అమెరికా అంటే నాకిష్టం - టోనీ బ్లెయిర్ మాటల్లో

"అమెరికా అంటే నాకిష్టం" అనే శీర్షికతో ఈ బ్లాగులో ఇదివరలో కొన్ని టపాలు రాశాను. సందర్భోచితంగా మరికొన్ని చోట్ల కూడా అమెరికా పట్ల నా అభిమానాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తూ వచ్చాను. కానీ ఎప్పుడూ ఏదో ఒక వెల్తి, నా మనసులో ఉన్నది సరిగ్గా చెప్పలేకపోతున్నాను అని. ఇందాక టైం వారపత్రిక సైట్లో టోనీ బ్లెయిర్ ఆత్మకథ పేజీనొకదాన్ని చదివినప్పుడు, హబ్బ, సరిగ్గా నా మనసులో మాట రాశాడీయన అనిపించింది. అది మీతో పంచుకోవాలని ..

తెలుగుసేత నాది. టపా కింద టైం పత్రికకి లంకె ఉంది. ఆంగ్లం కావాలంటే అక్కడ చదువుకోవచ్చు.

మిగతా ప్రపంచం అమెరికన్లని ఆడిపోసుకునే లక్షణాలు ఉన్నాయి అమెరికన్లలో - వాళ్ళు ఒకింత పొగరుగా, పెద్దనోరేసుకుని మాట్లాడుతూ, అంటీముట్టనట్టు ఉంటూ, తాము పట్టిందానికి మూడేకాళ్ళంటూ, ఒకింత పెత్తనం చెలాయిస్తూ ఉంటారు నిజమే. అయినా అమెరికా గొప్పతనానికి ఒక కారణముంది. ఎంత తిట్టుకున్నా మిగతా ప్రపంచం అమెరికాకేసి తలెత్తి చూస్తుండడానికి ఒక కారణం ఉంది. అమెరికను వ్యక్తిత్వంలో ఒక మొక్కవోనితనం- కొన్ని శతాబ్దాల చరిత్ర పేర్చిపెట్టినది, కొత్త ప్రపంచపు ఉత్సాహంతో వచ్చినది, రకరకాల కాందిశీకుల కలయికతో ఏర్పడినది, స్వాతంత్ర్య యుద్ధంతో సాధించుకున్నది, గొప్ప అంతర్యుద్ధం ద్వారా రాటుదేలినది, ఇంకా అనేక చారిత్రక సంఘటనల వల్ల రూపుదిద్దుకున్నది - అటువంటి రాజసం ఒకటున్నది.

ఐతే అది మంచితనానికి సంబంధించినది కాదు. మిగతా వాళ్ళకన్నా గొప్పగా ఉండడానికి సంబంధించినది కూడా కాదు. అది తమ దేశానికి సంబంధించిన ఒక భావన. జాతి మత వర్గ భేదాల్ని అధిగమించిన ఒకానొక అమెరికను ప్రతీక పట్ల ఆరాధన అది. విలువలకి సంబంధించిన ప్రతీక అది - స్వేఛ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పరిపాలన, స్వశక్తితో కష్టపడి వృద్ధిలోకి రావడం, ఇలాంటి విలువల్లో ఆ అమెరికన్ ప్రతీక ఉంది. ఈ ప్రతీకని సాధించడంలో, రక్షించుకోవడంలో వ్యక్తికన్నా దేశం ముఖ్యం అనే ఒక మజ్జాగతమైన సత్యం. నిజమే - ఈ ప్రతీక ఎల్లప్పుడూ ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు, కానీ అమెరికనులు దాని కోసం ఎల్లప్పుడూ పాటుపడుతూనే ఉంటారు.

Read more: http://www.time.com/time/world/article/0,8599,2015409-3,00.html#ixzz0yOIrMUrK

