Q!

రెండూ జీవన యానానికి సంబంధించిన సినిమాలే - రెండిట్లోనే శర్వానందే

ఎట్టకేలకు దేవ కట్టా ప్రస్థానం చూడ్డం తటస్థించింది.

సినిమా చూసినంతసేపూ నా దృష్టిని సడలకుండా పట్టి ఉంచాడు దర్శకుడు. వోలు మొత్తమ్మీద చాలా మంచి సినిమా చూసిన ఫీలింగ్. ముఖ్య పాత్రలు బలంగా, కాంప్లెక్సుగా ఉన్నాయి. సాయికుమార్, శర్వానంద్, చిన్నాగా వేసిన నటుడు చాలా బాగా చేశారు. సహాయ పాత్రల్లో కడప రెడ్డిగా జీవా చర్వితచర్వణ మైపోయాడు. ఇనస్పెక్టర్ గౌడగా వేసినతను, లోకనాథం సహాయకులు బాషా, దుర్గ పాత్రల్లో నటించిన వారిద్దరూ బాగా చేశారు. జయప్రకాష్‌రెడ్డి కామెడీ పరవాలేదు, సినిమాకి అవసరం కాకపోయినా మరీ ఎబ్బెట్టుగా లేదు. ఎబ్బెట్టుగా ఉన్నది శర్వానందుకి బలవంతాన కుదిర్చిన రొమాంటిక్ ట్రాకు. ఇది కీలకమైన సన్నివేశాల్లో కథనంలోని పటుత్వాన్ని సడలించింది. ఆ హీరోయిన్ ఘోరంగా ఉంది. కథకూడా నేరుగా ఒక దారెంబడి సాగిపోకుండా ఎపిసోడ్స్ గా జరగడం ఈ సినిమాకి కొంత లాభించింది. సంగీత దర్శకుడు కొంత కొత్త ప్రయత్నం చేశాడు, ఎలక్షను ఊరేగింపులుగా రూపొందించిన పాటల్లో, కొన్ని కీలకమైన సీన్లలో నేపథ్య సంగీతంలో ఆ ప్రాంతపు వాతావరణం (ఉదా. డప్పులు) తేవడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నం నించి దిగతీసినవి రెండు - మితిమీరిన ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం, అస్సలు బలంలేని మగ గొంతులు (ఈ రెండూ ఈ సినిమా ఒక్కదానికే పరిమితం కాదు, జెనరల్‌గా తెలుగు సినిమాలకి పట్టి ఉన్న జాడ్యాలే). అన్నిటికంటే ముఖ్యంగా బాగా ఇంప్రెస్ చేసింది దర్శకుని ప్రతిభ. షాట్లని ఫ్రేము చెయ్యడం దగ్గర్నించి, సీన్ కంపొజిషన్, దృశ్యంలోని వర్ణ మిశ్రమం, నటీనటుల అమరిక - ఒక్కొక్క సీనూ చూస్తుంటే, ఆ దృశ్యాన్నించి ఏమి రాబట్టాలి అని స్పష్టమైన అవగాహనతో తీశాడీ దర్శకుడు అనిపించక తప్పదు. అంతే కాదు, సినిమా మొత్తంగా అవలోకించుకుంటే కథకి ముఖ్యమైన ఏ దృశ్యమూ అక్కడ యాదృఛ్ఛికంగా చేరినట్టు కాక, సాలోచనా ఫలితంగా అమరినట్లు స్పష్టమవుతుంది.

