పెరడు వ్యవసాయం - గోంగూర రుచి

చాలా ఏళ్ళ తరవాత మళ్ళీ పెరటి వ్యవసాయం మీద బుద్ధి పోయి ఈ ఏడాది నడుం బిగించాను. వారాంతపు రైతుగా అవతారమెత్తాను.

దానికితోడు ఈ ఏడు ఏప్రిల్లోనే వాతావరణ ఉష్ణోగ్రత ఎనభైల్లోకి పాకి కితకితలు పెట్టింది. ఇంకేముంది, వసంతం వచ్చేస్తోంది అని హడావుడి పడిపోయి సీడ్ స్టార్టర్ కిట్ తెచ్చేసి, ఇండియానించి భద్రంగా తెచ్చుకున్న గోంగూర విత్తులు నాటేశాను. పొద్దున్నే నా నోట్లోకి ఇన్ని టీనీళ్ళతో బాటు దీనికి అన్ని మామూలు నీళ్ళు వొంపుతూ ఉండడం. ఏ చిన్న అరలోనన్నా మొలక పైకి తొంగి చూస్తోందా అని ఎదురు చూడ్డం. మొదటి మొలక కనిపించిన రోజున ఎంత సంతోషం వేసేసిందో.

ఎట్టకేలకు అన్ని అరల్లోనూ విత్తులు మొలిచి చిగుళ్ళు వేశాయి.

ఇంతలో నా ఉత్సాహం మీద నీళ్ళు చల్లడం కాదు, ఏకంగా మంచే కురిసింది - టెంప్రేచరు నలభైల్లోకి పడిపోయింది. మే నెల అంతా ఇలాగే.

మేనెల ఆఖర్లో, హమ్మయ్య కాస్త వెచ్చబడుతోంది, ఇంక మొక్కల్ని బయట నాటెయ్యొచ్చు అనుకుంటున్న నాకు ఇంకో కఠోర సత్యం ఎదురైంది. నేను మొక్కలు నాటాలి అనుకున్న ఆ చిన్న మడి చెక్క, గత రెండు మూడేళ్ళుగా సరైన శ్రద్ధ పెట్టక పోవడం వల్ల పిచ్చి మొక్కలకి ఆలవాలమైంది. అవన్నీ ఇల్లరికపు అల్లుళ్లలాగా హాయిగా సెటిలైపోయాయి. ధిక్కారము సైతునా అని హుంకరించి పార పట్టుకుని మహోగ్రం వాటి మీద దాడి చేశాను. ఐతే నా సమరోత్సాహం పది నిమిషాల్లో రొప్పుగానూ, మరో ఐదు నిమిషాలకి ఆయాసంగానూ, అటుపైన రెండు నిమిషాలకి నీరసంగానూ పరిణమించింది. వేళ్ళ పట్టు తప్పి పార కింద పడిపోయింది. ఓ కప్పు వేడి బ్రూక్‌బాండ్ రెడ్‌లేబుల్ టీతో మళ్ళీ శక్తి పుంజుకుందామని లోపలికొచ్చి, టీతాగి పుంజుకున్న శక్తితో మడి చెక్కే పనిని మర్నాటికి విజయవంతంగా వాయిదా వేశాను.

ఇప్పుడు వివెల్ అల్ట్రాప్రోవారి రైతుబిడ్డ కార్యక్రమంలో ఒక చిన్న విరామం! ఈ విరామంలో నా సోదర రైతు తెలుగుయాంకీగారి కబుర్లు చదివి రండి. మళ్ళీ ఇక్కడికే వచ్చెయ్యండేం, అక్కడ కామెంట్లు పెడుతూ కూర్చోవద్దు!!

