భాష అంటే ఏవిటి? అదెలా ఉండాలి?

విశ్వనాథ సత్యనారాయణగారి వ్యంగ్య నవల "విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు"

రచయిత విష్ణుశర్మకి ఇంగ్లీషు పాఠం చెబుతూ "రాముడు రావణుని చంపెను" అనడానికి ఇంగ్లీషులో "Rama killed Ravana" అని చెబుతాడు.
వివరిస్తున్నట్టుగా "killed అనేది భూత కాలిక క్రియ" అన్నాడు.
దానికి విష్ణుశర్మ "అది సరేనయ్యా చంపటాన్ని మధ్య పెట్టావేమి?" అన్నాడు.
రచయిత అదంతే అన్నాడు.
విష్ణుశర్మ నవ్వి, "ఎవడు చంపబడాలో వాడు తప్పించుకు పోతాడు సుమా!" అన్నాడు.
ఆయన చమత్కారం రచయితకి వెంటనే అర్ధం కాకపోతే పక్కనే ఉండి ఇదంతా చోద్యం చూస్తున్న తిక్కన్న గారు ఇలా వ్యాఖ్యానించాడు. (ఈ కింద ఉటంకించిన వాక్యాలు కథలోనించి యథాతథంగా)
"అబ్బాయి! ఇది చమత్కారం కాదు, భాష. భాష అంటే, భావాలని అక్కడ ఉన్నటువంటి శబ్దాలూ వాక్యాల ద్వారా మనం తెలుసుకోవటం. మనుష్యుని యొక్క బుద్ధి ఎప్పుడూ ప్రసరిస్తూ ఉంటుంది. ఇది మనో లక్షణం. ఆ మనస్సు యొక్క నడకకు అనుకూలంగా భాషని నిర్మించుకోవాలి, వాక్య విన్యాసం అట్లా వుండాలి. చంపెను అనటంతోటే ఎవణ్ణో ఇదివరకే తెలియాలి. తరువాత తెలియటమనేది మనస్సులో ఉన్న పరమ సూక్ష్మాంశమునకు బరువైన విషయం. ఇంతవరకు మేము చదివింది ఏమీ లేదు. ఈ అక్షరాలు నేర్చుకుని, పది మాటలు దగ్గరకు వచ్చి, ఒక్క వాక్యం కాడికి వచ్చేటప్పటికి ఈ భాష ఇంత ఘోరంగా వున్నది. ఈ భాషని ఈ దేశంలో, ఈ బంగారం వంటి దేశంలో, సంస్కృతంలో నుంచి పుట్టిన తెలుగుభాష చదువుకున్న దేశంలో పసిపిల్ల లందరి బుద్ధుల మీదా అందరి మనస్సుల మీద వందల ఏండ్లుగా మీరు రుద్దుతున్నారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మనస్సులలో ఉన్న పరమ సూక్ష్మమైన పరమ సుకుమారమైన మనోవృత్తి ఎంత బరువవుతున్నదో మీకు తెలియటంలేదు. అందుకనే కాబోలు మీరందరూ ఇంత తెలివిగలవాళ్ళుగా ఉన్నారు."

Comments

gaddeswarup said…
"సంస్కృతంలో నుంచి పుట్టిన తెలుగుభాష"?
స్వరూప్ గారు, అది తిక్కన్న గారి అభిప్రాయమని చెప్పి విశ్వనాథవారి అభిప్రాయం అయుండొచ్చు. :)
rākeśvara said…
అందుకే నేను ఇప్పటివఱకూ విస్సిగాణ్ణి చదవలేదు. రేపెప్పుడైనా పొరబాటున చదవబోతే ఆపడానికి ఒక నింజాని కూలికి నియమించుకోదలచుకున్నాను. (shot in the dark నుండి కాపీకొట్టబడ్డ చంటబ్బాయిలో చిరంజీవిలా).

