
నేనెంతో గౌరవంగా భావించే రేడియో విశ్లేషకులు, యువాన్ విలియమ్స్ ముస్లిముల గురించి చేసిన అనుచితమైన వ్యాఖ్యల వల్ల నేషనల్ పబ్లిక్ రేడియో ఆయన కాంట్రాక్టుని రద్దుచేసింది. సంక్లిష్టమైన ప్రపంచ పరిణామాల్ని, వార్తల్ని విశ్లేషించి విడమరిచి చెప్పే బాధ్యతాయుతమైన స్థితిలో ఉన్న యువాన్ వంటి మేధావుల నించి ఇటువంటి హేయమైన వ్యాఖ్యలు వినాల్సి రావడం నాకు చాలా బాధ కలిగించింది. ఇటీవల అమెరికను సమాజంలో అతి సున్నితమైఅన్ సందర్భాల్లో జాతి పరంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిన సందర్భాల్లో వివేకానికి ప్రతిధ్వనిలా నింపాదిగా ఎంతో సంయమనంతో మాట్లాడిన యువాన్ .. ఏంటో?
ఆరోగ్యం
You are what you eat అని ఆంగ్లోక్తి. అందులో కొంచెం కూడా అతిశయోక్తి లేదు. ఇరవై ముప్ఫై యేళ్ళ కిందట కూడా దైనందిన జీవితంలో భాగంగానే మైళ్ళకి మైళ్ళు నడుస్తూ, మెట్లెక్కుతూ దిగుతూ, ఇంటిపనులు చేసుకుంటూ, శరీరానికి తగినంత శ్రమ, వ్యాయామం కలిగిస్తూ ఉన్నప్పటి పరిస్థితి ఏమోగాని, ఇప్పటి మధ్యతరగతి జీవనశైలి మాత్రం ఏమితిన్నా హరాయించుకునేట్టుగా లేదు. అందుకని భోజనాన్ని నియంత్రించాల్సిన అవసరం మరింత పెరిగింది ఈ రోజుల్లో. ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకుంటున్నవారు తప్పక ఈ విషయం మీద శ్రద్ధ పెట్టాలి - ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం - ఈ రెండిటినీ పట్టించుకోవాలి. కొన్ని కొన్ని డయట్ ప్రోగ్రాములు స్వల్పవ్యవధిలో మంచి ఫలితాలని ఇవ్వవచ్చు కానీ ఆ ఫలితాలు జీవితాంతం ఉండకపోవచ్చు. అంచేత, మనం చేపట్టే మార్పులేవో జీవితమంతా మనతో ఉండే అలవాట్లుగా పెంపొందించుకోవాలి - అంచెలంచెలుగా చేసినా.
ఈ మార్పుల్లో మొట్టమొదట సాధించాల్సిన మెట్టు అన్నం మానెయ్యడం. అన్నం అంటే అన్నం ఒక్కటే కాదు, జీర్ణక్రియలో సులభంగా చక్కెరగా మార్పుచెందే పిండిపదార్ధాలు (కార్బోహైడ్రేట్లు) అన్నిటినీ మానెయ్యాలి. మనవాళ్ళు చాలామందికి భ్రాంతి - చపాతీలు పుల్కాలు అన్నం కంటే హెల్దీ అని. అస్సలు కాదు. ఈ కార్బోహైడ్రేట్ల కథా కమామిషూ వచ్చేవారం మరిన్ని వివరాలతో.
పర్యావరణం
ఇటీవల మెక్సికో గల్ఫ్‌లో జరిగిన చమురు పేలుడు వల్ల బ్రిటిష్ పెట్రోలియం కంపెనీ పట్లనేగాక మొత్తం చమురు పరిశ్రమ పట్ల జనాలకి కోపం హెచ్చింది. ఆ కోపాన్ని కాస్తయినా చల్లార్చి, తాము నిజంగా ప్రజలవైపే నని చూపించుకోవడానికి షెవ్రాన్ కంపెనీ ఒక ప్రకటన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి జాలరూపాన్ని ఇక్కడ చూడచ్చు.
ఐతే, చమురు కంపెనీల దగాకోరుతనాన్ని బయటపెడుతూ అచ్చం ఈ ప్రకటనలాగానే కనబడే ఇంకో పేరడీ సాలెగూడు మొదలైంది. ఆ పేరడీ ఇక్కడ.
ఈ పేరడీని "యెస్ మెన్" అనే గుంపు రూపొందించింది. ఈ పేరడీకి తెరవెనుక కథని వాళ్ళ బ్లాగులో చదవండి. కొంతకాలం క్రితం భోపాల్ తీర్పు వెలువడిన నేపథ్యంలో ఇదే గుంపు ఆ సందర్భంగా చేసిన "ఉత్తుత్తి ఇంటర్వ్యూ" ఇదిగో!
