మళ్ళీ మళ్ళీ చదవాలి ఈ బుక్కూ ..

ప్రసిద్ధమైన హాలీవుడు చిత్రం కేసబ్లాంకాలో ఇంకా ప్రసిద్ధి చెందిన డయలాగ్ - ప్లే ఇట్ ఎగేన్, శాం! అని. నాయికకీ నాయకునికీ గత జ్ఞాపకాల సేతువులాంటి పాటనొకదాన్ని మళ్ళీ వాయించమని శాం అనే పియానో వాద్యకారుణ్ణి కోరుతూ నాయిక ఇన్‌గ్రిడ్ బెర్గ్‌మేన్ చెప్పే డయలాగిది.

ఏదన్నా పుస్తకం తీసుకుందామని బుక్‌షెల్ఫు దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడప్పుడూ, ఈ డయలాగుని కొద్దిగా మార్చి, రీడిట్ ఎగేన్, శాం! అని నాకు నేనే చెప్పుకుంటూ ఉంటాను.

పాత పుస్తకం. ఎంతో పరిచయమైన పుస్తకం. మొదటి అట్ట దగ్గర్నించీ చివరి అట్టదాకా, ఏయే పేజీల్లో ఏయే విషయాలున్నాయో ఇంచుమించు హృదయస్థంగా తెలిసిపోయిన పుస్తకం. ఏముంది ఇందులో మళ్ళీ కొత్తగా చదివేందుకు?

పాత పుస్తకం. ఎంతో పరిచయమైన పుస్తకం. ఒకటో క్లాసులో బళ్ళో మొదటి రోజున నా పెన్సిలి ములుకు విరిగిపోతే షార్పెనర్ లేక బిక్కమొగం వేస్తే చొరవగా తీసుకుని చెక్కిపెట్టి అప్పణ్ణించీ ఆప్తమిత్రుడైపోయిన బాబూజీ జ్ఞాపకం. నాలుగో క్లాసులో కుంటాట ఆడుతూ పడిపోయి మోకాలికి దెబ్బతగిల్తే తనకోసం కొనుక్కున్న జాంకాయని కాకెంగిలి చేసి కొరికి నాకో ముక్క పెట్టిన స్వరాజ్యం చూపించిన అభిమానం. హైస్కూల్లో అనర్గళ ప్రవాహంలాంటి హెడ్మాస్టారి ఆంగ్ల పాఠం - అప్పటిదాకా ఇంగ్లీషు పాఠమంటే పాఠంలోని ఇంగ్లీషు మాటలకి తెలుగులో అర్ధాలు చెప్పుకుని బట్టీ కొట్టడమే - ఇంగ్లీషు పద్యంలో ఇంత మాధుర్యం ఉందా అని తెలుసుకున్న తొలి అనుభవం అది. అటుపైన కాలేజి విద్యార్ధినై ఇల్లు విడిచి బయటి ప్రపంచంలో తప్పటడుగులు వేస్తూ, అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా మాత్రమే ఇంటికొచ్చే నన్ను, ఏవేళకి ఇల్లు చేరినా, అన్నం తిన్నావా నాన్నా అని పలకరించిన అమ్మ ఆప్యాయత - నేను కాలేజి విద్యార్ధినైనా, మాస్టర్నైనా ఆ ఆప్యాయత మారదు గదా.

పాత పుస్తకం. ఎంతో పరిచయమైన పుస్తకం. నా మెదడుకి తెలుసు. పోయిన్నెల్లో కొన్న ఆ ప్రపంచ ఆర్ధికస్థితి విశ్లేషణ పుస్తకం ఇంకా తెరవనేలేదు. మొన్నటి వారంలోనే తెప్పించిన లేటెస్టు బెస్ట్ సెల్లరు నవల ఇంకా పేకెట్టే విప్పలేదు. కొత్త పుస్తకాలు చాలా ఉన్నై చదవాల్సినవి. తెలుసుకోవలసిన విషయాలు బోలెడున్నై. కానీ, చిన్నతనంలో పిచ్చిని పోలి ఉండే ఏకాగ్రతతో చేసినపనినే విసుగులేకుండా మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండే ఆ పునరావృత్తిలోని హిప్నాటిక్ ఆకర్షణ. ఒక గిల్టీ ప్లెజర్ - స్ట్రిక్ట్ డయట్ పాటించవలసిన వాడు ఒకసారి, నాలుగు చెంచాలే అయినా, తనకిష్టమైన బటర్ పీకాన్ ఐస్క్రీము తినెయ్యడం. ఒక గిల్టీ ప్లెజర్ - ఇలా దొంగతనంగా రాబట్టుకున్నే చిన్ని సుఖం కలిగించే ఆనందం లెజిటిమేట్‌గా వచ్చే ఏ గొప్ప సుఖమూ ఇవ్వలేదుగదా!