అలా చాలా మర్నాడులు గడిచాయి. టీకప్పు నాకిస్తున్న శక్తి పనిని వాయిదా వేసేందుకే పనికొచ్చింది తప్ప పని మొదలు పెట్టేందుకు పనికి రాలేదు. ఈలోగా నా శత్రువులు కబ్జా భూమిలో మరికాస్త వేళ్ళునుకున్నాయి. ఇంట్లోకొస్తే, విండో పక్కన స్టార్టర్ ట్రేలో అప్పుడే ఆరంగుళాల ఎత్తుకి ఎదిగిన గోంగూర మొక్కలు పెళ్ళికెదిగిన కూతుళ్ళు బక్కచిక్కిన గుమాస్తా తండ్రిని చూసినట్టు చూస్తున్నాయి నిష్ఠూరంగా. ఆ రూములోకి ఎంటరైనప్పుడల్లా "అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా" అని ఓ ముప్ఫై గొంతులతో 6-ట్రాక్ స్టీరియోఫోనిక్ ఎఫెక్ట్స్ తో విషాద గీతం.

ఇక భరించలేక, విజయమో వీరస్వర్గమో అని కబ్జాదారులమీద దండెత్తాను. మొత్తానికి రెండు సాయంత్రాలు హోరాహోరి ముష్టాముష్టిగా పోరాడి నా మడిచెక్కని ఆ కలుపుమొక్కల కబంధ హస్తాల పట్టునుంచి విడిపించుకున్నాను. ఓ రెండు సంచుల పైమన్నూ, ఒక సంచీ ఎరువూ మట్టిలో కలిపాను. ఇంతదాకా బానే ఉంది.

మొక్కల్ని తెచ్చి నేలలో పాతడం .. అప్పుడు తెలిసింది నరకమంటే ఏవిటో. హాయిగా స్టార్టర్ కిట్‌లో విత్తులు నాటినట్టు కాదు. వొంగి లేచి వొంగి లేచి ముప్ఫై మొక్కల్ని నాటేప్పటికి .. నాకు అకస్మాత్తుగా వరి పొలాల్లో నాట్లు, కోతలు చేసే రైతుకూలీలతో సోదరభావం ఏర్పడిపోయింది.

చీడలు పీడలూ ఏమీ లేకుండా, వాటి పుణ్యమా అని మొక్కలు ఏపుగా ఎదిగినాయి.

ఇప్పుడు సుమారు ఆరు వారాల తరవాత, మొన్న సోమవారం నాడు మొదటి విడత ఆకు కోశాము.

మా అత్తయ్యగారు దానితో పచ్చడి చేశారు.

ఆహా ఏమి రుచి!

