Monday, November 29, 2010

కబుర్లు - నవంబరు 29

ఉత్తర కొరియాలో ముసలివాడైన నాయకుడినించి యువనాయకుడికి అధికారం బట్వాడా చేసే కసరత్తులో భాగంగానే దక్షిణకొరియామీద కాల్పులూ, కయ్యానికి కాలుదువ్వడాలు జరుగుతున్నాయని ఇక్కడ విశ్లేషకుల ఊహాగానాలు నడుస్తున్నాయి. గద్దెనెక్కబోయే యువనాయకుడు యుద్ధ పరిస్థితుల్ని ఎదుర్కోగలడు, యుద్ధంలోనూ దేశాన్ని నడిపించగలడు అని చూపించడానికట ఈ శ్రమంతా - యేమి లాజిక్కురా నాయనా! ఉరుమురిమి మంగలం మీద పడిన చందంగా ఉంది. రాజకీయ ప్రత్యర్ధుల నడుములమీద లాఠీలు విరిచేందుకే తెలుగు గడ్డమీద కిరణోదయం అని అంటున్నారు, మరి ఇప్పటిదాకా ఎటువంటి అధికార పదవి నిర్వహించని అనుభవశూన్యుడైతే చెప్పినపని చెప్పినట్టు బాగా చేస్తాడని అధిష్టానం అంచనాయేమో. తెలుగు వెండి తెరమీద ఇంకా నటన బతికే ఉంది అని సూచించే పంచప్రాణాల్లో ఒకరైన తనికెళ్ళ భరణిగారికి వెండిపండగ చేశారు హైదరాబాదులో అంగరంగ వైభోగంగా. భేషజం లేకుండా పెద్ద పెద్ద స్టార్లు, సాధారణంగా బయట కనబడని ప్రకాష్ రాజ్ వంటి దిగ్దంతులు కూడా హాజరయ్యి ఆయనపట్ల గౌరవం వెలిబుచ్చారంటే భరణిగారి రేంజ్ ఏవిటో అర్ధమవుతోంది. వారికి మన బ్లాగర్లు కూడా యథోచితంగా అక్షర నీరాజనాలు పట్టారు, సంతోషం.

ఇవ్వాళ్ళ కార్తీకమాసంలో ఆఖరి సోమవారం. ఐతే ఏంటి? ఏం లేదు, శివుడంటే భక్తి ఉంటే చేతనైనట్టు శివప్రీతి చేసుకుంటారని, అంతే!

వ్యాపార ప్రకటనే కావచ్చు, కానీ ఒక్కోసారి గొప్ప దృశ్యకావ్యమవుతుంది. థాయ్ భాషలో రూపొందించిన ఈ షాంపూ ప్రకటన నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసేసింది.

ఆరోగ్యం


గత కబుర్ల తరువాయి
మనం చిన్నప్పుడు బహుశ ఆరోక్లాసులోనో ఏడో క్లాసులోనో చదువుకున్నాం, మనం తినే భోజన పదార్ధాలన్నీ కూడా కొన్ని మౌలికమైన పోషకపదార్ధాలుగా విడిపోతాయని - అందులో ముఖ్యమైనవి పిండి పదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వు, విటమిన్లు. ప్రాచీన నాగరికతలన్నీ పిండిపదార్ధాలకి పెద్దపీట వేశాయి తమ ఆహారపు అలవాట్లలో. అలా మనకి అన్నం పరబ్రహ్మ స్వరూపమే అయి కూర్చుంది. ఇటీవల మనవాళ్ళు (అంటే తెలుగు వాళ్ళు) కొంచెం ఆరోగ్యాన్ని, శరీరపోషణని సీరియస్ గా పట్టించుకునే వారు రాత్రి పూట అన్నం మానేసి చపాతీలో పుల్కాలో తినడం చేస్తుంటారు. మరి కొందరు మొక్కజొన్న పొత్తులో విత్తులో తినడం సాగించారు, ఉదయం బ్రేక్‌ఫాస్టుకి కార్న్‌ఫ్లేక్స్ తింటున్నారు - ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని కూడా ఒక పక్కన వ్యాపార ప్రకటనలూ, ఇంకోపక్క (వైద్య) అభిప్రాయాలూ గుప్పిస్తున్నారు మీడియాలో. వెరసి జరుగుతున్నదేవిటంటే మునుపెన్నడూ లేనంతగా మనం ఇప్పుడు పిండిపదార్ధాల్ని స్వాహా చేస్తున్నాం. అదే, ఇప్పుడు మహా ముప్పు తెచ్చి పెడుతున్నది. సగానికి సగం మంది మధుమేహం (డయబీటిస్) తో బాధపడుతున్నారు. ముప్ఫైలు నలభైల్లో ఉన్నవాళ్ళకే ఇప్పుడు షుగర్ కంప్లెయింట్, లేదా టైప్ 2 డయబీటిస్.