అలాంటి గిల్టీ ప్లెజర్ .. నా పాతపుస్తం!!

పాత పుస్తకం. ఎంతో పరిచయమైన పుస్తకం. పాత జ్ఞాపకాలంత అపురూపం. కానీ అనుభవాలు జ్ఞాపకాలు మళ్ళీ అనుభవంలోకి రావు. మనసు వీధుల్లో పిల్ల తెమ్మెరల్లా పలకరించాల్సిందే. పాత పుస్తకం అలాక్కాదు. మన దగ్గరే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరిచి చదువుకోవచ్చు. ఆ మాయదుప్పటీ మన మీద కప్పేసుకుని నాలుగో క్లాసులోకో, హైస్కూలు వయసుకో వెళ్ళిపోవచ్చు, మళ్ళీ కాస్సేపు.

నా దగ్గిర ఓ అరడజను ఉన్నాయ్ ఇలాంటి మాయదుప్పట్లు.
మరి మీ మాయ దుప్పటీ ఏంటి?

Comments

మాలతి said…
కానీ, చిన్నతనంలో పిచ్చిని పోలి ఉండే ఏకాగ్రతతో చేసినపనినే విసుగులేకుండా మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండే ఆ పునరావృత్తిలోని హిప్నాటిక్ ఆకర్షణ. - ఆణిముత్యంలాటి మాట చెప్పేరండీ. రెండుతరాలవెనకటి కథలంటే అలాటి అకర్షణ నాక్కూడా అందుకే. నాలుగో పేరా అంతా మళ్ళీ ఇక్కడ తిరిగిరాసేయాలన్నంత బాగుంది.
నిజమే సార్.. జ్నాపకాల చిత్తడి లేకపోతే బతుకు శూన్యం ఎవరికైనా.. ఎంతటివారికైనా.. నాకూ కొత్త తొవ్వ చూపిన మిత్రుని కరచాలనపు వెచ్చని స్పర్శ ఆయనిచ్చిన ఓ బుక్కును తాకినప్పుడంతా కలుగుతుంది. మంచి పోస్టు ద్వారా మనసును తట్టిలేపినందుకు ధన్యవాదాలు..
Purnima said…
Aah!

Can you tell me what I'm supposed to do to make you write in pustakam.net? :(

Can I loan this idea for next month's focus? Let me know what you think.

Thanks to blaagaadistaa Ravi garu for letting me know about this post.
నా దగ్గరా ఉన్నాయి అలాంటి దుప్పట్లు.
ప్రస్తుతానికైతే "అమరావతి కథలు."
మాలతి గారు, నచ్చినందుకు సంతోషం. మనలోమాట, నా మాయదుప్పట్లు రెందుతరాలకన్నా ఇంకా పాతవే :)
కెక్యూబ్, నిజమే, ఇదికూడా ఓ పాజిబిలిటీ. కానీ నాకు పుస్తకాల్లో వేల్యూ కేవలం పుస్తకం వల్లనే.
Purnima, Aah, indeed! You can certainly have the idea for Focus - not a loan - you can simply have it. I do support Pustakam in a very important way - by reading :)
And I too thank Ravi!
ఉమాశంకర్ గారు, మీకూ నాకూ ఒక కామన్ మాయదుప్పటి. సేం పించ్!!
కొత్తపాళీ గారూ,

