స్వరానంద హేల

మట్టికుండలాంటి మానవజన్మలో మనిషికి దైవత్వాన్ని చూపించేవి రెండే రెండు నా ఉద్దేశంలో - జీవన్ముక్తులైన మహామహుల విషయం కాదు, నా లాంటి మామూలు మనుషుల విషయంలో - ఒకటి ఇంకా ప్రపంచం తెలియని పసి పిల్లలు .. అందుకే మహానుభావులు దేవులపల్లి రాశారు, పిల్లలూ దేవుడూ చల్లని వారే అని.
రెండోది సంగీతం. అందునా కర్నాటక సంగీతం.

మన పూర్వులు మనకిచ్చి పోయిన అపారమైన సాంస్కృతిక వారసత్వ సంపదలో అతిగొప్ప రత్నం కర్నాటక సంగీతం. అట్లాంటిదే ఇంకో గొప్ప రత్నం మన సాంప్రదాయ కవిత్వం. తెలుగువారమై పుట్టి ఈ రెండు రత్నాలనీ రెండు కళ్ళకీ అద్దుకుని ఆస్వాదించలేకపోతే .. ప్చ్!

సంగీతం వినడం నేర్పినందుకు మా అమ్మకి ప్రతిరోజూ మొక్కుతుంటాను.

సాధారణంగా నాస్టాల్జియాకి లోనుకాను కానీ సంగీతం వినడం విషయంలో నాకు పాతరోజులే బావుండేవి. ఇంట్లో ఒక మంచి స్టీరియో ఉండేది. ఆఫీసులో ఒక వాక్‌మేన్ ఉండేది. నా సంగీతం అంతా కేసెట్లు, సీడీల్లోనే ఉండేది. ఇంట్లో ఉన్నంత సేపూ స్టీరియో మోగుతూనే ఉండేది. ఆఫీసులో డెస్కు దగ్గర ఉన్నంత సేపూ కేసెట్ మార్చి కేసెట్ మోగుతూనే ఉండేది. ఫలితంగా మనసు సంతతమూ స్వరానందహేలలో ఊయలూగుతూ ఉండేది. మేలుకుని ఉన్న సమయంలో 50 శాతానికి మించిన సమయం సంగీతం వింటూ ఉండేవాణ్ణి అంటే అతిశయోక్తి కాదు.

అట్లాంటిది కొన్నేళ్ళుగా జీవితంలో విపరీతమైన సంగీత లేమి ఏర్పడింది. సంగీతం వినిపించే వస్తువులు, వినే పద్ధతులు తామర తంపరగా, ఎటు తల తిప్పితే అటు ప్రత్యక్షమయ్యే ఈ రోజుల్లో ఇలాంటి లేమి విచిత్రమే గాక మనసుని కుంగదీసేదిగా తయారైంది. నాకెందుకనో నెట్‌లో సంగీతం వినడం అచ్చిరాలేదు. MP3 ప్లేయర్లు, సెల్‌ఫోనులో ప్లేయర్లు కూడా తలకాయనొప్పినే తెచ్చి పెట్టాయి.

ఇహ ఇది పద్ధతి కాదని ఒక ప్రాజెక్టుగా పెట్టుకుని ఉన్న కర్నాటక సంగీతం సీడీలన్నీ అంకోపరిలోకి ఎక్కించాను ముందు. అటుపైన ఒకటి రెండు చిన్న సీడీ వాలెట్లు కొని కార్లో పెట్టుకుని కారెక్కినప్పుడల్లా కచ్చితంగా వింటున్నాను. అలా పూర్వవైభవంతో కాకపోయినా కొద్దిస్థాయిలోనైనా మళ్ళీ సంగీతం నా జీవితంలోకి ప్రవహిస్తూన్నది ప్రస్తుతం.

ఇంతకీ ఇప్పుడు ఈ సోదంతా ఎందుకంటే, ఇవ్వాళ్ళ ఒక కస్టమరు మీటింగ్ నించి తిరిగి వస్తున్నాను. మీటింగ్ చాలా చీకాకు పెట్టింది, మనసు చిరాగ్గా ఉంది. అలవాటు చొప్పున రోడ్డెక్కగానే కార్ స్టీరియో ఆన్ చేశాను. ఆలత్తూర్ సోదరుల (కీ.శే. శివసుబ్రహ్మణ్య అయ్యరు, శ్రీనివాస అయ్యరు గారలు) గాత్రం నడుస్తున్నది. మాయామాళవగౌళ రాగంలో విదులకుమ్రొక్కెద అని త్యాగరాజస్వామి కృతి. ఓరి నా దేవుడా! ఏమి ఆ మాధుర్యం!! కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఈ సీడీలో ఇంకా రామా నీపై (కేదారం), కాంతా తవ (అఠాణా), చేరరావదేమిరా (రీతిగౌళ), బేహాగ్ తిల్లానా, విశ్వేశ్వర (సింధుభైరవి) ఉన్నాయి. అన్నీ అన్నే. గమ్యం చేరేలోపల మనసు తడిసి ముద్దయింది.

