హాయనే ఓ పిలుపు

ఎప్పుడు వాడ్డం మొదలెట్టానో గుర్తు లేదు. బహుశా కాలేజిలో చేరినాక అనుకుంటా.
చూస్తుంటే, ఇదే ఏకైక సంబోధనాప్రథమా విభక్తి అయి కూర్చున్నది, మరో పిలుపే సృష్టిలో లేనట్టు. నాకొక్కడికే కాదు, చుట్టూ ఉన్న ప్రపంచమంతటానూ.

మొన్న కొత్త ఆంగ్ల సంవత్సరాదిని శ్రుతీ సందర్భమూ లేని పండుగ అనుకుంటూ ఒక బ్లాగు మిత్రుడితో ముచ్చటిస్తుండగా ఆయన చెప్పిన మీదట ఈ హాయ్ సంగతేవిటో కనుక్కోవాలనిపించింది. చూడగా ఇది పంతొమ్మిదో శతాబ్దం చివర్లో వాడుకలోకి వచ్చినట్టుగా కనిపిస్తోంది, ముఖ్యంగా అమెరికాలో. అమెరికను వేష భాషా సంస్కృతులు ప్రపంచపు నలుమూలలకీ వ్యాపించడంతో బాటుగానే ఈ సంబోధన కూడా వ్యాపించింది. అంతకు మునుపు ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లో ప్రజలు యథాలాపంగా సంబోధించడానికి హలో అనే వారుట. టెలీఫోను వచ్చాక, ఫోను ఎత్తినప్పుడు అవతలి వ్యక్తి ఎవరో తెలీదు గనక, తటస్థంగా సంబోధించడానికి హలో అనడం మొదలు పెట్టారు. ఈ అనుబంధం ఎంత బలంగా అల్లుకు పోయిందంటే ఫోనంటే హలో, హలో అంటే ఫోను అనుకునేంతగా స్థిరపడిపోయింది. నేను చిన్నప్పుడు ఇంగ్లీషు కథలు చదువటం మొదలు పెట్టిన కొత్తల్లో రెండు పాత్రలు ఒకర్నొకరు హలో అని పలకరించుకుంటే, ఇదేంటబ్బా బొత్తిగా అనాగరికంగా ఉన్నారు వీళ్ళు, ఫోను లేకుండా హలో అంటున్నారు అనుకునే వాణ్ణి.

అసలు హలో అనే సంబోధన తటస్థ సంబోధనగా ఎప్పుడు ఆంగ్లభాషలో స్థిరపడిందో చెప్పటం కష్టం. దీని మూలం "ఎవరక్కడ? అలాగే నిలబడు!" అనే హెచ్చరికగా వాడుతున్న పాత భాషల మాటల నించి వచ్చిందని ఒక డిక్షనరీలో రాశారు. మొదణ్ణించీ కూడా అమెరికనులకి తమ ఇంగ్లీషు బ్రిటీషు వాళ్ళ ఇంగ్లీషుకంటే భిన్నంగా ఉండాలనే కోరిక ఒకటీనూ, పైగా వీలు కలిగిన చోటనల్లా మాటలని కుదించి పలికే బద్ధకం ఇంకోటీ - వెరసి, హలోని కాస్తా హాయిగా కుదించి పడేశారు.

తమాషా ఏవిటంటే ఆంగ్లం మాట్లాడని అనేక పాశ్చాత్య దేశాలలో హాయ్ అని సంబోధించరు. అంతేగాక అలా సంబోధించడం అనాగరికంగా భావిస్తారుట. ఫ్రాన్సులో బోన్ జోర్ అనీ, ఇటలీలో బోన్ జోర్నో అనీ (శుభ దినం), స్పానిష్ లేక పోర్చుగీసు మాట్లాడే దేశాల్లో ఓలా అనీ (హలోకి ప్రతిరూపం) అంటారు. ఇజ్రయెల్లో షాలోం అనీ ఇస్లామిక్ దేశాల్లో సలాం (రెంటికీ శాంతి అనే అర్ధం) అనీ అంటారు. మరో దిక్కు లేనట్టు అమెరికను సంస్కృతిని విచక్షణా రహితంగా దిగుమతి చేసుకోవడమే గాక స్వయానా అమెరికా మానసపుత్రులమని ఫీలయిపోతూ మనం మాత్రం హాయి హాయి పిలుపుల్లో తేలి సోలి పోతుంటాం!

మీకు గుర్తొచ్చిన తెలుగు సంబోధనలు చెప్పండి!