నిజం.. బాగా చెప్పారు. ఉద్యోగం వచ్చిన కొత్తలో మదరాసు నగరం లో మొదటి నెల సంపాదన అంతా ఖర్చు పెట్టేసాక 60 రూపాయలు మిగిలింది చేతిలో.. దాంట్లోంచి 15 రూపాయలు తీసి కొన్న వేమన పద్యాలు అప్పుడప్పుడూ తీసి చదువుతూ ఉంటాను.. చేతిలోకి తీసుకోగానే ఆ రోడ్లూ, ఎండా, బాచెలర్ జీవితం,.. అన్నీ గుర్తొస్తాయి. స్కూల్లో ఉన్నప్పుడు కొన్న 2-3 పుస్తకాలు.. అవి కొట్టేసిన పక్క బెంచీ అమ్మాయి, మళ్ళీ సాధించి తెచ్చుకున్న జ్ఞాపకం..

కృష్ణప్రియ/
రవి said…
నా దగ్గర దుప్పట్లు లేవు కానీ, ఇతరుల దుప్పట్లు కొట్టుకొచ్చాను. అవీ బానే ఉన్నాయ్, నా సొంత దుప్పట్లంత బావోలేకున్నా.

For pustakam.net ->

అన్నాయ్, You can contribute for pustakam in some smaller ways - like providing few ideas for focus etc..

పుస్తకం ఒక తెరిచిన పుస్తకం. ఏ విధమైన పుస్తక సంబంధ అవుడియాకయినా స్వాగతం.
భలే రాసారండీ....మీ టపా చదువుతూ నా మాయ దుప్పట్లని గుర్తు తెచ్చుకుని అలా అలా గతమనే స్వర్గంలోకి వెళ్ళిపోయాను.

నేను ఎనిమిదవ తరగతిలో ఉండగా చదివిన "ఆర్య చాణక్య" పుస్తకం. పదవతరగతిలో ఉండగా చదివిన "ఏడు తరాలు" మరియు "స్వీట్ హోం". ఇంటర్ లో చదివిన శ్రీ పాద కథలు ముఖ్యంగా వడ్లగింజలు, మార్గదర్శి. ఇవి నా మాయ దుప్పట్లు. ఆర్య చాణక్య ఎవరు రాసారో తెలీదు. పై అట్ట, ముందువి రెండు కాగితాలు ఎప్పుడో చిరిగిపోయాయి. అయినా అప్పట్లో ఆపుస్తకం నన్ను గొప్పగా ఆకర్షించింది. అలాగే ఏడు తరాలు (రూట్స్) దాన్ని నేను నమిలి మింగేసి జీర్ణావస్థకి తెచ్చేసాను. మళ్ళీ దానికి అట్ట కుట్టి జాగ్రత్త గా బైండింగ్ చేయించుకున్నాను. తరవాతెప్పుడో కొత్త పుస్తకం కూడా కొన్నాను,కానీ ఎప్పుడూ ఆ పాతదే చదువుతాను అదేమిటో. అలగే స్వీట్ హోం...మా దొడ్డమ్మ ఆంధ్ర జ్యోతి లో (ప్రభ లోనో) వచ్చిన స్వీట్ హోం రెండవ భాగం సీరియల్ కాగితాలని కత్తిరించి వేరే ఒక పుస్తకం గా చేసారు. దానికి అట్ట అదీ వేసి భలే ఉంటుంది. అది చదివాను. ఈ రోజు స్వీట్ హోం మూడు భాగాలు ఉన్న కొత్త పుస్తకం నా దగ్గరుంది. అయినా, ఈనాటికీ ఆ పాత పుస్తకంలో ఆ పచ్చని కాగితాల్లో, ఇమిడి ఉన్న నా బాల్యాన్ని తలుచుకుంటూ చదవడం ఒక గొప్ప అనుభూతి.
రవి, మీ దగ్గర దుప్పట్లు లేపోతే, ఇంకోళ్ళ దగ్గర కొట్టుకొచ్చినవి మీ దుప్పట్లంత బాగాలేవని ఎలా అనగలరు?? ఇదేదో రసెల్స్ పేరడాక్స్ లాగుంది :)

