త్రిపురతో ఓ సాయంత్రం

ఇంచుమించు పదేళ్ళ కిందటి సంగతి.

విశాఖపట్టణంలో ఒక వారంరోజులున్నాను. పెద్దగా పనేమీ లేదు. అందుకని రచయితలనీ, కవులనీ వెతికి వెతికి పట్టుకుని వెళ్ళి కలిసి ముచ్చటించడం ఓ హాబీగా ఉండేది.

ఒక పూట హైదరాబాదులో ఉన్న ఒక రచయిత మిత్రునితో మాట్లాడుతూ విశాఖలో ఉన్నానని చెప్తే (అతనికి నా హాబీ గురించి తెలుసు) త్రిపురగారిని కలిశారా అని అడిగారు. లేదు, ఆయన అక్కడెక్కడో అస్సాం వేపున కదా ఉండేది అన్నాను. లేదు లేదు రిటైరయినాక విశాఖ వచ్చేశారు అనిచెప్పి ఫోన్నెంబరు ఇచ్చారు.

అప్పటికి త్రిపుర రచనలు, ముఖ్యంగా కవిత్వం, కొంత చదివున్నా.కానీ ఏదీ పెద్దగా గుర్తు లేదు. ఆయన శైలి చాలా విలక్షణంగా ఉంటుందని మాత్రం గుర్తు.

కాల్ చేశా. ఆయనే ఎత్తారు. నేను ఫలానా అండీ అని ప్రవర చెప్పుకున్నా. ఐతే ఏంటి అన్నట్టు కళ్ళెగరేశారు, ఫోనులోనే. మిమ్మల్ని కలవాలి అన్నా. ఇవ్వాళ్ళ కుదరదు, ఎవరో బంధువులొస్తున్నారు. కావాలంటే రేపు రా, సాయంత్రం ఆరింటికి, ఒక అరగంట మాట్లాడుకోవచ్చు అన్నారు.

అయ్యబాబోయ్, ఈయన పద్ధతి నిర్మొహమాటమే కాదు, చాలా నిక్కచ్చి అల్లే ఉన్నదే అనుకున్నా. ఐనా, బొక్కిందే దక్కుడని మర్నాడు టంచనుగా సాయంత్రం ఆరింటికి వారి ఫ్లాటు ద్వారం ముందు నిలబడ్డాను. ఆయనే తలుపు తెరిచి లోపలికి ఆహ్వానించారు. సుమారు ఐదడుగుల ఆరంగుళాల ఎత్తు. వయసుతో కాస్త బొజ్జ వచ్చిందిగానీ పల్చటి శరీరం. బట్టతల, నెరిసిన పిల్లిగడ్డం (గోటీ), పదునైన చూపులు. నాకేసి కొంచెం అనుమానంగానే చూస్తూ సోఫాలో కూర్చోమన్నారు. మెల్లగా కబుర్లు మొదలెట్టాం. ఏం మాట్లాడుకున్నామో నాకిప్పుడు స్పష్టంగా గుర్తులేదు - కానీ తెలుగు సాహిత్యాన్ని గురించి, ఆయన రచనల్ని గురించి మాత్రం కాదు. బహుశా నా అమెరికా అనుభవాలని గురించీ ఆయన ఉద్యాగాలు చేసిన వివిధ ప్రదేశాల అనుభవాలని గురించీ కావచ్చు. వారి శ్రీమతి భాగ్యలక్ష్మి గారు కూడా మంచి పండితురాలు. ఈశాన్య రాష్ట్రాల్లో చాలాకాలం ఉండడంతో బెంగాలీ బాగా నేర్చుకున్నారు. కొన్ని బెంగాలీ సమకాలీన కథల్ని తెలుగులోకి అనువదించారావిడ. ఆవిడ కూడా మాతో వచ్చి కూర్చున్నారు. త్రిపురగారికి కారా కిళ్ళి అలవాటు, కారా మాస్టారికి లాగానే. గంటకో కొత్త కిళ్ళీ దవడలో బిగిస్తూ ఉంటారు. కానీ కారా మాస్టారూ ఈయనా మిగతా అన్ని విషయాల్లోనూ ఉత్తర - దక్షిణ ధృవాలు అనుకోవచ్చు.

నాకు త్రిపురగారు ఇచ్చిన సమయం అరగంటే అయితే ఆయన గంటకోసారి కొత్త కిళ్ళీ బిగిస్తారని నాకెలా తెలుసా అని మీకు సందేహం వచ్చింది - నాకు తెలుసు మీరు చాలా సూక్ష్మబుద్ధి కలవారని.
అదే చెప్పవస్తున్నా. మొదట అరగంట చాల్లే అని మొదలయిన సమావేశం అలా హాయి హాయిగా కొనసాగి, ఎనిమిది దాటింతరవాత, ఎలాగా భోజనాల వేళయింది, భోంచేసి వెళ్దువులే అని ఆపేశారు భార్యాభర్తలిద్దరూ. కాదనలేక పోయాను. నేను బయటపడేప్పటికి పది!
ఏం మాట్లాడుకున్నామో గుర్తు లేదు, కానీ ఎప్పటికి మరిచిపోలేని సాయంత్రాల్లో ఒకటి అది.

త్రిపుర కథలు చాలా కాలంగా ప్రింటులో లేవు.
కినిగె ఇప్పుడు అందుబాటులోకి తెచ్చింది ఈ పుస్తకంగా. మీకోసం!

Comments

Anonymous said…
thanks for the information about the book.
TTN said…
I first accidentally read a story by Tripura when I was in intermediate in 1977 . The story was Hotello.While removing the waste papers from the huge box in my house, an old copy of Bharati, which carried the story, caught hold of my attention. I grabbed it and found Tripura's Hottello very interesting. The story was a visual feast. it has been my practice to observe people in hotels and other place ever since.