డిట్రాయిట్ లో తెలుగు బ్లాగర్ల సంరంభం

గమనిక: ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మరిచినందువల్ల, అది చేర్చి ఈ టపాని మళ్ళి ప్రచురిస్తున్నాను. పాఠకులకు అసౌకర్యం కలిగితే మన్నించండి.
*** *** ***
మా డిట్రాయిట్ తెలుగు సాహితీ సమాఖ్య పదవ పుట్టిన రోజు వేడుకలు బాగా జరిగాయి. సభలకి దేశం నలుమూలల నుండీ సుమారు 150 మంది అతిథులు వచ్చారు. శనివారం జరిగిన విందు భోజనానికి సుమారు 250 మంది అతిథులు హాజరయ్యారు. టొరాంటో కెనడా నుండి పది మంది బృందం రాక ఒక విశేషం.

తెలుగు బ్లాగర్లు నేను ఆశించిన సంఖ్యలో రాక పోయినా, గంగి గోవు పాలు అన్న రీతిగా, వచ్చిన కొద్ది మంది అక్కడ బాగానే సంచలనం సృష్టించారు. ఈ సభల కాన్సెప్టు సాహిత్య విమర్శ. అంచేత నేను బ్లాగుల గురించి కూడా మాంఛి చిక్కనైన విమర్శ వ్యాసం ఒకటి తయారు చేశాను. తీరా మేము సభ ప్రారంభించి బ్లాగుల గురించి మాట్లాడ్డం మొదలు పెట్టే సమయానికి, అసలు బ్లాగులంటే ఏంటి అనే ప్రశ్న సభ్యుల దగ్గర్నించి వచ్చింది. దాంతో మొదట అనుకున్న ప్రణాళికని పక్కన పెట్టి మొదణ్ణించీ మొదలు పెట్టాము. ప్రణాళిక ప్రకారం నడవక పోవడంతో కొంత గందరగోళమైన మాట నిజం. ఈ పరిస్థితిని ముందే ఊహించి ఈ కార్యక్రమాన్ని బ్లాగుల పరిచయ వేదికగా రూపొందించుకుని ఉంటే ఇంకా బాగా జరిగే అవకాశం ఉండేది. అయినా, మాకెదురైన పరిస్థితిలో బాగా జరిగిందనే అనుకుంటున్నాను. మేం చెప్పిన విషయాల వల్ల సభ్యులు ఉత్తేజితులై, తెలుగు బ్లాగులు, వికీ పట్ల ఆసక్తి కలిగినట్లే కనిపించారు. సభ ముగిసిన తరువాత చాలా మంది వచ్చి, బ్లాగు మొదలు పెట్టాక ఏవన్నా డౌట్లు వస్తే ఎలాగ?, వికీలో ఏం చెయ్యొచ్చు లాంటి ప్రశ్నలు అడిగారు.

బ్లాగర్ల చిత్రమాల

ముందుగా తెలుగు వికీ ఆద్యుడు రవి వైజాసత్య వికీ ని పరిచయం చేసి అందులోని వివిధ ఫీచర్లని గురించి చెప్పారు. ఎలా సమాచారం రాబట్ట వచ్చు, ఎలా మనకి తెలిసిన సమాచారాన్ని అందులో ఎక్కించ వచ్చు, సమస్యలు వస్తే ఎలా .. ఇత్యాది విశేషాలన్నీ నెట్ కనెక్షను పుణ్యమా అని అక్కడికక్కడే ప్రదర్శించి చూపించారు. తెలుగు పండితులు కాని స్వఛ్ఛంద సేవకుల నిబద్ధత, సేవా పరాయణత గురించి విని సభ్యులు ఉత్తేజితులైనారు. వికీలో దొరికే సమాచారం నిజమేనని ఎలా నమ్మడం అని కొంత తీవ్రమైన చర్చ జరిగింది. చివరిలో వికీ సోర్సు ని పరిచయం చేసి అందులో సంస్కృత వ్యాస భారతం, ఆంధ్ర మహాభారతం పరిచయం చేసినప్పుడు, ఆచార్య వెల్చేరు నారాయణరావు గారి వంటి మహానుభావులే మహదాశ్చర్యంతో చేతులు జోడించి "మీకు నమస్కారాలండీ" అన్నారు. ఇది నిజంగా తెలుగు వికీ ఉద్యమకారులకి స్వర్ణపతకం లాంటిది.


