కొంచెం నాట్యం కొంచెం సంగీతం

గడిచిన వారంలో గురువారంనాడు ఒక ఆధునిక నాట్యప్రదర్శన, శుక్రవారంనాడు కర్నాటక గాత్రప్రదర్శన చూసొచ్చాను.

నాట్యప్రదర్శన పాల్ టేలర్ డేన్స్ కంపెనీ వారిది ఏనార్బర్లో పవర్‌సెంటర్ అనే రంగస్థలమ్మీద జరిగింది. నేను చూసిన ప్రదర్శనలో రెండు అంశాలు చేశారు. మొదటిది Speaking in Tongues. సుమారు 45 నిమిషాల నిడివి ఉన్న ఈ అంశం చాలా విచిత్రంగా ఉన్నది. ఆధునిక నాట్య ప్రక్రియలని ఉపయోగిస్తూనే కథచెప్పడంలో ఒక వినూత్నమైన ప్రయోగం అనిపించింది నాకు. మన భారతీయనాట్యంలో లాగా చాలా అభినయం ఉంది ఇందులో - పాశ్చాత్య ఆధునిక నృత్యంలో అభినయం ఉండదు. కానీ కథ తిన్నగా సాగదు. పాత్రలేవీ గీతగీసినట్టు, నిర్వచించినట్టు నిలకడగా ఉండవు. కథ, కథనము, పాత్రలు - ఈ మూడూ నాట్యమనే ఒక ద్రావకంలో వేసి గిలక్కొడితే ఏర్పడిన రసాయన మిశ్రమంలా రంగులు మారిపోతూ నిత్యచలనంతో నిత్య చైతన్యంతో ఉన్నాయి. అంచేత ఆ చూసిన దృశ్యాల నించి ప్రేక్షకులు ఎవరికి వారు కథని తమతమ బుర్రల్లో అల్లుకోవలసిందే. మొత్తం తొమ్మిదైమందో పదిమందో ఉన్నారు నాట్యకారులు, ఆడామొగా కలిపి. వాళ్ళ మధ్యలో కదలికల సమన్వయం కానీ, ఆ కదలికల్లో ప్రస్ఫుటితమవుతున్న ఒక విసురైన శక్తికానీ కళ్ళని మిరుమిట్లు గొలిపాయి. ఏతన్మధ్య బుర్ర మాత్రం - ఇప్పుడు నేను చూసిందానికి అర్ధం ఏవిటీ అని బుర్ర గోకేసుకుంటూ ఉన్నది. ఈ అంశం తరవాత విరామ సమయంలో, నా వరసలో కొంచెం అవతలగా కూర్చున్న నలుగురు అమ్మాయిలు, వివి విద్యార్ధినులల్లే ఉన్నారు, నోటుబుక్కులు పెన్నులు పట్టుకుని బరబరా నోట్సులు రాసేస్తున్నారు - ఈ కార్యక్రమం చూడ్డం, దాన్ని గురించి రాయడం వాళ్ళకి క్లాసు ఎసైన్మెంటల్లే ఉంది. వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుంటున్నారు, ఈ ప్రదర్శనలో ఆయాభాగాలకి అర్ధమేమిటి, తమకి ఏం అర్ధమయింది అని. నాకు చాలా ముచ్చటగా అనిపించింది - ఏదో వచ్చాం, చూశాం, ఇంటికెళ్ళి తొంగున్నాం అన్నట్టు కాకుండా, వాళ్ళా ప్రదర్శనలో లీనమై లోతులు వెదకడాన్ని గమనిస్తే. ఈ అంశాన్ని 1988లో తొలిసారి ప్రదర్శించారట.

