మాసు క్లాసు ఇదేమి తిరకాసు

రెంటాల జయదేవగారు జూ. ఎన్టీయార్ బృందావనం సినిమాని సమీక్షిస్తూ "మాస్ హీరోగా ముద్ర పడిన చిన్న ఎన్టీయార్ ను, మంచి లవర్ బాయ్ గా చూపి, క్లాస్ కు దగ్గర చేయాలనే ప్రయత్నంగా ‘బృందావనం’ చిత్రాన్ని చెప్పుకోవచ్చు." అని రాశారు.

ఈ సినిమాని గురించి బ్లాగుల్లో ఇతర సమీక్షలు చర్చల్లో కూడా ఇంచుమించు ఇదే భావం, ఇంచుమించు ఇదేమాటల్లో వ్యక్తమయింది. ఇది నాకు బాగానే ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలీ క్లాసు - మాసు వర్గీకరణలు ఏంటి, వాటికేవన్నా అర్ధం ఉందా అన్నది నా మౌలికమైన ప్రశ్న. సినిమా పత్రికలూ, సినీ జర్నలిస్టులూ, సినిమాకి అంకితమైన సాలెగూళ్ళూ ఇలాంటి మాటల్ని అలవోకగా వాడేస్తూ ఉంటారు. అలాంటి వాడుకల వెనకాల ఒక నిర్దిష్టమైన ఆలోచన, ఒక స్పష్టమైన అవగాహన ఉన్నాయని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ మన భావాల్ని, అనుభూతుల్ని పంచుకోడానికి రాసుకునే బ్లాగులో కూడా ఇవే వాడుకలు ఎదురయ్యేటప్పటికి నాక్కొంచెం ఝలక్ తగిలిన మాట నిజం. అందుకే జయదేవగారి టపా దగ్గరా, ఇంకా ఒకట్రెండు సమీక్షల దగ్గరా దీన్ని గురించి నిరసనగా వ్యాఖ్యలు రాశాను.

జయదేవగారు సహృదయంతో స్పందించి, క్లాసు - మాసు వర్గీకరణ గురించి ఇంకో టపా వివరంగా రాశారు. ముందస్తుగా వారికి నా ధన్యవాదాలు. ఆ టపాలో మంచి పాయింట్లు చెప్పారు. ఇదేమి పెద్ద వివాదం కాదు గానీ, ఐనా నా సందేహాలు తీరలేదు. అందుకే నా రేండం ఆలోచనల్ని బయటపెట్టే ప్రయత్నం ఇది. నలుగురిముందూ పెడితే ఎవరన్నా నా సందేహాలు తీరుస్తారేమోననే చిన్న ఆశకూడ లేకపోలేదు.

నా ప్రతిపాదనలు ఇవి:
1. మంచి సినిమా, చెత్త సినిమా, పరవాలేదనిపించే సినిమా - ఇవే నాకు సంబంధించిన వర్గీకరణలు.
2. క్లాసు - మాసు అనే వర్గీకరణ ఇండస్ట్రీ వర్గాలకీ, ట్రేడ్ వర్గాలకీ ఉపయోగపడే కొలమానం అయితే కావచ్చు. ఒక ప్రేక్షకుడిగా ఈ లేబుల్ నాకేమీ ఉపయోగపడదు.
3. పరిశ్రమకి అనుబంధ వర్గాలు ఈ లేబుళ్ళని, వర్గీకరణల్ని వాడితే వాడారు గానీ, మన ఆనందం కోసం సినిమా చూసి, ఆ ఆనందాన్ని (కొండకచో బాధని) బ్లాగులో పంచుకునేందుకు రాసుకునే సమీక్షలో ఈ రొడ్డకొట్టుడు లేబుళ్ళని పట్టించుకోవలసిన పని లేదు. అంతే కాదు, మన సినిమాలు ఇంకొంచెం బాగుండాలి, ఇంకాసిని మంచి సినిమాలు రావాలని తాపత్రయపడే బ్లాగరులు ప్రయత్నపూర్వకంగా ఈ రొడ్డకొట్టుడు భావనల్ని దూరంగా ఉంచాలని కూడా నేననుకుంటాను.
4. ప్రస్తుతం తెలుగు తెరని ఏలుతున్న హీరోల్లో "క్లాసు" హీరోలు ఎవరన్నా ఉన్నారా?

