మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ స్మారక దినం

రోజు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ స్మారక దినం.

1950-60
లలో పౌరహక్కుల ఉద్యమవేదిక మీదికి కింగ్ రావడానికి అనేక దశాబ్దాల మునుపే అమెరికాలో నల్లజాతి చైతన్యము వికసిస్తూన్నది. తమాషాగా, చైతన్యము చాలా మట్టుకు క్రిస్టియను మతబోధనతో ప్రేరితమై, మూలాలనించి తన బలాన్ని పొందుతూ వచ్చింది  . అమెరికన్ సివిల్ వార్ ముగిశాక జెనరల్ హోవర్డ్ అనే పెద్దమనిషి వాషింగ్టన్ నగరంలో నల్లజాతి యువకులు మతసంబంధమైన చదువులు చదువుకోవడం కోసం ఒక సెమినరీ (క్రైస్తవ మత పాఠశాల) స్థాపించాడు. అదే కాలక్రమేణా హోవర్డ్ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతకాలంలో అన్ని జాతులవారినీ విద్యార్ధులుగా చేర్చుకుంటున్నా, గత శతాబ్ది కాలంగా విశ్వవిద్యాలయం ముఖ్యంగా నల్లజాతి వారికి మతబోధనే కాక అనేక రంగాల్లో ఉన్నత విద్యాస్థానంగా దేశపు నల్లజాతి చైతన్యాభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించింది.

విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేసిన రెవరండ్ హోవర్డ్ థర్మన్ (Howard Thurman) ఇరవయ్యవ శతాబ్దపు తొలి దశాబ్దులలో నాటిన సైద్ధాంతిక బీజాలు తరువాతి రోజుల్లో దేశ వ్యాప్త ఉద్యమాలుగా ఎదిగినాయి. కింగ్ తండ్రికి ఈయనతో ఉన్న స్నేహాన్ని పురస్కరించుకుని, బోస్టను యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న సమయంలో థర్మన్గారితో సన్నిహితంగా మెలిగి ఆయన భావాలతో ప్రభావితుడైనాడు. తన క్రైస్తవ మతబోధనా కార్యక్రమాల పుణ్యమాని థర్మన్ అనేక ప్రపంచ దేశాల్లో పర్యటించి మానవ సామాజిక రాజకీయ జీవితాన్ని అనేక కోణాలనించి గమనించారు. భారతదేశం పర్యటించి మహాత్మాగాంధీతో కొంతకాలం గడిపినప్పుడు మహాత్ముని అహింసా సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైనాడు. గాంధీ సూత్రాలకి ఏసుక్రీస్తు ప్రవచనాల బలాన్ని జోడించి ఆధునిక పౌరహక్కుల ఉద్యమానికి ఒక నైతిక బలాన్ని చేకూర్చాడీయన. ఈయన రచించిన పుస్తకాలు రోజుల్లో జాతి భేదం లేకుండా ఆనాటి యువతరంపై, యువ నాయకులపై బలమైన ముద్ర వేశాయి.

గమనించాల్సిన ఒక ముఖ్య విషయం థర్మన్ గారి బోధనలో శ్వేతజాతి పట్ల ద్వేషం ఎక్కడా లేదు. నల్లజాతి వారికి చట్టపరమైన న్యాయం జరగాలని ప్రతిపాదిస్తూ, దీనిపై ఉద్యమించాలని పిలుపునిస్తూనే, సామాజిక జీవనంలో ఇరుజాతులవారూ శాంతియుతంగా కలిసికట్టుగా పరస్పర సహాయ సహకారాలతో జీవించాలని ఈయన కాంక్షించారు.

1929
లో పుట్టిన కింగ్ ఇరవయ్యైయ్దేళ్ళ వయసులో అలబామా రాష్ట్రంలోని మాంట్గామరీ అనే ఊరిలో బాప్టిస్టు పాస్టరుగా వృత్తి జీవితం ప్రారంభించారు. అమెరికాలో చాలా చోట్ల, ముఖ్యంగా అలబామా వంటి దక్షిణ రాష్ట్రాల్లో అప్పట్లో నల్లవారిని విడిగా ఉంచేవారు. ఊరిలో వాళ్ళ ఇళ్ళుండే చోటు వేరే విడిగా ఉండేవి. హోటళ్ళలో రెస్టరాంట్లలో అందరూ కూర్చునే చోట కూర్చోటానికి లేదు. దొడ్డితోవన వచ్చి, వంటింటి పొయ్యికి దగ్గర్లో కూర్చుని తినేసి వెళ్ళిపోవాలి. వాళ్ళ ప్లేట్లూ గ్లాసులూ వేరే. వాటిని వాళ్ళే కడుక్కోవాలి. కొన్ని చోట్ల నల్లవారికి ప్రవేశం నిషిద్ధం అని ప్రకటనలుండేవి. ఆఖరికి సిటీబస్సులో కూడా వారు బస్సు చివరి భాగంలో మాత్రమే కూర్చోవాలి.