Comments

విలువలకి సంబంధించిన ప్రతీక అది - స్వేఛ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పరిపాలన, స్వశక్తితో కష్టపడి వృద్ధిలోకి రావడం, ఇలాంటి విలువల్లో ఆ అమెరికన్ ప్రతీక ఉంది. ఈ ప్రతీకని సాధించడంలో, రక్షించుకోవడంలో వ్యక్తికన్నా దేశం ముఖ్యం అనే ఒక మజ్జాగతమైన సత్యం. నిజమే
కొత్తపాళిగారికి నమస్కారాలు,
నాకు అమెరికా గురించి పెద్దగా తెలియదుకాని,మీలాంటి ప్రవాస భారతీయుల సాన్నిహిత్యం తో ఎంతో కొంత తెలుసుకుంటుంటాను.కాని కొన్ని వాస్తవాలు తెలిసి నపుడుచాలా భాద కలుగుతుంది. మన విలువల రక్షణ కోసం ఇతరుల హక్కులు హరించటం దానికి బాగా తెలుసు.అలాగే వారి ఆర్దికాభివ్రుద్ది కోసం ఇతర ఆర్ధికవ్యవస్థ లని తెలివితేటలతో కూల్చటం ,కనీస నైతికత్వం,మానవహక్కులు వారి స్వదేశంలో తప్ప ఎక్కడైనా ఉల్లంఘించటం లో వారికి వారే సాటి.
ఇది నా అభిప్రాయం మాత్రమె, వీటిలో సత్యదూరమైన విషయాలు ఉంటె తెలియచేయ మనవి.
@ vajasaneya .. కాదనడం లేదు. ఐతే అమెరికా ఈ గ్లోబలు పోలీసులాగా, గ్లోబలు దుండగీడుగా వ్యవహరించడం సుమారుగా రెండో ప్రపంచ యుద్ధం తరవాత నించే మొదలైంది. కానీ అమెరికను ప్రతీక అనేది తొలి వలసనివాసాల నించీ (సుమారు 500 యేళ్ళుగా) పటిష్ఠమవుతూనే ఉంది. ఈ పరిణామంలో అమెరికను భూభాగం మీదానే, చట్టపరిధిలోనే, ప్రభుత్వం పేరిటే చాలా దారుణమైన దుర్మార్గాలు జరిగాయి - స్థానిక అమెరికను తెగల పట్ల, నల్లజాతి బానిసల వ్యాపారంలో, ఇంకా ఇతరత్రా చాలా ఘోరాలు జరిగాయి. కంటిలో నలుసు తీయాలంటే కనుగుడ్డు పెరికివేయాలా అన్నారో కవిగారు. అమెరికను వ్యక్తిత్వంలో ప్రతీకలో ఒక గొప్పదైన, మెచ్చుకోదగిన, అనుసరించదగిన విశిష్టత ఉన్నది అని ఒప్పుకోవడానికి ఇవేవీ అడ్డంకులు కావు అని నా విశ్వాసం.
Anonymous said…
అమెరికా వాళ్ళంతా గొప్పవాళ్ళనుకునే మీ బానిస బుద్ధి అమెరికాలో వున్నా పోలేదేదన్న మాట. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కాని పోవంటారు, అందుకే.
@ Anon .. Interesting comment.
సమర్ధించుకోవడానికి చెప్పడం లేదు. అమెరికా వచ్చేవరకూ అమెరికా గురించి, అమెరికనుల గురించీ నాకు ఏమీ తెలియదు - ఇక్కడి జీవితంలోనే తెలుసుకున్నాను నే తెలుసుకున్నదేదైనా.
Anonymous said…
అమెరికా చరిత్ర నాకు తెలియదు.కానీ ప్రస్తుతం నడుస్తున్న చరిత్రను చూస్తూ కూడా అమెరికా అంటే నాకిష్టం అంటున్నారంటే ఆలోచించాల్సిన విషయమే..ఎగ్జిస్టెన్షిలియజానికి ప్రతీకలైన వారు వ్యక్తి కన్నా దేశం ముఖ్యం అనుకుంటారా..!..Interesting.! పైన vajasaneya గారి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను.

అమెరికాలో ఉంటున్నారు కాబట్టి అమెరికా అంటే ఇష్టపడుతున్నారని నేను ఆస్సలు భావించటం లేదు.
మంచి ఎక్కడునా గ్రహించాలి ,వాస్తవం చేదుగా ఉన్న తెలుసుకోవాలి.మీ ఉద్దేశం నాకు అర్ధమైంది .
ధన్యవాదాలు.మీలాంటి వారు నా లాంటి కొత్త బ్లాగరులకి సలహాలు ఇవ్వాలని కోరుతున్నా.
@ vajasaneya .. నేను అంత విశ్వవ్యాపితమైన సందేశం కూడా ఇవ్వడంలేదు. ఇక్కడ విషయం మంచి చెడు కూడా కాదు. అమెరికాకి సంబంధించి నన్ను ఆకర్షించిన విషయాలు చెబుతున్నా, అంతే. అంతకంటే ఎక్కువా కాదు, తక్కువా కాదు. మీ హేండిల్ లంకె నొక్కితే మీ ప్రొఫైలుకి, బ్లాగుకి దారి మూయబడి ఉన్నది. అంచేత మీ బ్లాగు చూసే అవకాశం కలగలేదు.