ఇంకా విడ్డూరం ఏంటంటే, ఆంగ్లం సంస్కృతం నుండి పుట్టిందంటే అర్థం వుంది. (అంగ అనేదే సంస్కృత పదం). కానీ తెలుఁగు సంస్కృతం నుండి వచ్చిందనడం ఇంకా నిష్టూరంగా వుంటుంది. పైపెచ్చు అవి తిక్కన అభిప్రాయాలఁట!
Sanath Sripathi said…
కొత్తపాళీ గారూ, మీరు ఇట్లా మధ్యలో ఉటంకిస్తే చదివే వారి పనేం గాను? తలా తోకా అర్థంకాక తలగోక్కునే అవకాశం లేదూ... రాముడు రావణుని చంపెను లో పదాలని అటునిటుగా మార్చినా చచ్చేవాడు, చంపబడేవాడూ, చచ్చుట అన్నవాటి అర్థం మారట్లేదు అన్నది సోదహరణంగా వివరించే సందర్భం లో కదా ఈ వాక్యాలు వచ్చేది (రాముడు రావణుని చంపెను, రావణుని రాముదు చంపెను, చంపెను రాముడు రావణుని)... మీరు కొంత భాగాన్ని మాత్రమే ఇస్తే చదువరులకు సమగ్రత అర్థం ఔతుందంటారా? టపా మరీ చిన్నది అయిపోయి బుర్రకి పదును ఎక్కువగా అవుతుంది అని అనిపిస్తోంది.

విశ్వనాథను చదవని వారు మీటపా చదివితే, మీరు (లేదా) విశ్వనాథ చెప్పదలుచుకున్న విషయం పూర్తిగా అవగాహన అయ్యేనా ?? ఇది నాకు మాత్రమే కలిగిన సమస్య అయితే క్షమించెయ్యండి.

స్వర్గంలోనుండీ విష్ణుశర్మాదులు భూమ్మీదకి రావటం, కాఫీ సేవించటం...మీకిది నేర్పిస్తే నాకేం ఇస్తారు అని రచయిత వారితో బేరాలాట్టం... బీయుటి బట్టు, పీయూటీ పుట్టు ఎమిటి అని ఇంగ్లీషు మొత్తాన్ని వారు చీల్చి చెండాడం.... ఇల్లా అయితే నేను గ్రామరు నేర్పించను అని రచయిత భీష్మించుకోవటం.... అబ్బో...నవల మొత్తం కట్టిపడెసి ఒకేబిగిని చదివింపజేసే రచన విశ్వనాథవారికి వెన్నతోపెట్టినవిద్య. నాకు బా నచ్చిన పొత్తన్ని చాలా రోజులకి గుర్తుచేశారు. కనీసం ఓ ఇరవై సార్లు చదివి ఉంటా దాన్ని నా ఫదో క్లాసులోపు...ధన్యవాదాలు కొత్తపాళీ
malathi said…
కొత్తపాళీ, పుస్తకం పేరు వినడమే కానీ నేను చదవలేదు. మీరింకా మొత్తంపుస్తకంమీద సమీక్ష రాస్తున్నారేమో అనుకున్నాను. మీరు కోట్ చేసిన heavyduty para నాకు అర్థం కాలేదు. అందుకే చదవలేదేమో నేను. :p
Unknown said…
ఇలాంటి చోట్లే నాకు విశ్వనాథతో కొద్దిగా పేచీ వచ్చేది. తనకి తెలుగంటే విపరీతమైన అభిమానం. ఇంగ్లీషు భాష తెలుగు మీద చేస్తున్న అజమాయిషీ చూస్తే అంతులేని వేదన. ఇంతవరకూ బాగానే ఉంది. కాని తెలుగు భాష ఇంగ్లీషు కన్నా సహజంగా గొప్పదని, దాన్ని తన తర్కాన్ని ఉపయోగించి నిరూపించాలనీ అనుకోడమే అతిశయం. ఎవరిని ఎవరు చంపారు అన్న విషయం కన్నా ఒకరు ఇంకొకరిని ఏం చేసారన్న ప్రశ్న ఇంకా "బరువైనది" అనుకోవచ్చుగా? అలాగే పదాలని ఏ క్రమంలో వ్రాసినా అదే అర్థం రావడమన్నది కూడా "గొప్ప" విషయమేమీ కాదు. తెలుగు భాషలో ఉన్న విభక్తి ప్రత్యయాల వల్ల ఇది చేకూరుతుంది. వాటి అవసరం లేకుండా కేవలం క్రమాన్ని బట్టి అర్థం రావడం ఇంగ్లీషు భాష ప్రత్యేకత. దేని ప్రత్యేకత దానిదే. బీయుటి బట్టు, పీయూటీ పుట్టు గురించి మనం ఎంత వింతగా అనుకుంటామో, మనం అంత వింతగా అనుకుంటామని తెలిసి వాళ్ళంత వింతపడతారు!
భాష శాస్త్రీయంగా ఏర్పడేది కాదని భాషాశాస్త్రజ్ఞులకి తెలుసున్న విషయమే. విశ్వనాథకి కూడా అది తెలియకపోవడమేమీ లేదు. సంస్కృత భాషకున్న పరిమితులు కూడా (కాకువులాంటివి దేశభాషలోనే సాధ్యమవ్వడం) ఆయన గుర్తించారు. కాని ఇంగ్లీషు భాష విషయానికి వచ్చేసరికి ఒక రకమయిన ఆవేశం ఆయనను ఆక్రమిస్తుంది. అయితే ఇంగ్లీషు సాహిత్యం మీద మాత్రం అతనికి గౌరవం లేకపోలేదు. భాష విషయమై, అది మన మీద రుద్దబడుతున్న తీరునే ఆయన సహించ లేకపోయారు.

