తోట

పోయినేడు కొంచెం నిర్లక్ష్యంగా చేసిన వ్యవసాయం ఉత్సాహం కలిగించే ఫలసాయం ఇవ్వడంతో ఈ సారి కొంచెం పెద్దయెత్తున, మరికొంచెం శ్రద్ధా శ్రమా పెట్టి చేద్దామని నిశ్చయించాను. ఏదీ జూన్నెల దాకా పరిస్థితి వెచ్చబడనిదే. అక్కడికీ నేలని పోయినేడే చదును చేసి ఉంచాను కాబట్టి వెచ్చబడంగానే నాట్లు వెయ్యడమే. ఈసారి టొమేటోల్ని వెరైటీగా తలకిందుల ప్లాంటర్స్‌లో వేలాడ దీశాను. ఇదెలా వస్తుందో చూద్దామని కుతూహలం కొంతైతే, అసలే ఉన్న నేల కొంచెమే గదా, టొమేటోలొ ఖాళీ చేసిన జాగాలో వేరే మొక్కలు వెయ్యొచ్చుగదాని స్థలపీనాసిత్వం కొంత. నేలలో - వంగ, బెండ, మిరప, యెల్లో స్క్వాష్, జుకీనీ (ఇవన్నీ మొక్కలు కొన్నాను), గోంగూర, దోస, బీర, బటాణీ, చిక్కుడు, చుక్కకూర, తోటకూర (ఇవన్నీ విత్తులు నేరుగా నేలలో నాటినవి).





గోంగూర చాలా నిరాశ పరిచింది. ఎన్నో విత్తనాలు నాతితే అరడజను మొక్కలు కూడా పైకి రాలేదు, బహుశా పాత విత్తనాలు అవడం వలన కావచ్చు. ఐనా అడపాదడపా పప్పుకి సరపడా కాస్తూనే ఉన్నది. వంగ మొక్కలు బాగా యేపుగా ఎదిగాయి, మొదటి తడవ బగా కాశాయి కూడా. ఆ తొలితొందర చల్లబడ్డాక, పూతలు కాపులూ కూడ చల్లబడిపోయాయి - వారానికో రెండు కాయలు కాస్తూ వచ్చాయి. బెండ అసలు మరీ జోకు. ఉన్నవే నాలుగు మొక్కలు - ఒక్కొక్కటీ ఒక్క సారికి ఒక్క కాయతప్ప కాయను అని ఒట్టు పెట్టుకుని మరీ పుట్టినట్టున్నాయి. నాలుగేసి బెండకాయల్ని ఏమి చేసుకోవాలి? యెల్లో స్క్వాషు, జుకినీ, చెరొక మొక్కే అయినా బాగా కాశాయి. వీటి మీద ఎప్పుడైనా మినిమం గేరెంటీ - నీళ్ళు పోస్తే చాలు, కల్పవృక్షంలాగా కాస్తూనే ఉంటాయి. 



గోంగూరలాగానే బాగా నిరాశపరిచింది టొమేటో. త్రిశంకుస్వర్గంలాగా తలకిందులుగా వేలాడదిశ్తావా, హన్నా అని బిగదీసుక్కూర్చున్నాయి. మొత్తం సీజన్‌కీ కిలో కూడ రాలేదు!  వచ్చే యేడు త్రిశంకు కేన్సిల్.

బటాణీలనీ చిక్కుళ్ళనీ ఇంకా పిందెలు వేస్తున్న సమయంలోనే లేళ్ళు సుబ్బరంగా తినేశాయి. వాటికి చుక్కకూర నచ్చలేదు కామాలు. ఆకుల్ని ముట్టుకోలేదు గాని ఆకుమడి ముందుకి ఉండడంతో తొక్కి తొక్కి పెట్టాయి. తోటకూర సీజనంతా విరివిగా కాస్తూనే ఉన్నది. మిరప మొక్కల్తో ఇంకో జోకు. నేను కొన్నప్పుడు అవన్నీ రకరకాల బెల్ పెప్పర్లు (కేప్సికం) అనుకున్నా. తీరా ఒక్క మొక్క మాత్రం మామూలు గ్రీన్ బెల్ పెప్పర్. మిగతావన్నీ హంగేరియన్ పెప్పర్ అనే ఒకే రకం. అవన్నీ విరివిగా కాశాయి. సీజన్ మొత్తం జుకినీ లాగానే ఇవికూడ విరివిగా కాస్తూనే ఉన్నాయి. ఏం చేసుకోవాలో తెలియక అత్తయ్యగారు వీటితో రకరకాల కాయల కాంబినేషన్‌లో కూరలు కనిపెట్టారు. ఇంక దోసపాదులు. పెరగడం మాత్రం కనులపండువుగా పెరిగాయి చిలవలు పలవలుగా సాగి. కానీ సెప్టెంబరు నెల మధ్య దాకా అసలు ఎక్కడా మొగ్గ కూడా కనబళ్ళేదు. నెలాఖరుకి కొన్ని కాయలు కాశాయి. ఇంతలో అకస్మాత్తుగా చలి వచ్చేసింది. ఇంకేముంది, అయిపోయింది అనుకున్నా.