ఇదంతా బానే ఉంది కానీ మర్నాడు నిద్ర లేచినాక రకరకాల విషయాలు బుర్రలో పురుగు తొలవడం మొదలైంది. సినిమా మొత్తానికి కీలకం లోకనాథం నాయుడు. విజయవాడ, చుట్టూపక్కలంతా ఆర్ధికంగా రాజకీయంగా బలిమి కలిగి ఉన్నవారు కమ్మవారు. ఇది జగద్విదితం. మరి లోకనాథాన్ని నాయుణ్ణి ఎందుకు చేశారు? చౌదరిని ఎందుకు చెయ్యలేదు? ఇది మొదటి ప్రశ్న. కాకపోతే ఒకటి ఒప్పుకోవాలి - ఇంత రాజకీయంలోనూ కులపరమైన రాజకీయం కనపడదు ఎక్కడా, మొట్టమొదటి పల్లెటూరి ఎలక్షనులో తప్ప. అదీకాక, నాకు తెలిసినంతలో విజయవాడ అర్బన్ నియోజక వార్గాల్లో కమ్మవారెప్పుడూ ఎమ్మెల్లేగా నెగ్గలేదు, పక్కన కంకిపాడులో దేవినేని నెహ్రూ ఏలుతున్నాడుగాని.

లోకనాథం కాంప్లెక్సు కేరెక్టరు. అనేక పొరలు, అనేక కోణాలు. సాయికుమార్ బాగా చేశాడు. కానీ సినిమా చివర్లో గతాన్ని గురించిన ఆ చిన్ని సత్యాన్నొక్కదాన్ని ఆవిష్కరించడంతో ఆ సంక్లిష్టత కాస్తా పల్చబడిపోయింది. ఆ చిన్ని గత శకలాన్ని చూపకుండా ఉండాల్సింది. అసలు లోకనాథం మిత్ర తల్లిని పెళ్ళి చేసుకోవల్సిన అవసరం ఏవిటి? కేవలం పెద్దాయన మాటేనా? పెద్దాయన మాత్రం అసలంత అనూహ్యమైన కోరిక ఎలా కోరాడు? ఇది జీర్ణించుకోవడం కొంచెం కష్టం. కానీ మిత్రా చిన్నా ఇద్దరూ ఒక తల్లి బిడ్డలు కాకపోతే ఇప్పుడు సినిమాలో ఉన్నంత టెన్షను సాధ్యం కాదు. దాని కోసం దీన్ని ఒప్పుకోవాలి. కేశవ చనిపోయే సమయానికి, సినిమాలో చూపినదాన్ని బట్టి మిత్రకి ఆరేళ్ళు, మిత్ర అక్కకి పదేళ్ళు ఉంటాయి సుమారుగా. తరవాత డయలాగుల్ని బట్టి కేశవ మరణాన్నించి ప్రస్తుత కథాసమయానికి పాతికేళ్ళు గడిచినట్టు తెలుస్తుంది. అంటే మిత్ర అక్కకి ముప్పై అయిదేళ్ళు. ఆమెకి సుమారు 18-20 ఏళ్ళ కూతురు ఉండడం అసంభవం. మిత్రకి కనీసం ముప్పై యేళ్ళుండాలి, కానీ పాతికేళ్ళకి మించినట్టు కనబడ్డు (పాత్రధారి శర్వానందుకి నిజంగానే 2009 లో 25 నిండాయిట). అఫ్కోర్సు ఇదంతా ఎగ్స్ ఈకల్స్ పీకింగ్స్ అంటే, నేను కాదన్ను. ఫిర్ భీ .. కభీ కభీ ..

