Monday, June 20, 2011

ఈ శనివారమే

ఏవిటి విషయం?
మోహినీ భస్మాసుర - కూచిపూడి నృత్యనాటకం జరుగుతోంది. దీన్ని డిట్రాయిట్ తెలుగు సమితివారు (DTA) సమర్పిస్తున్నారు.

ఎవరెవరు వేస్తున్నారేవిటి?
కూచిపూడి నాట్యాచార్యులు, శ్రీ హరి రామమూర్తిగారు భస్మాసురునిగా నటిస్తున్నారు.
మోహిని ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్సు.
ఇంకా భారత్ నించీ, అమెరికాలో వివిధ నగరాలనించి ఇరవైమంది నర్తకీనర్తకులు ఈ ప్రదర్శనలో వివిధ పాత్రలు పోషించనున్నారు.

మోహినీ భస్మాసుర చాలాసార్లు చూశామండీ, దీని గొప్ప ఏవిటట?
ఇది పూర్తిగా కొత్త సృష్టి.
సాహిత్యం, సంగీతం, నాట్యం - మూడు మూర్తులా పాత కథకి కొత్తరూపాన్ని తెచ్చాయి. పైగా, హరి రామమూర్తిగారు వెంపటి చిన్నసత్యం మాస్టరుగారి అగ్రశ్రేణి శిష్యులలో అగ్రగణ్యులు. ఆయనే మొత్తం నాటకానికి నాట్యరచన చేశారు. పైగా స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు.
ఒక్ఖ మాటలో చెప్పాలంటే - ఈనాటి కూచిపూడి రంగస్థలం అందిస్తున్న ఉత్తమోత్తమైన నాట్యప్రదర్శన ఇది.

అబ్బ, మీరు మరీ నోరూరించేస్తున్నారండి. ఎక్కడా, ఏరోజు, ఎన్నింటికి, ఈ వివరాలు కూడా చప్పున చెప్పండి మరి!

ఈ శనివారం, జూన్ 25 తారీకున.
సాయంత్రం 4 గంటల నుంచీ

Southfield-Lathrup High School
19301 W 12 Mile Rd
Lathrup Village, MI 48076-2557

మరిన్ని వివరాలు DTA Websiteలో

Mohini Bhasmasura
Grand Kuchipudi Dance Ballet
Starring world renowned master, Sri Hari Ramamurthy as Bhasmasura
Featuring more then 20 talented dancers from India and the USA.
Southfield-Lathrup High School
19301 W 12 Mile Rd
Lathrup Village, MI 48076-2557

Click Here For DETAILS

Thursday, June 16, 2011

స్వరానంద హేల

మట్టికుండలాంటి మానవజన్మలో మనిషికి దైవత్వాన్ని చూపించేవి రెండే రెండు నా ఉద్దేశంలో - జీవన్ముక్తులైన మహామహుల విషయం కాదు, నా లాంటి మామూలు మనుషుల విషయంలో - ఒకటి ఇంకా ప్రపంచం తెలియని పసి పిల్లలు .. అందుకే మహానుభావులు దేవులపల్లి రాశారు, పిల్లలూ దేవుడూ చల్లని వారే అని.
రెండోది సంగీతం. అందునా కర్నాటక సంగీతం.

మన పూర్వులు మనకిచ్చి పోయిన అపారమైన సాంస్కృతిక వారసత్వ సంపదలో అతిగొప్ప రత్నం కర్నాటక సంగీతం. అట్లాంటిదే ఇంకో గొప్ప రత్నం మన సాంప్రదాయ కవిత్వం. తెలుగువారమై పుట్టి ఈ రెండు రత్నాలనీ రెండు కళ్ళకీ అద్దుకుని ఆస్వాదించలేకపోతే .. ప్చ్!

సంగీతం వినడం నేర్పినందుకు మా అమ్మకి ప్రతిరోజూ మొక్కుతుంటాను.