గత ఐదారేళ్ళల్లో నేను చూసిన తెలుగు సినిమాల్ని నెమరు వేసుకున్నప్పుడు - జయదేవ గారు తన వివరణలో ఇచ్చిన నిర్వచనాలని బట్టి - కొన్ని మాసు సినిమాలు నాకు బాగా నచ్చాయి, కొన్ని క్లాసు సినిమాలు చాలా విసుగు పుట్టించాయి. ఫైట్లు రక్తపాతం ఇరగదీసే డాన్సులు రెండర్ధాల పాటలు (ఇంకా రెండర్ధాలు కూడా ఎక్కడున్నాయండీ బాబు, డైరెక్టుగా ఇంక అదే అర్ధం!) - ఇత్యాది సకల మసాలా దినుసులతో వండబడిన యమదొంగ, మగధీర బాగా నచ్చాయి. కొన్ని అస్సలు నచ్చలేదు (పేర్లు నాకిప్పుడు గుర్తు లేవు). పైన చెప్పిన మసాలా దినుసులు లేనివి, కుటుంబగాధలకి ప్రాముఖ్యతనిచ్చేవి క్లాసు చిత్రాలని నిర్వచించుకుంటే - అష్టాచెమ్మా, ఆకాశమంత బాగా నచ్చాయి. కొం యి కొం క, కొత్తబంగారులోకం పరవాలేదు అనిపించాయి. శశిరేఖాపరిణయం, ఆడవారి మాటలకి అర్ధాలు వేరులే, ప్రవరాఖ్యుడు లాంటి సినిమాలు చూసినప్పుడు కథ రాసినవాణ్ణీ, డైరక్టరునీ కలిపి తన్నాలన్నంత చిరాకు కలిగింది.

దీనికి ఇంకో కోణం ఉంది. సోకాల్డు మాసు హీరో సినిమాల్ని క్లాసు ఆడియెన్సులు బహిష్కరించడంగానీ చూడకుండా ఉండడం గానీ జరుగుతోందా? అన్ని రకాల ప్రేక్షకులూ విరగబడి చూస్తేనే గదా యమదొంగ, పోకిరీ, మగధీర అంత హిట్టయినాయి! పైగా భారత్‌లోనూ ఇక్కడ అమెరికాలోనూ నాకు పరిచ్యమున్న కుటుంబాల్లో - అబ్బే అది మాసు హీరో సినిమా కాబట్టి మేం చూడం - లాంటి సెంటిమెంటు నాకైతే ఎక్కడా వింబళ్ళేదు. గృహిణులు, పిల్లలతో సహా, తెలుగు సినిమా చూడ్డం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు అన్ని రకాల సినిమాలనీ (కొండకచో చూడకూడని వాటినికూడా, అంటే పిల్లలకి సముచితం కానివి) చూస్తూనే ఉన్నారు. మరి వీరుకాకుండా కుటుంబాలుగాని క్లాసు ప్రేక్షకులుగాని వేరే ఉన్నారేమో నాకు తెలియదు.

సినిమా హిట్టా ఫట్టా అన్న సంగతి కాసేపు పక్కన పెట్టి, సినిమాని సినిమాలాగానే చూస్తే .. అసలు ఒక సినిమానించి మనం ఏం ఆశిస్తాం? కొంచెం వినోదం. ఒక రెండున్నరగంటల సేపు మన బుర్రని డైరెక్టరు చేతుల్లో పెట్టినందుకు అతగాడు మనబుర్రని మరీ చెత్తకుండీలా చూడకూడదని ఆశించడం తప్పులేదు గద? సినిమా కథ అనుకున్నాక ఏదో ఒక పరిధిగీసుకుని, ఆ పరిధిలో కథ చెబుతాడు దర్శకుడు. మనం ఆ పరిధిని అంగీకరించాం అనుకుంటే, ఆ పరిధిలో కథ పకడ్బందీగా, లొసుగుల్లేకుండా ఉందా లేదా, ఆ కథని సినిమాగా మలచిన పద్ధతిలో ఏవన్నా వినోదం, చమత్కారం ఉన్నాయా లేదా? ఇవే మన ప్రమాణాలు. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం ఆసించట్లేదు.

