సూపర్ సింగర్ ఫైవ్

ఇంట్లో కొత్తగా శాటిలైట్ టీవీ పెట్టించడంతో మాటీవీలో సూపర్ సింగర్ ఫైవ్ చూడ్డం మొదలెట్టాను. మరికొన్ని కార్యక్రమాల్ని కూడా రుచి చూసినా, నన్ను కొద్దిగా ఆకట్టుకున్న కార్యక్రమం ఇదొకటే.

ముందొక డిస్క్లెయిమరు. నేను సాధారణంగా టీవీ చూడను. 2000 సంవత్సరంలో మానేశాను టీవీ చూడ్డం. అందుకని ఇటు అమెరికను ఐడల్ లాంటి కార్యక్రమాలు గానీ అటు పాడుతాతీయగా, వాయిస్ ఆఫ్ యూత్, సూపర్ సింగర్ - ఇవేవీ చూసిన వాణ్ణి కాదు.

మేము కనెక్షను పెట్టించేప్పటికే సీజను మొదలైపోయి కొన్ని ఎపిసోడ్లు జరిగిపోయాయి. ఆ తరవాతెప్పుడో యూట్యూబులో ఆ తొలి ఎపిసోడ్లు కొన్ని చూశాను. ముందుగా ఏంకర్ సాగర్‌నీ, అటుపైన టీం లీడర్లు ఐదుగుర్నీ పరిచయం చెయ్యడం కొంచెం అతి చేశారు. ఇది గనక నేను మొదట టీవీలోనే చూసి ఉంటే కచ్చితంగా ఈ కార్యక్రమం పట్ల శ్రద్ధ కలిగి ఉండేది కాదు, తరువాతి ఎపిసోడ్లని శ్రద్ధగా చూసేవాణ్ణి కాదు. అదలా మిస్సవడం మంచిదే అయింది.

కాన్సెప్టు
ఈ కాన్సెప్టు నాకు బాగా నచ్చింది. పోటీదారులు ఎవరికి వాళ్ళు టెన్షనుతో కూర్చోవడం, తమ వంతొచ్చినప్పుడు పాడి వెళ్ళిపోవడం కాకుండా; ఐదు టీములు. ఒక్కోదానికీ కొంత ప్లేబాక్ అనుభవం కలిగిన ఒక లీడర్, ఇద్దరు ఔత్సాహిక గాయకులు. ముగ్గురు న్యాయ నిర్ణేతలలో కోటి, చంద్రబోస్ రెండేసి టీములకి, గాయని సునీత ఒక టీముకీ మద్దతు నివ్వడం (ఇలా జడ్జీలు పోటీదారులకి మద్దతు నివ్వడంలోని ఆంతర్యం నాకు అర్ధం కాలా. దీన్ని గురించి ఇంకొంచెం తరవాత). రౌండ్లు కూడా కొంచెం వినూతనంగా ఉన్నాయి. టీములుగా పాల్గోవడాన్ని బాగా ఉపయోగించుకునేట్టు రూపొందించారు. టీం లీడర్ల సోలో, జూనియర్ల సోలో, యుగళ గీతాలు, ముగ్గురూ కలిసి పాడిన బృంద గానాలు; రకరకాలుగా -- మొత్తమ్మీద బాగా రుచికరంగా కార్యక్రమం రూపొందిందని చెప్పుకోవచ్చు.