1955
లో మాంట్గామరీ నగరంలో మొదట క్లాడెట్ అనే పదిహేనేళ్ళ బాలిక బస్సులో తన సీటుని వదులుకోక సంచలనం సృష్టించింది. తరవాత కొన్నాళ్ళకి రోసా పార్క్స్ అనే యువతి అదే తిరస్కృతికి అరెస్టయింది. అలా చిన్నగా మొదలయిన తిరస్కారం, సహాయ నిరాకరణం మహా ప్రభంజనమై, ఏడాదికి పైగా నల్లజాతివారు సిటీబస్సుల వాడకాన్ని తిరస్కరించారు. ఇది మాంట్గామరీ బస్ బాయికాట్ అనే పేరిట ఈనాడు చరిత్రపుటలకెక్కింది. సంఘటన కింగ్ని పౌరహక్కుల నాయకునిగా జాతీయ వేదిక మీద నిలబెట్టిందని చెప్పుకోవచ్చు.

1959
లో కింగ్ భారతదేశం వచ్చి గాంధీ కుటుంబ సభ్యులతో కొంత కాలం గడిపారు. అప్పటికే గాంధీ అహింసా సిధ్ధాంతాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఉన్నా, యాత్ర వల్ల గాంధీ ఆత్మకి మరింత దగ్గరైనట్టు, ఆయన బోధలు తన రాజకీయ చైతన్యంలో అంతర్గత భాగమైనట్లుగా కింగ్ రాసుకున్నారు. దక్షిణ క్రైస్తవ నాయకుల సమితి (Southern Christian Leadership Conference) అనే సంస్థని స్థాపించి అమెరికాలో అనేక దక్షిణ రాష్ట్రాల్లో శాంతియుత అహింసాయుత సహాయ నిరాకరణ ఉద్యమాలు నిర్వహించ సాగారు. అప్పటినించీ 1968లో హత్య చేయబడే వరకూ కింగ్ సమితి అధ్యక్షులుగా కొనసాగారు. గాంధీ ప్రతిపాదించిన అహింస సూత్రాలని అప్పటి అమెరికను చట్టాలకి అన్వయించి ఒక పటిష్ఠమైన కార్యాచరణ ప్రణాళికని రూపొందించడంలో కింగ్ కీలకపాత్ర వహించారు. సహాయ నిరాకరణోద్యమాల ద్వారా తన జాతి వారి దుర్భర దారిద్ర్యాన్ని, అప్పటి చట్త వ్యవస్థ వారి పట్ల చూపుతున్న వ్యవస్థీకృత నిరాదరణని ఉద్యమాల ద్వారా వార్తాపత్రికల్లోనూ టీవీలోనూ ప్రచారం జరిగేట్టు చేశాడు. తొలిసారిగా దేశవ్యాప్తంగా అమెరికను ప్రజలకు తమ తోటి పౌరులైన నల్లజాతి వారు ఎటువంటి ద్రుభరమైన పరిస్థితుల్లో బతుకులీడుస్తున్నారో తెలిసి వచ్చింది. ప్రజాభిప్రాయం వెల్లువెత్తింది. తద్వారా అమెరికను ప్రభుత్వం, నల్లవారికి వోటు హక్కుతో సహా అనేక మౌలిక హక్కుల చట్టాలను చేసి అమలు పరచడం మొదలైంది.