ఇంగ్లీషు తెలుగు భాషలకి మౌలికమైన తేడాలు ఉన్నాయన్నది నిజం. భాష తనతోపాటు తరతరాల సంస్కృతిని, "మనదైన" ఒక ముద్రని మనకి అందిస్తుందన్నది నిజం. ఇంగ్లీషు బలవంతంగా మన మీద రుద్దబడిందన్నది (అవును ఇది భూతవాచకమే, అది ఇప్పటికే జరిగిపోయింది!) నిజం. దీనివల్ల మనదైన గతంతో మనకి చాలా లంకెలు తెగిపోతున్నాయన్నది వాస్తవం.

రాకేశ్వరా, ఇందుకే మీరు విస్సన్నని చదవలేదంటే మీరు చాలా నష్టపోతున్నట్టే! :-)
రాఘవ said…
కామేశ్వరరావుగారూ,

మీ ఈ వాక్యానికి నా తీవ్రాభ్యంతరం తెలియజేస్తున్నాను: "అలాగే పదాలని ఏ క్రమంలో వ్రాసినా అదే అర్థం రావడమన్నది కూడా 'గొప్ప' విషయమేమీ కాదు." ఇది మనకి మాత్రమే గొప్పవిషయం కాకపోవచ్చండీ. "దేని ప్రత్యేకత దానిదే" అన్నది మాత్రం నూటికి నూఱు పాళ్లూ నిజం.

"భాష శాస్త్రీయంగా ఏర్పడేది కాదని భాషాశాస్త్రజ్ఞులకి తెలుసున్న విషయమే." మ్... ఇది వేఱే ఏ భాషకైనా సరిపోతుందేమో కానీనండీ, శాస్త్రీయంగా సంస్కరింపబడిన సంస్కృతానికి మాత్రం కాదు.

మీరు సంస్కృతభాషకున్న పరిమితులూ అంటూ కాకువుగుఱించి చర్చ లేవదీసారు. నాకు అర్థమైనంతలో సంస్కృతభాషలో భావాలను వ్యక్తపరిచే పద్ధతే వేఱు. కాకువు లేదని ఎవరన్నారు? వైదికసంస్కృతంలో మాత్రమే అసందేహార్థం స్వరం చెప్పబడింది. లౌకికసంస్కృతంలో కావలసినంత కాకువు ఉంది. అంతెందుకండీ, అసలు కాకువు అన్నదే సంస్కృతపదం. :)
రాఘవ said…
రాకేశులవారూ, పెద్దవారిని మఱీ అలా విస్సిగాడూ అని సంబోధించటం బాగోలేదు. ఎవరికి బాగోలేదు అని అడిగితే, నాకు అని మాత్రం చెప్పగలను ప్రస్తుతానికి.
రాఘవ said…
గద్దె స్వరూప్ గారూ, నది కొండల్లో పుట్టింది అంటాం. మేఘాలగుఱించి చెప్పనవసరం లేదు కాబట్టి. అలాగే ఇదీనూ. సంస్కృతంలోనుంచి పుట్టిన తెలుగుభాష అంటే సంస్కృతం ద్వారా ఒక దారిని గ్రహించిన తెలుగుభాష అని చెప్పుకోవాలండీ. సంస్కృతం నుండి వచ్చినది సంస్కృతమే ఔతుంది. :)
ఎవరూ పట్టించుకోరులే అని నేను వేసిన ఈ బుల్లి టపాకి మంచి స్పందనే కాదు, ఆసక్తికరమైన చర్చ మేలుకున్నది - చాలా సంతోషం.
సనత్ గారు, అలా నాలిక్కి తగిలీ తగలకుండా రుచి చూపిస్తే, అసలు విషయం పూర్తిగా చదవాలనే కుతూహలం పుడుతుందని నా ఆశ.
కామేశ్వర్రావుగారు, కొద్దిగా ఇబ్బంది అని మొదలుపెట్టినా భావంలో మీరు చెప్పిన ఆవేదనే విశ్వనాథ వారిది కూడాను. ఇట్లాంటి విషయాల్లో ఆయన చక్కగా న్యాయబద్ధంగా వాదనలు చేసే మనిషి కాదని నాకనిపిస్తుంది.
రాఘవ, మంచి పాయింట్లు చెప్పారు.
రాకేశ్వర, మాలతి గారు - ఈ నవలిక తప్పక చదవ వలసిన పుస్తకం. ఇదొకటీ, హాహా హూహూ ఒకటీ.
Unknown said…
రాఘవగారు,

