టీవీ 99 స్పెషల్ కవరేజీ


ఏంకర్: టీవీ 99 ప్రేక్షకులకి జిగ్రీనాథ్ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్ ప్రత్యేక కవరేజికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే అందిన వార్త. బెజవాడ మొగల్రాజపురం కొండ దగ్గర జరిగిన ఒక ఘోర ప్రమాదం. జాక్ అనే అబ్బాయి, జిల్ల్ అనే అమ్మాయి ప్రమాదంలో చిక్కుకున్నారని ఇప్పటికే అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మా రిపోర్టర్ సత్యూష ప్రమాదం జరిగిన చోటికి చేరుకున్నారు. ప్రమాదం విశేషాలేమిటో సత్యూష నించి లైవ్ లో తెలుసుకుందాం. (చెవి దగ్గర ఇయర్ ఫోన్ నొక్కి పట్టుకుని) హలో సత్యూష, సత్యూష - ఉన్నారా?

ప్రేక్షక మహాశాయులారా? ఇటువంటి దుర్ఘటన జరిగితే టీవీ 99 ఎన్నో వ్యయప్రయాసలకి ఓర్చి, సంఘటన చూసిన వారిని, చూడని వారిని కూడ ప్రత్యక్ష సాక్షులుగా మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్న ప్రత్యక్ష కథనం. హలో సత్యూష?

సత్యూష: హలో జిగ్రీ. ఇప్పుడే వెంకాయమ్మ గారు బయటికి వచ్చారు. దుర్ఘటన గురించి ఆవిడకి ఏం తెలుసో కనుక్కుందాం.

ఏంకర్: ఓకే సత్యూషా.

(
వెంకాయమ్మ గారు పెద్ద పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకుని మొహంనిండా పవుడర్ రాసుకుని వస్తుంది. అనవసరంగా సిగ్గు పడిపోతూ మెలికలు తిరిగిపోతూ ఉంటుంది).

సత్యూష: నమస్కారం వెంకాయమ్మ గారూ. మా టీవీ 99 ప్రేక్షకులు మీరు చెప్పబోయే కథనం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. చెప్పండి.

వెంకాయమ్మ: ఓలమ్మో, నేను నిజంగా టీవీలో కనిపిచ్చేతనానండీ?

సత్యూష: అవును. కనిపిస్తున్నారు. ఇది ప్రత్యక్ష ప్రసారం.

వెంకాయమ్మ: అట్టైతే ఒక్క నిమిషం అట్టనే ఉండండేం. ఎట్ట కనిపిస్తనానో టీవీలో చూసుకోని వచ్చేత్తా.

సత్యూష (నెత్తి కొట్టుకుని): మీరు ఇక్కణ్ణించి వెళ్ళిపోతే టీవీలో కనపడ్రు. ఇదిగో కేమెరా ముందు నించున్నంతసేపే కనిపిస్తారు.

వెంకాయమ్మ: అట్టాగాండీ. (చీర బొడ్డులోంచి సెల్ ఫోన్ తీసి, నెంబర్ డయల్ చేసి) ఒసే లచ్చమ్మత్తోవ్, నేన్ టీవీలో వస్తనానే. టీవీ 99 అంట, యెమ్మటే పెట్టి చూడండే.
(
ఇంకో నెంబర్ డయల్ చేస్తుంది - సత్యూష కోపంగా ఆమె ఫోన్ లాక్కుని)

సత్యూష: వెంకాయమ్మ గారూ, అది కాదు. జాక్ ఇంకా జిల్ దుర్ఘటన. దాన్ని గురించి చెప్పండి.

వెంకాయమ్మ: (అయోమయంగా చూస్తూ) దుర్గటనా? దుర్గటనేందీ? (తన బట్టలూ జుట్టు సరి చేసుకుంటూ, కేమెరా అబ్బాయితో) కెమెరా బాబూ, నేను బాగా కనపడతనానా?

సత్యూష: (వెంకాయమ్మ బుజాలు పట్టి తన వేపుకి తిప్పుకుని) జాక్ అనే పిల్లాడూ జిల్ అనే పిల్లదీ కొండ ఎక్కుతూ ఎక్కుతూ .. మీ పనిమనిషి చూసిందంట కదా.

వెంకాయమ్మ (గుర్తొచ్చినట్టు) అదా. మా పనిమనిషి కాదండి. మా తోటికోడ్లు గారి పనిమనిషికి మరిదండి. మరిదంటే మొగుడి తమ్ముడు కాదండి. ఆయమ్మాయి చెల్లిలి పెనివిటండి. (రహస్యంగా) ఏండీ, మీ టీవీలో వంటల కార్యక్రమం ఉంటదా? నేను ఉలవచారు మా బెమ్మాండంగా కాత్తానండి.

సత్యూష: వంటల్లేవ్ గింటల్లేవ్, మంటలు మంటలు. కాదు కాదు, జాక్ ఇంకా జిల్, పనిమనిషి మరిది. ఇంతకీ మీకు ఏం తెలుసు దుర్ఘటన గురించి?

వెంకాయమ్మ: మరి పొద్దుటేలే మా తోటికోడ్లు గారు ఫోన్ చేసింది గదండీ. అన్నట్టు నా ఫోనిచ్చెయ్యండే - మొన్న పండక్కి మా ఆయన కొనిచ్చాడు (తన ఫోన్ తీసుకుంటుంది). అదే ఫోన్ చేసి, యెంకా ఇదిన్నావటే అనిచెప్పి చెప్పారండి. (ఇంతలో వెంకాయమ్మ ఫోన్ మోగుతుంది ఫోన్ తీసి) హలో ఎవలూ? సరోజక్కా, బాన్నావా? టీవీ 99 చూడక్కా, నేను టీవీలో కనిపిత్తన్నా. ఏంటి టీవీ చూసే ఫోన్ చేశావా? తేంకూ తేంకూ అక్కా. ఇంకేంటి పెదబావగారు కులాసానా? నిన్న పండక్కి ఏమేం వంటల్ చేసావక్కా? మేమా .. ఏదో మామూలియే, అవునుగానక్కా, ..