ఇక్కడో మాట చెప్పాలి. ఇప్పుడు సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతున్న సుధ రఘునాథన్, ఉన్నిక్రిష్ణన్, సంజయ్ సుబ్రహ్మణ్యం ఇత్యాదుల గాత్రాన్నీ బాగానే అభిమానించాను ఇన్నాళ్ళూ. కానీ ఈమధ్య మళ్ళీ వినడం మొదలు పెట్టినప్పటినించీ పాతతరం వారి గాత్రంతో పోలిస్తే వీళ్ళ గొంతుల్లో ఏదో .. ఇదీ అని చెప్పలేని ఒక లోటు. సంజయ్ సుమారు నలభై నిమిషాలపాటు బాగా విపులంగా పాడిన మాయామాళవగౌళ ఉన్నది నా దగ్గర. కానీ ఆలత్తూర్ సోదరులు పది పన్నెండు నిమిషాల్లో గుప్పించిన మాధుర్యం ఏదీ సంజయ్ గాత్రంలో? అటుతరంలోనూ ఇటుతరంలోనూ ఎవరో ఒకరిద్దరు గాయకుల గురించి కాదు, అసలు మొత్తానికి, ఆ తరం నించి ఈ తరానికి సంగీతంలో అంతర్గతంగా ఉన్న సహజలక్షణంలో ఏదో తెలీని మార్పు వచ్చింది. బహుశా గాయకుల తరాల మార్పో, శ్రోతల తరాల మార్పో, musical taste లో మార్పో - తెలీదు. ఓలేటి, సెమ్మంగూడి, ఎం డి రామనాథన్, నేదునూరి ఇత్యాదులు నచ్చినట్టు ఇప్పటివారు నచ్చటంలేదు. నచ్చకపోవడం కూడా కాదు - వీళ్ళనీ వింటూ ఆస్వాదిస్తూనే ఉన్నా రికార్డుల్లోనూ ప్రత్యక్ష కచేరీల్లోనూ. కానీ వీళ్ళ సంగీతం ఆ స్థాయి ఎక్కిరావట్లేదు అనిపిస్తోంది.

పాతతరంవారు ఎక్కువగా రికార్డు చెయ్యలేదు. కానీ ఈ మాత్రమైనా మిగిలి మనదాకా వచ్చినందుకు సంతోషిస్తున్నా.
అదండీ సంగతి. తీగలాగితే డొంకంతా కదిలింది.

Comments

రవి said…
దైవత్వం చూపించేవి చాలా ఉన్నాయండి. వర్షం, మౌనం, సూర్యుడు, చంద్రుడు, అన్నం పెట్టే అమ్మ(ల) చేతులూ, ఇలా ఎన్నో...

పోనీలెండి. రెండిటిని చూపించారు. మొదటి విషయంలో ఏకీభవిస్తున్నాను. రెండవ విషయంలో నాది వెనుకబడిన తరగతి. నాకు మౌనంలోనే సంగీతం ఎక్కువగా వినిపిస్తుంది. :) అయితే సెమ్మంగుడి వారి కీర్తనలు విన్నాను.
తృష్ణ said…
అద్భుతంగా సెలవిచ్చారు. మహోన్నతమైన శాస్త్రీయసంగీత సాగరంలో మునిగితేలడానికి కూడా అదృష్టం ఉండాలండీ. మంచి గురువుగారి దగ్గర నేర్చుకునే అవకాశం వచ్చినా కూడా సగంలోనే ఆపేయాల్సి రావటం నా దురదృష్టం...అని ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను. అప్పుడు విలువ తెలీదు. ఇప్పుడు నేర్చుకుందామన్నా ఆ గురువుగారు అందుబాటులో లేరు..:(

ఆనందించండి.
shyam said…
ఆ పాట కృష్ణశాస్త్రిగారు రాసిందేనా?
pi said…
Havమీరు మల్లాది సోదరుల సంగీతం విన్నారా? వీళ్ళూ నేదునూరి వారి శిష్యులు. క్రితం సంవత్సరం, ఖరహరప్రియ పాడేరు. I cant describe the feeling I had at that time."
బాగుందండీ.. రవిగారు అన్నట్లు దైవత్వాన్ని చూపించేవి చాలా ఉన్నా మీరుచెప్పిన రెండూను ప్రముఖమైనవని చెప్పచ్చేమో.. నా పరిస్థితి చాలా చిత్రమైనదండీ.. శాస్త్రీయ సంగీతాన్ని పూర్తిగా విననూలేను అలా అని వినకుండానూ ఉండలేను.. బహుశా మీరంటున్న గాత్రమాధుర్యం ఒకకారణమేమో ఈ సీడీ దొరుకుతుందేమో ప్రయత్నించాలి.
ఈ కాలం వారు పాడే శాస్త్రీయ సంగీతంలో మాధుర్యం పాళ్ళు ఎంచేతనో కొద్దిగా తక్కువే. రికార్డింగ్ సదుపాయాలు, సాధనాలు ఇంతగా పెరిగిన నేపధ్యంలో గొంతుల్లో కూడా ఏదో యాంత్రికత పెరిగి ఉంటుందంటారా?