అమ్మా అప్పుడే మిమ్మల్ని చలికౌగిళ్ళకి ఒదిలేస్తానా అని భానుడూ కళ్ళెర్రజేశాడు. దాంతో మళ్ళీ గత పదిరోజులుగా పగలు 70 - 80 మధ్యలో ఊగిసలాడుతున్నది ఉష్ణోగ్రత. పాపం మొక్కలు కంఫ్యూజన్‌లో పడ్డాయి. చాలా మొక్కలు చేతులెత్తేశాయి, కానీ దోసపాదులూ, వంగ మొక్కలూ, మిరపమొక్కలూ పూర్తిగా ఆశ వొదులుకో లేకుండా ఉన్నాయి. ఇంకా తలా ఒక కిలో కాయలు ఇస్తాయేమో! చూద్దాం. 

ఏదేమైనా మనచేత్తో మనం పండించుకున్న తాజా కూరల రుచే వేరు. 

Comments

రవి said…
మా ఇంట్లో టమోటోలు విజయవంతమయ్యాయి. కొబ్బరి చెట్టు క్రితం యేడాది కాండం లోపల నల్లబడి పురుగుపడితే ఇంజెక్షను వేయించి, ఉప్పు నీళ్ళు చల్లుతూ వచ్చాము. ఈ యేడాది ఏభై కాయలొచ్చాయి.

చివరి వాక్యంతో అర్జెంటుగా ఏకీభవిస్తున్నాను. కర్వేపాకు పచ్చడి మా ఇంటి కర్వేపాకుతో చేస్తే అమృతంలా ఉంది.
రసజ్ఞ said…
ఆహా ఎంత చక్కగా చెప్పారో మా ఇంట్లో పనస చెట్టుది కాయ పొట్టు కొట్టి ఆవపెట్టి కూర చేస్తే ఆ రుచే వేరు తొనలు కూడా ఎంత తియ్యగా ఉంటాయో! ఆఖరి వాక్యంతో నేను కూడా ఏకీభవిస్తున్నా అన్నీ ఇంట్లోనివి అయితే ఆ తృప్తే వేరు! మా ఇంట్లో కాయలతోనే అమ్మ ఊరగాయలు పెడుతుంది అలా పెట్టినవే ఆవకాయ, మాగాయ, కరివేపాకావకాయ, పెసరావకాయ, వంకాయ, టొమాట, గోంగూర, నిమ్మ, దోస ఆవకాయ, ఉసిరికాయ అన్నీను! మీ టపా చూసేసరికి ఒక్కసారి అలా మా పెరడు నా జ్ఞాపకాలని తట్టి లేపింది. ధన్యవాదాలు!
కొత్తపాళీగారు,,

మీరు హైదరాబాదులో ఉండి ఇలాగే పుస్తకాలు చదువుతూ పరిచయం చేస్తూ, కూరగాయలు పెంచుతుంటే ఎంత బాగుండు.. అఫ్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి బోల్డు పుస్తకాలు, కొన్ని కూరగాయలు తీసికెళ్లేవాళ్లం కదా.. ఒకపని చేయండి. హైదరాబాదులో ఓ వెయ్యి గజాలు కొనేసి ఇల్లు కట్టేయండి. కనీసం రిటైరయ్యాక ఇక్కడికొచ్చి సెటిల్ అవ్వంఢి. అప్పుడు మా ఈ కోరిక తీరుతుందేమో..:)))
మీ పెరడంతా తిప్పి చూపించేశారు. మాకీసారి గొంగోర చాలా బాగా వచ్చింది. టమాటోలు ఓ నాలుగు కిలోలు కాయలు కాశాయి ఆ తరువాత అదేదో పురుగు పోయినసారి లానే. బంతి పూలు చూసి తీరాలి అంత బాగా పూశాయి. తోట కబుర్లు పచ్చపచ్చగా బావున్నాయి...ధన్యవాదాలు.
Anonymous said…
ఎప్పుడో మా అత్తయ్య వాళ్ళ అత్తారింట్లో రోజూ తోటలో తాజాకూరగాయలు కోసుకొచ్చి వండేవారని, అప్పుడప్పుడూ మా ఇంటి(సొంతూర్లో) చుట్టూ ఉన్న పాదుల్లో కాయలు తాజా తాజాగా కోసి వండేవారమనీ ఇప్పటికీ మా అమ్మ చెప్పడం మేం లొట్టలు వేయడమే గానీ ఆ భాగ్యానికి నోచుకోలేదు ఈ ఇరుకిరుకు ఇళ్లలో. కొంచం వెసులుబాటుదొరికితే కొన్ని కాయగూరలైనా పండించుకోవాలని నాకూ, మా నాన్న గారికీ కోరిక. దానికి ఆజ్యం పోశారు మీరు.
శ్రీ said…
మా ఇంట్లో చిన్నపుడు మునక్కాయలు, సొరకాయలు బాగా పండేవి. మా అయ్యవార్లకి మునక్కాయలు, సొరకాయలు సమర్పించుకునేవాళ్ళం.