ఉదాహరణకి మగధీర తీసుకుందాం. పునర్జన్మలుంటాయా లేదా అనే డౌటుతో సినిమా చూడ్డం మొదలు పెడితే ఇంక ఆ సినిమాలో వినోదించేందుకు ఏం లేదు. ప్రేక్షకులుగా మనం ఆ కథ పరిధిని - పునర్జన్మ ఉంది, పాత జ్ఞాపకం ఏదో ఒక విధంగా కొత్త జన్మలో తెలుసే అవకాశం ఉంది - అని మనం ఒప్పుకుంటే, మొత్తమ్మీద మిగతా కథ అంతా ఆ చట్రంలోకి చక్కగా ఇమిడింది. ఒక చక్కని వినోదభరితమైన (వినోదం అంటే ఇక్కడ నవ్వు అని కాదు) చిత్రం తయారైంది. మసాలా దినుసులుకూడా, చక్కటి భవనానికి బహుచక్కగా వేసిన రంగుల్లాగా, కథకి ఉపకరించే విధంగా అమరినాయి. దీనికి పోలికగా శశిరేఖాపరిణయంగానీ ఆడవారిమాటలకి అర్ధాలెవేరుళే గానీ తీసుకుని చూడండి. కథ పరిధిని మనం ఒప్పుకున్నా, ఆ పాత్రలుగాని, సన్నివేశాలుగాని, డయలాగులుగాని - ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా, అతుకులేసి కుట్టినా కూడ వొంటికి పట్టని చిరుగు చొక్కాలాగా ఉన్నాయి.

సో, లాష్టండ్ ఫైనలుగా నా విన్నపం ఏంటంటే .. క్లాసో మాసో మరో తిరకాసో .. మనకి అనవసరం. సినిమా బావుందా బాలేదా .. ఇదే మనక్కావల్సింది, కనీసం మనం బ్లాగుల్లో రాసుకునే వరకైనా.

మీరేమంటారు?





Comments

Hima bindu said…
మా వర్గీకరణ కూడా మీరు చెప్పిందేనండీ
Apparao said…
సగటు ప్రేక్షకుడు సినిమా చూసేటప్పుడు హీరో పాత్రలో లీనమై చూస్తాడు
మధ్య తరగతి ప్రేక్షకులు ఎక్కువగా ఉంటారు కాబట్టి హీరో ఎక్కువగా బీద వాడిగనో , మధ్య తరగతి వాడిగానో ఉంటాడు
దీనిని మాస్ అని అంటారు.
Anonymous said…
క్లాస్ అంటే ఏమిటి ? మాస్ అంటే ఏమిటి ? అని విపులంగా చెప్పడం కష్టం. ఒక్కొకరు ఒకో విధంగా నిర్వచిస్తారు. కొందరు అసలు మాస్ లేదు, క్లాస్ లేదు అంటారు.

ఒక క్లాస్ మూవీతో మాస్ ను ఆకట్టుకోవడం ఒక మాస్ సినిమాతో క్లాస్ ను ఆకట్టుకున్నంత ఈజీ కాదు.
Surya Mahavrata said…
ఈ వర్గీకరణ ప్రేక్షకులని బట్టి కాక, నిర్మాతలని బట్టి ఉండి ఉంటుంది. ఇష్టపడి కష్టపడి తీసినవి క్లాసు, పెట్టుబడి మీద వచ్చుబడి దృష్టితో తీసినవి మాసు అని. మాసుకి క్యాష్ బాక్సులు, క్లాసుకి మెటల్ ఆక్సులు (నందులు) ప్రతిఫలాలు.
Anonymous said…
Surya,మీ డెఫినిషన్ అదిరింది !
@ సూర్య .. కేష్ బాక్సులు - మెటల్ ఆక్సులు .. Brilliant
ప్రతి ఒక్కరిలోనూ రెండు కోణాలు ఉంటాయి. అందుకే అన్ని రకాల సినిమాలు చూస్తారు.
పోకిరి, మగధీర లాంటి సినిమాలు అందరూ చూసారంటే... అందరిలోనూ రెండు లక్షణాలు ఉన్నట్లే!
" ఒక సీన్ చూసేటప్పుడు చప్పట్లు కొట్టాలనిపించి కొడితే మాస్... కొట్టాలనిపించినా కొట్టకపోతే క్లాస్. దీనికి బాల్కానిలో ఉన్నామా నేలపై కూర్చున్నామా అన్నదానితో సంబంధం లేదు. " ఇది NTR ఇంటర్ వ్యూలో చెప్పాడు.
దీనికి మీరేమంటారు చెప్పండి.
బాబు said…
తెలుగు చలన చిత్ర వ్యాపారం లో మూడు జోన్లు ఉన్నాయి. వరసగా A, B, C సెంటర్లు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి థియేటరూ ఈ ABC లలో ఎదో ఒకటై ఉంటుంది.(ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ వద్ద ఈ లిస్టు సంపాదించవచ్చు)