సత్యూష (కేమెరా మేన్ని పక్కకి లాక్కు పోయి కేమెరాలోకి చూస్తూ) అరేయ్ జిగ్రీగా, నాకు అర్జంటుగా కడుపులో కాఫీ పడకపోతే - జాక్ జిల్ దుర్ఘటన కాదు, ఇంకా తీవ్రమైన దుర్ఘటనలు చాలా జరిగి పోతయ్. నేను పోతన్నా. నువ్వు స్టూడియోలో ఏం ఏడుపు ఏడుస్తావో ఏడుచుకో.

(
సత్యూష, కేమెరా మెన్, వెంకాయమ్మ నిష్క్రమిస్తారు).

(
స్టూడియోలో ఏంకర్)
ఏంకర్: చూస్తున్నారు కదా ప్రేక్షక మహాశయులారా? దుర్ఘటన వెనుక విషయాలు తెలుసుకోవడం అంత సులభమైన విషయం కాదు. ఐనా మా రిపోర్టర్లు అష్టకష్టాలఓర్చి దీని వెనక బాగోతమంతా బయటకి తీసి మీముందు పెట్టేదాకా పట్టు విడవరు. మేం ఏమేం బయటికి లాగుతామో తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి టీవీ 99!
***
Jack fell down and broke his crown
Jill came tumbling after.

This is just a sample. The full sketch is available. If you want to perform this, please email me. 
kottapali at gmail dot com

This was adapted from an English version prepared and performed by folks at IISc.

Comments

buddhamurali said…
intaku జాక్ అనే అబ్బాయి, జిల్ల్ అనే అమ్మాయి paristiti yemito miraina cheppandi
sample supero super. full sketch ఎలా ఉంటుందో...

సత్యూష.. పేరు బావుంది.
సుజాత said…
అసలు .Why Jack and Jill went up the hill? వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? వీళ్ళిద్దరూ స్నేహితులా , లవర్సా? వీళ్ళ స్నేహితులేం చేస్తుంటారు? వీళ్ళ కాలేజీ బాక్ గ్రౌండ్ ఏమిటి? ఇలాంటి ఆస్కతి కర విషయాలు త్వరలో తెలుపుతారని చూస్తుటాం? మీరు ఇలాంటివే తెలుపుతారని మాకు తెలుసనుకోండి...
Kottapali said…
మురళి ..అంత వీజీగా చెప్పేస్తారేంటి?

గీతిక .. నెనర్లు. సత్యూష ఒకానొక టీవీ న్యూస్ ఏంకరమ్మ పేరుకి నకలు.

సుజాత .. భలే పట్టేశారండి. ఈ ప్రత్యక్ష కథనం తరవాత జరగబోయేది అదే. ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించడానికి విశ్లేషకులు బండల్రావుగారు, విశ్లేషకురాలు డా. పటాలిని గారు స్టూడియోలో సమావేశమవుతున్నారు.
బాబోయ్..!!!
మీరూ ఓ ఛానలేం పెట్టబోవట్లేదుగా...???
Disp Name said…
టీ వీ లందు టీ వీ 99 మేలయా !

మీరు కొంత డీసెంట్ గా కవర్ చేసారు!

ఈ పాటి డీసేన్సీ తో మన టీ వీ వాళ్ళు చేస్తే ఎంతో గొప్ప ఈ కాలానికి !

అల్ప తృప్తి జీవులం - ఆంధ్రులం !


చీర్స్
జిలేబి.
టి.వి 99 వారికి విజయవాడ ప్రేక్షకుల విన్నపములు.

మొగల్రాజపురం కొండపై.ఎప్పుడూ..దుర్ఘటనలే జరుగుతాయి.. మీరు నాన్ స్టాప్ న్యూస్ నే అందిస్తూనే ఉంటారు.. బ్రేకింగ్ న్యూస్ అంటూ..కొత్తగా ఏమి ఉండదని.. ప్రత్యూష మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుందని మాకు తెలుసు. ఈ లోపు మేము..రక్త పోటు పెంచుకుని.. హైరానా పడమని..తెలియజేస్తున్నాం.వెంకాయమ్మ గారి వంట ఉలవచారు లైవ్ లంచం ఇస్తే మీకు వివరాలు త్వరగా తెలుస్తాయి. అని రహస్యం తెలుసుకోరే!
వెంకాయమ్మ గారి పూర్తి ఇంటర్వ్యూ ప్రసారం చేయనందుకు నిరసన తెలియ చేస్తున్నాం.

సుజాత గారు మంచి జర్నలిస్ట్ అని ఈ వేళ అర్ధం అయింది..... దహా
మేధ said…
:))

ఆ వీడియో అదరహో.. నేటి 24X7 వార్తా ప్రసారాలను కళ్ళకి కట్టినట్లు చూపించారు..
Kottapali said…
జిలేబి, వనజవనమాలి, Indian Minerva, బులుసు గారు, మేధ .. నెనర్లు.
మాలతి said…
భలే ఉంది. నను ఉప్పుడు మన్దేసంలో ఉండనందుకు సంతోసంగా ఉన్నది. :))