Comments

నమస్కారం
వందనం
"నమస్తే" అని పలకరించుకునే వాళ్ళము కదు..ఇప్పుడు అంతా హాయ్ లు హెల్లోలు
ఈమధ్య dude ఒకటి మొదలయింది.
తెలియని వారినైతే నమస్కారం, ఏవండీ తెలిసిన వారినైతే అమ్మా అనో, సార్ అనో, పేరుతోనో, వరుసకలిపో సంబోదిస్తాం. గౌరవప్రదంగా వారి వృత్తి పేరుతో సంభోదించడం ఇంకో పద్ధతి. ఎలా పిలిచే వాళ్ళమా అని అలోచించిస్తూ, రెండు నిముషాల్లో బోలెడు ప్రదేశాలకు వెళ్లి బోలెడు మందిని కలిశాను. ధన్యవాదాలు.
మనకలవాటున్నవి:

కలిసేటప్పుడు "నమస్కారం", "బావున్నారా?", "అంతా కులసానా?"

వెళ్ళిపోయేటప్పుడు "మంచిదండీ", "ఉంటామండీ", మళ్ళీ కలుద్దాం, "జాగ్రత్తండీ"

మా ఇజీనారం దాటి వచ్చకే ఈ కొత్త హాయ్, హలో పిలిపులు అలవడ్డాయి నాకు. అంతవరకూ పైచెప్పినవే.

ఇంకోమాట: మనకి good monring అనో శుభోదయం అనో పలకరించుకునే అలవాటు లేదు. రోజులో ఏ సమయంలో కలిసినా నమస్కారాలు, దణ్ణాలే!

good morning అలవాటు ఎంతలా మన జీవితాల్లోకి అంతలా ప్రవేశించడంటే దానిని సమూలంగా తుడిచిపెట్టడం ఎప్పటికీ కుదరదేమో అనిపిస్తోంది.

కనీసం ఇంగ్లీషైనా మానేద్దామని నేను "మేలిపొద్దులు" అని చెప్పడం మొదలెట్టాను.
<< మీకు గుర్తొచ్చిన తెలుగు సంబోధనలు చెప్పండి!

బాబ్బాబూ.. అదేదో చెప్పి పుణ్యం కట్టుకుందురూ.. :P

అప్పుడెప్పుడో ఒకసారి మా జర్మన్ కొలీగ్ అడిగింది.. 'హాయ్' ని మీ భాషలో ఏమంటారని.. ఎవరైనా కనపడగానే ఎలా విష్ చేస్తారని?
నిజం చెప్పొద్దూ.. నాకేం సమాధానం చెప్పాలో తోచలేదు.. :(
"నమస్తే, నమస్కారం.." తప్పించి వేరే ఏం గుర్తు రాలేదు.. అప్పటి నుంచీ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నా.. :)
Anonymous said…
నమస్కారం
రసజ్ఞ said…
నమస్కారం, మంగిడీలు, బాగున్నారా? కుశలమా? ఉభయకుశలోపరి! క్షేమమా? కులాసానా? వందనాలు, పల్లె వెలుగులు, శుభదినం, ఇంకా గుర్తురావటం లేదు!
ఈ హలో గురించి నేను ఒకసారి చదివాను దానిని ఇక్కడ కాపీ చేసి పెడుతున్నాను.
Story of Hello!
When you lift the phone you say Hello.... Do you know what is the real meaning of Hello ? It is the name of a girl !!! YES !!!!!!!!!!! And do you know who is that girl ?? Margaret Hello ..... She was the girlfriend of Graham-bell who invented telephone.... One can forget the name of Graham-bell but not his girlfriend, that is ...love !!!!!
Anonymous said…
నమస్తే; బాగున్నారా; ఎన్నాళ్ళకిఎన్నాళ్ళకి, నమస్కారం. అన్నింటి లోకీ "నమస్తే" సింపుల్ గా, అందంగా అన్ని వయసులవారూ అనడానికి వీలుగా ఉంటుందని నా అభిప్రాయం.

-లక్ష్మి
Anonymous said…
Addressing someone with 'Hi' may be strongly associated with America, but this 'Hi' is possibly a derivative of greeting in Finnish, like 'Hyvää huomenta' for Good morning and 'Hyvää iltaa' for Good evening. If 'Hi' is culturally offensive, so can also be the Telugu address forms like 'era', 'orey', 'osev'.
Kottapali said…
అందరికీ నెనర్లు.
ఇవ్వాళ్ళా రేపూ పనిలో చాలా రద్దీగా ఉంటున్నది. మేరు పెట్టే వ్యాఖ్యలు వెంటవెంటనే ప్రచురించలేను. కొంచెం ఓపిక పట్టాలి.
మాష్టారూ బాగున్నారా, కులాసా నా, అయ్యా.
ఈ good morning లు, సుప్రభాతాలు అన్నీ గత 40 ఏళ్ల నుంచి మనకు అలవాటు అయ్యాయి అనుకుంటాను. అంతకు మునుపు బహుశా ఈ విధమైన గ్రీటింగ్స్ అలవాటు లేదేమో?

