సహనావవతు

ऊं सहना ववतु
सहनौ भुनक्तु
सहविर्यम् करवावहे
तेजस्विना वधीतम् अस्तु
मा विद विशावहै
ऊं शांति शांति शांति

ఓం సహనా వవతు
సహనౌ భునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు
మా విద్విషావహై
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః

పాఠం చెప్పుకునే ముందు గురుశిష్యులు చెప్పుకునే శాంతిమంత్రమిది.
భగవంతుడు మన ఇద్దరినీ రక్షించుగాక. మన ఇద్దరినీ వృద్ధి చేయుగాక. ఈ అధ్యయనానికి అవసరమైన శక్తి మన ఇద్దరికీ అబ్బునుగాక. మనం చదివేది మన ఇద్దరికీ వెలుగుని ఆపాదించు గాక. మన మధ్యలో విభేదాలు తలయెత్తకుండు గాక.
టూకీగా ఇదీ అర్ధం.

పాఠం, అధ్యయనం మాత్రమే కాదు, ఏ ఇద్దరు మనుషులు కలిసి మాట్లాడుకునే సందర్భమైనా ఈ ప్రార్ధన సముచితమే కాక, ఇప్పటి రోజుల్లో అయితే మరీ అవసరం కూడాను. ఆధునిక జీవితంలో మనుషుల మధ్య సంబంధాలు ఎలాగైనాయంటే - నేను చెబితే నువ్వు వినాలి, నేను గెలిస్తే నువ్వు ఓడాలి, నాది పైచెయ్యి నీది కింది చెయ్యి, నేను అంటాను నువ్వు పడు. ఉద్యోగ వ్యాపారాల్లోను, స్నేహాల్లోను, ఇంట్లో మనుషుల్తోను ఇదే తంతు.

తరవాత్తరవాత కాలం కొంచెం మారింది. కొత్త ఆలోచనలు బయల్దేరినై. వాణిజ్య లావాదేవీల్లోను, ఉద్యోగ శిక్షణల్లోను, మానవ సంబంధాల్లోను - Win win mentality, Active listening, Empathetic listening వంటి concepts ప్రాచుర్యం పొందుతూ వచ్చాయి. పూర్వకాలంలో నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందని సామెత. కానీ ఎంతటి వాడికైనా ఎల్లవేళలా నోరు అంతమంచిగా పెట్టుకోవడం సాధ్యమా? ఇద్దరు మనుషులు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటేనే ఇన్నేసి విభేదాలు తలెత్తుతున్నాయే, మరింక ప్రత్యక్షంగా కాకుండా ఫోన్‌లలో, ఈమెయిళ్లలో, మెసేజుల్లో, బ్లాగుల్లో .. ఎలా సాధ్యం? మన మనసులో ఏ దురుద్దేశం లేకపోయినా అవతల వినే వ్యక్తికి మనమాటలో ఏ విరుపు వినబడుతుందో, మనరాతలో ఏ వగరు కనబడుతుందో?

అప్పుడే అనిపిస్తుంది, ఈ మంత్రం ఇప్పటి జీవితంలో మరీ అవసరమని. మంత్రాన్ని మళ్ళీ ఒకసారి చదవండి. మంత్రార్ధాన్ని మననం చేసుకోండి. ఆ అర్ధాన్ని ధ్యానం చెయ్యండి.
మంచి జరగాలి అనుకుని ఊరుకోవడం కాదు - చెడు జరగకూడదని స్పష్టంగా వ్యక్తపరచడం ఎంత గొప్ప ఆలోచన అది. మనిద్దరం కేవలం బాగుండాలి అని కోరుకోవడమే కాదు. వృద్ధి పొందాలి. ఎదురుగా ఉన్న పని తేలికైనది కాదు, దాన్ని సాధించగలిగే శక్తి మాకు కలగాలి. అటుపైన ఆ చేసిన పని మా యిద్దరికీ వెలుగునివ్వాలి. నాకు నేను ఏమి కోరుకుంటున్నానో, నా ఎదురుగా ఉన్న వ్యక్తికికూడా మనస్పూర్తిగా అదే కోరుకుంటున్నాను. అంతరాంతరాల్లో ఈ నిజాన్ని పూర్తిగా జీర్ణించుకుంటే స్వ-పర భేదం మాయమవుతుంది. త్వమేవాహం.

ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః

Comments

మంచి టపా, సరైన సమయంలోనే వచ్చినట్లనిపిస్తోంది.
Yes, మేము డిప్లమా చదివేరోజుల్లో మా సారు ఒకతను ఇలానే మాచేత రోజూ మననం చేయించేవారు..nice..
ఈ మంత్రం నేను బడిలో ఉన్నప్పుడు చదివేవాళ్ళం, కాని గురువుతో కలిసి కాదు మధ్యాహ్న భోజన సమయంలో. దీనికర్థం అప్పుడు తెలియదు, బహుషా ఇలా ఉంటుందేమో! (just for fun)
భగవంతుడు మన ఇద్దరినీ రక్షించుగాక (నన్ను, భోజనాన్ని), మన ఇద్దరినీ వృద్ది చేయుగాక(నాకోసం నువ్వు వృద్ది చెందాలి, నిన్ను వృద్ది చేయడానికి నేను ఉండాలి), ఈ అధ్యయనానికి శక్తి మన ఇద్దరికీ అబ్బును గాక (నీకెందుకు నాకొక్కడికి చాలనుకుంటా!), మన ఇద్దరికీ వెలుగును ఆపాదించు గాక (నీకేమో కాని, తిన్నాక నాకైతే వెలుగు వస్తుంది), మన మధ్యలో ఎప్పటికీ విభేధాలు తలయెత్తకుండు గాక(అన్నం మీద అలిగితే ఎవడికి నష్టం, కాబట్టి విభేధాలు తలెత్తే సంస్యే లేదు).

అర్థాన్ని పంచినందుకు ధన్యవాదాలు.
Ruth said…
హ హ.... నిజంగానా? మేము నవోదయ స్కూల్లో ఈ పద్యం(శ్లోకం?) భోజన సమయంలో చదివేవాళ్ళం. ఇదేదో తిండికి సంబంధించినదేమో అనే అనుకునేదాన్ని. ఈ పోస్టు చదవటం మొదలు పెట్టిన తరువాతకూడా ఏదో తిండి విషయమై రాసారనే అనుకుంటూ చదివాను !
Anonymous said…
మన బ్లాగ్మిత్రులంతా బ్లాగుల్లో కామెంట్లు పెట్టే ముందు ఈ మంత్రం చదువుకుని కామెంటితే బాగుణ్ణు:);)
--సూరంపూడి పవన్ సంతోష్
వ్యాఖ్యాతలందరికీ నెనరులు.
@కన్నగాడు - హ హ. మీ వ్యాఖ్యానం బాగుంది. భోజనంతో ఆషామాషీ కాదండోయ్ - తిన్నది అరక్కపోతే వచ్చేబాధలు ఇన్నన్ని కావుగా!
Sanath Sripathi said…
మేము రక్షింపబడుదుము గాక ! కలసి భుజింతుము గాక ! కలసి సామర్థ్యము పొందుదుము గాక ! తేజస్వంతులముగుదుముగాక ! విరోధము పొందకుందుము గాక ! మా మధ్య ద్వేషము కలుగకుండును గాక !!

ఇది ఒక ఆశంసనము !!

ద్వేషం లేకపోతే విరోధం కలగదు, విరోధం లేనప్పుడు, పరస్పర అవగాహన ఉన్నప్పుడు collective గా ఎక్కువ సాధించగలుగుతాం (సామర్థ్యం ద్విగుణీకృతమౌతుంది). టీం మీటింగులులు, డిన్నర్లూ, ఇన్ఫార్మల్ మీటింగులు గట్రా ఈ ఆశంసన ప్రాతిపదికగా ఏర్పడ్డవేనేమో..

మంచి టపా..
మురళి said…
బాగుందండీ.. ఈ 'తేజస్వి నావధీతమస్తు' ఎక్కడో బాగా చూశాను.. స్కూల్లో అన్నట్టుగా జ్ఞాపకం... ఆచరించాల్సిన విషయమే..
తృష్ణ said…
ఈ శ్లోకం మాకు యోగా నేర్చుకునేప్పుడు క్లాస్ మొదట్లో పాడించేవారు. చివర్లో నేమో 'మృత్యుంజయ మంత్రం','అసతోమా' పాడించేవారు.
మాలతి said…
చాలా బాగా చెప్పేరు, ప్రస్తుతానికి సమయోచితంగా కూడా ఉంది. ఈ శ్లోకం నాకు తెలుసు కానీ విద్విషావహై అన్న పదానికి అర్థం తెలీదు. ఇప్పుడు తెలిసింది. ధన్యవాదాలు.
Anonymous said…
ఈ శ్లోకం అర్థం తెలియకుండానే స్కూల్లో ప్రార్థనా సమయంలో రోజూ పాడేవాళ్ళం.
అర్థం చెప్పినందుకు ధన్యవాదాలు.
Anonymous said…
सह नौ अवतु (नौ+अवतु= नाववतु) నౌ= ఇరువురిని
सह नौ भुनक्तु

तॆजस्विनौ अधीतमस्तु
मा विद्विषावहै
ఓం శాంతి: శాంతి: శాంతి:
సందర్భోచితంగా చెప్పారు.నెనర్లు.
Unknown said…
హైదరాబాదులోని రామకృష్ణమఠంలో సంస్కృతం పాఠం చెప్పుకొనేటప్పుడు ఈ శ్లోకాన్ని నేర్చుకున్నాం.గుర్తు చేసినందుకు నెనర్తు.
sharma said…
మంచి విషయం పంచుకున్నారు.
Laxma Reddy said…
హైదరాబాదులోని రామకృష్ణమఠంలో ఈ శ్లోకాన్ని నేర్చుకున్నాం.
పి బి ఆర్ said…
మాకు కూడా మధ్యాహ్న భోజనం సమయం లో చేయించేవారు