Comments

పెరట్లో మన సొంతంగా పండించిన కూరగాయలు కోసుకునేటప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేముకదండి...ఇంతకూ మీరు "సీడ్ స్టార్టర్ కిట్" అని ఏదో తెలీని పదం వినిపించారు..అదేంటి? మీ గోంగూర తోటని తొలిదశ నుండి చివరి దశ వరకూ ఫోటోలు తీసి ఆల్బంని వీడియోలా ప్లే చేసి పెట్టుంటే, చూసి మేము అలా అలా దూరదర్శన్ రోజులకు పోయిఉండేవాళ్ళమండీ..ఈ విషయంలో నిరాశపడ్డాను నేను మీ టపా చదవటం పూర్తవగానే...
నెనర్లు శేఖర్.
సీడ్ స్టార్టర్ కిట్ - ఇది చూడండి ఉదాహరణకి
ఇక్కడ చాలా కాలం చలిగా ఉంటుంది కాబట్టి బయట నారుమడి వేసే వీలు లేదు. అందుకని ఇటువంటి కిట్లతో ముందు ఇంట్లోనే, ఏ మార్చిలోనో ఏప్రిల్లోనో మొదలు పెట్టి నారు పెంచుతారు. బయట రాత్రి ఉష్ణోగ్రత 60కి తగ్గదు అని రూఢి చేసుకున్నాక, అప్పుడు బయట నాటుతాము. బయటే నేరుగా విత్తు నాటాలి అంటే వేసవి సరిపోదు కాపుకొచ్చేసరికి.
ఫొటోలు - నిజమే. తట్టలేదు. వచ్చే యేడు తీస్తాను.
ఆర్యా! స్వామీ! అభినందనలు. మొత్తం మీద సాధించారు మీరనుకొన్న పనిని.
మీరు పడించే గోంగూర పచ్చడిరుచి ఎలాగుంటుందో తినని వాడను కాబట్టి చెప్పలేను కాని; మీ రచన మాత్రం ఎలాగుందో చెప్పాలనిపించింది. గద్య రచనలో కూడా యింతటి ఆకర్షణ ఉంటుందనే విషయం మీ రచన చదువుతూణ్ంటే తెలుస్తోంది. చూచారా మీరాఖర్నన్నారు. వంగి లేచి వంగి లేచి ఈ పని చేసే సరికి మీకు మన రైతన్నలు గుర్తుకొచ్చారని; అదండి అతి ముఖ్యమైన అంశము. ఈ స్వానుభవంతో రైతన్న కష్టమేమిటో మీకైతే తెలిసింది కాని మన రాష్ట్ర రెవిన్యూ మంత్రికి కాని; హోం మంత్రికి కాని ఆ పదాలే తెలియవు.పాపం. తెలిసుంటే అమాయకులైన సోపేట నిరుపేద జాలర్లనీ రైతులనీ అంత దారుణంగా కాల్పించరు కదా! ఎప్పుడైనా మీ బోటి వారి రచనలు కనీసం సరదాకి చదివున్నా వారిలో మానవత్వం మందుకైనా ఉండి ఉండేది. ఏం చేస్తాం అంతా నేతి బీరకాయ ప్రజాస్వామ్యం. సరే పొరపాటున విసిగించాను.
ధన్యవాదములతో ముగిస్తున్నానులెండి. నమస్తే.
kiranmayi said…
మాష్టారు, మొత్తానికి ఇంట్లో పండించిన గోంగూర తో పచ్చడి చేయిన్చారన్న మాట. Cool.
నేను పోయిన నెల మిరప (thai chilli pepper) ఇంకా మెంతి పెంచా patio garden లో. మెంతితో వచ్చే వారం పెసర పప్పు చేద్దామని ప్లాన్. చూద్దాం ఎట్లా వస్తుందో.
గోంగూర...అబ్బా..మీరు చెబుతుంటే నాకు నోరూరుతోంది....

"అప్పుడే ఆరంగుళాల ఎత్తుకి ఎదిగిన గోంగూర మొక్కలు పెళ్ళికెదిగిన కూతుళ్ళు బక్కచిక్కిన గుమాస్తా తండ్రిని చూసినట్టు చూస్తున్నాయి నిష్ఠూరంగా"