సాధారణంగా నాస్టాల్జియాకి లోనుకాను కానీ సంగీతం వినడం విషయంలో నాకు పాతరోజులే బావుండేవి. ఇంట్లో ఒక మంచి స్టీరియో ఉండేది. ఆఫీసులో ఒక వాక్‌మేన్ ఉండేది. నా సంగీతం అంతా కేసెట్లు, సీడీల్లోనే ఉండేది. ఇంట్లో ఉన్నంత సేపూ స్టీరియో మోగుతూనే ఉండేది. ఆఫీసులో డెస్కు దగ్గర ఉన్నంత సేపూ కేసెట్ మార్చి కేసెట్ మోగుతూనే ఉండేది. ఫలితంగా మనసు సంతతమూ స్వరానందహేలలో ఊయలూగుతూ ఉండేది. మేలుకుని ఉన్న సమయంలో 50 శాతానికి మించిన సమయం సంగీతం వింటూ ఉండేవాణ్ణి అంటే అతిశయోక్తి కాదు.

అట్లాంటిది కొన్నేళ్ళుగా జీవితంలో విపరీతమైన సంగీత లేమి ఏర్పడింది. సంగీతం వినిపించే వస్తువులు, వినే పద్ధతులు తామర తంపరగా, ఎటు తల తిప్పితే అటు ప్రత్యక్షమయ్యే ఈ రోజుల్లో ఇలాంటి లేమి విచిత్రమే గాక మనసుని కుంగదీసేదిగా తయారైంది. నాకెందుకనో నెట్‌లో సంగీతం వినడం అచ్చిరాలేదు. MP3 ప్లేయర్లు, సెల్‌ఫోనులో ప్లేయర్లు కూడా తలకాయనొప్పినే తెచ్చి పెట్టాయి.

ఇహ ఇది పద్ధతి కాదని ఒక ప్రాజెక్టుగా పెట్టుకుని ఉన్న కర్నాటక సంగీతం సీడీలన్నీ అంకోపరిలోకి ఎక్కించాను ముందు. అటుపైన ఒకటి రెండు చిన్న సీడీ వాలెట్లు కొని కార్లో పెట్టుకుని కారెక్కినప్పుడల్లా కచ్చితంగా వింటున్నాను. అలా పూర్వవైభవంతో కాకపోయినా కొద్దిస్థాయిలోనైనా మళ్ళీ సంగీతం నా జీవితంలోకి ప్రవహిస్తూన్నది ప్రస్తుతం.

ఇంతకీ ఇప్పుడు ఈ సోదంతా ఎందుకంటే, ఇవ్వాళ్ళ ఒక కస్టమరు మీటింగ్ నించి తిరిగి వస్తున్నాను. మీటింగ్ చాలా చీకాకు పెట్టింది, మనసు చిరాగ్గా ఉంది. అలవాటు చొప్పున రోడ్డెక్కగానే కార్ స్టీరియో ఆన్ చేశాను. ఆలత్తూర్ సోదరుల (కీ.శే. శివసుబ్రహ్మణ్య అయ్యరు, శ్రీనివాస అయ్యరు గారలు) గాత్రం నడుస్తున్నది. మాయామాళవగౌళ రాగంలో విదులకుమ్రొక్కెద అని త్యాగరాజస్వామి కృతి. ఓరి నా దేవుడా! ఏమి ఆ మాధుర్యం!! కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఈ సీడీలో ఇంకా రామా నీపై (కేదారం), కాంతా తవ (అఠాణా), చేరరావదేమిరా (రీతిగౌళ), బేహాగ్ తిల్లానా, విశ్వేశ్వర (సింధుభైరవి) ఉన్నాయి. అన్నీ అన్నే. గమ్యం చేరేలోపల మనసు తడిసి ముద్దయింది.