A సెంటర్ లో ఆడేది క్లాసు సినిమా(ఇది కేవలం A సెంటర్ లోనే ఆడుతుంది)
A,B,C సెంటర్ లో ఆడేది మాసు సినిమా.

సినిమా బాగున్నప్పటికీ(?) క్లాసు సినిమా B,C సెంటర్లలో ఆడదు.(గమనిక: శంకరాభరణం క్లాసు సినిమాకాదు).తెలుగు సినిమా చేస్తున్నవందల కోట్ల వ్యాపారంలో ఉన్న వర్గీకరణ ఇది. హీరోలు కాలం గడిచేకొద్దీ తమేంటో తామే తెలుసుకోలేక అటూ ఇటూ మారుతుంటారు(కారణాలు అనేకం).

పుట్ బాల్ మైదానమంత విశాలహృదయం కలిగిన వారు వీటిని పట్టించుకోరు. :) వీరు హై క్లాసు...! :):)...(వీరి శాతం లెక్కలోకి రానంత తక్కువ)

సగటు ప్రేక్షకుడికి ఈ వర్గీకరణ అవసరమా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే సమీక్షకుడికి మాత్రంఅవసరమే..బ్లాగుల్లో రాసినా పత్రికల్లో రాసినా..!
చిన్ని, అప్పారావుశాస్త్రి, a2zdreams - సరే.
సవ్వడి - NTR ఇచ్చిన నిర్వచనం ప్రతి వ్యక్తిగత ప్రేక్షకునికి అన్వయించినది అనుకుంటాను. వోలుమొత్తం ప్రేక్షక వర్గాల విశ్లేషణకి అన్వయించలేము.
బాబు, వివరమైన విశ్లేషణ బాగుంది. నెనర్లు. మీరు శంకరాభరణం పేరెత్తటం నాకు భలే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఈ టపా రాస్తున్నంతసేపూ నా మనసులో ఆ సినిమా మెదుల్తూనే ఉంది, కానీ ఎప్పుడో ముప్పయ్యేళ్ళ నాటి సినిమా ఇప్పుడెందుకులే అని దాని ప్రస్తావన తేలేదు. అవును, ఆ సినిమా ఒక ఫినామినాన్ - ఈ విశ్లేషణలకి అతీతమైనది.
మీరంతా చెప్పిన దాన్నిబట్టి నాకు అర్ధమైనది ఏంటంటే క్లాసు మాసు వర్గీకరణకీ సినిమా హిట్టవడానికి పెద్దగా సంబంధం లేదు. ఈ వర్గీకరణకి మూలం, ఒకలాంటి సినిమాని ఒకలాంటి వర్గ ప్రేక్షకులు అభిమానిస్తారు అనే "అంచనా".
"ఒక క్లాస్ మూవీతో మాస్ ను ఆకట్టుకోవడం ఒక మాస్ సినిమాతో క్లాస్ ను ఆకట్టుకున్నంత ఈజీ కాదు." - ఈ శ్టేట్మెంట్ కూడా ముందు ఆశ్చర్యం కలిగించింది గానీ ఆలోచించిన మీదట నిజమే అనిపించింది.
శ్రీ said…
బాగా చెప్పారు. బ్లాగుల్లో మనం సినిమాల గురించి రాసేటపుడు మన అభిప్రాయాలను రాస్తూ ఉంటాం. ఈ క్లాసు, మాసు గొడవలు మనకు అనవసరం.
క్లాసయినా, మాసయినా మూస పద్ధతిలో లేకుండా మనం (పలు రకాలుగా) హర్ట్ కాకుండా హార్ట్ ని టచ్ చేస్తే చాలు.
శ్రీ, నెనర్లు.
శరత్, మీ అంచనాలు (హార్ట్ టచింగులూ గట్రా) చాలా హెచ్చుస్థాయిలో ఉన్నాయి. తెలుగుసినిమా చూసేప్పుడు నేను ఆశించేదల్లా దర్శకుడు మన బుర్రని చెత్తబుట్టలాగానో, సెప్టిక్ టేంకులాగానో వాడకుండా ఉంటే చాలు అని. గత రెండేళ్ళల్లో చూసిన ఏ తెలుగు సినిమా మీ గుండెని తాకిందో చప్పండి.
@ నేనైతే కచ్చితంగా మీరు చెప్పినదానికి అవునంటాను. మీరన్నట్టు శశిరేఖాపరిణయం, ఆడవారిమాటలకు అర్థాలే వేరులే, అరుంధతి సినిమాలు చూసాక తెలుగు సినిమాల మీద విరక్తి వచ్చేసింది. మీరు "నేనింతే" అనే సినిమా చూసారా? బావుంటుంది, నాకు నచ్చింది. వీలైతే చూడండి. అందులో క్లాసు మాసు సినిమాల మీద ఒక చిన్న చర్చ పెడతారు. ఒక టీ కొట్టువాడంటాడూ "శంకరాభరణం సినిమా క్లాసు జనాలు 'A' సెంటర్ వాళ్ళు చూస్తేనే హిట్ అయిందా, మాలాంటి 'C' సెంటర్ మాస్ ప్రేక్షకులు చూసి దాన్ని హిట్ చెయ్యలేదా? మీకు సినిమాలు తియ్యడం చేతకాక క్లాసు, మాసు అంటారుగానీ, మంచి సినిమాలు తీస్తే మేమెందుకు చూడం" అని.

