కబుర్లు - ఏప్రిల్ 18

వసంతాగమనంతో ప్రకృతిలో జరిగే మార్పులు అలా ఉండగా, అమెరికను సాంఘిక జీవనంలో ఈ సమయానికి ప్రతి యేడూ కొన్ని కొన్ని విశేషాలు జరుగుతూ ఉంటాయ్. బడులకి స్ప్రింగ్ బ్రేక్ శలవలు (దాంతోబాటే ఉద్యోగస్తులైన తలిదండ్రులు వారంరోజులు శలవతీసుకోవడమూ), ఈస్టరు పండగా, తత్సంబంధమైన గుడ్ల వేట, ఈస్టరు కుందేళ్ళ దర్శనాలు, బహుమతులు, ప్రార్ధనలు, గట్రా. ఇలాగే ప్రతియేడూ క్రమం తప్పకుండా ఈ సమయంలో వారం రోజుల పాటు జరిగే తమాషా నేషనల్ పబ్లిక్ రేడియో వారి భిక్షాటన సప్తాహం.

అమెరికావాసులు కానివారికి ఈ టూకీ పరిచయం. ఇక్కడ టివీ ఛానెళ్ళూ, రేడియో స్టేషనులూ అన్నీ ప్రైవేటు సంస్థలవే. అవి ప్రకటనల అమ్మకంద్వారా డబ్బు సంపాదిస్తాయి. వీటికి భిన్నంగా, వ్యాపార ప్రకటనలు లేకుండా రేడియోలో నేషనల్ పబ్లిక్ రేడియో (NPR) అనీ, టీవీలో పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ (PBS)అనీ సంస్థలు ఉన్నాయి. ఈ రెండూ లాభాపేక్ష లేని (non-profit) సంస్థలు. ఇలాంటివే మరికొన్ని ఉన్నాయి, PRI, APM, ఇలాగ, కానీ ఈ రెండూ పెద్దవీ, ముఖ్యమైనవీనూ. వీటిని నడిపేందుకు అవసరమైన ఆర్ధిక మదుపు ఎక్కువభాగం ప్రజల చందాల ద్వారా సమకూరుతుంది. వాణిజ్య సంస్థలుకూడా చందాలు ఇస్తుంటాయి, తమ ఎండోమెంట్ ఫౌండేషన్ల ద్వారా. కార్పొరేషన్ ఫర్ పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ అనే సంస్థ ద్వారా అమెరికను ప్రభుత్వం కొంత డబ్బు వీటికి ఇస్తుంది. వీళ్ళకి వచ్చే ఆదాయంలో సింహభాగం సాధారణ ప్రజలు కట్టే చందాల వల్ల కాబట్టి ఆయా పబ్లిక్ రేడియో స్టేషన్ల వాళ్ళు మార్చి-ఏప్రిల్ నెలల్లో ఒక వారం రోజులపాటు రేడియోమీద అతి దర్జాగా భిక్షాటనం చేస్తారు.

ఇప్పుడు మళ్ళీ అసలు కథకొద్దాం.