హ హ హ.....ఏం చెప్పారండీ...
కిరణ్మయి, మీరూ మొదలెట్టారన్న మాట. సంతోషం. మా ఇంటో మెంతికూర పప్పు ఆల్రెడీ ఒక నాలుగు రౌండ్లయింది. మెంతికూరకి గోంగూరకి చేసినంత వైభోగం లేదు. ఇంటోనే, కిటికీ పక్కన ఒక పెద్ద అల్యూమినియం ట్రే నిండా మట్టి పోసి, దాంట్లోనే లాగించేస్తున్నా. మూడు వారాలకో కొత్త పంట.
సావిరహే, థాంకులు.
రామకృష్ణ మాస్టారూ, అది నా వచనంలో రుచి కాదు, మీ అభిమానం. సోంపేట ఉదంతం .. మీరన్నది నిజం నిజం.
స్థితప్రజ్ఞుడు, నచ్చినందుకు సంతోషం. వచ్చేసెయ్యండి, గోంగూర పచ్చడి రుచి చూడాలంటే!
జైజై రైతన్నా !!!
జైజై కూలన్నా!!!
అమెరికాలో కూడా తెలుగు రైతు సత్తా చూపించారన్నమాట మొత్తానికి :-)
మేమూ ఏసాం అన్నగారూ
దోసతోట
గోగులు
తోటకూర
మెంతి
కొత్తిమీర
కాకర
చిక్కుడు
మామిడి
రేపు పుటోబులు పెడతా
మీరు నూనె గోంగూర పెడితే ఓ సీసా ఇటేద్దురూ!!!
తెలుగుయాంకి, లోకేష్ .. నెనర్లు
భాస్కర్ .. మామిడి? కాకర ఎలా పండిందో చెప్పు. నేను ఈ సారి వేసిన ఒక కొత్త పంట సోంపు. కొత్తిమీర లాగానే తీగలు సాగుతుంది. కోసుకుని సాలడ్లో వేస్తే మాంచి సువాసన. ఈ ఏడాదికి ట్రయల్ మాత్రమే నా వ్యవసాయం. ఇది సక్సెస్ అనుకుంటే వచ్చే ఏడు ఇంకొంచెం పెద్ద మడిచెక్క చేస్తా. ప్రస్తుతానికి నూనె గోంగూర పెట్టేంత సీనులేదు. మీరేవన్నా ఇటొస్తే (ఇంకో రెండు వారాల్లోపు), ఒక పూట పచ్చడేసి భోజనం మాత్రం పెడతా. :)
ఎ క్విక్ పోస్ట్
http://ramakantharao.blogspot.com/2010/07/blog-post_16.html
భావన said…
గుంటూరోళ్ళకు ఇవ్వకుండా మీరే పచ్చడి చేసుకుని లాగించేసారన్నమాట. హుం.... హుం.... హుం.. మేము ఖండిస్తున్నాం. వుట్టి గోంగూరేనా ఇంకేమి లేవా? కూరలు బీరలు... ?
కొత్తపాళి గారి బ్లాగ్ అంటే చాలా ఘంభీరం గా వుంటుందనే నా అభిప్రాయాన్ని మార్చుకున్నానండి , హెడ్మాస్టర్ గారు . మీ వ్యవసాయం బాగుంది . ఇక్కడ మాకైతే మంచి గోంగూర దొరకటమే లేదు .
Vasu said…
బావుంది. ఇక్కడ ఏడాది పొడవున మంచి వాతావరణం ఉన్నా కూర మొక్కలకి అంతగా ఉపయోగిన్చుకోవట్లేదేంటి అనిపించింది ఇది చదవగానే. నా శ్రీమతికి ఈ పెరడు వ్యవసాయం మహా సరదా. కానీ నా సాయం పెద్దగా ఉండదు. పూల మొక్కలు, తులసి బాగా పెరిగాయి మా పాటియో లో.

అన్నట్టు మీరు గోంగూర అనగానే ఇండియా నించి తెచ్చుకున్నా గోంగూర పచ్చడి తినాలనిపించింది. ఈ రోజు రాత్రికి అదే.
Anonymous said…
బాగుంది.
నేను కూడా గోంగూర పెంచడంలో ప్రయోగాలు చేసాను.
మీ టపా స్ఫూర్తితో త్వరలో ఒక టపా వ్రాస్తాను.
aavakaya said…
మాల గారూ,

"కొత్త పాళీ" గారంటే నాకూ ఇంచుమించు ఇదే అభిప్రాయం. పాత సినిమాలలో "పెద్ద నాన్న" తరహా పాత్రల గాంభీర్యం గుర్తొస్తుంది.

కొత్తపాళీ గారు,
టపా బాగుంది.అర్జెంటు గా ఈ వీకెండ్ నేనూ గోంగూర తెచ్చుకుని పచ్చడి చేసుకోవాలి.మరి నెక్స్ట్ ఏమి పండిస్తున్నారు?
కొత్తపాళీ గారూ!! మీ టపా చదువుతున్నంత సేపూ, అదేదో నేనే ఆ గోంగూర విత్తుల్ని నాటేసి, మొలకల గురించి ఎదురు చూసి, అవి రాగానే సంతోషించి.. ఇంకా పంట చేతికి రాగానే, నేనే గోంగూర పచ్చడి చేసేస్కుని చాలా ఆనందంగా తినేసిన భావన.. అంత కన్నులకి కట్టినట్లుగా రాశారు. ఇది మీకు కొత్త కాదు అని నాకు తెలుసులేండీ..:) ఏదో నాకు గోంగూర రుచి చూపించారు అన్న ఆనందంలో.. :):)
వ్యాఖ్యానించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

భావన - మధ్యలో గుంటూరోళ్ళెవరు?

