తెలుగు పాఠం - నుడికారం

ఈ వారం కొత్తగా నేను చెప్పే పాఠం లేదుగానీ, రానారె అని పిలువబడే యర్రపురెడ్డి రామనాథ రెడ్డి తెలుగు నుడికారాన్ని గురించి చాన్నాళ్ళ కిందట రెండు చక్కటి వ్యాసాలు రాశారు పొద్దు జాలపత్రికలో. కొత్త పాఠకులకి ఒకసారి ఈ టపాల్ని పరిచయం చేస్తే బాగుంటుందనిపించింది.

మొదటి టపా
రెండవ టపా

గతవారం పదాలకి అర్ధాలు:

కాటు = కరచు (పాముకాటు). కన్నుకాటు తిన్నదిగా అని వాడాడు మాటలమాంత్రికుడు ఎంతఘాటు ప్రేమయో పాటలో
కొన్ని ప్రాంతాల్లో మాడినది, గిన్నె అడుగంటినది అన్న అర్ధంలో కూడా వాడుతారు. ఉదా. పాలు కాటెక్కినాయి, కాటువాసన వస్తున్నాయి

పోటు = పొడుచుట (కత్తి పోటు, బల్లెపు పోటు), సముద్రపు పొంగు (ఆటు - పోటు)
రక్తపోటు సముద్రపు పోటు వంటి వాడుకయేమో అనిపిస్తున్నది
తలనెప్పిని తలపోటు అంటారు కొందరు - అది బహుశా నొప్పి పొడుస్తున్నట్టుగా రావడం వలననేమో.

నాటు = గుచ్చుట (శ్రీకృష్ణుని బోధనలు అర్జుని మనసులో నాటుకున్నాయి. అర్జునుని బాణాలు భీష్ముని శరీరమంతా నాటుకున్నాయి)
విశేషణంగా పల్లె ప్రాంతానికి సంబంధించినది అర్ధంలో నాటుకోడి, నాటువైద్యుడు, నాటుమందు వంటి వాడుకలు ఉన్నాయి.

మాటు = దాగి ఉండే చోటు; వేటగాడు పులికోసం మాటు వేశాడు.
చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను అని రాశారు సినారె ఏకవీర పాటలో
కంచు, రాగి, ఇత్తడి గిన్నెలకి తగరంతో పెట్టే అతుకుని మాటు వెయ్యడం అంటారు.
తడవ, సారి అనడానికి - ఈ మాటు, మరోమాటు - అంటారు. ఇది ఈ మారు, మరోమారు అనే వాడుకకి రూపాంతరంగా వచ్చిందని నేననుకుంటున్నాను.

చేటు = ఉపద్రవం, నాశనం
పేదవాని కోపం పెదవికి చేటు అని సామెత


ఈ కింది పదాలకి అర్ధం చెప్పండి, నిఘంటువులు చూడకుండా, జాలంలో వెతక్కుండా

కొదవ
కుదువ
చెలువ
నలువ
వెల్లువ

Comments

రవి said…
ఈ ఎకర్సైజులు నా వంటికి పడవు. అయినా ఒక ప్రయత్నం.

కొదవ = తక్కువ (లోటు)కొదవ లేకుండా
కుదువ = తనఖా
చెలువ = ప్రియురాలు (చెలువె కన్నడనాడు అని సముద్రతీర కర్ణాటకకు పేరు)
నలువ = ?
వెల్లువ = పొంగు
This comment has been removed by the author.
This comment has been removed by the author.
కొదవ తక్కువ
కుదువ ఏదైనా వస్తువును ఉంచి డబ్బు తెచ్చుకోవడం
చెలువ ?
నలువ ?
వెల్లువ వరద

ధన్యవాదములు
Anonymous said…
చెలువ అంటే "చెలియ" అని అర్ధం (నాకు తెలిసినంతవరకూ)
చెలువము/చెలువు అంటే మాత్రం అందమనే అర్ధం వున్నదేమో.

"చెలువు మీర గను
మారీచుని మద మణచే వేళ
అలకల్లల్లాడగ..." అన్నాడు పెద్దాయన మరి!
శారద
కొదవ, కుదువ, వెల్లువ అందరూ చెప్పేసారు.

చెలువ = అందం అనుకుంటున్నాను.

నలువ = విధాత, బ్రహ్మ అని విన్నట్టు గుర్తు.
vijay said…
<<తడవ, సారి అనడానికి - ఈ మాటు, మరోమాటు - అంటారు. ఇది ఈ మారు, మరోమారు అనే వాడుకకి రూపాంతరంగా వచ్చిందని నేననుకుంటున్నాను.<<

ఇది సరికాదనుకుంటాను. 'మాట మాటకీ' అన్న ప్రయోగం 'మాటి మాటికీ' గానూ, 'ఈ మాటు, మరో మాటు' గానూ రూపాంతరం చెందాయనుకుంటాను.

మీరు చెప్పిన మాటుకీ 'ఈ మాటు, మరో మాటు' కీ సంబంధం లేదేమో!

నేను తెలుగు పండితుడిని కాను గానీ ఇది కరెక్ట్ కాదనిపించి రాస్తున్నాను.
vijay said…
అసలు విషయం మరిచాను. 'అవ్యాజం' అన్న పదానికి అర్ధం వెతుకుతూ ఇక్కడికి వచ్చాను. మీ పాఠం బాగుంది. ధన్యవాదాలు.
Kottapali said…
విజy గారు, మీకు నచ్చినందుకు సంతోషం. పాఠం చెప్పడం మానేశాను గానీ, తెలుగు నుడికారాం మాత్రం నా ఫెస్ బుక్ పేజిల్లో కొనసాగుతున్నది ప్రతి మంగళవారం. వీలుంటే చూడండి.