మీ అభ్యంతరానికి కారణం నాకు సరిగా బోధపడలేదు. సంస్కృతం గురించి మీరన్నది నిజమే. అది శాస్త్రీయంగా సంస్కరింపబడిన భాషే. నా ఉద్దేశం సాధారణంగా భాషలేవైనా వ్యవహారికంలోంచి పుట్టేవి, వాటికి శాస్త్రీయమైన లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదనీను. శాస్త్రీయంగా ఏర్పడిన/సంస్కరించిన భాషకి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి, కొన్ని ప్రత్యేకమైన విషయాలకి అది ఉపయోగపడుతుంది. అంత మాత్రం చేత అలాంటి భాష మిగతా భాషల కన్నా "గొప్ప" అని చెప్పలేం కదా. కాకువు గురించి మీరన్నది నిజమే. విశ్వనాథవారు వ్యావహారిక భాషను సమర్థిస్తూ దాని విషయంలో చెప్పారు.

తెలుగు భాష సంస్కృతంనుండి పుట్టిందనడానికి మీరన్న వివరణతో నేను ఏకీభవిస్తాను. వచ్చిన చిక్కల్లా శాస్త్రీయమైన చర్చచేస్తున్నట్టుగా అనిపించే వ్యాఖ్యానంలో ఇలాంటి అన్వయాలు సరిగా అతకవు.

ఈ సందర్భంలో విశ్వనాథ ఒక ఇంగ్లీషు ఇంటర్వ్యూలో చెప్పిన అభిప్రాయాలని ఇక్కడ ఉటంకించడం సమంజసమని, కొంచెం సుదీర్ఘమైనా ఇక్కడ ఇస్తున్నాను. విశ్వనాథ ఆలోచనలు ఇందులో మరికొంత స్పష్టంగా తెలుసుకోవచ్చు:


Q. Do you feel from your personal experience that Sanskrit is more expressive than Telugu in all aspects?

Ans: Any language is the most important thing in certain circumstances. The importance of that language much depends upon the politics of the world. Till recently the French language was the world's language, as they say. Now English took its position. During the time of predominance of Buddhism in this country and elsewhere, Pali was very well-read language in the whole of India. Telugu for some centuries was the most important language. Today, because of Mahatma Gandhi and his followers, Hindi perhaps has become one. If India becomes one of the biggest powers in the world, Hindi may occupy the same position as English does today. And so the expressiveness of a language depends much upon the culture and the needs of the people living at that time. You cannot find names for bombs, telegrams, telepathy, prudism, rocket etc., in Sanskrit. So also hundreds of words are there in Sanskrit the synonyms of which are not to be found in any modern language.
An American, writing a preface to his English book "Neethi Chandrika" wrote that the word "Neethi" has no synonym in English. You want to express your thoughts. That is a language. If many thoughts can be expressed in a language you call it expressiveness of the language. The thoughts are there. They are not the same all over the world and in all times. Times change, circumstances change. New ideas come and new thoughts arise. Man invents new words. Because of this, you cannot find fault with a very great language that flourished in a bygone age. For example the words like "Brahman Athman" etc., are used by English authors themselves as they are. The word "nephew" is there in English. He may be the son of your brother or sister. On that account we cannot say English is a poor language. Richness of English language lies elsewhere. And richness of Sanskrit also is elsewhere.