నేను సినిమాసంగీతాన్ని ఎప్పుడూ పెద్దగా పట్టించుకున్న వాణ్ణి కాను. పాతపాటలైతే ఆకాలంలో ఇష్టమున్నా లేకున్నా జనరంజని వినీవినీ ఏదో కొంత గుర్తుండిపోయాయి. కానీ గత ఇరవై ఏళ్ళలో వచ్చిన సినిమాపాటలైతే బొత్తిగా మనసుకి హత్తుకోలేదు. సినిమాలు విరివిగా చూస్తూనే ఉన్నా, ఎవరన్నా మిత్రులు పాట వినమన్నప్పుడు పాటలుకూడా అప్పుడప్పుడూ వింటూ ఉన్నా, ఏ పాటా ఇది బాగుంది అని నా దృష్టిని ఆకర్షించలేదు, అసలు ఇదో సంగీతమనే ఎప్పుడూ అనిపించలేదు. తీరా ఈ ప్రోగ్రాములో ఈ యువతీయువకులు పాడుతూ ఉంటే విన్నప్పుడు ఈ కొత్త పాటల్లో కూడా సంగీత విశేషాలు బాగున్నాయి, ఇది నిర్లక్ష్యం చెయ్యాల్సిన విషయం కాదు అని ఒక కనువిప్పయింది. ఇది నేనసలు ఎదురుచూడని పరిణామం.

రేండం ఆలోచనలు
టీం లీడర్లు ఐదుగురికీ (గీతామాధురి, శ్రావణభార్గవి, శ్రీకృష్ణ, కృష్ణచైతన్య, దీపూ) గొంతులు చాలా బావున్నాయి. ఐదూ విలక్షణమైన గొంతులు. కానీ సెమీఫైనల్సు లోనూ, ఫైనల్సులోనూ, ఒకటి రెండు చోట్ల బాగా పాడేరు గానీ, వీళ్ళు పాడగలిగినంత గొప్పగా పాడలేదనిపించింది. ప్రిలిం రౌండ్సులోనే, బహుశా కొంచెం రిలాక్స్‌డ్ గా ఉన్నారేమో, హాయిగా గొంతులు విప్పి పాడారు. జూనియర్లలో అమ్మాయిల గొంతుల్లో అస్సలు పరిపక్వత లేదు. కొంత మజ్జాగతమైన టేలెంటు ఉన్నది గానీ, ఈ ఐదుగురూ ఇంకా బాల సాధకావస్థలోనే ఉన్నారని నాకనిపించింది. జూనియర్లలో అబ్బాయిల గొంతులన్నీ విలక్షణంగా ఉన్నాయి. రేవంత్‌ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ అబ్బాయి ఏది పాడినా (తప్పులు పాడినప్పుడూ, అక్కడక్కడా సాహిత్యం మర్చిపోయినప్పుడూ కూడా) నాకు చాలా నచ్చేసింది. ధీరజ్ కూడా, ముఖ్యంగా రాక్ (rock) బాణీలో ఉన్న పాటల్ని చాలా బాగా పాడాడు. ఈ అబ్బాయిలు ఐదుగురూ త్వరలో ప్లేబాక్ గాయకులుగా మనకి కనిపిస్తారు, సందేహం లేదు.

జడ్జీలు కూడా నాకు బాగా నచ్చారు. కోటి పెద్దతరహాగా అందర్నీ ప్రోత్సహించిన తీరు బాగుంది. తప్పులెంచాల్సి వచ్చిన చోట సాహిత్య పరమైన తప్పుల్ని ఎక్కువగా చంద్రబోస్, సంగీత పరమైన తప్పుల్ని సునీత వదలకుండా పట్టుకున్నారు. పాడుతున్నది సీనయర్లైనా, లేక జరుగుతున్నది ఫైనల్స్ అయినా, తప్పు తప్పే అన్నట్టు, మృదువుగానే, మనసు నొచ్చుకోకుండానే, ఐనా కచ్చితంగా తమ విమర్శని వినిపించారు. సునీత మాట్లాడే గొంతుకూడా నాకు చాలా నచ్చింది. ఆవిడ మాట్లాడుతుంటే హాయిగా అలా ఎంతసేపైనా వింటూ ఉండొచ్చు. ఆవిడ చాలా గొప్ప ప్లేబాక్ సింగరని విన్నాను గానీ ఆవిడ ఈ వేదిక మీద పాడిన పాటలు నాకు పెద్దగా నచ్చలేదు. చంద్రబోస్ అద్భుతంగా పాడతారని తెలుసుకోవడం ఒక రివెలేషన్. వ్యాఖ్యలు చెప్పేప్పుడు ఈయన వీలున్నచోటల్లా ఏదో ఒక పదవిన్యాసం చెయ్యడం (ఉదా. స్వ-రాకింగ్) కూడా సరదాగా ఉంది.