మంచి టపా. :)
రవి, తొలివాక్యంలో దైవత్వాన్ని గురించి నేను చేసిన ప్రకటనకి అర్ధం మీకు తెలియకుండా ఉన్నదని నేను అనుకోను. అదలా ఉండగా కర్నాటక సంగీతం వినడం మొదలుపెట్టండి. మీ సాహిత్య అభిమానానికి ఇది కూడా జోడైతే బహుపసందు.

తృష్ణ .. నిజం నిజం. నేర్చుకోలేకపోయినందుకు చాలా కాలం విచారిస్తూ గడిపాను. విని ఆస్వాదించ గలుగుతున్నందుకు ఇప్పుడు ఆనందిస్తున్నాను.

శ్యాం. అవును.

pi, మల్లాది సోదరులని విన్నాను. వీళ్ళ క్వాలిటీ కొంచెం సైన్ కర్వ్‌లా ఉంటుంది. కొన్ని రికార్డింగులలో అద్భుతంగా పాడారు. నేను విన్న ప్రత్యక్ష కచేరీల్లో వీళ్ళ స్కోరు 50%

వేణూశ్రీకాంత్, కొద్దిగా అభిరుచి ఎలాగూ ఉన్నది కాబట్టి దీని మీద ఇంకా పెంపొందించడానికి ప్రయత్నించండి. వినడంలో మీరు వెచ్చించే ప్రయత్నానికి కొన్ని వందల రెట్లు ఆనందం మీకు దొరుకుతుంది. నాదీ హామీ.

కొత్తావకాయ .. హమ్మ్, నిజమే. కానీ తప్పు టెక్నాలజీది అనుకోను. ఇలా పాడితే చాలు, ఇంతకు మించి పాడక్కరలేదు. ఇలా పాడితేనే జనం మెచ్చుతున్నారు - ఇట్లాంటి భావాలు ఇండస్ట్రీ వ్యాప్తంగా పాతుకుంటున్నట్టు ఉన్నాయి.
ఇందు said…
సర్! లలితకళలు ఉన్నదే మనసుకి స్వాంతన చేకూర్చి...ఉత్తేజాన్ని కలిగించడానికి కదా! ఎంత బాధలో ఉన్నా....మనసుకి నచ్చిన పాట వింటే...ఇట్టే తేలికైపొతుంది...అదేం చిత్రమో! దీనికి సంగీతం నేర్చుకోలేకపోయినా కనీసం ఆస్వాదించే మనసన్నా ఉన్నందుకు సంతోషించాలి :) ఈ కాలంలో అది కూడా చాలా మందికి ఉండట్లేదు కదా! :)) ఏదేమైనా మంచి పోస్ట్! :)
శ్రీ said…
శాస్త్రీయ సంగీతం నాకు పెద్దగా అర్థం కాదు, నేర్చుకునే ప్రయత్నం చెయ్యాలి. మా మేనకోడల్లిద్దరూ (బొజ్జా సిస్టర్స్) కాళహస్తిలో, తిరుపతిలో అన్నమయ్య కీర్తనలు పాడుతూ ఉంటారు. దియాతో పాటు నేను కూడా నేర్చుకుంటా.
shyam said…
కాదు.
చిత్రం: లేత మనసులు. రచన: ఆరుద్రగారు.
శ్రీ, మీ మేనకోడళ్ళు పాడుతున్నందుకు చాలా సంతోషం. మీరూ నేర్చుకోండి తప్పక. ఐనా విని ఆస్వాదించేందుకు నేర్చుకోవలసిన పని లేదు.

శ్యాం, నిజమా? ఇది దేవులపల్లి పాట అనే అనుకుంటూ వచ్చాను. మీరేమో ఆరుద్ర అంటున్నారు. కావచ్చు.
Sanath Sripathi said…
పిల్లలూ దేవుడూ చల్లని వారే (లేతమనసులు) - రచన ఆరుద్ర.
మురళి said…
బాగుందండీ
గమ్యం చేరేలోపల మనసు తడిసి ముద్దయింది.
ఈ వాక్యం బాగా నచ్చింది..
Anonymous said…
commercialization of minds అనేది కారణం అనుకుంటున్నాను కొత్తపాళి గారు. పాతతరం వారు సంగీతమే జీవితంగా బ్రతికినవారు. ఈ తరం గాయకులకు సంగీతం అంటె జీవితంలో ఒక భాగం మాత్రమే.(however talented they may be). నేదునూరి వంటి గురువులు ఆ స్వచ్చమైన సంగీత విద్యను కొనసాగటానికి ఎంతో తపన పడుతున్నారు. అదే స్థాయిలో స్పందించే శిష్యులు కరువైనారు.
శ్యాం, సనత్ - ఆరుద్రే ఖాయం అంటారా? ఐతే వోకే. నెనర్లు చెప్పినందుకు.