Yes men - Dow and Bhopal
ఈ వారపు సిఫారసు
టీవీ రాకమునుపు రేడియో మన దైనిందిన కార్యక్రమాల్లో ఎంతో ముఖ్యపాత్ర వహిస్తూ ఉండేది. ఉదయం భక్తిరంజనితో మేలుకొలిపి, రాత్రిపూట ఏదో ఒక వినోద కార్యక్రమంతో నిద్రపుచ్చుతూ - తెలుగు గడ్డమీద హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కడప కేంద్రాలనించి ప్రసారం చేస్తూ - ఎన్నో వినోద విజ్ఞాన కార్యక్రమాలని అందిస్తూ ఉండేది. అందులో విజయవాడ కేంద్రం ముఖ్యంగా సంగీతానికి సంబంధించిన కార్యక్రమాలకి అగ్రగామిగా ఉండేది. తొలినాళ్ళలో శ్రీమంగళంపల్లి బాలమురళీకృష్ణగారు, తదుపరి స్వర్గీయ శ్రీవోలేటి వేంకటేశ్వర్లుగారు - ఇద్దరూ గొప్ప సంగీత విద్వాంసులేగాక స్వతస్సిద్ధమైన సృజన శక్తి ఉన్నవారు - ఎన్నో అద్భుతమైన సంగీత కార్యక్రమాలని రూపొందించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది భక్తిరంజని కోసం తయారు చేసిన అనేక అంశాలు. నాకు బాగా గుర్తుండిపోయినదొకటి సూర్యదేవునికి పట్టిన గాత్ర నీరాజనం - శ్రీసూర్యనారాయణా మేలుకో అనే మేలుకొలుపు పాటతో మొదలై, తరవాత చక్కగా పాడిన భానుదండకం (మధ్య మధ్యలో విరామచిహ్నంగా వినిపించే బృందగానం), చివరగా రాగమాలికలో శ్రావ్యంగా గానం చేసిన ఆదిత్య హృదయం. దండకాన్నీ ఆదిత్యహృదయాన్నీ గానం చేసినది శ్రీనూకల చిన్నసత్యనారాయణగారు అనుకుంటున్నా. ఈ మూడు కలిపి ఇప్పుడు సీడీగా దొరుకుతున్నది - ఆకాశవాణి లేదా దూరదర్శన్ కేంద్రాల్లో మాత్రమే. తప్పక కొనుక్కోండి. చాలా బాగుంది.
ఈ వారపు బ్లాగు
శ్రీ పంతుల జోగారావుగారు సీనియర్ కథకులు. వివిధ పత్రికల్లో ఎన్నో ఏళ్ళుగా కొన్ని డజన్ల కథలు ప్రచురించారు. తన బ్లాగులో తన కథలతో పాటు సుభాషితాలు, చమత్కారమైన పద్యాల కథలు, తన చిన్నప్పటి విశేషాలు, తమ స్వస్థలం విజయనగరం కబుర్లు - ఇలా వైవిధ్యంగా ఎన్నో విషయాలమీద విపులంగా రాస్తున్నారు. క్రమం తప్పకుండా క్వాలిటీ తగ్గకుండా రాసే కొద్దిమంది బ్లాగర్లలో జోగారావుగారొకరు. చూడ్డం గనక మొదలెడితే మీరూ వదిలి పెట్టరు - ఏదీ, ఒక లుక్కెయ్యండి!
Comments
యువాన్ విలియమ్స్ చేసిన వ్యాఖ్యలు మరీ హేయమైనవేం కావనుకుంటానండి. ఒ’రెలి షోలోని కామెంట్ల గురించే కదా మీరు చెప్తుంది. post 9/11 చాలా మంది అమెరికన్ల అభిప్రాయాన్నే అతను చెప్పాడుకదా. చాలా మంది ఆలోచనా విదానాన్ని అలా మార్చేసింది ఆ సంఘటన, నమ్మటానికి ఒప్పుకోలేని సత్యం ఇది. కాకపోతే అతను NPR ను రిప్రజంట్ చేస్తూ ఇలా మాట్లాడి ఉండకూడదని వాళ్ళ అభిప్రాయమేమో అందుకే కాంట్రాక్ట్ రద్దు చేసుకుని ఉండచ్చు.
నా లోకం లో కి తొంగి చూసి మీరు నూర్ బాషా రహంతుల్లా గారిని గూర్చి నేను పెట్టిన టపాను అభినందించినందుకు కృతజ్ఞతలు .ఈ బ్లాగులోకంలోకి ఇప్పుడే అడుగు పెట్టిన వాడిని. మీ వంటి వారిని గూర్చి తెలుసుకోవాల్సింది చాలానే వుంది.మీ బ్లాగ్ అద్భుతంగా వుంది. అభినందనలు.
naa blog lo mee mecchukolu tho pongi poyina naaku, meeru entha seniorlo telisindi, mee blog loki pravesinchhaka. mee bahula krushi chaala abhinandaneeyam.. appudaapudu naa blogintini koodaa sandarsisthaaru ani ahvaanam to, akanksh ni kalup utunnanu..
vasantham.
@ వేణు, యువాన్ విలియమ్స్ గురించి మీ భావం అర్ధమయింది. అతను ఓరెలి షోలో NPR రిప్రజెంటెటివ్‌గా ఉన్నాడని అనుకోను. కానీ అటువంటి విశ్లేషకులకి సమాజం పట్ల ఒక బాధ్యత ఉంటుందని నేను నమ్ముతున్నాను. అంచేత వ్యక్తిగతమైన అభిప్రాయాలని (భయాలని) వారు బహిరంగ వేదికల మీద బయటపెట్టడం తగదనే నా అభిప్రాయం.
@ హనుమంతరావుగారికి, మీ అభిమానానికి ధన్యవాదాలు.
Thank you
Please visit http://lekhini.org
It is one of the easiest tools to write in Telugu.
You may visit
http://etelugu.org/helpcenter
for more detailed information.