ఈ కార్యక్రమం మొత్తానికీ అస్సలు చలించని పునాదిలాగా ఉండి ఆద్యంతమూ అత్యుత్తమ స్థాయిలో పని చేసిన వారు ఆర్కెస్ట్రా సభ్యులు. అందరూ చాలా గొప్పగా చేశారు కానీ, వేణువు వాయించిన ఆయన్నీ, కీబోర్డ్స్ వాయించిన ఇద్దరినీ ప్రత్యేకంగా అభినందించాలి. కార్యక్రమం నడుస్తుండగా పార్టిసిపెంట్లూ, జడ్జీలూ ఈ వాద్య బృందానికి అభినందనలు చెప్పుకున్నారు గానీ, కనీసం ఒక్కసారైనా వీళ్ళని పేరుపేరునా పరిచయం చేసి ఉండాలిసింది. అది చెయ్యకపోవడం పెద్ద లోపం.

ఏంకర్‌గా, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తమ్ముడూ, స్వయంగా గాయకుడూ సాగర్, కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించాడు. అతనికి ఏంకరింగ్ కొత్త కావడం వల్లనూ, అతను సహజంగా పెద్ద మాటకారి కాకపోవడం వల్లనూ (కనీసం నాకలా అనిపించింది) కొంచెం వొద్దికగా చేశాడు. తామే పెద్ద పిస్తా అనుకునే ఏంకర్ల దెబ్బ ఆల్రెడీ రుచి చూశాను మరి కొన్ని కార్యక్రమాల్లో. వాటితో పోలిస్తే సాగర్ కొత్తదనం ఫ్రెష్గా అనిపించింది.

చివరి ఎపిసోడ్లలో ఎవరెవరో స్పెషల్ గెస్టులు రావడం మొత్తానికి కొంచెం చిరాకు కలిగించింది. ఒక పక్కన గాయనీ గాయకులు ఈ హడావుడికి కొంత తడబడినట్టు అనిపించింది. ఇంకో పక్క కేమెరా అతను పిచ్చ పట్టినట్టు మాటిమాటికీ ఈ గెస్టుల మొహాలు క్లోజప్ చూపించడం - వాళ్ళేమో ఏంటో నెర్వస్ గా అటూ ఇటూ కదుల్తూ ఉండడం. అప్పటికి ఆరేడు వారాలుగా ఈ కార్యక్రమం చూడ్డం ఒక హాయైన అనుభవంగా ఉన్నది కాస్తా చివర్లో తన ఫోకస్ కోల్పోయి కంగాళీ అవకతవగ్గా తయారైంది.

ది సింగింగ్ పార్టీ అని టేగ్ లైన్ పెట్టుకున్నందుకు కేవలం ఇంకో పాటల పోటీ లాగా కాకుండా ఆద్యంతం నిజంగానే ఒక పార్టీలాగా, సరదాగా, హాయిగా, అలరిస్తూ, ఆహ్లాదం కలిగిస్తూ జరిగింది కార్యక్రమం.