సౌమ్య, గతం స్వరగంలా భ్రమపెడుతుంది అంతే! నిజంగా కాదు :) ఆర్యచాణక్య రాసింది బహుశా ముదిగొండ శివప్రసాద్. రంగనాయకమ్మ స్వీట్‌హోం గురించి మీరు బ్లాగు ప్రవేసం చేసిన కొత్తలో వేరొకరి బ్లాగులో మీకూ నాకూ కొద్ది పాటి సంభాషణ నడిచిన గుర్తు. నేనూ బడి వయసులో స్వీట్‌హోం రెండో భాగం తొలి ప్రచురణ చదివాను. మూడు భాగాలు కలిపి కొత్తగా ప్రచురించిన పుస్తకంలో ఆవిడ చేసిన మార్పులు నాకు నచ్చలేదు.
gaddeswarup said…
చాలా రోజులు మా అమ్మ పాటల పుస్తకము ఉండేది. అందులో తెలుగు, హింది, తమిళ (మా స్కూల్లో ఒక అయ్యంగారు ఉండేవారు, వారి అమ్మాయిల దగ్గర మా అమ్మ నేర్చుకున్న పాటలు) పాటలు ఉండేవి. ఆపుస్తకము పోయింది. ఇప్పుడు ఏమైన గుర్తుకు వస్తే ఇంటర్నెట్ లో దొరుకుతయ్యేమో అని చూస్తా. ఈమధ్య శరత్ రాసిన మహేష్ చదివాను.
కొత్త పాళీ గారు !
నా దగ్గర కూడా ఉన్నదండీ ..ఇలాంటి మాయ దుప్పటి _"దర్గా మిట్ట కతలు ".
నేను హైస్కులు చదివే రోజుల్లో ..ఆంధ్ర జ్యోతి లో వారం వారం వచ్చే ఈ కథల్ని చదివాకా ..అవన్నీ పుస్తకం గా వస్తే ..మా నాన్న గార్ని బ్రతిమాలి ,డబ్బులు మనియార్డరు చేయించి ..పోస్టు లో తెప్పించుకుని, అపురూపం గా బైన్డింగు చేయించుకుని.. ఆప్యాయం దాచుకున్ననా మాయా దుప్పటి "దర్గా మిట్ట కతలు ".
ఈ భాగ్యనగరం లో ..మనసు బాగోలేనపుడు ..ఈ పుస్తకాన్ని తెరిచి చదివితే ,మా ఊళ్ళో ని మా అమ్మ ,మా నాన్న .తమ్ముడు ,స్నేహితులు ..అందరూ నా కనుల ముందుకు వచ్చికబుర్లు చెబుతారు .అందుకే ఈ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నపుడల్లా ..పాత స్నేహితుడి చేతిలో చెయ్యేసి కబుర్లు చెప్పుకుంటునట్టు అనిపిస్తుంది.మీకు ధన్యవాదాలు .
జయ said…
నాకు ఎంతో ప్రియమైన దుప్పట్లు...ఎంత పాతబడినా రిపేర్లు చేసి, కనీసం అప్పుడప్పుడైనా కప్పుకోకపోతే తృప్తే లేని ప్రియాతి ప్రియమైన రెండు దుప్పట్లున్నాయి. బహుశ: నేను చాలా చిన్నప్పుడే కప్పుకున్నవి కనుక ఆ మమకారం ఎప్పుటికీ పోదేమో:) మొదటిది పథేర్ పాంచాలి (తెలుగు వెర్షన్). దుర్గ అమాయక జీవితమే నామీద చాలా ప్రభావం చూపించింది. రెండవది 'థార్న్ బర్డ్శ్'. ఈ దుప్పటైతే అసలేనాటికీ వదలను. వాటి స్థానంలో కొత్తవి కూడా కొనుక్కోవచ్చు...కాని ఎందుకో నాకు ఆ పాత దుప్పట్లే కావాలి.మళ్ళీ మళ్ళీ తలచుకొనే ఆ తలపును గుర్తుచేసిన మీకు నా కృతజ్ఞతలు.
ఓహో ఆర్య చాణక్య రాసినది ముదిగొండ శివ ప్రసాద్ గారా....తెలియజెప్పినందుకు ధన్యవాదములు.