దీప్తిధార సీబీ రావు గారు, ఇక్కడ డిట్రాయిట్ లో ఈ సభల్లో పాల్గొనడానికి పని గట్టుకుని రావడం మాకందరికీ ఎంతో సంతోషం కలిగించింది. ఆయన తన బ్లాగుల గురించి చెప్ప బోతుంటే సభ్యులు అసలు బ్లాగంటే ఏవిటి అని అడిగారు. దాంతో ఆయన అక్కడికక్కడే ఒక కొత్త తెలుగు బ్లాగు సృష్టించి చూపించారు.

అటు పిమ్మట కాలాస్త్రి బ్లాగు రాసే శ్రీ (మా వూరాయనే), షికాగో నించి వచ్చిన శరత్కాలం శరత్ , బ్లాగుల్తో తమ వ్యక్తిగత అనుభవాల్ని వివరించారు. ఎందుకు బ్లాగు రాయాలనే కోరిక కలిగింది, బ్లాగు రాయడం ద్వారా తాము పొందుతున్న తృప్తిని గురించి చెప్పారు. పనిలో పనిగా శ్రీ బ్లాగు పేజీలో మనం ఎట్లాంటి వింతలు విశేషాలు పెట్టి దాన్ని పెర్సనలైజ్ చేసుకోవచ్చో చూపించారు. శరత్ తను అప్పటికప్పుడూ రాస్తున్న లైవ్ బ్లాగ్ ని చూపించి, తన ప్రసంగం గురించి అక్కడికక్కడే ఒక వాక్యం రాశారు. తన బ్లాగుల్ని పరిచయం చేస్తూ, గుండె దిటవు ఉన్న వాళ్ళు మాత్రమే తన శృంగారం బ్లాగుకి రావచ్చుని అని హెచ్చరించారు కూడా :)

నేను చెప్పాలనుకున్న చిక్కటి విమర్శ చెప్పేందుకు టైము సరిపోక పోవడమే కాకుండా అది సరైన వేదిక కూడా కాదు అనిపించింది. దాన్ని సవరించి ఇక్కడే నా బ్లాగులో త్వరలో ప్రదర్శిస్తాను. ఆ విషయాల గురించి మనందరం చర్చించుకోవచ్చు. అంచేత నావంతు వచ్చినప్పుడు ఒక ఆరు బ్లాగుల్ని సభ్యులకి పరిచయం చేశాను. ఈ ఆరుగురూ విభిన్న నేపథ్యాల నించి వచ్చి, అటు కంప్యూటరు వాడకానికో, ఇటు తెలుగు రాయడానికో, లేక రెంటికీనూ దూరంగా ఉంటూ వచ్చిన వారు ఈ నాడు ప్రముఖ బ్లాగర్లు అయి, తమ రచనల్తో ఎందరినో అలరిస్తున్నారు. టెక్నాలజీ ఇంత అందుబాటులో ఉండీ తెలుగు భాష సాహిత్యాల మీద ఇంత ప్రేమ ఉండీ మీరు బ్లాగులు రాయకుండా ఉండడం న్యాయం కాదు. బ్లాగు మొదలు పెట్టండి అనే సందేశంతో ముగించాను. మొత్తానికి ఒక సీరియస్ సాహిత్య వేదిక మీద తెలుగు బ్లాగుకి, పెద్ద పీట సంగతి దేవుడెరుగు, అసలు సూది మోపినంత స్థానం దొరకడం ఇదే ఓం ప్రథమం. ఈ అవకాశం ఇచ్చినందుకు డిట్రాయిట్ తెలుగు సాహితీ సమాఖ్య వార్షికోత్సవ కమిటీకి తెలుగు బ్లాగర్లందరి తరపునా ధన్యవాదాలు. త్వరలోనే తెలుగు సాహిత్య రంగంలో బ్లాగులకి ముఖ్య స్థానం ఉన్నదీ అని సగర్వంగా చాటి చెప్పుకునే స్థాయిని మనం సాధించాలని కోరుకుంటున్నాను.