Comments

నాకెందుకో బొత్తీగా ఇలాంటి కార్యక్రమాలు ఒక పట్టాన నచ్చవు. కాని ఒక సారి ఏదో టి.విలో ఇలాంటి ఒక కార్యక్రమంలో గోరంటి ఎంకన్న గారిని న్యాయనిర్ణేతగా నియమించారు, ఇలా కాస్త వినూత్నంగా నియమించడం నచ్చింది. ఎంకన్న గారి లాంటి జానపదాలు పాడే గాయకుల(అంతో ఇంతో ఆశుకవి) దృష్టికోణం కాస్త భిన్నంగా ఉంటుది.
దాదాపుగా అన్ని ఎపిసోడ్స్ నేను చూశాను..రెగ్యులర్ గా ఫాలో అయ్యే ప్రోగ్రాముల్లో ఇదొకటి...చాలా నచ్చేది ప్రతీ ఎపిసోడ్..అటు అదే టైంకి మన బాలు గారు 'పాడుతా తీయగా' వచ్చేది..రెండు ప్రోగ్రాంలు మార్చి మార్చి చూసేసేవాళ్ళం...పాడుతా తీయగా కూడా చాలా బాగుంటుంది..అనవసరమైన హంగామా లేకుండా పద్దతిగా సాగిపోతుంటుంది ఆ ప్రోగ్రాం...

సునీత గొంతుకకు మీరు కూడా పడిపోయారా? :)
భావన said…
నేను కూడా క్రమం తప్పకుండా చూసాను. ఆఖరు లో రెండు వారాలు ప్రతి రోజు రాత్రి ఒక అరగంట పాత ప్రోగ్రాం క్లిప్పింగ్స్ వేసేడు. అవి కూడా మళ్ళీ చూసాము. కాక పోతే ముందు నుంచి తెలుస్తూనే వుంది ఫలితం శ్రీకృష్ణ టీమ్ కు అని. నాకెందుకో గీతా మాధురి కృష్ణ చైతన్య వున్నట్లుండి జావ కారి పోయినట్లు సెల్ఫ్ విత్ డ్రా ఐనట్ళనిపించింది. ముందు నుంచి KC టీమ్ చాలా బాగా చేసింది. గీతా మాధురి టీం కూడా. మధ్యలో పరిచయం చేసారే ఆ మ్యూజిక్ పాడీన వాళ్ళను. అవును ఆఖరులో చాలా ఖంగాళి ఐపోయింది ఆ స్పెషల్ గెస్ట్ ల గోల తో. అంతా ముందే స్క్రీన్ ప్లే చేసి పెట్టుకున్నట్లు అనిపించింది కాని పిల్లల గొంతులు మాత్రం చాలా బాగున్నాయి. నేను ఇక్కడ బాలు ప్రోగ్రాం లో శ్రీకృష్ణ ను, ఏడిద నాగేశ్వర రావు గారి మ్యూజిక్ ట్రూప్ లో దీపు,ఆ కిందటేడు వచ్చిన వాళ్ళవి ఆ జానపద కళాకారులవి ప్రోగ్రాం లు లైవ్ లో చూసా. దీపు చాలా బాగా పాడేడు. కొత్తదనం లేదు శ్రీకృష్ణ గొంతులో, బాగుంది నో డౌట్ కాని.. ఐనప్పటికి.. పరంతూ.... :-)
మాటీవీలో మరో మంచి ప్రోగ్రామ్ ఉంది. రేలారే రేలా.. జానపద, పల్లెపదాలు వినొచ్చు.మూడో సీజన్ మొదలవుతుంది అని చెప్తున్నారు లంగరమ్మను(మార్నింగ్ భాను ఐతే) పట్టించుకోకుంటే జడ్జిలు సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న ఉంటారు. ఇది మిస్ కాకుండా చూడండి..
నాకు కూడా ఈ కార్యక్రమం బాగా నచ్చింది. ఇదే కాదు... సూపర్ సింగర్ సిరీస్ అంతా బాగానే ఉన్నాయి. సూపర్ సింగర్ 3, 4, 5 ఐతే చాలా నచ్చాయి.
ముఖ్యంగా చెప్పుకోవల్సింది జడ్జీల గురించి.. ఈ 5 లో అందరూ హుందాగా చేసారు.
ఇంతకుముందు మనో, గోరేటి వెంకన్న అప్పుడప్పుడు కొద్దిగా ఎక్కువ చేస్తున్నారు అనిపించేది. కాని ఈ 5 లో అందరూ బాగా చేసారు.
పాడుతా తీయగా, ఇది చాలా మంచి కార్యక్రమాలు.
కన్నగాడు, శేఖర్, భావన, జ్యోతి, సవ్వడి .. ధన్యవాదాలు
Vasu said…
మరేం అనుకోరంటే ఒక మాట. సరిగ్గా మీరు మీకు నచ్చాయని చెప్పిన విషయాలే నాకు నచ్చనివి ఇందులో. నేను ఈ కార్యక్రమం మరీ ఎక్కువగా ఫాలో అవ్వకపోవడం వల్ల అలవాటు పడలేదేమో . అలా కాకపోవడానికి కూడా ఇవే కారణాలు.
సాగర్ - అతని గొంతు అస్సల నచ్చదు నాకు. దేవి శ్రీ సంగీత దర్శకుడు కాకపోతే అతను ప్లే బ్యాక్ సింగర్ అయ్యే లక్షణాలు అసలా లేవు అని నా నమ్మకం. యాంకరింగ్ కూడా అంతే.

