వంగూరి వారికి ఇండియనాపొలిస్ గీతావారికి శెల్యూట్!

ఒక గంట క్రితమే ఇండియనాపొలిస్ నించి తిరిగివచ్చాను.
రెండు రోజులు తెలుగుసాహిత్య చర్చల్లో మునిగి తేలి, సాహితీబంధువుల సాంగత్యంలో గడిపివచ్చిన ఆ ఆనందపు సుగంధం ఇంకా నన్ను ఆవరిచే ఉన్నది.

బ్లాగ్మిత్రుడు అఫ్సర్‌ని ఇదే ముఖాముఖి కలుసుకోవడం. చిరకాలంగా జాలంలో పరిచయమున్న యువమిత్రుడు, ఔత్సాహిక కవి కిరణ్ (నచకి పేరిట ప్రసిద్ధుడు) ని కూడా ఇదే చూడ్డం. కలిసి చాలాకాలమైన మిత్రులు డా. ఇయ్యుణ్ణి ఉమగారిని, డా. శొంఠి శారదాపూర్ణగారిని మళ్ళీ కలుసుకోవడం బాగుంది. షికాగో నించి చాలామందే వచ్చారు. సరే ఈ ఉత్సవానికి నాంది పలికిందే వంగూరి ఫౌండేషన్ కాబట్టి వంగూరి చిట్టెన్‌రాజుగారిని ఎలాగూ కలిశాననుకోండి.

ఇండియానించి ఇక్కడ తమ పిల్లల్ని చూసుకోడానికి వచ్చిన పెద్దలు పనిలోపనిగా ఈ సభావేదికని అలంకరించారు - లొయొలాకాలేజిలో నాకు హిందీ పాఠం చెప్పిన గురువులు, మాజీ పార్లమెంటు సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, ప్రముఖ సాహిత్య తత్త్వవేత్త బి. ఎస్. రాములుగారు, ప్రఖ్యాత రంగస్థలనటులు, పద్యకవి, ఆచార్య అక్కిరాజు సుందరరామకృష్ణగారు - ఇత్యాది ప్రముఖుల్ని కలుసుకోవడమేగాక రెందు రోజులపాటి వారి మాటలు వింటూ, వారితో కలిసి భోజనం చేస్తూ వారి సాంగత్యంలో గడిపే భాగ్యం చిక్కింది.

చివరిగా ప్రయాణంలో తోడొచ్చి, దారి ఖర్చులే కాదు, రోడ్డు కష్టాల్ని కూడా పంచుకున్న మిత్రుడు శ్రీ - శ్రమ తెలియకుండా ప్రయాణం జరిగింది. మరీ దూరం కాకపోయినా డిట్రాయిట్ నించి మేవిద్దరం తప్ప ఇంకెవరూ రాలేదెందుకో.

సదస్సు సమగ్ర నివేదిక శ్రీ రాస్తానన్నారు. బ్లాగుల గురించి నేను చెప్పిన మాటలు, ఇంకా సదస్సులో నా దృష్టిని ఆకర్షించిన అంశాలతో వేరే టపా వివరంగా రాస్తాను త్వరలోనే.

సదస్సు జరిగేందుకు విత్తనం వేసిన వంగూరివారికీ, నడుంబిగించి చక్కటి ఏర్పాట్లు చేసి సదస్సుని నిర్వహించిన ఇండియనాపొలిస్ గీతావారికి శెల్యూట్!

Comments

మాలతి said…
హాఁ, ఏంటండీ, ఇంతవరకూ మీరు అఫ్సర్ గారిని చూడలేదా. హా. నేనే ముందు చూశానోచ్ :)
ఈటపా, దీనిముందుది చదువుతుంటేనే చాలాఆనందంగా ఉంది. మాబోటీ పామరులకి ఇంతకన్నా సులువుగా చెప్పేవాళ్ళుదొరకరేమో
మాలతిగారు, ఎట్లాగైనా మీరు నాకంటే నాలుగడుగులు ముందే! :)
చైతన్య, అంతసీను లేదుగానీ జరిగిన అనుభవాల్ని పొంచుకోడానికేగా బ్లాగు రాస్తున్నది!
Unknown said…
మీకు "అంతటి" క్లుప్తత లేదని సభలో చెప్పినా ...మఱీ క్లుప్తంగా ముగించేసారు! మీ తరువాయి టపాల కోసం వేచి చూస్తాను. :-)
కిరణ్, వస్తున్నాయొస్తున్నాయి. ఈ టపా ఎపిటైజరు మాత్రం. కొంచెం ఓపిక పట్టాలి.
Unknown said…
vechi chusthuntaamandi mi tapa kosam. miru visheshalni cheppe vidhanam chala baguntundhandi. kallaku kattinattuga untaay.
శరత్ said…
ఈ సభలకు మీరూ వెళుతున్నారని తెలిస్తే నేను కూడా వచ్చేవాడినేమో. మీ బ్లాగులో చెప్పారేమో నాకు తెలియదు. మనకు తెలిసిన వారు వెళుతున్నారంటే మనకూ వెళ్ళాలని కాస్తయినా దురదగా వుంటుంది :) చికాగో నుండి కొంతమంది వచ్చారన్నారు. జయదేవ్ వచ్చారా? చికాగో సాహితీ సమావేశాలు జరుగుతున్నాయో లేదో సమాచారం ఏమీ లేదీ మధ్య.
స్ఫూర్తిగారు, మీరింక తెలుగు వ్యాఖ్యల్ని తెలుగు లిపిలోనే రాయాలి!

శరత్ గారు, గతవారపు కబుర్లలో చెప్పాను. అఫ్సర్ గారు దీన్ని గురించి ఒక టపాయే రాశారు. జయదేవ్ రాలేదు. షికాగో సాహిత్య సమావేశాల సంగతి కూడా తెలియదు. కానీ ఈ సభలో ఇండియనాపొలిస్ స్థానికుల తరవాత షికాగో వారి ప్రాతినిధ్యమే ఎక్కువ - అంతా కలిపి 15-20 మంది వచ్చినట్లున్నారు.