మురళిగారు, కర్నాటక సంగీతంతో నాకు ఎప్పుడూ ఉన్నదే ఇది. మనసు మాత్రం ముద్ద అయితే పరవాలేదు. ఒక్కోసారి కళ్ళు కూడా అప్రయత్నంగా వర్షిస్తాయి.

Anon .. ఏమోమరి, కావచ్చు. ఏదో చెప్పరాని లోటు మాత్రం స్పష్టంగా
తెలుస్తున్నది నాకు.
నిజమండీ, శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేకపోయినందుకు నేనెప్పుడూ బాధపడతాను. ఇప్పటికీ నేర్చుకుందామా అనే అనిపిస్తుంది. కానీ ...ఏదో జంకు.
శాస్త్రీయ సంగీతంలో అదీ కర్నాటక సంగీతంలో నాక్కావలసింది ఏదో ఉందనిపిస్తుంది. శివశంకరీ..శివానందలహరి.., రసికరాజ తగువారముకామా, శంకరాభరణం , స్వాతికిరణం పాటలూ స్వరయుక్తమైన సినిమా పాటలన్నీ మాత్రమే కాక ముద్దుగారే యశోద ..అన్నమయ్య కీర్తనల్లో రసాస్వాదన చేయగలిగినప్పుడు పూర్తిస్థాయి శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే ...అన్న ఆలోచన వస్తూనే ఉంటుంది.
"కర్నాటక సంగీతంలో నాక్కావలసింది ఏదో ఉందనిపిస్తుంది."
ఈ మాత్రం ఫీలయ్యారంటే, మీరు సినిమా శాస్త్రీయ సంగీతపు పాటల్ని అధిగమించి సిసలు సంగీతంలో మునక వెయ్యాల్సిందే! ధైర్యం చేసి, ముక్కు పట్టుకుని ఆ ప్రవాహంలో దూకెయ్యండి!:)
Anwartheartist said…
చాలా వాటి గురించి తెలియదు, తెలుసుకొవాలని రూలు లేదు కదా అని జీవితం సాగుతూనే వుంటుంది, ఇదిగొ మధ్యలొ ఇలాటి పొస్ట్లు చూసి బెంగ పుట్తది. ఎంత బెంగెట్టుకున్నా ఏం లాభం?? ఎలక తొలు నాది.
Anonymous said…
కొత్తపాళీ గారూ,
శాస్త్రీయ సంగీతాన్ని ఆస్వాదించే ఒడుపు తెలుసుకోవాలని ఎన్నాళ్ల గానో నాకో బాధ ఉండిపోయింది. కొందరు సంగీతఙ్ఞుల్ని అడిగితే అదొక ఆర్టు పుట్టుకతో వినికిడిలో స్వరాల్ని గుర్తుపట్టగలిగే నేర్పు ఉండాలి గాని నేర్చుకుంటే వచ్చేది కాదనేశారు. మీరైనా ఎలా మొదలెట్టాలో చెప్పండి. స్వరఙ్ఞానం కలిగి వింటున్నది మెచ్చేస్థితికైనా రావాలని కోరిక.
@అన్వర్, వింటూ ఉండడమే, ప్రయత్నిస్తూ ఉండడమే. ఎక్కడో ఓ చోట క్లిక్కవుతుంది.

@ పక్కింటబ్బాయి - సంగీతం సృష్టించాలంటే స్వరజ్ఞానం కావాలి గాని, విని ఆస్వాదించడానికి అక్కర్లేదు. శాస్త్రీయ సంగీత ఆస్వాదన కొంచెం అభ్యాసం చేస్తే అలవాటవుతుంది. ఆస్వాదించడం ఎలా అని కొన్ని వరుసటపాలు రాయాలని ఉన్నది, కానీ ప్రస్తుతానికి వీలు పడేట్టు లేదు. ఈ లోపల మీ మిత్ర బంధు వర్గాల్లో సంగీతం వినే అలవాటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో గమనించండి. నెట్లోనో, మరో విధంగానో మీకు అందుబాటులో ఉన్న సంగీతం వింటూ ఉండండి.
ఈ విషయం గురించి మళ్ళి మాట్లాడుదాం.