అవునండీ, మీరు చెప్తుంటే గుర్తు వస్తున్నది మన మధ్య స్వీట్ హోం గురించి కొంత సంభాషణ జరిగింది, కానీ ఏం జరిగిందో గుర్తు లేదు. నాకు స్వీట్ హోం మూడవ భాగం కన్నా రెండవ భాగమే చాలా ఇష్టం. మీకు ఆవిడ చేసిన మార్పులు ఎందుకు నచ్చలేదు? దీనిపై మీ అభిప్రాయం తెలుసుకోవాలని ఉంది, మీకు అభ్యంతరం లేకపోతే ఓ పోస్ట్ రాయండి.
కృష్ణప్రియ, గుడ్!
రవి, సరే! :)
స్వరూప్, తూవాయి, జయ - చాలా సంతోషం.
సౌమ్య, హుం, ఇంకో రాయాల్సిన ఎసైన్మెంటు!
pi said…
Off-late I am oding on Noam Chomsky & Howard Zinns' lectures on Youtube.

Mine is chandama.
రవి said…
>>ఇదేదో రసెల్స్ పేరడాక్స్ లాగుంది :)

హ్హహ్హహ్హ..నిజమే.

నా దగ్గరా చాలా ఉండేవి. నావీ ఇతరులు కొట్టుకెళ్ళారు. ఇదీ ట్రాజెడీ..
రవి said…
ఆర్య చాణక్య, వేదుల సూర్యనారాయణ శర్మ గారూ రాశారు. పుస్తకం.నెట్ లో నేను పరిచయం చేశాను.
మేధ said…
నా మాయాదుప్పటి "నాలో నేను".. నేను మొదటిసారి నా సొంతంగా కొనుక్కున్న పుస్తకం.. ఇదొక్కటేనా అంటే అని కాదు, కానీ మిగితా పుస్తకాల కంటే ఇది కాస్త ఎక్కువ ఇష్టం..
Ravi, thanks for the correction.

Medha, నాలోనేను? బల్బు వెలగట్లేదు! :(
పుస్తకం అప్పు తెచ్చి చదివి, బాగా నచ్చి, నా కోసం కొనుక్కున్న మొదటి పుస్తకం "Gone with the wind". ఐ ఫెల్ మాడ్లీ ఇన్ లవ్ విత్ స్కార్లెట్ ఓ హారా! మాడ్లీ ఇన్ లవ్ విత్ మెలయిని, ఒకటేమిటీ అన్నిటితో. ఇప్పటికి పుస్తకాలు దులిపినపుడూ అది కనిపిస్తే ఏదో ఒక పేజీ నుంచి మళ్ళి మొదలు పెడతాను. చదివిన ప్రతిసారీ ఏదో క్రొత్త అనుభూతి. మళ్ళి పుస్తకాలు ఒకసారి దులపాలి లాగా ఉంది.
Unknown said…
నా మాయ దుప్పట్లు మల్లాది వారి కృష్ణాతీరం, మొక్కపాటి వారి బారిష్టరు పార్వతీశం, ప్రొ. జి.లలితగారి అవధానాల మీద వ్రాసిన పరిశోధన గ్రంధం, కరుణశ్రీ గారి పుస్రక సంకలనం,
మేధ said…
నాలోనేను: భానుమతి గారి ఆత్మకధ

నాకు క్లాసు పుస్తకాల్లో కూడా కొన్ని మాయా దుప్పట్లు ఉన్నాయి.. సబ్జెక్ట్ ఎప్పుడైనా రివైజ్ చేసుకుందాం అనిపించినప్పుడల్లా అవి చదువుతుంటా.. కమ్యూనికేషన్స్, కంట్రోల్ సిస్టంస్ నూ..
Wit Real said…
విశ్వనాథ గారిని, 'ఆల్రెడీ చాలామంది రాసేసిన రామాయణం మల్లీ ఎందుకు రాస్తున్నారు' అని అడిగారట

దానికి వారు, 'రోజు తింటున్న ఆవకాయనే మళ్ళీ ఎందుకు తింటున్నారు...అలాగే ఇదీను' అని రామాయణ కల్పవృక్షం లో ఒక పద్యం వ్రాశారు