ఇక్కడో మాట చెప్పాలి. ఇప్పుడు సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతున్న సుధ రఘునాథన్, ఉన్నిక్రిష్ణన్, సంజయ్ సుబ్రహ్మణ్యం ఇత్యాదుల గాత్రాన్నీ బాగానే అభిమానించాను ఇన్నాళ్ళూ. కానీ ఈమధ్య మళ్ళీ వినడం మొదలు పెట్టినప్పటినించీ పాతతరం వారి గాత్రంతో పోలిస్తే వీళ్ళ గొంతుల్లో ఏదో .. ఇదీ అని చెప్పలేని ఒక లోటు. సంజయ్ సుమారు నలభై నిమిషాలపాటు బాగా విపులంగా పాడిన మాయామాళవగౌళ ఉన్నది నా దగ్గర. కానీ ఆలత్తూర్ సోదరులు పది పన్నెండు నిమిషాల్లో గుప్పించిన మాధుర్యం ఏదీ సంజయ్ గాత్రంలో? అటుతరంలోనూ ఇటుతరంలోనూ ఎవరో ఒకరిద్దరు గాయకుల గురించి కాదు, అసలు మొత్తానికి, ఆ తరం నించి ఈ తరానికి సంగీతంలో అంతర్గతంగా ఉన్న సహజలక్షణంలో ఏదో తెలీని మార్పు వచ్చింది. బహుశా గాయకుల తరాల మార్పో, శ్రోతల తరాల మార్పో, musical taste లో మార్పో - తెలీదు. ఓలేటి, సెమ్మంగూడి, ఎం డి రామనాథన్, నేదునూరి ఇత్యాదులు నచ్చినట్టు ఇప్పటివారు నచ్చటంలేదు. నచ్చకపోవడం కూడా కాదు - వీళ్ళనీ వింటూ ఆస్వాదిస్తూనే ఉన్నా రికార్డుల్లోనూ ప్రత్యక్ష కచేరీల్లోనూ. కానీ వీళ్ళ సంగీతం ఆ స్థాయి ఎక్కిరావట్లేదు అనిపిస్తోంది.

పాతతరంవారు ఎక్కువగా రికార్డు చెయ్యలేదు. కానీ ఈ మాత్రమైనా మిగిలి మనదాకా వచ్చినందుకు సంతోషిస్తున్నా.
అదండీ సంగతి. తీగలాగితే డొంకంతా కదిలింది.

Monday, June 13, 2011

సహనావవతు

ऊं सहना ववतु
सहनौ भुनक्तु
सहविर्यम् करवावहे
तेजस्विना वधीतम् अस्तु
मा विद विशावहै
ऊं शांति शांति शांति

ఓం సహనా వవతు
సహనౌ భునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు
మా విద్విషావహై
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః

పాఠం చెప్పుకునే ముందు గురుశిష్యులు చెప్పుకునే శాంతిమంత్రమిది.
భగవంతుడు మన ఇద్దరినీ రక్షించుగాక. మన ఇద్దరినీ వృద్ధి చేయుగాక. ఈ అధ్యయనానికి అవసరమైన శక్తి మన ఇద్దరికీ అబ్బునుగాక. మనం చదివేది మన ఇద్దరికీ వెలుగుని ఆపాదించు గాక. మన మధ్యలో విభేదాలు తలయెత్తకుండు గాక.
టూకీగా ఇదీ అర్ధం.

పాఠం, అధ్యయనం మాత్రమే కాదు, ఏ ఇద్దరు మనుషులు కలిసి మాట్లాడుకునే సందర్భమైనా ఈ ప్రార్ధన సముచితమే కాక, ఇప్పటి రోజుల్లో అయితే మరీ అవసరం కూడాను. ఆధునిక జీవితంలో మనుషుల మధ్య సంబంధాలు ఎలాగైనాయంటే - నేను చెబితే నువ్వు వినాలి, నేను గెలిస్తే నువ్వు ఓడాలి, నాది పైచెయ్యి నీది కింది చెయ్యి, నేను అంటాను నువ్వు పడు. ఉద్యోగ వ్యాపారాల్లోను, స్నేహాల్లోను, ఇంట్లో మనుషుల్తోను ఇదే తంతు.

