలర్లుండగా ఒక మేచ్ లో ఎందుకో బాల్ నా చేతిలో పెట్టాడు కేప్టెన్. లేక పొరబాటున నేనే బౌలింగ్ చేద్దామని ముచ్చట పడ్డానో నాకిప్పుడు గుర్తు లేదు. ఓవరు పూర్తయ్యే సరికి నేను పదిహేను బంతులు విసరడమయింది, ప్రత్యర్ధుల ఖాతాలో ఓ పది పరుగులు జమ అయ్యాయి. ఆ తరవాత అట్లాంటి పొరబాటు ఎప్పుడూ చెయ్యలేదు మా కేప్టెన్.

మా క్రికెట్లో ఇంకో తమాషా - అప్పుడప్పుడూ శాఖాధిపతులు, ఒక సారైతే ప్రిన్సిపాల్ కూడ వచ్చి మాతో ఆడారు. మేం ఆడుతున్నప్పుడు ఏ మాత్రం దయ, జాలి, దాక్షిణ్యం లేకుండా వాళ్ళ అమ్ముల పొదిలో ఉన్న అన్ని అస్త్రాలనూ బంతులుగా విసిరే పిల్లకాయలు ఈ ఆత్మీయ అతిథులు బేటింగ్ కి వచ్చినప్పుడు మాత్రం పరమ సాధువులుగా మారిపోయేవారు. ఒకసారేమయిందంటే ఫైనలియర్ మెకానికల్ వాళ్ళతో ఆడుతున్నాం, మా హెడ్ వచ్చారు ఆడ్డానికి (ఆయన తరవాత ప్రిన్సిపల్ అయ్యారు) - అసలు చాలా అరుదైన సంఘటన. It was an event. It was an occasion! సరే ఆయన్ని బేటింగ్ కి దించారు. బౌలింగ్ వంతు ఆయన దగ్గరే ఫైనల్ ప్రాజెక్ట్ చేస్తున్న పిలగాడికి వచ్చింది. వాడు రెండు బంతులూ ఎంత మెల్లగా వేశాడంటే .. చివరికి మా హెడ్డుగారే వాణ్ణి పిల్చి, ఒరే నాయనా, నువ్వు కనీస వేగంతోనైనా బాలు విసరకపోతే నేను కొట్టలేనురా నాయనా అని చెప్పాల్సి వచ్చింది. ఐనా, ఆయన్ని ఔట్ కాకుండా ఉంచడానికి ఆ పిల్లకాయలు ముచ్చెమటలు పోసి మూడు చెరువుల నీళ్ళు తాగారు. ఓ అరగంట అయ్యాక, చివరికి ఆయనకే మొహం మొత్తి, "రిజైన్" చేసి పనుందని వెళ్ళిపోయారు.

ఇలా మా క్రికెట్టాట ఆరు బంతులూ మూడు పరుగులూగా కుంటుతూ కుంటుతూ నడుస్తుండగా, ఒక మహా ప్రభంజనం కేంపస్ లో ప్రవేశించింది. ఆ ప్రభంజనం పేరు చంద్రశేఖర్. చంద్రశేఖర్‌ని గురించి క్లుప్తంగా చెప్పడం అసంభవం. ఇక్కడ మనకథకి అవసరమైన జ్ఞానగుళిక ఏవిటంటే ఈ పెద్దమనిషి బెంగుళూరులో బీటెక్కు సమయంలో, కేవలం యూనివర్సిటీ కాదు, రంజీ టీములో ఆడాడు - ఓపెనింగ్ బేట్స్‌మెన్. అంతే కాదు స్టైలిష్ బేట్స్‌మెన్, మాస్టర్ బేట్స్‌మెన్ కూడా. బరిలోకి దిగాడంటే స్కోరు బోర్డు మీద యాభై అయినా నమోదు చేస్తే గానీ డ్యూటీ దిగేవాడు కాదు. పిల్లకాయల బౌలర్లకి సింహస్వప్నంగా తయారయ్యాడు. మా ఫేకల్టీ టీముకి మాత్రం యమా వూపొచ్చింది. మొత్తానికెందుకో శేఖర్‌కి నామీద గురి కుదిరింది - నా సామర్ధ్యమ్మీద కాదు, నేనుగనక తనతో కలిసి బేటింగ్ చేస్తే తను బాగా స్కోర్ చేస్తాడని. అలా నేను కూడా ఓపెనింగ్ బేట్స్‌మెన్ గా సెటిలయిపోయాను. అలా ఆడుతూ పాడుతూ ఫేకల్టీ టీము కొన్ని మేచిలు గెలిచింది కూడా. ఇంతలో ఓ కొత్త సమస్య ఎదురైంది. నా వ్యక్తిగత స్కోరు ఆరుకి చేరేప్పటికి నేను అవుటైపోయేవాణ్ణి. నేను అవుటైపోతే శేఖర్ నిలవలేక పోయేవాడు. అలా మా టీము గెలుపోటములు తిరిగితిరిగి, ఏదో ఊసుపోకకి టీములో చేరిన నా భుజస్కంధాల మీద మోపబడింది.