ఈ టపా మొదటి ప్రచురణలో మరచిన విషయాలు:
1. కేవలం బ్లాగు URL ఇవ్వడమో, లేక ఒక్కో బ్లాగు గురించి నా వ్యక్తిగత అభిప్రాయాలో కాకుండా, ఆయా బ్లాగుల్లో ఏం రాస్తున్నారో తిన్నగా సభ్యులకి రుచి చూపితే బాగుంటుంది అనిపించింది. అందుకని, ప్రస్తుతం క్రమం తప్పకుండా టపాలు వస్తున్న బ్లాగుల్లోంచి, పధ్నాలుగు బ్లాగుల నుండి ఒక టపాలోని ఒక చిన్న పేరాగ్రాఫుని (a short excerpt), ఆ బ్లాగు పేరు, URL తో కలిపి ఒక పేజీ కరపత్రాన్ని సభ్యులందరికీ పంచి పెట్టాను.
2. నేను వేదిక మీద ఉదహరించిన 6 బ్లాగులు ఏవో అక్కడ ఇచ్చిన సూచనలను బట్టి ఊహించండి చూద్దాం! (దీనికి ప్రైజు ఏమీ లేదు!!)
3. రానారె, విహారి, చరసాల - వీరు ముగ్గురూ బహుశా రాలేమని ముందే చెప్పినా, ఆఖరి నిమిషంలో అక్కడ ప్రత్యక్షమై నాకు విభ్రాంతి కలిగిస్తారేమోనన్న ఆశ, నిజం చెప్పొద్దూ, ఆదివారం పొద్దుటిదాకా మనసులో ఏమూలో మిణుకు మిణుకు మంటూనే ఉంది. నిష్ఠూరాలాడ్డం నా స్వభావానికి విరుద్ధం. మీరు వచ్చి ఉంటే మటుకు చాలా సంతోషించి ఉండేవాణ్ణి. I missed you, guys! It was a delight to meet CB Rao, Vyzasatya and Sarath. CB Rao and Vyzasatya got to witness some not-usually-seen sides of me after the main event was over. I am not going to spill the beans about that. You have to lobby them! :)

మొదటి సారి కలుసుకున్న కొత్త మిత్రులు, ఎన్నో ఏళ్ళ తరవాత మళ్ళీ కలుసుకున్న పాత మిత్రులు, ఒక పట్టాన వదల లేక వీడ లేక అతి కష్టమ్మీద వీడ్కోళ్ళు చెప్పుకుని బయటికి నడిచాము.

Comments

Ramani Rao said…
మీ పిలుపునందుకొని మన భారత దేశం నుండి ప్రత్యేకంగా హాజరయిన శ్రీ సి.బి రావు గారిని మా తెలుగు బ్లాగరల తరుపున అభినందిస్తున్నాము. సమావేశంలో తెలుగు బ్లాగర్ల సమావేశ కార్యక్రమం తక్కువైనా, ఉన్న సమయంలో విశ్లేషించి చెప్పిన ప్రముఖలందరికీ శుభాకాంక్షలు.

తెలుగు బ్లాగర్ల సంరంభాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఫోటోలతో సహా మాముందుంచిన మీకు ప్రత్యేక అభినందనలు.
కొత్తపాళీగారు,

అంటే ముందుగా బ్లాగుల గురించి అక్షరాభ్యాసం చేయించాలన్నమాట. అది మన బ్లాగర్లందరు కలిసి పూనుకుంటే పెద్ద కష్టమేమీకాదనుకుంటా.. ఇపుడు సూది మోపినంత స్థానం దొరికింది. వచ్చే ఏడాదికి పీట ఏం ఖర్మ పందిరే వేయోచ్చేమో మనమందరం తలుచుకుంటే..
Congratulations and all the best for the future
sorry for writing comment in english
చక్కగా వివరించారు/చూపించారు కొత్తపాళీ గారు.. ఇక్కడి తెలుగు సాహితీ సమావేశాల్లో బ్లాగులకొక స్థానం కల్పించిన ఘనత మాత్రం DTLCదే!! మీతో పాటు సమావేశంలో పాల్గొన్న బ్లాగరులందరికీ అభినందనలు.. ఫోటోలు చాలా చాలా బావున్నాయి.. కనీసం వాటిని చూసైనా మిస్సయిన బాధ నించి బయటపడాలి :-)
Anonymous said…
వావ్.. మీకు నిజంగా హృదయపూర్వక ధన్యవాధాలు.
ఒక cause గురించి మీరందరూ చేస్తున్న కృషి చూస్తూంటే నాకు కొంచెం సిగ్గు గానూ, inspiring గానూ ఉంటుంది.