కొన్ని నెలలకిందట యువాన్ విలియంస్ అనే సీనియర్ విశ్లేషకుడి కాంట్రాక్టుని అథాట్టుగా రద్దుచేసి NPR తానే వార్త అయి కూర్చున్నది. ఆ సందర్భంలో విలియంస్ గారి ప్రవర్తన వివేచనారహితంగా ఉన్నదా అన్న ప్రశ్న పక్కన పెడితే, విలియంస్‌ని వదిలించుకున్న పద్ధతిలో NPR తప్పులో కాలువేసిందనే పబ్లిగ్గా అనుకున్నారు. అదలా ఉండగా, మొన్నటి మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికను పార్టీ ఢంకా బజాయించి కాంగ్రెసు పగ్గాల్ని చేబట్టిందిగదా. అసలుకి NPR ఎప్పుడూ లిబరల్ ఎజెండాని సమర్ధిస్తూ ఉంటుంది, తమ కన్సర్వేటివ్ ఎజెండాని చిన్న చూపు చూస్తుంది అని రిపబ్లికన్ల గునుపు. దాంతో ఈ సంవత్సరపు కాంగ్రెసు సెషన్లలో దీన్ని ఒక పట్టుపట్టక తప్పదని వాళ్ళు తర్జనభర్జన పడుతున్న సమయంలోనే మూలిగే నక్కమీద తాటికాయ పడినట్టు NPR మీద జేమ్స్ ఓకీఫ్ పడ్డాడు. ఈ దెబ్బతో NPR సీయీవో రాజీనామా చేశారు. జేమ్స్ ఓకీఫ్ బయలుపరచిన విడియోతో నసాళం అంటిన కాంగ్రెస్ రిపబ్లికన్లు అమెరికను ప్రభుత్వాన్నించి NPRకి అందే నిధుల్ని పూర్తిగా అరికట్టాలను బిల్లు ఆమోదించారు. రిపబ్లికన్ల కసరత్తు సాగుతుండగానే, వసంతకాలపు భిక్షాటన సప్తాహం మొదలైంది. ఈ సంచలన సంఘటనల నేపథ్యంలో సాధారణ ప్రజలు ఇచ్చే చందా మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. అంతే కాదు, NPRవార్తా ప్రసారాల్లో తరచూ వినిపించే కొందరు ప్రముఖ విలేఖరులు, విశ్లేషకులు - ఎందుకు అమెరికను రాజకీయ సాంఘిక చైతన్యంలో NPR ముఖ్యమైనదో - తమమాటల్లో చెబుతూ వస్తున్నారు. అంటే, మీరెన్నుకున్న ప్రభుత్వం మా ఫండింగ్‌ని కత్తిరించింది, మేం చేస్తున్న పని మీ తరపునే కాబట్టి మీరే ఇంకాస్త ఆర్ధిక సహాయం చెయ్యాలని చెప్పకనే చెప్పినట్టయింది.

మామూలుగా నాకు ఈ భిక్షాటన వారంరోజులూ NPRవినడం ఇష్టం ఉండదు, వాళ్ళ దీనాలాపాలు వినలేక. కానీ ఈ సారి మాత్రం - ఘటోత్కచుడు అన్నట్టు - ఆర్తనాదములు శ్రవణానందకరముగా నున్నవి. ప్రతిరోజూ, వీలు దొరికినప్పుడల్లా రేడియో పెట్టుకుని మరీ వింటున్నా!

Comments

Anonymous said…
ఆసక్తికరమైన కబుర్లు పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు

మామూలుగా నాకు ఈ భిక్షాటన వారంరోజులూ NPRవినడం ఇష్టం ఉండదు, వాళ్ళ దీనాలాపాలు వినలేక. కానీ ఈ సారి మాత్రం - ఘటోత్కచుడు అన్నట్టు - ఆర్తనాదములు శ్రవణానందకరముగా నున్నవి. ప్రతిరోజూ, వీలు దొరికినప్పుడల్లా రేడియో పెట్టుకుని మరీ వింటున్నా!


ఈ కామెంటు మాత్రం సూపరు
సంతోష్ సూరంపూడి
pi said…
LOL! I am an NPR junkie!! I seriously wish Republicans were a serious alternative rather than the crazy loons that they are.
Anonymous said…
"అంతే కాదు, NPRవార్తా ప్రసారాల్లో తరచూ వినిపించే కొందరు ప్రముఖ విలేఖరులు, విశ్లేషకులు - ఎందుకు అమెరికను రాజకీయ సాంఘిక చైతన్యంలో NPR ముఖ్యమైనదో - తమమాటల్లో చెబుతూ వస్తున్నారు."

ఇది ఎప్పుడూ వుండేదే కదా?

"కానీ ఈ సారి మాత్రం - ఘటోత్కచుడు అన్నట్టు - ఆర్తనాదములు శ్రవణానందకరముగా నున్నవి. ప్రతిరోజూ, వీలు దొరికినప్పుడల్లా రేడియో పెట్టుకుని మరీ వింటున్నా!"

ఎందుకని?

నాకు తెలిసినంతలో నిధుల కోత ప్రభావం NPR మీద తక్కువ సభ్య రేడియో స్టేషన్ల మీద ఎక్కువ.

http://marketplace.publicradio.org/display/web/2011/03/09/pm-how-will-npr-ceos-departure-impact-public-broadcasting-funding-/
@ iddaru -
a) This is something new they've been doing since the congress funding cut. Several times a day, senior and star reporters like Nina Totenburg and Noah Adams et al. Have been preaching to the choir.
b) Yes and no. It's all tied together. However, the local stations which have borderline budgets will surely go under without the CPB funding.