ఆరు దాటి నా స్కోరు పెంచడానికి .. అంటే ఆ ఉత్సాహాన్ని నాలో కలిగించడానికి మా టీం సభ్యులందరూ శాయశక్తులా ప్రయత్నించారు. కానీ ఇక్కడ నా ఉత్సాహం కాదుగా ఇబ్బంది! అదేంటో మరి, మంత్రించినట్టు ఆరో పరుగు దాటి ఏడో పరుగు సాధించిన పాపాన పోలేదు. ఒకే ఒక్క సారి జన్మానికో శివరాత్రి అన్నట్టు బరిలో దిగీ దిగడంతోనే నా వంతు రాంగానే ఒక షాటు పీకాను - సిక్సరెళ్ళింది. మరుసటి బాలు క్లీన్ బౌల్డు. ఆ తరవాతి ఓవర్లో శేఖర్ కూడా అవుటైపోయాడు. ఒక మేచ్ .. నాలుగో సెమిస్టరు యీసీయీ వాళ్ళతో. వాళ్ళ కేప్టెను యూనివర్సిటీ టీములోమాస్టర్ బేట్స్‌మెన. వాళ్ళు ముందు బేటింగ్ చేశారు. వాడు హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తం స్కోరు 132. గెలవాలంటే శేఖర్ సెంచరీ చెయ్యాలి. శేఖర్ సెంచరీ చెయ్యాలంటే నేను తగినంత సేపు తనకి శ్టాండ్ ఇవ్వాలి. మా బేటింగ్ మొదలయింది. మొదటి ఓవర్ శేఖర్ తీసుకున్నాడు - ఓ పదో పన్నెండో పీకాడు. రెండో ఓవర్ నేను ఫేస్ చేశాను. ఒక చిన్న షాటుకి రెండు పరుగులు. మొత్తానికి ఎలాగో ఆ ఓవరు గట్టెక్కించాను. మూడో ఓవరు శేఖరు రెండు సిక్సర్లు, రెండు బౌండరీలూ పీకాడు. తరవాతి ఓవరు మొదటి బంతిలోనే సింగిల్ తీశాను. మిగతా ఐదు బంతులూ శేఖర్ యథావిధిగా చెడుగుడాడేసుకున్నాడు. నాకేమో భయంగా ఉంది - నా కోటాలో ఆరింటా మూడు రన్నులు అప్పటికే జమ అయిపోయినై.

ఓవర్ మారుతున్నప్పుడు శేఖర్ చెవిలో నా అయిడియా గొణిగాను. వోకే అని బుజం తట్టి బౌలింగ్ ఎదుర్కోవడానికి వెళ్ళాడు. నాలుగు బౌండరీలు ఆ ఓవర్లో. మరుసటి ఓవర్ నేను ఫేస్ చెయ్యడానికి వెళ్ళంగానే, మొదటి బంతి సింగిల్. ఓవర్లో మిగతా బంతులన్నీ శేఖర్‌కే .. యథా విధి చెడుగుడు. మా స్ట్రేటజీ మీకీపాటికి అర్ధమై పోయి ఉండాలి. అయినా మూడు ఓవర్లలో నా వ్యక్తిగత స్కోరు ఆరుకి చేరుకుంది. ఐతే ఆ సమయానికి మావాడికి ఇంకో బ్రిలియంటయిడియా వచ్చేసింది. నేను నా మొదటి బంతికి సింగిల్ తియ్యాల్సిన శ్రమ కూడ లేకుండా, తన ఓవర్లో చివరి బంతిలో తనే సింగిల్ తీసేవాడు. ఇక నేను చెయ్యవలసిందల్లా, అవతలి వికెట్ దగ్గర బేటు పట్టుకుని సవిలాసంగా నించోవడమూ, ఓవర్ చివర్లో సింగిల్ కోసం పరుగు తియ్యడమూనూ. బౌలర్లేం తక్కువ తినలే - ఓవర్ చివరి బంతి శేఖర్తో
బౌండరీ కొట్టేందుకు అనువుగా టెంప్ట్ చెయ్య ప్రయత్నించారు కూడా. అయినా మా వాడు తొణకలేదు.

మేమిద్దరం నాటవుట్‌గా ఆ రోజు మేచ్ గెలిచాం.