తరవాత్తరవాత కాలం కొంచెం మారింది. కొత్త ఆలోచనలు బయల్దేరినై. వాణిజ్య లావాదేవీల్లోను, ఉద్యోగ శిక్షణల్లోను, మానవ సంబంధాల్లోను - Win win mentality, Active listening, Empathetic listening వంటి concepts ప్రాచుర్యం పొందుతూ వచ్చాయి. పూర్వకాలంలో నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందని సామెత. కానీ ఎంతటి వాడికైనా ఎల్లవేళలా నోరు అంతమంచిగా పెట్టుకోవడం సాధ్యమా? ఇద్దరు మనుషులు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటేనే ఇన్నేసి విభేదాలు తలెత్తుతున్నాయే, మరింక ప్రత్యక్షంగా కాకుండా ఫోన్‌లలో, ఈమెయిళ్లలో, మెసేజుల్లో, బ్లాగుల్లో .. ఎలా సాధ్యం? మన మనసులో ఏ దురుద్దేశం లేకపోయినా అవతల వినే వ్యక్తికి మనమాటలో ఏ విరుపు వినబడుతుందో, మనరాతలో ఏ వగరు కనబడుతుందో?

అప్పుడే అనిపిస్తుంది, ఈ మంత్రం ఇప్పటి జీవితంలో మరీ అవసరమని. మంత్రాన్ని మళ్ళీ ఒకసారి చదవండి. మంత్రార్ధాన్ని మననం చేసుకోండి. ఆ అర్ధాన్ని ధ్యానం చెయ్యండి.
మంచి జరగాలి అనుకుని ఊరుకోవడం కాదు - చెడు జరగకూడదని స్పష్టంగా వ్యక్తపరచడం ఎంత గొప్ప ఆలోచన అది. మనిద్దరం కేవలం బాగుండాలి అని కోరుకోవడమే కాదు. వృద్ధి పొందాలి. ఎదురుగా ఉన్న పని తేలికైనది కాదు, దాన్ని సాధించగలిగే శక్తి మాకు కలగాలి. అటుపైన ఆ చేసిన పని మా యిద్దరికీ వెలుగునివ్వాలి. నాకు నేను ఏమి కోరుకుంటున్నానో, నా ఎదురుగా ఉన్న వ్యక్తికికూడా మనస్పూర్తిగా అదే కోరుకుంటున్నాను. అంతరాంతరాల్లో ఈ నిజాన్ని పూర్తిగా జీర్ణించుకుంటే స్వ-పర భేదం మాయమవుతుంది. త్వమేవాహం.

ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః

Thursday, June 2, 2011

All about Bapu

బాపు 1
బాపు 2
బాపు 3

అందుకని అయ్యలారా అమ్మలారా ఒక్క పూటైనా వెళ్ళి బాపు బొమ్మల కొలువుని చూడండి. మీ మీ బుడుగుల్నీ సీగానపెసూనాంబల్నీ వెంటతీసుకెళ్ళడం మర్చిపోకండి. వచ్చే దార్లో కుంచెలూ రంగులూ కొనెయ్యడానికి సిద్ధంగా ఉండండి.

ఇంతచెప్పినా వెళ్ళకపోయారో, ది గ్రేట్ బాపిస్ట్ హిజ్ మోస్ట్ కలర్ఫుల్నెస్ అన్వర్ మహర్షులవారు మిమ్మల్ని శపిస్తారు!!

అంతదాకా రానివ్వడం ఎందుకు చెప్పండి. చక్కగా హాయిగా వెళ్ళొచ్చెయ్యండేం?