గమ్యం ఇంతకు ముందోసారి చూశాను, బానే ఉందనుకున్నాను, కానీ సరిగ్గా గుర్తు లేదు. అందుకని మళ్ళీ చూశాను. ఈ సారి కొంచెం శ్రద్ధగా చూశాను. అఫ్కోర్సు, దీంట్లోనూ శర్వానందే. కాకపోతే ఈ సినిమాకి హీరో హీరోయిన్లు యాదృఛ్ఛికం. అక్కడ శర్వానందు - కమలిని కాక ఇంకో జంట ఎవరున్నా సినిమా ఇంత ఎఫెక్టివ్ గానూ ఉండేది. మనలో మాట, కమలిని పక్కన శర్వానందుడు కొంచెం వరహీనం అనిపించాడు. సినిమా అన్ని విధాలా చాలా చాలా బావుంది. అల్లరి నరేష్ మంచి నటుడని నాకెప్పణ్ణించోనే అనుమానం. నేనులో ఆ చాయలు బాగానే కనబరిచాడు. ఈ సినిమాతో ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఎవరన్నా దర్శక పుణ్యాత్ములు ఈ అబ్బాయికి కాస్త అప్పుడప్పుడూ అయినా ఇటువంటి కథా, ఇటువంటి పాత్రలూ ఇస్తూ ఉంటే బాగుణ్ణు. రావు రమేష్ తెలుగు సినిమాకి లభించిన మరో మంచి నటుడు. ఈయన పది కాలాలపాటు వైవిధ్య భరితమైన పాత్రలు పోషిస్తూ ఇంకా ఎంతో ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో నాకు ఆసక్తిగా అనిపించిన విషయం - ఏ విషయాన్నీ ఎబ్బెట్టుగా చూపించడు. ఉదాహరణకి మొదట్లో శర్వానందు కమలినితో నీ చుట్టూ అంతా చెత్తా మురికీ అసయ్యం అంటాడు చాలా సార్లు, కానీ దృశ్యంలో అంత ఇదిగా ఏం చూపడు. అలాగే రెండు ఆన్‌స్క్రీన్ డెలివరీలూ, ఇంకొన్ని బీభత్స దృశ్యాలూ కూడా చాలా లలితంగా తీశాడనే చెప్పాలి - బహుశా అది డైరెక్టరు టెంపరమెంటు కావచ్చు. బ్రహ్మానందం కామెడీ, రికార్డింగ్ డేన్సుల వాళ్ళ ఎపిసోడ్ కూడా కథలో చక్కగా ఇమిడాయి. రిఖార్డింగ్ డేన్సు దగ్గర NTR, ANR, కృష్ణల సూపర్ హిట్ పాటల్ని చూపించడం కొంచెం తమిళ దర్శకుడు బాలాని గుర్తుకి తెచ్చింది. సమయమా అనే పాట చాలా నచ్చింది (పాడింది ఎవరు?). మిగతావన్నీ వోకే. నేపథ్య సంగీతం లేకుండా ఉంటే బాగుండేది. చక్కటి సంయమనంతో శ్రద్ధ పెట్టి తీసిన సినిమా ఎలావుంటుందో గమ్యం నిరూపించింది. దర్శకుడు క్రిష్ కృషికి టోపీ తీసేశ్శా!

Comments

బహుషా మీరు ఈక అనుకొని పెంకు పీకుతున్నట్టున్నారు, కథానాయకి, మిత్ర బావకి చెల్లెలు. ఇక గతశకలం నాకు బాగానే అనిపించింది, వీలైతే మరొక్క సారి చూడండి లేదా కొని సన్నివేశాలు గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నించండి,
ఒక సన్నివేశం, ఎమ్మెల్యే టిక్కెటు నిరాకరించిన తరువాత కార్లో ప్రయాణిసున్నప్పుడు మానేజరు(ధర్మం) అనుకుంట, "జనాలు కూడా అట్టడుగున స్వార్దపరులండీ" అంటాడు దానికి బదులుగా లోకి "స్వార్దమే మనిషి అసలు లక్షణం, నిస్వార్దం దానిని కాచే కవచం" అంటాడు. ఇక్కడే ఉల్లిగడ్డ ఒక పొర విప్పుకుంటుంది.
లోకి అవసరానికి తగ్గట్టుగ నడుచుకునే వాడని చెప్పడానికి వాడుకున్నాడు.
కన్నగాడు గారు (నాకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారి జోకు గుర్తొస్తోంది!), welcome back - haven't seen you in a while.
ఆసక్తి కరమైన విషయాలు చెప్పారు. ఈరోయిన్ను మిత్రాని మావయ్యా అని పిలిచినట్టు గుర్తు - ఏమోమరి. ఎట్లాగా ఇంకొన్నాళ్ళు పోయాక మళ్ళి చూస్తాను, అప్పుడు వెరిఫై చేస్తాను. లోకి అవసరానికి తగ్గట్టే కాదు, ఎదురుగాఉన్న అవకాశాన్ని తనకి అనుకూలంగా మార్చుకో గలిగిన సమర్ధుడు అనడంలో నాకేమాత్రం సందేహం లేదు. నేనంటున్నదల్లా కథనంలో దర్శకుడి నిర్ణయం - ఎంత వరకూ స్పష్టంగా చెప్పాలి, ఏది చెప్పకూడదు అనే దాన్ని గురించి. ఆ గత శకలం ఇదీ అని స్పష్టంగా చూపించడం కాకుండా, ఒక సూచనగా వొదిలేస్తే, ఆ కాంప్లెక్సిటీ ఇంకా రంజుగా ఉంటుందని నా ఉద్దేశం.
రెండు మంచి సినిమాలగురించి బాగా రాశారండి.
ప్రస్థానంలో ఎగ్స్ ఈకల్స్ విషయానికి వస్తే నటీనటుల వయసు పాయింట్ కరెక్టేకానీ మిత్ర తన అసలువయసుకన్నా ఐదేళ్ళు తక్కువగా కనిపించేంత ఆరోగ్యవంతుడని సరిపెట్టుకోవచ్చు. ఇక హీరోయిన్(మిత్రలవర్) మిత్ర అక్కకూతురు కాదండీ మీరు గమనించారోలేదో తను మిత్రని బావ అంటుంది. ఆ అమ్మాయి మిత్ర బావకి చెల్లెలు అని చూపించాడు. మిత్ర అక్కాబావా చనిపోయిన సీన్ లో ఆ అమ్మాయి అన్నయ్యా అని ఏడవడం మీరు గమనించవచ్చు.