నేను రాక పోవడం మూలాన, కొత్త మిత్రులని కలసుకునే అవకాశాన్ని కోల్పోయానని తెలుస్తుంది.

మీ ప్రయత్నాలు ఇలానే కొనసాగాలని, అవ్వింకా బాగా సఫలం అవ్వాలని కోరుకుంటూ...
Purnima said…
సమావేశాల గురించి ఇక్కడ పంచుకున్నందుకు నెనర్లు!
మొదటి అడుగు ఎప్పుడూ ఒక్కటే మరి - మొదటివాడు ఎప్పుడూ ఒంటరే మరి.బ్లాగింగుని నెమ్మదిగా ఒక సాహితీ ప్రక్రియగా మార్చటానికి మొదటి అడుగు వేసినందుకు అభినందనలు.
Unknown said…
చాలా మంచి ప్రయత్నం. అభినందనీయం.
మీ టపా చదివేసరికీ... ఒక ఉప్పెన ఎగసింది..ఒక విప్లవం మొదలైంది అని ఏవేవో "ఎరుపుకలలు" కనేస్తూ పాటలు అరిచెయ్యాలనుంది.

చాలా అభినందనీయమైన గర్వించదగ్గ క్షణాల్ని పరిచయం చేసారు. బ్లాగు భాషలో నెనర్లు.
Anil Dasari said…
కొత్తపాళీగారు,

సదస్సు విజయవంతం చేసినందుకు అభినందనలు. మన సాంకేతిక బ్లాగర్లు (తెవా, నశ్రీ) అడపాదడపా బ్లాగులు రాయటమెలా అన్న విషయం గురించి బ్లాగినట్లు గుర్తు. వాటిని క్రోడికరించి ఒక పాకెట్ బుక్ లా చేసి కూడలి, జల్లెడ లాంటి చోట్ల డౌన్లోడ్ కి ఉంచితే కొత్తగా బ్లాగులోకంలో ప్రవేశించేవారికి ఉపయుక్తంగా ఉండొచ్చు. ఈ విషయంలో మీరు చొరవ తీసుకుంటే బాగుంటుంది. నేను కూడా చేతనైన సహాయం చెయ్యటానికి తయార్.

అన్నట్లు, పోయిన వారం ఈనాడులోనో అంధ్రజ్యోతిలోనో డెట్రాయిట్ సదస్సు గురించి వార్త చూశాను. మొదట అదాటున శీర్షికని 'డెట్రాయిట్లో సాహితీ సదస్సుపై విమర్శ' అని చదివి కొంచెం గందరగోళానికి గురయ్యా. తర్వాత తీరిగ్గా చదివితే అక్కడ 'డెట్రాయిట్లో సాహితీ విమర్శపై సదస్సు' అనుంది :-)
మీ సమావేశపు సంగతులను ఫోటోలతో సహా మాకూ చెప్పినందుకు ధన్యవాదాలు. మీరు అక్కడ కూడా బెత్తం పట్టారన్నమాట:)

సమావేశాలకి విచ్చేసిన మన బ్లాగర్లకు అభినందనలు. వచ్చే సమావేశాలకి మరింతమంది బ్లాగర్లు వస్తారని ఆశిస్తూ...
spandana said…
కొత్త పాళీ గారూ,
మిమ్మలని నిరాశ పరిచినందులకు క్షమించండి. మొన్న మొన్ననే ఇండియాకు రెండు సార్లు వెళ్ళి రావడం వల్ల, ఇక్కడ పని భారం అధికమవడం వల్లా నేను రాలేక పోయాను.

సమావేశం బాగా జరిగినందులకు ఆనందంగా వుంది, రాలేకపోయినందులకు భాధగానూ వుంది. సమావేశ వివరాలను పంచినదుకు కృతజ్ఞతలు.