మామూలు గా సంబోధన గా ఒరేయ్, ఏమండీ బాపతే ననుకుంటాను.
y.v.ramana said…
అలోఅలోలో..లో.. అంటూ ముళ్ళపూడి 'హలో'ని తెలుగైజ్ చేశారు గదా!
పలకరించుకోవటానికి ఏ భాషయినా నాకభ్యంతరం లేదు.
అసలు పలకరింపులే కరువైన ఈ కాలంలో ఏదో ఒక పలకరింపు.
పలకరింపే పది వేలు!
Disp Name said…
ఈ జాడ్యం తెలుగు వాళ్ళలో కూడా వచ్చేస్తోందా?!

అరవ వాళ్ళే ఈ లా ఆయ్ మరో భాష నించి మన భాష లో కి పదం రాకూడదు సుమా అంటారను కున్నాను !


నా వరకైతే హాయ్ లో హాయి ఉంది. హాయ్ నాకెందుకో తెలుగు లో మమేకం అయినయిట్టని పిస్తుంది. వేరు పదాలు వుపయోగించాకూడదని నా అర్థం కాదు సుమా !


రెండు, ఒక భాష పది కాలాల పాటు వుండాలంటే అది నది లా ప్రవహించాలి. ఇంగ్లీషు లో మమేకం అయిన పర భాషా పదాలెన్నో వున్నాయి. అవన్నీ ఇప్పుడు ఆంగ్లమే సుమ్మా అన్నంత గా కలిసి పోయేయి. అదే ఆంగ్ల భాష కి పట్టు గొమ్మ అయి పోయింది అని నా అభిప్రాయం. అదీ ఆ భాషని ప్రపంచ భాష గా నిలబెడు తోంది.

తెలుగు లో మమేకం కావించి మరిన్ని పదాల్ని మనవి గా మార్చేద్దాం ! ఆ పై అవి మనవే అనుకుంటారు అందరు ! ఏమంటారు ? ఆ పై తెలుగు కూడా ప్రపంచ భాష అయి పోతుంది !


స్వకుచ మర్దనం అనుకోకుంటే, ఈ జిలేబి పదం వ్యుత్పత్తి చూడండీ , అక్కడెక్కడో ఇరాన్ లో దీని ఆరిజిన్ అట, ఇప్పుడు చూడండీ తెలుగు లో ఎంత ఒద్దికగా కలసి పోయిందో !


చీర్స్
జిలేబి.
వ్యాసం బాగుంది.మంచి ప్రశ్ననే లేవనెత్తారు.ఏ మాటకీ ఏ భాషలోనూ పేటెంటు ఉండదు.మన భాషలో చక్కటి సమానార్థక పదం లేనప్పుడు ఆ కొత్తపదం ఎదుటి వ్యక్తికి అర్థమవుతుందనుకున్నప్పుడు ఎరువు తెచ్చుకోవడంలో తప్పు లేదు. కొత్త ఒక వింత కనుక వయసులో ఉన్నవారు ఒకరినొకరు అలా పలుకరించుకొవడం ఫరవా లేదు. కాని పెద్దలని నమస్కారం అని సంబోధిస్తేనే మర్యాదగా ఉంటుంది.చాలా ఏళ్ల క్రితమే ప్రేమించిన కుర్రాణ్ణి పెళ్ళి చేసుకో బోతూ కాబోయే మామగారిని హాయ్ అని పలకరించిన యువతిని చూసి విస్తుబోయాను.కొన్ని విషయాలు ఈ మధ్యనే నా అపురూపం బ్లాగులో పిలుపులూ. మానవ సంబంధాలూ అంటూ చర్చించాను.ఎదుటి మనిషి మనని పలకరించే తీరుని బట్టే వారితో మన సంభాషణ జరుగబోయే తీరు నిశ్చయమైపోతుంది.
బాలు said…
అంతా బాగేనా? హైదరాబాద్లో చాలామంది పలకరించేతీరిది
chavera said…
ಊಟ ಆಯುತ್ತಾ ?
భోజనం అయ్యిందా?
బెంగళురులో వినిపించే పలకరింపు.
mohan
జయ said…
కొత్తపాళీ గారూ! మీకు హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలండి. ఇలా కూడా పిలుస్తారన్నమాట:)
సంక్రాంతి శుభాకాంక్షలు .
chavera said…
హాయ్ హాయ్ అని హాయిగా తెలుగులో పిలుచుకుంటే హాయిగానే ఉంటుంది.
ఇంకా ఏ భాషలోను లేని సరైన అర్థం తెలుగులో ఈ పలకరింపు సంతరించుకుంది.
"ఇదేంటబ్బా బొత్తిగా అనాగరికంగా ఉన్నారు వీళ్ళు, ఫోను లేకుండా హలో అంటున్నారు అనుకునే వాణ్ణి." :D