నిన్న రాత్రి పైరేటు డిస్కు మీద లీడరు సినిమా చూశా. సాధారణ సినిమాలకి భిన్నంగా ఉన్నది అనేదొక ప్లస్ పాయింటు. కుర్రాడు చూడ్డానికి బావున్నాడు, డిక్షనూ ఏక్షనూ పర్లేదనిపించాడు - ఇది రెండో ప్లస్ పాయింటు. బ్రహ్మానందం ఇత్యాదుల డోకు కామెడీ, పనీపాటా లేనప్పుడల్లా హీరోహీరోయిన్ల పాటలూ లేవు. హీరో ఎంట్రీ జరిగినప్పుడు ఫెళఫెళార్భాటాలు, ఉరుములు మెరుపులు భూకంపాలేవీ జరక్కుండా, మామూలు మనిషిలాగే నడిచి తెరమీదికొచ్చేశాడు - ఆ అబ్బాయేనే హీరో అని మాయావిడ ఆశ్చర్యపోయింది కూడా. సాధారణంగా సెకండ్ విలన్, మజిల్ మేన్ గూండా లాంటి పాత్రలు వేసే నటుడు (పేరు తెలీదు) ధనంజయ పాత్రలో బాగా చేశాడు. ఇంతకి మించి చెప్పుకోదగినదేమీ కనబళ్ళేదు. సినిమా ఎక్కడా ఇమోషనల్గా కానీ, ఇంటలెక్చువల్గా కానీ కదిలించలేదు. కథ అంటూ ఏమీ లేకుండా ఉత్తుత్తి అల్లిబిల్లి కబుర్లు నాలుగు కలిపి సినిమా తియ్యడం శేఖరాయికిది రెండోసారి.
అంధ్రజ్యోతివారి నవ్యవీక్లీ జాలప్రవేశం చేసిందిట.
ఉగాది సందర్భంగా పొద్దువారి నిర్వహణలో మేము జరిపిన కావ్యకలాపాలు పొద్దులో ధారావాహికంగా ప్రచురిత మవుతున్నాయి.
కొత్త బ్లాగర్లకి చాలా మందికి పరిచయం ఉండక పోవచ్చు, రానారెగా ప్రసిద్ధుడైన రామనాథరెడ్డి అలనాటి ఆరుద్ర కూనలమ్మ పదాలకి దీటైన గూగులమ్మ పదాలు రాస్తూ వచ్చాడు - సమకాలీన జీవన సంక్షోభాల్నీ, అమెరికాలో ప్రవాస జీవితపు చమత్కారాల్ని కలిపి నంజుకుంటూ. కొత్తవాళ్ళకిది పరిచయం, పాతకాపులకిది నెమరువేత.
అన్నట్టు గత వారంలో శ్రీరామనవమి, సీతారామ కళ్యాణం. పోయినేడాది ఈ సందర్భంగా రాసుకున్న నా భావనలు.
గతవారపు తెలుగు పదాలకి అర్ధాలు
కలికము - కంటికి వేసే మందు. ఏదైనా (లేక ఎవరైనా) కనబడకుండా పోయినప్పుడు కలికం వేసినా కనబట్టల్లేదు అంటారు. ఏదైనా పదార్ధం నిండుకుండి అని చెప్పడానికి కలికంలోకి కూడా లేదు అంటారు, బహుశా కలికం తయారీలో బహు చిన్న మోతాదు దినుసులు వాడతారు కావచ్చు. అంజనం అని ఇంకోటి ఉంది. సాధారణంగా కాటుకకి పర్యాయపదంగా వాడుతారు. మంత్రగాళ్ళు అంజనం వేసి పోయిన వస్తువులు, పశువులు, మనుషుల ఆచూకీ చెబుతుంటారు.
కోటేరు - నాగలిని తిరగేసి కాడికి వేలాడదియ్యడాన్ని కోటేరెయ్యడం అంటారు. కోటేరేసినప్పుడు నాగలి మొన కిందకి తిరిగి, తిన్నగా ముందుకు పొడుచుకొచ్చి ఉంటుంది. ఎవరిదైనా ముక్కు తిన్నగా పొడుగ్గా ఉంటే కోటేరేసిన ముక్కు అంటారు.
మక్కెలు - ఎముకలు. మక్కెలిరగ్గొడతా అనేది సర్వసాధారణమైన బెదిరింపు.
తుక్కు - చెత్త. తుక్కు కింద కొట్టడం అనే వాడుక కూడా ఉంది.
మొగసాల - ముఖశాలకి వికృతి. ఇంటి ముఖద్వారం వద్ద ఉండే చిన్న గది. గుమ్మం దగ్గర గదులు కట్టడం మానేశాక, పైన చూరు దించిన వీధరుగుని కూడా మొగసాల అని వ్యవహరిస్తుంటారు. మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కింది అని సామెత.