కింగ్ నాయకత్వం వహించిన హక్కుల ఉద్యమాల్లో 1963 లో జరిగిన 'మార్చ్ ఆన్ వాషింగ్టన్" అతి ముఖ్యమైనది. భారత స్వాతంత్ర్యోద్యమంలో గాంధీ నాయకత్వంలో జరిగిన దండి యాత్రతో పోల్చదగినది. అప్పటికే ప్రభుత్వం ముందు పరిశీలనలో ఉన్న అనేక చట్టాల అమలుపై ఉద్యమం వ్యతిరేకమైన ప్రభావం చూపుతుందనే భయంతో కింగ్ దీనిని మొదట తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఇతర ఉద్యమనాయకులతో చర్చల ఫలితంగా తన అభిప్రాయాన్ని మార్చుకుని, మొదట నిరసనగా వ్యూహరచన జరిగిన ఉద్యమాన్ని వేతనహక్కులకోసం పోరాటంగా తీర్చి దిద్ది తానే నాయకత్వం వహించారు. దేశం నలుమూలల నించీ సుమారు మూడు లక్షలమంది నల్లజాతి వారు రాజధానికి వచ్చి పాల్గొనగా, లింకన్ మెమోరియల్ భవనం మెట్లమీద నిలబడి "నేనొక కలగన్నాను" అంటూ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా టీవీలో రేడియోలో ప్రసారమైన ప్రసంగం నల్లవారినే కాక సకల అమెరికనులనూ ఉత్తేజ పరిచింది, యాభయ్యేళ్ళ తరువాత ఈనాటికీ ఆత్మ గౌరవానికీ, హక్కుల పరిరక్షణకూ, సౌహార్ద్రతకూ ప్రతీకగా నిలిచింది.

1968
లో మెంఫిస్ నగరంలో ఒక రేలీలో పాల్గొనేందుకు తయారవుతుండగా ఒక హంతకుడి తుపాకి కాల్పుల్లో, ముప్ఫై తొమ్మిదేళ్ళ వయసులో కింగ్ మరణించారు. ఆయన అకాల మరణానికి సంబంధించిన వివరాలు ఇప్పటికీ మసక తెరల్లో కప్పబడి ఉన్నాయి. ఆయన చాలా కాలం కమ్యూనిస్టులతో కుమ్మక్కై ప్రభుత్వాన్ని సాయుధ పోరాటంతో కూలద్రొయ్యాలని కుట్ర చేసినట్టు ఆరోపణలున్నాయి. వియత్నాం యుద్ధాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. కింగ్ వ్యక్తిత్వం మీద కూడా తరువాతి కాలంలో చాలా ఆరోపణలు వచ్చాయి.

తన అంతిమ యాత్రలో తన తోటివారు తనని ఎలా గుర్తుంచుకావాలని కోరుకుంటున్నారో అయనే రాసుకున్నారొక వ్యాసంలో - "నేనెక్కడ పుట్టాను, ఏయే ఎవార్డులు గెలిచాను అని చెప్పుకోనక్కర్లేదు. నేనంత గొప్పవాణ్ణి, ఇంత గొప్పవాణ్ణి అని పొగడక్కర్లేదు. నేను నా సాటివారి కోసం పాటుబడ్డానని గుర్తుచేసుకుంటే చాలు. నేను నీతికి నిలబడ్డాననీ, న్యాయం కోసం శాంతియుతంగా పోరాడాననీ గుర్తు చేసుకుంటే చాలు."

ఏదేమైనా ఇరవయ్యవ శతాబ్దపు అమెరికను సామాజిక రాజకీయ చైతన్యం మీద బలమైన ముద్ర వేసిన దార్శనికుడుగా ఉద్యమకారుడుగా కింగ్ చరిత్రలో నిలిచిపోయారు.

నాడు అమెరికను సమాజ స్వరూపం 1960లతో పోలిస్తే చాలా మారింది. నల్లజాతి వారికంటే హిస్పానిక్ జాతివారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భారతీయూలతో కలిపి అనేక ఆసియా దేశాలనించి వచ్చిన వలసదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. సంఘంలో వివక్ష తొలిగిపోలేదు. ఒక నల్లజాతి వజ్రం అధ్యక్ష పీఠాన్ని అధిరోహించినా, ఇప్పటికీ నల్లజాతి యువకులు అత్యధిక నిష్పత్తిలో అమెరికను జెయిళ్ళలో మగ్గుతున్నారు. గద్దర్ పాట ఒక దాంట్లో చెప్పినట్టు పేదలున్న పల్లెల్లో బాధలెన్నొ ఉన్నాయి. కింగ్ స్వప్నించిన సొహార్ద్ర వాతావరణం, జాతి భేదం లేకుండా ప్రతి పౌరుడూ ఇది నా అమెరికా అని సగర్వంగా చెప్పుకోగల పరిస్థితి ఇంకా చేతికందలేదు.

రోజు మహనీయుణ్ణి తలుచుకోవడం రోజు ఎప్పటికైనా వస్తుందనే ఆశని తిరిగి ప్రజ్వలింపచేసుకోడానికే.

పాలపిట్ట మాసపత్రిక ఫిబ్రవరి 2010 సంచికలో ప్రచురితం

Comments

డాక్యుమెంటరీ చూసిన అనుభూతి కలిగింది. మీ వ్యాసం ద్వారా కింగ్ ని స్మరించాను,దర్శించాను.

ధన్యవాదాలు.