పిండి పదార్ధం జీర్ణక్రియలో జీర్ణమయ్యాక లాస్టండ్ ఫైనలుగా చక్కెర (గ్లూకోజు)గా మారుతుంది. ఏ ముడిపదార్ధం ఎంత త్వరగా ఎంత సులభంగా చక్కెరగా మారిపోతుంది అన్నదాన్ని బట్టి, గ్లైసీమిక్ లోడ్ అని ఒక సూచికని లెక్కవేశారు సైంటిస్టులు. ఈ కింది పట్టికలో, సంఖ్య ఎంత ఎక్కువైతే ఆ పదార్ధం అంత సులభంగా చక్కెర అవుతుంది - అంటే డయబీటిస్ దృష్ట్యా అంత రిస్కన్న మాట.
తెల్ల అన్నం = 64
బంగాళ దుంప = 85
కార్న్ ఫ్లేక్స్ = 92
తెల్ల బ్రెడ్ = 70
గోధుమ బ్రెడ్ (చపాతీ) = 55
దంపుడు బియ్యం (బ్రౌన్ రైస్) = 55
చూశారుకదా, గోధుమ వస్తువులుకానీ, మొక్కజొన్న పదార్ధాలుకానీ, షుగర్ దృష్ట్యా వరన్నం కంటే పెద్దగా ఆరొగ్యకరమైనవి కావు.

పర్యావరణం


కొంచెం ఆలోచన పెడితే, కొద్దిగా శ్రద్ధగా ఉంటే, మన పుడమితల్లికి మనమే మన పరిధిలోనె ఎంతో సాయం చెయ్యొచ్చు. ఈ మధ్యకాలంలో ఇంట్లోనించే పని చెయ్యడం, లేదా హోం ఆఫీసులు పెట్టుకుని చిన్న పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు నడపడం బాగా ఎక్కువైంది. ఇది వ్యకతిగత అభివృద్ధి దృష్ట్యా ఆహ్వానించాల్సిన పరిణామం కూడా. ప్రతీ హోం ఆఫీసులో ఒక నకళ్ళ యంత్రం (కాపీయరు), ఒక ప్రింటరు (లేజరో, జెట్టో) ఉండడం సర్వసాధారణం.
ఈ యంత్రాల్లో ఇంకు (కాగితమ్మీద అక్షరాల్ని రూపొందించే నల్లటి లేదా రంగు పదార్ధం) కేర్ట్రిడ్జిలనే చిన్న డబ్బాల్లో ఉంటుంది. లేజర్ ప్రింటర్లో ఉపయోగించే కేర్ట్రిడ్జి సుమారు ఐదు పౌనులు (రెండు కిలోలు) బరువుంటుంది. ఇందులో ఇంకు పూర్తిగా వినియోగమైపోయినా ఆ ప్లాస్టిక్ డబ్బాని తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఇదే ఉద్దేశంతో ప్రపంచ వ్యాప్తంగా కేర్ట్రిడ్జి రిఛార్జి వ్యాపారాలు మొదలైనాయి. మీ చుట్టుపక్కల ఇటువంటి వ్యాపారం ఉందేమో గమనించుకోండి. చాలామంది మీ ఖాళీ కేర్ట్రిడ్జి తీసుకుని మరొక నిండు కేర్ట్రిడ్జి వెంటనే ఇస్తారు. ఒక్కొక సారి కొంత సమయం పట్టవచ్చు. ముందే కనుక్కుని ఉంటే మంచిది.
యేటా సుమారు 40,000 టన్నుల కేర్ట్రిడ్జిలు చెత్తలో పారవేయబడుతున్నాయి. మీ కేర్ట్రిడ్జి ఐదు పౌనులే కావచ్చు - దాన్ని తిరిగి ఉపయోగిస్తే, అది భూభారం కాకుండా ఉన్నట్టే. రిసైకిల్ చేస్తారు కదూ!