మాలగారు - ఈ హెడ్మాస్టర్ ఇమేజి మీలాంటి వారు కూడగట్టుకుని నా బ్లాగుకి కల్పించిన దుష్ప్రాపగాండా అధ్యక్షా అని మనవి చేసుకుంటున్నాను. నా మట్టుకి నేను సరదాగానే ఉంటాను! :)

సునీత, వాసు, బోనగిరి, ఆవకాయ - వోకే.

మనసుపలికే - కదా? :) ఇప్పుడే మీ ఐటీ వ్యవసాయం చూశాను, బాగుంది
హయ్యబాబోయ్.. కలయా.. నిజమా..!! నేనస్సలు ఊహించలేదండీ.. మీరు ఏమిటీ.. మొన్ననే పుట్టిన నా బ్లాగుని పలకరించడం ఏమిటీ.. చాలా ఆనందంగా ఉంది సుమండీ.. :) ఇక నాకు కొత్త శక్తి వచ్చేసింది. ఇంకో రెండు రోజుల వరకూ నాకు భోజన అవసరం ఉండదేమో.. నమ్మకం కుదరడం లేదా..? సత్య ప్రమాణం అండీ బాబూ.. అంత ఆనందంగా ఉంది. :):)
GKK said…
అడుగడుక్కీ నవ్వుకునేలా మీ శైలిలో చాలా బాగుంది.
బాగుందండి, స్పూర్తిదాయకంగా
antaryagam said…
మీ గోంగూర పంటకి మా జోహార్.

దిష్టి (తెగులు అన్న మాట) తగల కుండా చూసుకోవటం ముఖ్యం.

నేను కూడా ఇంటి బాల్కనీ లో పంటలు (పువ్వులు, కూరగాయలు)పండించి చూసి, అనుభవించి ఆనందిస్తూ ఉంటాను.

ఒక పదేళ్ళ క్రితం 70-80 కుండీలు పెట్టి అన్ని రకాల మొక్కలు పెంచి ఎదిగిపోయిన నా పిల్లల చిన్న తనం తల్చుకుంటూ ఆనందించే దాన్ని.

అదిగో మా పెద్ద అమ్మాయి మీరు ఉంటున్న దేశం వచ్చేసి చదువుకుని, అక్కడి వరుడికే ఇచ్చి మేము పెళ్ళి చేస్తే మాకు ఒక మనవడిని ఇచి మమ్మల్ని తరింప చెయ్యాలని సిద్ధ పడ్డ తరుణం లో నేను అక్కడికి రావటం జరిగింది. మా మొక్కలన్నీ విరహం తో అనాధలై, పాపం కొన్ని వాడి పోయి, కొన్ని చచ్చి పోతే బాధ పడి మళ్ళీ ముందున్న పూనిక తో మొక్కలు వెయ్యలేక ఆగిపోయాను.

ఇదిగో మళ్ళీ ఇప్పుడు, మొన్ననే వచ్చి వెళ్ళిన మనవడు, మనవరాలి మురిపాలలొ మునిగి తేలి, ఆ బాధని మర్చిపోవటానికి మళ్ళీ తోట ధ్యాస లో పడ్డాను. ఇంతలో మీ గోంగూర తోట గురించి చదివి మరింత ఉత్సాహం తో పనికి ఉపక్రమించాను.

మీరిచ్చిన స్ఫూర్తి తొ మరిన్ని తోటలు తయారు అవుతాయని ఆశిద్దాము.