గమ్యంలో ’సమయమా’ పాటపాడింది సుజాత.
దుగ్గిరాల గారి జోకేమిటండీ?
మీరనేది నేనొప్పుకుంటా, మామిడి రసం తీసి తాగడం కంటే పండులాగానే తింటే ఇంకా బాగుంటుందంటారు అంతే కదా!
వేణూ - మీరు కూడా యీరోయిను మరదలు వరసే అంటున్నారు కాబట్టి ఒప్పేసుకుంటా :) వయసు - లుక్సు - ఒక మాట ఒప్పుకోవాలి, శర్వానందు మరీ పాలబుగ్గల పసివాడిలాకాకుండా కొంచెం ఆ పాత్రకి తగిన టఫ్‌నెస్ బానే కనబరిచాడు.

కన్నగాడు - జోకు వచ్చే వారం కబుర్లలో రాస్తాను.
బావుంది మీ సమీక్ష.ప్రస్థానం సినిమాలో డైలాగులు బావుంటాయి.గమ్యంలో కంటే ఈ చిత్రంలోనే శర్వానంద్ కాస్త నటించాడు.
ఇందు said…
నేను ప్రస్థనం చూడలేదండీ...కానీ గమ్యం చూసా! మీరు చెప్పినట్టే కొన్ని దృశ్యాలు సున్నితంగా తీసారు.గాలిశీను పాత్రలో అల్లరినరేష్ జీవించాడు.అతను చనిపొయినప్పుడు చాల బాధేస్తుంది.కానీ అలా చనిపోవడం వల్లే సినిమా కీలక మలుపుతిరిగిందేమొ అనిపిస్తుంది.మీరు గమనించారొ లేదో ఈ సినిమాలో చూపించే పల్లెటూరి దృశ్యాలన్ని సహజంగా చిత్రీకరించారు.అంటే పల్లెటూరుని అందంగా...ఒక స్వర్గంలా చూపించకుండా...సహజంగా అవి ఎలా ఉంటాయొ..అక్కడి మనుషులు ఎలా ఉంటారో అలాగే చూపించారు. ఈ కాలంలో వచ్చిన కొన్ని మంచి సినిమాల్లో ఇదీ ఒకటి :)
మురళి said…
'ప్రస్థానం 'నాయికానాయకుల బంధుత్వం విషయంలో మీరు పొరబడ్డారు. కన్నగాడు గారు మరియు వేణూ శ్రీకాంత్ గార్లు చెప్పిందే కరెక్ట్. మీరు డిస్క్ చూడడం వాళ్ళ హీరో హీరోయిన్ల రొమాన్స్ చూడడం తటస్థించిందే తప్ప, థియేటర్లో రెండో రోజునుంచే ప్రొజెక్షన్ వాళ్ళు వాటిని ఎడిట్ చేసి చూపించారు మాకు. నిడివి ఎక్కువ కావడం ఒక్కటే సమస్య అయినప్పటికీ, ఎక్కడా బోర్ కొట్టించలేదు దర్శకుడు. "అసహ్యకరమైన" కోరిక కోరడానికి కారణం, కొడుకు చివరి కోరిక తీర్చడంతో పాటు, వృద్ధుడైన తను, బలమైన శత్రువుల బారి నుంచి కోడలినీ, మనవలనీ కాపాడుకోలేననే మానవసహజమైన బలహీనత కూడా కావచ్చునేమో కదా.. అన్నట్టు 'గమ్యం' చూసి క్రిష్ కి టోపీ తీసిన వాళ్ళలో నేనూ ఉన్నాను.. కానీ 'వేదం' చూశాక మళ్ళీ పెట్టేసుకుందామా అన్న ఆలోచనలో పడ్డాను :-) :-) వీలు చూసుకుని మీరూ చూడండోసారి..
లోకేష్ శ్రీకాంత్, నెనర్లు.