Regarding Telugu and Sanskrit. Telugu is 90 per cent Sanskrit. As the language of other States of India, Telugu also adopted many "Englishisms". What is the richness of a language? In a language there are groups of words relating to different customs, faiths, politics and many others. The greatness of Sanskrit is thorough as far as the soul, the development of the soul and the emancipation of the soul are concerned, it is the richest language in the world. There is no hope of any other language beating it out. It does not mean that Sanskrit is deficient of expression regarding other branches of life. It is much more rich in many phases of life than many of the modern languages. There is much more to say about the potentialities of a language. But not now.
రాఘవ said…
కామేశ్వరరావుగారూ

"అలాగే పదాలని ఏ క్రమంలో వ్రాసినా అదే అర్థం రావడమన్నది కూడా 'గొప్ప' విషయమేమీ కాదు." -- ఈ విషయంలో విభేదిస్తున్నాననండీ. కామాలూ ఫుల్-స్టాప్ లూ లేకపోతే అర్థం మారిపోయే భాష వారిది. మన భాషలలో ఈ ఆంగ్లభాషాసంపర్కం వలన కలిగిన పరిణామం ఒకటుంది. మనం కూడా కామాలూ ఫుల్-స్టాప్ లూ లేకుండా వ్రాయలేకపోతున్నాం. ఇటువంటి చిహ్నాల అవసరం లేకుండానే అర్థం ఆవలివారికి చెప్పగలిగే భాష మనది. మనకు ఉన్నది కేవలం వాక్యాంతరమైన పూర్ణవిరామం. చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పడం మనకు చేతనైన విద్య. మన భాషల శ్లేష కనబడితే అది కేవలం ఆనుషంగికం కానీ ప్రధానం కాదు. పైపెచ్చు వేదంలో అర్థభేదాలు రాకూడదు కూడాను. పదాలు ఏ క్రమంలో ఉన్నా అనటంతోనే భాషకు సంబంధించిన ఒక శక్తి బయటపడుతోందండీ. ప్రమాదవశాత్తూ పదాలు అటూ ఇటూ ఐనా, ఈ కామాలూ పుల్లవిఱుపులూ మఱచిపోయినా కూడా అర్థం చెడకపోవటం. ఇది ఆంగ్లభాషకు లేని అదనమైన శక్తి. ఇది గొప్ప విషయమేమీ కాదు అంటే నేనేమీ చేయలేను. ఒక్కటి మాత్రం చెప్పగలను. తెలుగు సంస్కృతం కాకపోయినా తెలుగుకు ఈ శక్తి ఎందుకు వచ్చింది? ఇక్కడే సంస్కృతపుటడుగుజాడలలో నడవబట్టి అని తెలుస్తోంది. ఇక్కడే సంస్కృతం తెలుగుకు మాతృక అన్న వాక్యానికి సార్థకత. జనని సంస్కృతంబు సర్వభాషలకును అన్నప్పుడూ ఇదే అర్థం.

ఒకే వర్ణాన్ని రెండు చోట్ల రెండు రకాలుగా పలకటంలోనే భాషలో లేఖనానికీ పాఠనానికీ మధ్య ఉన్న ఆంతరం పెద్దదీ అనే డొల్లతనం కనబడుతోంది. ఇప్పటికీ నాకు (మనకు) ఆంగ్లంలో క్రొత్తపదాలు విని నేర్చుకుంటే దాని వర్ణక్రమం ఏమిటని నిఘంటువులు చూచుకోవలసిందే. లేదంటే బట్ కు బీయూటీ వ్రాయబోయి బీయూటీటీ వ్రాస్తే గొడవైపోదూ. అలాగే నాకు (మనకు) ఆంగ్లంలో క్రొత్తపదం చదివి నేర్చుకుంటే దానిని ఏమని పలకాలి అని ఉచ్చారణ కూడా నిఘంటువులలో చూచుకోవలసిందే. ఇది గొప్ప అని నేను అనుకోవటం లేదు. ఇది ఆ భాషకు మాత్రం ప్రత్యేకం.