చదివిన దాన్ని మల్లీ మల్లీ చదవటం, అదొక రుచి!
Kalpana Rentala said…
ఆలస్యం గా చదివినప్పటికీ మీ పోస్ట్...మీరన్న మాయాడుప్పట్లను అలా ఒక దాని మీద ఒకటి గుర్తు చేసుకుంటూ మీద వెసుకుంటూ అందులో మునిగిపోయి నాకు నేను కనిపించటం మానేశాను. అందుకే ఈ కామెంటడమ్ కూడా కష్టమవుతోంది...పుస్తకాల మీద...వాటి జ్నాపాకాల మీద ఎండరు ఎన్ని పోస్ట్ లు రాసినా ఒక తాజాదనం వాటిలో...పూర్ణిమ....మీరు మీ పుస్తకం లో పెట్టబోయే వాటి కోసం ఎదురుచూస్తూ వుంటాము.
ఓహ్ ఆర్య చణక్య వేదుల సత్యనారాయణ శర్మ గారు రాసారా?
తెలియజెప్పినందుకు ధన్యవాదములు రవి.
మీరు పుస్తక.నెట్ లో సమీక్ష రాసానన్నారు? లింక్ ఇవ్వగలరా?
మీకు భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
Sharada said…
Better late than never
అని అనుకుంటూ నా favorite topic గురించి రెండు ముక్కలు.
నాకంటే మూడేళ్ళు పెద్దైన కజిన్స్ తో కలిసి స్కూలుకెళ్ళటం వలన పెద్ద పేరక్కలా అన్నీ వాళ్ళ పుస్తకాలే చదువుతూ వుండేదాన్ని. అప్పుడు చదివిన Knights of the round table తలచుకుంటేనే మళ్ళీ నోట్లో నీళ్ళూరతాయి!
కానీ అన్నిటికంటే ఓల్-మొత్తంగా నాకు నచ్చిన పుస్తకం "పెళ్ళి చేసి చూడు". ఈ చిన్న నవలని రాసింది "వసుంధర" గారు. ఏడో తరగతిలోనో ఎనిమిదో తరగతిలోనో చదివిన ఈ పుస్తకం లో జోక్స్ కూడా గుర్తున్నాయి నాకు.
తరవాతెప్పుడో పెద్దై పోయి ఒక అయిదారేళ్ళ కింద వాళ్ళని కలిసినప్పుడు ఈ పుస్తకం కాపీ ఒకటుంటే ఇవ్వమని అడిగాను. కానీ వాళ్ళు లేదని చెప్పి, ఆ పుస్తకం నాకు గుర్తుండటం గురించి ఆశ్చర్య పోయారు.

ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం లో జరిగే పెళ్ళీ, హడావిడీ, అనుబంధాలూ, చాలా బాగుంటుందా బుక్కు!
ఎవరి దగ్గరైనా వుంటే చెప్పగలరు!
శారద
శారద, సంతోషం. పుస్తకం సైటులో కుడిపక్కన మార్జినులో "పేజీలు" అనే హెడింగు కింద చెప్పాలని ఉందా అని ఓ లింకు ఉంది. అది నొక్కేసి, అక్కడ మీక్కావలసిన పుస్తకాల పేర్లు చెబితే, ఇతర పుస్తక ప్రేమికులు చూసి ఎక్కడన్నా దొరుకుతాయేమో చెప్పే అవకాశం ఉంది.
మనకే కాదు మహామహా గొప్ప రచయితలకీ ఉంటాయిట ఇలాంటి మాయదుప్పట్లు!