Comments

సూపర్ సార్ :)

అయిన మాష్టార్లతో క్రికెట్ అంటే ఆ మజా నే వేరు లెండి ;)
Anonymous said…
Bagundi sir mee strategy...
Anonymous said…
బాపట్ల కాలేజీ ఇప్పటికీ అదే సమయం ఉ7:30 - మ1:00. మేము కాలేజీ రోజుల్లో బాపట్ల కాలేజీని ప్రేమించటానికి గల కారణాల్లో ఇదీ ఒకటి.
Vasu said…
బావున్నాయి మీ బాపట్ల క్రికెట్ జ్ఞాపకాలు.మీరు లెక్చరర్ గా పని చేశారని తెలియదు ఇప్పటి వరకూ. ఏం భోదించే వాళ్ళు?
Kottapali said…
కామెంటిన అందరికీ నెనర్లు.
@Vasu, నేను స్వయంగా పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ బోధించేవాణ్ణి. మరో సీనియర్ కింద జూనియర్ గా ఇంజనీరింగ్ డ్రాయింగ్, థర్మల్ లాబ్ కూడా బోధించేవాణ్ణి. అన్నిటికంటే ఎక్కువగా పిల్లలకి క్లాస్‌గా కనబడుతూ మాస్‌లాగా అల్లరి చెయ్యడం ఎలాగో బోధించేవాణ్ణి! :)
అలాగటండీ నారాయణ స్వామి గారూ.. పక్కా మాస్ పనులు ఎలా చెయ్యాలో క్లాస్ గా వుంటూ చెప్పేవారా :))
భలే బాగుంది మీ కిరికెట్టు కధ కమానిషు..చదువుతుంటే కళ్ళ ముందు కాలేజీ కనిపించింది..those are wonderful days.
భలే బాగుంది మీ కిరికెట్టు కధ కమానిషు..చదువుతుంటే కళ్ళ ముందు కాలేజీ కనిపించింది..
నేను జోర్హట్ లో చేరిన కొత్తలో, మా లాబ్ డైరెక్టర్ కూడా అయిన మా హెడ్, నన్ను బలవంతాన వాలీ బాల్ టీములో చేర్చాడు జనాలు ఎవరూ దొరకక. ఇంటర్ dept. మాచెస్ కి. ప్రైజు డిస్ట్రిబ్యూషన్ లో చెప్పాడు. సుబ్రహ్మణ్యం సర్విస్ చేస్తే బాల్ అవతలి కోర్టు లోకి వెళ్ళగా ఈ ఏడు చూడలేకపోయాను. మళ్ళీ ఏడు చూడగలనని ఆశిస్తున్నాను అని.... అహా.
Vasu said…
" అన్నిటికంటే ఎక్కువగా పిల్లలకి క్లాస్‌గా కనబడుతూ మాస్‌లాగా అల్లరి చెయ్యడం ఎలాగో బోధించేవాణ్ణి! :)"

మీకు సింహాద్రి నచ్చింది అన్నప్పుడు నాకు ఇదే అనిపించింది. ఇంత క్లాస్ బ్లాగర్ కి అంత మాస్ సినిమా ఎలా నచ్చిందో అని :)
S said…
మా నాన్నా వాళ్ళ కాలేజీలో కూడా లెక్చరర్స్-స్టూడెంట్స్ క్రికెట్ మ్యాచ్లు అయ్యేవి. ఇక్కడ ఆడా-మగా ఇద్దరూ ఉండేవాళ్ళు...లెక్చరర్ల టీములోనూ, స్టూడెంటు టీములోనూ. వీళ్ళ డిపార్ట్మెంట్ మాత్రమే ఆడేదో ఏమో మరి...నాకు గుర్తు లేదు. పదేళ్ళు ఉంటాయేమో నాకు అప్పటికి. వీటిల్లో ఏకైక బెనిఫిట్ ఏమిటంటే...సార్ పిల్లలం కనుక బాగా ఎంటర్టైన్ చేసారు స్టూడెంట్లు అని గుర్తు నాకు :))
Chandu S said…
'ఆయన్ని ఔట్ కాకుండా ఉంచడానికి ఆ పిల్లకాయలు ముచ్చెమటలు పోసి మూడు చెరువుల నీళ్ళు తాగారు.'


చాలా బాగుంది
gaddeswarup said…
I took my final school examination from Bapatla in 1954 though I studied in Chintayapalem. So, I visited Bapatla several times around that period. CheDuguDu later termed KabaDi was the popular game those days. I think there were also some good volleyball players from Bapatla. I had classmate by name Tilak from Bapatla with whom I was in touch until 1977. There are surprising number of good researchers from Bapata including Komaravolu Chandrasekharan and Madhav Nori in mathematics, Modaugu Gupta in Fisheries who won a UN prize, several literary personalities.. And artists.