నేను గొప్ప అన్నప్పుడు అది పూర్తి భాషను దృష్టిలో ఉంచికొని అన్నది కాదు. కేవలం ప్రస్తుతమైన విషయాలలో ఏది గొప్ప అన్నది నిర్ణయిస్తున్నాని తెలియజేస్తున్నాను. భాషలలో ఏది గొప్ప అంటే ఆ భాషలు పూర్తిగా తెలిస్తే కానీ చెప్పలేని విషయం. రెండు పరస్పర సంబంధరహితమైన సంప్రదాయాలకు చెందిన భాషలు సంపూర్ణంగా నేర్చుకోవటం ఋషులకే సాధ్యం. వారికి ఈ హెచ్చు తగ్గు గొప్ప బీద భావాలు ఉండవు. గొడవే లేదు. :)

"బట్ బీయుటి బట్టు, పీయూటీ పుట్టు గురించి మనం ఎంత వింతగా అనుకుంటామో, మనం అంత వింతగా అనుకుంటామని తెలిసి వాళ్ళంత వింతపడతారు!" -- కూపస్థమండూకన్యాయమండీ. :) మనం ఎందుకు ఆశ్చర్యపోతామో వారికి ఆమూలాగ్రం స్పష్టంగా తెలిస్తే వారు కూడా ఆశ్చర్యపోరంటే అది అతిశయం కాదని నా నమ్మకం.

"సాధారణంగా భాషలేవైనా వ్యవహారికంలోంచి పుట్టేవి, వాటికి శాస్త్రీయమైన లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదనీను." -- ఔనండీ... శాస్త్రీయమైన లక్షణాలు అన్నారు కదండీ. మీరు అనుకుంటున్న లక్షణాలు ఏమిటేమిటి? నిర్దుష్టమైన వ్యాకరణం అన్న ఒక్క లక్షణం నాకు స్పష్టంగా తెలుస్తోంది. అదే తీసుకుంటే అలాంటి లక్షణం సంస్కృతాన్యమైన ఏ భాషకీ ఇప్పుడు లేదు. ఇకమీద ఉండకపోవచ్చు. ఇకమీద ఉండకపోవచ్చు అని ఎందుకు చెబుతున్నాననంటే సమస్తమైన సంస్కృతవాఙ్మయాన్నీ (లౌకికమైన కావ్యాలూ పురాణాలూ గట్రా మాత్రమే కాక సమస్త వేదశాఖలూనూ) దృష్టిలో ఉంచికొని పాణిని మహర్షి తన వ్యాకరణాన్ని వ్రాసారు. అది ఒక తపస్సు. తపఃఫలం. మిగతా భాషలలో మ్లేచ్ఛనం అపభాషణం వల్ల అర్థం మారకపోవచ్చు. ప్రత్యక్షరానికీ అర్థం చెప్పబడింది కాబట్టి సంస్కృతంలో అలా కాదు. నా తాత్పర్యం ఏమిటంటే సంస్కృతేతరమైన ఏ భాషకైనా శాస్త్రీయమైన ఈ లక్షణం ఉండదని. అలాంటి లక్షణం కల్పించగలిగే ఋషులు నేటి కాలంలో లేరనీ, ఈ కాలంలో నేటి పరిస్థితులలో ఇకమీద వచ్చే అవకాశాలు లేవనీ.

ఇంకొక విషయం. సంస్కృతం వ్యావహారిక భాషగా ఆర్యావర్తంలో చాలా కాలం నడిచింది (పతంజలి మహాభాష్యం). ఈ మధ్య నేను చాలా చోట్ల సంస్కృతం వ్యావహారిక భాష కాదు. కేవలం లేఖనానికి వాడిన భాష అని చెప్పడం చూచాను. ఇది ప్రమాదం. అందరికీ అన్నీ తెలియవలసిన అవసరం లేదు. కానీ ఇలా తెలియనిదానిపై ఊహాగానాలు చేస్తే ఇదిగో అప్రాచ్యుడైన మేక్స్ మ్యూలర్ కనిపెట్టిన ఆర్యులూ ద్రవిడులూ అన్న చందంగా తయారౌతుంది.