విరామం తరవాత రెండో అంశం - ఇదికూడా సుమారు 45 నిమిషాలు నడిచింది. యోహాన్ సెబాస్టియన్ బాఖ్ రచించిన రెండు వయొలిన్ కాంచెర్టోలకి ఇది నృత్యానువాదం. బాఖ్ సంగీతం సహజంగానే ఆహ్లాదంగా మృదువుగా ఉంటుంది. వయొలిన్ కాంచెర్టో అంటే ఆ మృదుత్వం ఇంక చెప్పక్కర్లేదు. అటుపైన దానికి నృత్య రచనచెయ్యడంలో శ్రీమాన్ టేలర్ గారు ఆ సంగీతంలోని ఆత్మని పట్టుకున్నట్టు చక్కగా కనులకింపైన కదలికలతో అమరికలతో ఈ అంశాన్ని రూపొందించారు. నటీనటులు ధరించిన ఆహార్యంకూడా కంటికింపయిన రంగుల్లో ఒక గులాబి పూలతోటని గుర్తుచేస్తూ ఉన్నది. నాట్యం అంతా నటీనటులు గుంపులు గుంపులుగా లయబద్ధంగా కదులుతూ ఆయా గుంపులు విడిపోయి కొత్త గుంపులు ఏర్పడుతూ ఉండడమే. బుర్రని హడావుడి పెట్టేసిన మొదటి అంశం తరవాత ఈ అంశం చెవులకీ కళ్ళకీ హాయినిచ్చి బుర్రని శాంతపరిచింది. దీనిలోకూడా నటీనటుల మధ్య ప్రకటితమైన సమన్వయం అద్భుతం. రెండు అంశాల్లోనూ లైటింగ్ డిజైన్ మరో అద్భుతం. లైటింగ్ అంటే ఊరికినే అవసరమున్నా లేకపోయినా రంగు రంగుల లైట్లు గుప్పించడం, స్ట్రోబు లైట్లలో కళ్ళు బైర్లు కమ్మించడం కాకుండా స్టేజిమీది వివిధ భాగాల్ని అవసరమైన పాళ్ళల్లో, అక్కడి అంశంలోని మూడ్‌కి తగినట్టు మార్చుకుంటూ, ప్రదర్శనలో విడదీయరాని భాగంగా లైటింగ్ భాసించింది. ప్రదర్శన ముగిసినాక నటీనటులు ప్రేక్షకుల అభినందనలు అందుకుంటుండగా ఎనభయ్యేళ్ళ పాల్ టేలర్ గారే స్వయంగా స్టేజిమీదికి విచ్చేశారు. అది ఇంకో అద్భుతం!

శుక్రవారంనాడు స్థానిక సంగీతసభవారు మల్లాది సోదరుల గాత్రకచేరి ఏర్పాటు చేశారు. ఒక మిడిల్ స్కూలు కేఫెటెరియాలో ఏర్పాటైంది సభ. ఇదేమిరానాయనా, సౌండు బాగుండదు అనుకుంటూ కూర్చున్నాను గానీ, ఆశ్చర్యంగా అకౌస్టిక్స్ బానే ఉంది. మల్లాది సోదరులతో పాటు బి.యు. గణేశప్రసాద్ గారు వయొలిన్, పత్రి సతీష్ కుమార్ గారు మృదంగం. శహన వర్ణంతో మొదలై అసావేరిలో త్యాగరాజస్వామివారి మాపాల వెలసి, తరవాత రామప్రియ రాగాన్ని విపులంగా ఆలపించి దీక్షితర్ కృతి మాతంగీ శ్రీ రాజరాజేశ్వరీ పాడారు. రామప్రియ ఆలాపన ఆసక్తి కరంగా ఉంది. ఇది 52వ మేళకర్త, దీక్షితార్ మద్ధతిలో దీన్ని రామమనోహరి అంటారు. స్వరాలు S, R1, G3, M2, P, D2, N2. R1 నించి G3 కి వేసే గంతు ఈ రాగానికి విలక్షణమైన నడకనిస్తుంది. ఐతే ఆలాపన వింటూ ఉంటే బాగా పరిచయమైన మలయమారుతం (రాగం పేరు) లాగా అనిపించింది. ఏవిటబ్బా అని ఇంటికొచ్చాక చూస్తే, అదే మరి - రామప్రియలోంచి ఆ ప్రతిమధ్యమాన్ని తొలగిస్తే అదే మలయమారుతమై కూర్చుంటుందాయెను. ఆహా నా చెవులు బాగానే పనిచేస్తున్నాయని నాకు నేనే అభినందించుకున్నాను.