ఈ వారపు సిఫారసు
ఇంక ఇంతకంటే పెద్దగా చెప్పక్కర్లేదు. ఒక్క గమనిక - ఈ పుస్తకంలో అతను రాసిన కథల్లేవు, అతనికి నచ్చిన కథలు మాత్రమే ఉన్నై. నాకు చాలా నచ్చేయి.

ఈ వారపు బ్లాగు


పశ్చిమబెంగాలు విశేషాలు చక్కటి ఫొటోలతో సహా చెబుతున్నారు పాపాయి బ్లాగులో. మీరూ ఓ లుక్కెయ్యండి.

Monday, November 15, 2010

డెలవేర్ పౌరాణిక నాటకప్రదర్శన విజయవంతం

నాటక ప్రదర్శన చాలా బాగా జరిగింది.

శ్రీకృష్ణ పాత్రలో ఆచార్య శ్రీ సుందరరామకృష్ణగారు ప్రేక్షకుల మనసులు దోచారు అంటే అతిశయోక్తి కాదు. తన రూపాన్ని ఇనుమడింపజేసే ఆహార్యంతో, మృదు గంభీరమైన వాచికంతో, సందర్భోచితమైన చతుర సంభాషణతో శ్రీ సుందరరామకృష్ణగారు ఆ నటనసూత్రధారిని ప్రత్యక్షం చేశారు.

ద్వారకాఘట్టంలో అర్జునునిగా మిత్రులు సరిపల్లి శర్మగారు చాలా బాగా నటించారు. మునుపు అనుభవం లేకపోయినా క్లిష్టమైన పద్యాలను కంఠత పట్టడమే కాక చక్కగా రాగయుక్తంగా ఆలపించి రక్తి కట్టించారు. రాయబార ఘట్టంలో డెలవేర్ వాస్తవ్యులు, పలువు ఔత్సాహికులు వివిధ పాత్రల్ని సమర్ధంవంతంగా పోషించారు. బ్లాగుమిత్రుడు రవి వైజాసత్య తొంభై మైళ్ళు డ్రైవు చేసుకుని వచ్చాడు. నా ఫిలడెల్ఫియా మిత్రులు ఆప్తులు పెద్దవారు అందరూ వచ్చారు. చాలా సంతోషమైంది. మనసు నిండిపోయింది.

ఈ కార్యక్రమాన్ని సంకల్పించిన శ్రీమహాలక్ష్మి దేవస్థాన ట్రస్టీ శ్రీ పాటిబండ శర్మ గారు, సమర్ధవంతంగా నిర్వహించిన కార్యవర్గ బృందము అభినందనీయులు.

ప్రస్తుతానికి ఈ చిరు దృశ్యమాలిక మీకోసం.

Tuesday, November 9, 2010

ఆహ్వానం - డెలవేర్‌లో పౌరాణిక నాటకం

డెలవేర్ శ్రీమహాలక్ష్మి దేవస్థానం వారు సమర్పిస్తున్న తెలుగు పౌరాణిక నాటక ప్రదర్శన


తిరుపతి వేంకటకవుల పాండవోద్యోగ నాటకము నించి కొన్ని ఘట్టాలునవంబరు 14 ఆదివారం అపరాహ్ణం 3 గంటల నుండి.
Hindu Temple of Delaware
760 Yorklyn Road
Hockessin DE 19707
Phone: 302-235-7020; 302-235-2749

ఆచార్య అక్కిరాజు సుందరరామకృష్ణ గారు శ్రీకృష్ణునిగా అలరించనున్నారు. దుర్యోధనుడి పాత్రలో వారితో కలిసి నటించే అదృష్టానికి పొంగిపోతున్నాను. స్థానికులు సరిపల్లి శర్మగారితో సహా మరికొందరు ఔత్సాహిక నటులతో ఈ ప్రదర్శన జరగనున్నది.

Hockessin DE అంటే దక్షిణాన బాళ్టిమోర్, ఏబర్డీన్ నగరాల నించీ, ఉత్తరాన ఫిలడెల్ఫియా, ప్రిన్స్‌టన్ నగరాల నించీ సులభంగా కార్లో రాగలిగిన దూరమే.