"తెలుగు భాష సంస్కృతంనుండి పుట్టిందనడానికి మీరన్న వివరణతో నేను ఏకీభవిస్తాను. వచ్చిన చిక్కల్లా శాస్త్రీయమైన చర్చచేస్తున్నట్టుగా అనిపించే వ్యాఖ్యానంలో ఇలాంటి అన్వయాలు సరిగా అతకవు." -- మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదండీ.

విశ్వనాథవారు పూర్తిగా చెప్పకుండా వేఱే ఎప్పుడైనా అని దాటవేసారు. ఈ విషయమై పెద్ద చర్చించలేం. మొదట రాజభాషగా గుర్తింపు వలన ఆయా భాషల ప్రాధాన్యం గుఱించి చెప్పినా కూడా తరువాత లౌకికపారలౌకికప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుంటే సంస్కృతాన్ని కొట్టేది లేదని ఆయనే అంటున్నారు కదండీ.
gaddeswarup said…
Raghava garu,
Interesting comment but I do not know what Telugu you are talking about. My Telugu is limited what I learnt in childhood and since I am way from Andhra since 1956, it is mostly what I speak to relatives when I go home or what I speak at home to wife and friends (not children, since they do not know telugu). And some poems and film songs that I remember or I heard later and books I look up once in a while. Bhadriraju in 'Dravidian Languages' is clear about Telugu origins. In every day telugu, there are lot of words like chokka, roju, railu etc which we seem to have borrowed from languages other than sanskrit. I vaguely remember some by Viswanatha like 'cheliyalikatta', 'kinnersanipaatalu', gipichand's 'asamarthuni jeevayaatra'. But the ones I remember most seem to be some by Annamacharya, Vemana and lines from film songs like "gundello gunapaallu guccarea neevallu, 'edabaatantea edalo mullu' 'vallamaalina mamata kamma temmera laaga kammukunnadi ninnu chinnadanaa'. I remember some by Srinadha but these are mostly his 'chaatu padyalu' or lines from 'palnati charitra'. For some reason I still remember 'atajani kanche bhuumisurundu' from Manu charitra though I do not remember the meaning. You may be thinking of Telugu of some 'text communities' but these are my subjective memories and I get my with them when I go home without mentioning any of the authors above. But some of the film songs or Vemana or Annamacharya people still seem to know.
రాఘవ said…
గద్దె స్వరూప్ గారూ, నేను అన్నది మీకు సరిగా అర్థం కాలేదనుకుంటాను. తెలుగు తెలుగుగా స్వయం ప్రతిపత్తి కలిగిన భాషే. కాదనను. తెలుగు సంస్కృతం నుండి పుట్టింది అన్నపుడు కేవలం తత్సమాలగుఱించి మాట్లాడుకుంటూంటే అలాంటి భాష కూడా సంస్కృతమే అంటాను నేను. సంస్కృతం నుండి పుట్టినది సంస్కృతమే ఔతుందీ అన్నపుడు సంస్కృతమంటే వ్యాకరణం ద్వారా సంస్కరింపబడిన భాష అని అర్థం. ఇక సంస్కృతభవాలు కాని అచ్చ తెలుగు పదాలు తీసికొంటే, వాటి పుట్టుకకూ సంస్కృతానికీ సంబంధం ఉండకపోవచ్చు. ఐతే ఆ పదాలు వాడే పద్ధతిలో తెలుగు సంస్కృతం నుండి కొన్ని లక్షణాలు పుణికిపుచ్చుకుంది. ఉదాహరణకు ప్రస్తుతవిచారణలోని కారకాలు (విభక్తులూ ప్రత్యయాలూ). ఈ రకంగా తత్సమాలలో నేరుగానూ (కనటం), తదితరాలలో పరోక్షంగానూ (పెంచటం) తెలుగుకూ సంస్కృతానికీ సంబంధం ఉందని స్పష్టం. ఈ రకమైన సంబంధాన్ని మన సంస్కృతిలో తల్లీపిల్లల సంబంధంగానే చెబుతాము.
gaddeswarup said…
Raghava garu,
I am beginning to understand a little of what you said; it seems to about the influence of Sanskrit grammar apart from the vocabulary. Suresh Kolichala (his Telugu is clearer to me) makes similar points in
http://www.eemaata.com/issue40/teluguvayassu.html
but with slightly different emphasis, I think.