http://www.npr.org/templates/story/story.php?storyId=129235528
hmm...ఏమిటొ, నేనసలెప్పుడూ ఇటువంటి పుస్తకాలే చదవలేదు. కనీసం ఇప్పుడు కొన్ని పేర్లు తెలిసాయి, చదవాల్సినవి :)
మీరు మళ్ళీ టపా వేయటం లేదు నెల అవుతున్నట్టుంది?
Anonymous said…
I have one like this. Vennello Aadapilla by Yandamoori.
అసంఖ్య .. హ హ హ.
కృష్ణప్రియ, రోజుల్లెక్కబెడుతున్నందుకు థాంకులు :) నాకు ఒక టపా రాయాలంటే కనీసం గంట పని. అంత తీరిక దొరకటం లేదు. :( అసలిహ నించీ ఆడియో టపాలు వేస్తే పోతుంది.
శ్రీనివాస, సంతోషం.
కొత్తపాళీగారు,, ముందుగా మీకు ధన్యవాదాలు. మంచి జ్ఞాపకాలను తట్టిలేపారు. మీరందురు చదివే పుస్తకాలగురించి నాకు తెలీదు. నేను చదివే పుస్తకాలు మీకు తెలుసో లేదో అని ఇన్నిరోజులు కామెంటలేదు. నాకు కూడా రెండు మరచిపోలేని మాయాదుప్పట్లు ఉన్నాయి.నాదగ్గర ఉన్న పుస్తకాలన్నీ ఇచ్చేసినా ఆ రెండింటిని దాచుకున్నాను. మీ టపా చదివినప్పటినుండి వాటిని వెతుకుతుంటే ఇవాళ దొరికాయి. పాతబడి, చిరుగులుపడినా అతుకులేసి ఉంచుకున్న పుస్తకాలు. ఎన్నిసార్లు చదివినా బోర్ కొట్టకుండా అందులో లీనమైపోయి కొత్తపుస్తకంలాగే చదువుతుంటాను. ముప్పై ఏళ్ల క్రింద కొన్న పుస్తకాలు.అవి.. మాదిరెడ్డి సులోచన రాసిన తరంగాలు,ఋతుచక్రం ..ఈ మధ్యే మరో కొత్తదుప్పటి చేరింది. అది కూడా ఏళ్ల తరబడి దాచుకొని అప్పుడప్పుడు నిండా కప్పుకుని ఆస్వాదించాల్సినదే. దానిగురించి త్వరలో బ్లాగుతాను..
కొత్త పాళీ గారు,
'సామెత లేని మాట, ఆమేత లేని ఇల్లూ ' అని టైటిల్ పెట్టాను నా బ్లాగ్ పోస్ట్ కి. (సామెతల పుస్తకం లో చూసి) ఆమేత అంటే ఏంటని అడిగితే ఆవు మేత అని చెప్పాను. కరెక్టేనా?
@ జ్యోతి, మీ మాయదుప్పట్ల గురించి కూడా బ్లాగండి.

@ కృష్ణప్రియ, మె కి దీర్ఘం లేదు. బ్రౌణ్యం ఇలా చెబుతున్నది.
āmeta. [Tel.] n. Invitation, banquet, feast. ఆమెతచేయు. to feed on: make a meal. Vasu. iii. 152. ఆమెతపెట్టు to give a dinner. విందుచేయు
"మేటి తుమ్మెదల కామెతలు పెట్టు." రసి. iv.
సూపర్ పోస్ట్! చదవాల్సిన చాలా పుస్తకాల గురించి తెలిసింది.
నేను మొట్టమొదటసారి చదివిన " రాధా కృష్ణ " నవల.. యద్ధనపూడి గారిది ఎప్పటికీ గుర్తే! ఎందుకంటే రోజు లైబ్రెరీ కి వెళ్లి ఆ టైమింగ్స్ లోనే చదివాను. అది నచ్చలేదు కాని లైబ్రెరీలో కూర్చొని చదవడం... దానిగురించి అమ్మతో మాట్లాడడం నాకు బాగా గుర్తుంది.
చాలా ఆలస్యంగా చూసాను మమ్చి టపాని.
చాలా బాగా రాసారు కొత్తపాళీ గారూ...నేను కూడా అంతే ఎన్ని సార్లు చదివినా కొన్ని పుస్తకాలను మళ్ళీ మళ్ళీ చదువుతాను. చిన్నప్పుడు నా స్కూల్లో బహుమతిగా వచ్చిన కథల పుస్తకం, ఇంకా చందమామ పుస్తకాలు ఇలా.... అవి చదివి మీ లాగే చిన్నప్పటి అందమైన రోజుల్లోకి గెంతులేసుకుంటూ వెళ్ళిపోతాను లేడిపిల్లలా.
మనోజ్ఞగారు సంతోషం
నామాయాదుప్పట్లు పుస్తకాలకంటే పాటలే. వాటిలో కొన్నివింటుంటే ఎన్నెన్ని జ్ఞాపకాలో