ఇందు, అక్కడే నేను విభేదిస్తున్నది. అతను సున్నితంగా తియ్యడంలో, రొమాంటిసైజ్ చెయ్యలేదు - కానీ అలాగని ఉన్న బీభత్సాన్ని కూడా పూర్తిగా చూపలేదు. చూపినా అది సినిమాకి అచ్చిరాదు అనుకోండి.
మురళి, టోపీ పెట్టేస్కుందాం అంటారా? అసలే మా వూళ్ళో చలికాలం వచ్చేసింది! :)
pi said…
I liked neither of the films. I watched Raktha charithra. I would give it 2 stars. Background score was atrocious. It piqued my curiosity about violent politics.
@ pi - మీరు తెలుగు సినిమాల విషయంలో మీ స్టాండర్డ్ కిందకి దించాలి :)
తృష్ణ said…
మొదటిది నేను చూడలేదు కాబట్టి ఏం రాయలేను...:(
రెండోదాని గురించి మీరు చెప్పినవే ఒప్పేసుకుంటాం. అల్లరి నరేష్ గురించి నాక్కూడా సేమ్ ఇంప్రెషన్. ఇక ఈ సినిమా హీరో ఫేస్ నాకస్సలు నచ్చదు. "సమయమా" పాట పాడినది సునీత. సంగీతం సమకూర్చింది నాన్నగారి చిరకాల మిత్రులు ఈ.ఎస్.మూర్తి. నాన్న గురించి రాసిన కథలో రాసానీయన గురించి. కవి తిలక్ గారి మేనల్లుడీయన.

"గమ్యం" స్థాయిలో లేకపోయినా "వేదం" పర్వాలేదనిపించిందండి నాకు. A different & promising director అని నమ్మాలని అనిపించింది.
శిశిర said…
ప్రస్థానం సినిమా మాటలు, గమ్యం సినిమా కథనం నచ్చాయండి నాకు. చాలా ఆలోచింపచేసే డైలాగ్స్ రాశారు ప్రస్థానంలో. ఇక హీరోయిన్ హీరో బావకి చెల్లెలు గానే చూపించారు సినిమాలో.
RAKSINGAR said…
Prasthanam chudani vallevaraina unte mundu annee manesi velli chudandi.. alanti movie ravadam telugu industry cheskukunna adrustam antannenu... aa kahaleja lu brindavanalu action lu fighting lu faction lu mirapakaya lu vankayalu veetannitikinnaa chala manchi cinema...

cinema chusina next day kuda miru dani gurinche alochistunnaru ante ardam cheskondi adi elanti movie o..
ssr... said…
e madya edo dairyam chesi manavallu konchem chudadagga chitralu teesthunaru.Meeru vati ekalini peeki endukandi bedaragottesthunaru!!
Xx లు గారు, Sravs గారు, తెలుగు వ్యాఖ్యల్ని తెలుగు రాస్తే బాగుంటుందని మనవి.