అతనిచేత చెప్పించిన డైలాగులు ఇక్కడ సరిగ్గా సరిపోతాయనిపించి రాసాను. సినిమా బావుందా లేదా , హాల్ లో ఉన్న రెండు గంటలు మనం ఎంజాయ్ చేసామా లేదా అన్నదే పాయింటి. సునీల్ మాస్ అనా, క్లాస్ ఆ మర్యాద రామన్నా అంత హిట్ చేసారు. సినిమా చూస్తున్నంతసేపు మనసుకి హాయిగా అనిపించింది. మీరన్నట్టు బావుందా లేదా అన్నదే కావాలి ప్రేక్షకులకి. ఆ సినిమాలో తొడ గొట్టొచ్చు, కీర్తనలు ఆలపించొచ్చు. పునర్జన్మలు ఉంటాయని నమ్మించొచ్చు, మాయలు మంత్రాలు చూపించొచ్చు. ఏదన్నాగానీ బావుందా లేదా అన్నదే పాయింటు.
అరే కామెంట్లు చదవకుండా నేను కామెంటు రాసాను. ఆల్రెడీ శంకరాభరణం ప్రస్తావన వచ్చిందే, బలే!

@సూర్య
మీ నిర్వచనం అదిరిపోయింది.
GKK said…
క్లాసు అంటే నాజూకుదనం మాస్ అంటే మొరటుదనం అనుకుంటున్నాను. నిజానికి ఇవి ప్రతి (సినిమా) మనిషిలోనూ ఉండేవే. సమయ, కాల, సందర్భాన్ని బట్టి ఏదో ఒకటి బయటపడుతుంది. its all percentage game. అట్లనే సినిమా overall impact పడితే బాగుంది. పట్టకపోతే బాగాలేదు.
అది కాదండీ అన్నయ్యగారూ... ప్రేక్షకుడు కోరుకునేది చిటికెడు క్లాసు డబ్బాడు మాసు!(ఈ డైలాగుని ‘శ్రీదేవి పెళ్లి’ మిమిక్రీ క్యాసెట్లోలా జయంతి స్టోన్లో చదువుకోమని మనవి)
ఓసారి సింగీతం శ్రీనివాసరావుగారి ఇంటర్వ్యూలో చదివాను "మాయాబజార్ సినిమా తీసినప్పుడు దాన్ని మాస్ సినిమా అన్నారు. ఇప్పుడు క్లాస్ దాటి క్లాసిక్ అయ్యింది." అని.
ఇక క్లాస్ మాస్ మీద నాఅభిప్రాయం- క్లాసంటే ఇంటిల్లిపాది చూడగల్గింది. మాసంటే దీనికి వ్యతిరేకం.