శ్రీరంజనిలో పాపనాశం శివన్ గారి తమిళకృతి పాడాక త్యాగరాజస్వామివారి చిట్టిముత్యం ననుగన్న తల్లీ మంచి వేగంతో పాడారు. భైరవి రాగాలాపన ఎత్తుకున్నారు గానీ తొందరగా ముగిసినట్టు అనిపించింది. ఆ రాగానికి తగిన బరువుగానీ శ్రద్ధగానీ పెట్టలేదు. తానం మాత్రం చాలా చాలా బావుంది. సోదరులిద్దరూ వొంతులేసుకుని మంచి vigorతో పాడారు. దానికి తోడు వయొలిన్ మీద గణేష్, మృదంగం మీద సతీష్‌లు కూడా దీటైన సహకారం ఇచ్చారు. పల్లవి త్రిపురసుందరి అమ్మవారి మీద (నవరాత్రులు కదా!).. ఆది తాళం, అటుపైన వేసిన రాగమాలిక స్వరాలు - ఇవన్నీ కొంచెం చప్పగా ఉన్నాయి. మృదంగ తనిఆవర్తనం మంచి హుషారుగా ఉంది. ఈ అబ్బాయి రూప వేష విశేషాలు కొంచెం తమాషాగా, ఆకట్టుకునేట్టు ఉండి, ఎవరబ్బా అని కుతూహలంతో ఇంటికొచ్చాక జాలంలో వెదికాను. ఆ పొడుగాటి జుట్టూ అదీ కోంచెం తబలా ఉస్తాద్ జాకీర్ హుసేన్ స్టైల్లో పెట్టీంచాడు. వేషం ఒకటే సరిపోదు కదా, అతని వాయిద్యం కూడా మంచి పసతోనే ఉన్నది. ఇతనికి ఇంకా మంచి ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉంటుందనడంలో సందేహమేం లేదు. చాన్నాళ్ళ తరవాత అంతర్జాతీయ రంగమ్మీద మరోమంచి తెలుగు సంగీతకారుడు కనబడినందుకు సంతోషమనిపించింది. నాకు కనబడిన యూట్యూబ్ విడియోల్లో, అరుణాసాయిరాం గారి పక్కన ఇతను మృదంగం వాయిస్తున్న దృశ్యం మీకోసం. ఈ దృశ్యకపు తునకలో ఇంకో విశేషం - ఈ కచేరిలో వయొలిన్ వాయించిన రాఘవేంద్రరావుగారు కూడా తెలుగువాడే.

Comments

Kalpana Rentala said…
అదృష్టవంతులు...ఈ వారమంతా సంపూర్ణ సంగీత, నృత్య, సాహిత్య కళాపోసన లోనే గడిపినట్లున్నారు.

మీరు ఇంత అందంగా రాస్తే, మళ్ళీ నా లోపలి కళాకారిణి నిద్ర లేస్తున్న ప్రమాదం కనిపిస్తోంది.

మీరు వెళ్ళి ఆనందించటమే కాకుండా మాకు కూడా కాసింత కళాజ్నానమ్ ప్రసాదించారు. ధన్యవాదాలు.
భాను said…
అస్సలు మీకు ఇంత సమయం ఎట్లా దొరుకుతున్డబ్బ? మీరు ఇలా సంగీత సాహిత్యాలను మా ముందున్చుతుంటే... నెనర్లు. మాకు సంగీత జ్ఞ్యానం లేకున్నా మొత్తం శ్రద్దగా చదివేల రాసారు
తృష్ణ said…
బాగున్నాయండి కబుర్లు. మాకూ కచేరీ చూసిన, విన్న అనుభూతి కలిగించారు.
మల్లాది సోదరులు.....గురించి ఎక్కడైనా చదివితే చిన్నప్పుడు రోజూ పొద్దున్నే వీధి గుమ్మం అరుగు మీద నేను కూర్చున్నప్పుడు, అదే టైమ్లో వాళ్ళు ముగ్గురూ(వాళ్ల చెల్లితో) నిర్మలా కాన్వెంట్ స్కూల్ బస్ కోసం మా ఇంటి ఎదురుగా నిలబడి ఉండటం ఇప్పటికీ ఓ ఫోటోలా కనబడుతూ ఉంటుంది. నాన్నగారి కొలీగ్ పిల్లలవటం, ఒకే చోట చాలా ఏళ్ళు ఉండటంతో...ఎంత పేరుప్రఖ్యాతలు పొందినా మనవాళ్ళే అన్న భావన...ఆనందపరుస్తూ ఉంటుంది. మంచి గురువుగారు లభించటం, వృధ్ధిలోకి రావటం భగవదనుగ్రహం.
ఇందు said…
చక్కగా వ్రాసారు.అదృష్టవంతులు....
కల్పన .. కళాకారిణి నిద్రలేస్తే మంచిదే. చంద్రముఖి కాకుండా మాత్రం చూసుకోండి :)

భాను, తృష్ణ, ఇందు - సంతోషం