మీ కూరగాయల కబుర్లు బాగున్నాయి.
Vasu said…
దోసకాయలు చూస్తే వెంటనే పచ్చడి తినాలనిపిస్తోంది.

"ఏదేమైనా మనచేత్తో మనం పండించుకున్న తాజా కూరల రుచే వేరు. "
మొన్న విస్కాన్సిన్ లో కూరగాయలు ఫారం లో కెళ్ళి కోసుకుని తెచ్చుకున్నాం. రుచి భలేగా ఉన్నాయి. ఇక మనం పెంచుకున్నవంటే ఇక చూసుకో అక్కర్లేదు.
chavera said…
దీపావళి శుభాకాంక్షలు.
good produce for the festival.
Mohan
ఉమ said…
అమెరికాలోనూ ఆంధ్రా సేద్యం బానే చేస్తున్నారు. బావున్నాయ్ మీ తోట మాటలు.
Tejaswi said…
నారాయణస్వామిగారూ,

నమస్కారం. ఇవాళే మీ స్పందన చూశాను. నా బ్లాగులోకొచ్చి స్పందించినందుకు చాలా సంతోషం...ధన్యవాదాలు. మీరు సూచించినట్లే మరింత తరచుగా టపాలు రాయడానికి ప్రయత్నిస్తాను. సంగీత, సాహిత్యాలలో మీ పరిజ్ఞానానికి నేను అభిమానిని. స్వాతి తిరునాళ్ యొక్క 'అలివేణీ ఎంద చెయివు' పాట గురించి మిమ్ములను ఒకసారి అడిగి(మీ బ్లాగులో వ్యాఖ్యద్వారా) సందేహనివృత్తి చేసుకున్నాను...మీకు గుర్తుందో, లేదో.

I will be glad, if you give any suggestions.
Ennela said…
మేము మరీ దూరం కాదు, కొన్ని ఇటు పడెయ్యొచ్చు కదా!!!
బలే బావుంది మీతోట. నేనూ ఈ మధ్యనే మొదలెట్టా ఈ కార్యక్రమం. నా చిన్ని పెరటిలో చిక్కుడు, బచ్చలి వేసాను. బచ్చలి విరగ్గాస్తోంది. చిక్కుడు ఇంకా ఎదగాలి. మన చేత్తో వేసే వాటి రుచి గొప్పగా ఉంటుంది అంతేకాదు మన చేత్తో వేసిన మొక్కలు ఏపుగా ఎదిగితే న్న తృప్తి, ఆనందం రూటే వేరు. :)
ఇక్కడ కామెంటిన అందరికీ నెనర్లు. కొన్నాళ్ళుగా బ్లాగు సంగతి పట్టించుకోవడంలేదు - క్షంతవ్యుణ్ణి. ఇవ్వాళ్ళ సౌమ్యగారి తాజా వ్యాఖ్యతో మెలకువ వచ్చింది. వెనకనించి సమాధానాలు.
సౌమ్య - ఏమ్మా, మాకిక్కడ శీతాకాలం వణికించడానికి కంకణం కట్టుకుని చుట్టుముడుతూ ఉంటే మీరిలా విరివిగా పెరుగ్తున్న బచ్చలికూర గురించి చెప్పడం ధర్మమేనా? వచ్చే ఏడయినా బచ్చలి విత్తులు సంపాయించి వెయ్యాలి.
ఎన్నెల, పచ్చికూరగాయల్ని సరిహద్దు దాటించడం నేరమని తెలియదా? మీరు ఇటొస్తే ఆ పూట కాసిన వాటితో ఏదన్నా వండిపెడతాం - దానికైనా ఇప్పుడూ వచ్చే వేసవిదాకా ఆగాల్సిందే!
తేజస్వి - నెనర్లు. ఈ పాటగురించి రాయాలండీ. మనసులో సుడులు తిరుగుతోంది. రాస్తాను.
ఉమ, నా సేద్యం ఏముందిలేండి, నన్ను తలదన్నేట్టుగా చేస్తారు, కొందరు అమెరికన్లూ తెలుగు వాళ్ళు కూడా.
చవేరా, వాసు, శ్రీ, నెనర్లు
పక్కింటాబ్బాయి, తప్పక ప్రయత్నించండి. చాలా తృప్తిగా ఉంటుంది.
జ్యోతిర్మయి, సంతోషం. అన్ని మొక్కల్నీ ఆకులు పరీక్షిస్తూ ఉండాలి. పసుపు కారము కలిపిన నీళ్ళని పిచికారీ చేసి చాలా మట్టుకి పురుగుల్ని పారదోలవచ్చు.
జ్యోతి, హైదరాబాదులో ఈ మాత్రం పండించే స్థలం ఉండుంటే ఓ పిల్లజమీందారునైపోయేవాణ్ణి కాదూ!
రసజ్ఞ, రవి, నెనర్లు. సంతోషం.
భలే బావుందండీ.. మీ వ్యవసాయం, ఫలసాయం.. :)