మాంఛి కథలండే!

మా వూళ్ళోనండే, మరే, డీటీయెల్సీ అని ఒక సబుండాదండే!
నెలకోసారి గావాల్న మనోళ్ళందరూ ఆడజేరి తెలుగు పుస్కాలు చదివొచ్చి ఆడ చర్చలు జేస్తారండే!
మరండే, పెతీ సంవొచ్చరమూ కత అన్జెప్పి ఓ కతల బుక్కొచ్చుద్ది గదాండే? అంటే ఆ సంవొచ్చరంలో వొచ్చిన మాంఛి కథలండే!
ఓ పాలేవైనాదంటే, మా డీటీయెల్సీలో ఈ కత బుక్కుని చర్చిస్తనావండే, ఒగాయనన్నాడూ, థూ ఏందీ ఏడుపు నాగొట్టు కతలు? ఛీ దీనెమ్మ (ఆయన ఆ మాటన్లేదండే, నే సెబతన్నా గదా, తవరిలాటి ఇసయాలు కొంచెం నిబాయించుకోవల్న!) జీవితంలో సంతోసమనేది లేదా? ఆనందమనేది లేదా? కత రాయల్నంటే ఏడుపేనా? థూ దీనెమ్మ అని చానా ఫీలైపోనాడండి. నాను గూడ చానా ఫీలైపోనానండి - ఆయన నానూ కల్సి మీటంగం మద్దిలో కిందకి బొయ్యి కాపీ తాగొచ్చేటోళ్ళమండి. మరి ఆ మాత్రం ఫీలింగుండదేటండి, మీరే జెప్పండి?

సరెగాని దీనెమ్మ తెలుక్కతలన్ని యిట్టనే యేడుపుగొట్టుగ జచ్చినయ్యనిజెప్పి, ఇయ్యాల ఇంటికొస్తానె, ఏంటో కుశాలగనిపించి, యేదన్న కుసాలగ చదువుదాము అనిపించి, నిగనిగలాడతన్న యింగ్లీషు నవలోటి పట్టుకోని పైకొచ్చినానండే. జానీ వాకరు బ్లాక్ లేబిలు (ఏటి మజాకనుకున్నారేటి? 12 సంవచ్చరాల స్కాచి విస్కీ!) సరికొత్త బాటిలు మూద్దెరిచి హా సువాసనని
హమ్మ్
ముక్కపుటాల్లోకి పీల్సుకోని హమ్మ సమ్మగా ఓ సుక్కేసుకోని పుస్కం దెరిసినానండే. ఏవి సుకంగుండాలి, మీరే జెప్పండే! ఇంగ్లీసు నేల - ఇంగ్లీసు విస్కీ- ఇంగ్లీసు పుస్కం! కానేంటండే?

?
?
?

ఏంటండే ఈ పుస్కం? యాబై పేజీల్చదివినానండీ యీ పాటికి. అంతా కడుపు కోత దుఃఖం!!!

దుక్కం - ఒహటేనండే - దానికి తెలుగూ యింగ్లీసూ తేడాల్దెలీవండే .. దుక్కం ఒహటేనండే!
మాంఛి కథలండే! మరి యెతలున్న సోటనె కతలు గూడున్నాయండే!!

Comments

హ..హా..హా.. ఐతే ఇప్పుడేటంతారు?? ఆసేత్తోనే ఇంకో సుక్కేసుకుని ఆ పుస్కం బాగుంటదన్నోడిని రెండు పీకండి..:))
బలే రసేరండే.. మీరెప్పుడితేనండి.. బలె బలే రాసేత్తారు :)
Kalpana Rentala said…
కామెంట్ గూడా మీ లాగా రాయలంటే కష్టం కానీ ...మీరు బాగా రాశారు. బాగా చెప్పారు...వెతలున్న చోటే కతలుంటాయి.
ఆయ్.అంతా జెప్పినారు గానీ అంతగా ఏడిపించిన ఆ పుస్కం పేరేటో చెప్పలేదండి! చెప్తే మేంగూడా చదివేసి ఓ ఏడుపు ఏడిసేత్తామండీ (జానీ వాకర్ లేకపోయినా సరే)!
ఇందు said…
భాషా ప్రయోగం బాగుందండీ....లాస్ట్ లైన్ మంచిగా చెప్పారు.'వెతలున్న చోటే కతలుంటాయ్'

నేను ఆ మీటింగ్ కి వద్దామనుకున్నా!!'శ్రీ' గారు చెప్పారు.కాని కుదరలేదు.
హ హ బాగుంది గురూగారు :-) చివరిలైన్ చాలా బాగా చెప్పారు వెతలున్న చోటే కతలుంటాయ్...
జోతిగారు మా బాచెప్పేరండే .. ఆళ్ళనీ యీళ్ళనీ పీకితే ఊకుంటరేటండే! :)
WP. కల్పన, చిన్ని, వేణు .. నెనర్లు.
చంద్రమోహన్ .. ఆ ఆంగ్లనవలారాజం ఇది.
ఇందు .. ఇది మొన్నటి మీటంగం కత కాదులేండి, ఎప్పటిదో నేనింకా DTLCలో సభ్యుడిగా ఉన్నప్పటి కత. కానీ ఇంగ్లీషు నవల చదవడం మొదలెట్టింది మట్టుకు ఈ పోస్టురాసిన రోజునే.
మురళి said…
మీరెన్ని చెప్పండి.. ఒక కథా సంకలనంలో అన్నీ విషాద భరితమైన కథలుంటే ఏకబిగిన చదవడం కష్టం.. నవల దారి వేరు.. ఒకటే కథ కాబట్టి చదువుకుంటూ పోతాం.. అసలు సంకలనం అంటేనే రకరకాల కథాపుష్పాలని ఆశిస్తాం కదా.. ఇదండీ నా ఫీలింగు.. (వితవుట్ జానీ వాకర్ మరి!!)
తెల్లుక్కతల్ని ఏడుపుగొట్టన్నోళ్ళకి బారిస్టర్ పార్వతీశం, నామ్నీ సుబ్రమణ్యంనాయుడు ఇస్కూలుపిలకాయలకతలు, ఇల్లేరమ్మకతలు చదవమని చెప్పండి