కానీ ఒక్క మాటండోయ్, ఎన్ని సాధించినా ఎంత ఎదిగినా నేలని చీల్చుకు వచ్చిన మొలక మురిపించినంత గా మనల్ని ఏది అలరించ లేదు అంటే అతిశయోక్తి కాదేమో కదా
@ అంతర్యాగం, మీ సహృదయ వ్యాఖ్యకి ధన్యవాదాలు. మొక్క మొలుచుకు రావడమే కాదు, వాటికి సంబంధించిన వ్యవహారం అంతా నాకు ఎప్పటికప్పుడు గొప్ప విచిత్రంగా ఉంటూనే ఉంటుంది. ఒక విధంగా చూస్తే మొక్కలు (చెట్లు) లోనే జీవ శక్తి ఎక్కువగా ఉందేమో ననిపిస్తుంది మనుషుల్లోకంటే.
కొత్త పాళీ గారు అసలు మీ బ్లాగుని నేనింత వరకు గమనించ లేక పోయి నందుకు చాలా బాధ పడుతున్నాను.ఇప్పడి కైనా చూడ గలిగినందుకు బోలెడు సంతోషం.మీ గోంగూర ప్రహసనం పచ్చడి తిన్న దాని కంటె రుచి గా ఉంది. ఇంకో మాట చెప్పనా ? అచ్చం గా మీ లాగే నేను ఈ సమ్మరులో వొడియాలు పెడుతూ ఉంటాను .[ సారీ } అంటే మీ గోంగూర లాగ అన్న మాట. అది కుడా అంతే కష్ట పడి .రోజు ఉదయం లేస్తూనె వెదర్ చ్హానల్ చూసి [ఒకోసారి మోస పోతూ ] ఎండ వెంట పడుతూ ఎక్కడికీ వెళ్ళకుండా వాటిని తిరగ మరగ చేస్తూ అంటి పెట్టుకుని వారం రోజులు .తీరా ఎండాక " వడియాలు వేయించ మిమ్మడగ వలెనా మిమ్మడగ వలెనా ? ఎందు కంటే " నూనె " ఆయిల్ ఫాటు కదా ?
ఇందు said…
కొత్త పాళి గారు..నేను ఇవాళే మీ గోంగూర మొక్కల కథ చదివాను..చాల కష్తపడ్డారండీ...నాకు మొక్కలు,చెట్లు అంటే చాలా ఇష్టం. మీ స్పూర్తి తో నేను ప్రారంభిస్తా!! కాని ఇప్పుడు కాదు వచ్చె సంవత్సరం.....మరి కాస్త గొంగుర ఉంటే మాకు పంపించండీ....!!
తృష్ణ said…
మీ తోట కబుర్లు చదువుతుంటే పాత రోజులు గుర్తుకువచ్చాయి. కాలేజీలో ఉండగా రాళ్ళు రప్పలతో ఉన్న ఖాళి ప్రదేశాన్ని ఒక్కదానే పార,పలుగు పట్టుకుని బాగు చేసి బెండ, వంకాయ, టమేటా,అరటి, గోంగూర, పాలకూర,తోటకూర, కొత్తిమీర,కాకర పాదు,గుమ్మడి పాదు, మొదలైనవి బాగా పండించాను.తమలపాకు తీగ కూడా వేసాను.పూల మొక్కలైతే చెప్పక్కర్లేదు..బోలెడు రకలు.తలుచుకుంటే భలే ఆనందం వేస్తుందండీ.

బ్లాగ్ పేరు గుర్తు లేదు కానీ రూఫ్ గార్డెన్ పెంచిన ఒకావిడ తాలూకూ గార్డెన్ లింక్ ఒకటి ఆ మధ్యన చూసి దాచుకున్నానండి. చూడకపోయి ఉంటే చూడండి. గార్డెన్ చాలా బాగుంది.
http://kitchengardenofhyderabad.blogspot.com/2010/08/blog-post.html