సునీత - ఏదో తప్పు పట్టుకోవాలని , పేరు పెట్టాలని మాట్లాడినట్టుగా అనిపించింది ఈవిడ కార్యక్రమం లో ఎప్పుడు చూసినా . పైగా ఆ ముక్క ముక్కల ఆంగ్లం ఒకటి.

కాన్సెప్ట్ - నాకైతే ఈ గోలంతా లేకుండా పాడుతా తీయిగా, పాడాలని ఉంది లాంటివి హాయిగా అనిపిస్తాయి.
చంద్రబోసు, కోటి బాగా వ్యవహరించారు.
సింగర్స్ లో శ్రీ కృష్ణ, ధీరజ్ చాలా చక్కగా పాడారు.
gaddeswarup said…
It seems that we are following somewhat similar paths. for a long time I did not know any Telugu film singers after Ghantasala. Then in the early 90's a friend sang "ninuchuuDaka neanunDaleanu" which I liked very much and then I heard a few songs of SPB. Since then I have been watching some of these TV programsoff and on and I think there are many talented singers and new modes of songs and singing some which I like.
As in your previous post I had similar experiences with kitchen garden for nearly twenty years. My main success is with chillies and I grow seven types of various degrees of hotness. Somehow if I freeze them for the two-three months when they do not come out, all the flavour is gone and they taste strange. Do you hav any ideas on preserving them?
వాసు, భిన్నాభిప్రాయాలుండడం సహజమే.

స్వరూప్ గారు, ఇటువంటి విషయాల్లో మన అనుభవాలు సమాంతరంగా ఉండడం - మనిద్దరికీ ఒక కీలకమైన సమయంలో తెలుగు పాపులర్ కల్చర్‌తో కనెక్షన్ తెగింది. అది అంత సులువుగా తిరిగి అతుక్కోలేదు, ఏదో ఇలాంటి యాదృఛ్ఛిక సంఘటనలు తప్ప. మన తరవాత ప్రవాసులైన వారికి ఈ విషయంలో ఆ కనెక్షన్ తెగిపోకుండా ఉండేట్టుగా ఇవన్నీ ఇప్పుడూ విదేశాల్లో అందుబాటూలో ఉంటున్నాయి.

వ్యవసాయం - కోసి, ఫ్రీజ్ చేసేంత పరిమాణంలో నేను పండించలేదు. ఏ పూట కోసింది ఆ పూట ఆరగించడమే.
gaddeswarup said…
That is a useful observation which I did not realize. Coincidentally I read an Amit Choudhuri article today which hints at one place of similar things:
http://www.guardian.co.uk/books/2009/apr/18/new-indian-writers-amit-chaudhuri