రావు గారి వాషింగ్టన్ పర్యటనకై ఎదురు చూస్తున్నాను.

--ప్రసాద్
http://blog.charasala.com
Bolloju Baba said…
తెలుగుభాష గురించి ఇక్కడ కంటే అక్కడే ఎక్కువ కృషి జరుగుతున్నట్లు నాకనిపిస్తూంది. అందరూ అభినందనీయులు.
ఒక సారి ఎవరిదో ఒక వాఖ్య.
తెలుగు సంస్కృతి గురించి తెలుసుకోవాలంటే ఆటా సంబరాలలో స్పష్టంగా కనపడుతుందని.

ఇది అన్నది ఎవరో గుర్తులేదు కానీ వాఖ్యమాత్రం అప్పట్లో చాలా ఎబ్బెట్టుగా అనిపించింది (సుమారు 2 సం. క్రితం).

బ్లాగులోకంతో పరిచయమయ్యినతరువాత బహుసా కరక్టేనేమో అనిపిస్తూంది.

ఎందరో మహానుభావులు. అందరికీ అభినందనలు.

బొల్లోజు బాబా
మొత్తానికి సి.బీ.రావు గార్ని, పరుచూరి గారిని, కె.హెచ్.ఆర్ గారిని నవ్వుతూ పట్టుకున్నారన్నమాట...
శ్రీ said…
రెండు రోజులు పండుగ లాగా జరిగిందండీ! రవి గారి అద్భుత కృషి చూసి నిజంగా కళ్ళు తిరిగాయి,తెలుగు బ్లాగర్స్ కి ఒక వరం మన వైజాసత్య గారు.సీబీఎన్ రావు గారు రిటైర్ అయ్యి ఇంతగా బ్లాగుతున్నారని తెలిసి చాలా సంతోషం వేసింది.బ్లాగుల పై మీ "ప్రెజెంటషన్" నిజంగా అద్భుతం! ఫోటోలు చాలా చక్కగా వచ్చాయి.
బ్లాగర్ల సంరంభాన్ని గురించి మాత్రమే చెప్పారు. సదస్సులోని మిగతా విషయాలన్నీ ఎప్పుడు, ఎక్కడ?

అక్కడి వక్తలు, వారు మాట్లాడిన అంశాల గురించి చూచాయగా తెలిశాక, మంచి అవకాశాన్ని అందుకొని ఆనందించే అదృష్టాన్ని చేజార్చుకున్నానని అర్థమౌతోంది.

బ్లాగంటే ఏమిటని అడిగినవాళ్లున్నారంటే, తెలుగు బ్లాగనేది అమెరి'కనుల' దృష్టికి ఇంకా చేరలేదంటే ఆశ్చర్యంగా వుంది.

వికీవీరుల కృషికి తలవంచి నమస్కరించాల్సిందే. వారంవారం క్రమం తప్పకుండా వస్తున్న తెవికీ వ్యాసాల్లోని విషయపుష్టిని చూస్తున్నవారికి ఈ విషయం విదితమే.

బ్లాగంటే ఏమిటి - అనే ప్రశ్న పునరావృతం కాకుండా వచ్చే ఏడాదికల్లా సాధించాలనుకున్న లక్ష్యాలేవైఁనా ...?
Anonymous said…
కొత్తపాళీ గారూ, చక్కటి నివేదిక! సభలను బాగా జరిపినందుకు అభినందనలందుకోండి. వికీ, బ్లాగుల వ్యాప్తిలో ఈ సభొక మలుపు కాగలదని ఆశిద్దాం.

మీరుదహరించిన ఆరుగురు బ్లాగరుల్లో (బ్లాగుల్లో) వీరు ఉండి ఉండొచ్చు - రాకేశ్వరరావు, జ్ఞానప్రసూనాంబ, జ్యోతి. ( ఒప్పైనంతమేరకు నావాటా ఏమీలేదును ఇప్పించగలరు. )

మీ అపరిచిత కోణం గురించి.. ఆ సంగతి మా రావుగారు బ్లాగకపోరు, అక్కడ చదూకుంటాం లెండి. :)

వంశీ: ఆ ఫోటోలోని మూడో వ్యక్తి కొడవళ్ళ హనుమంతరావు గారన్న మాట! ఆయన ఫోటోను జాలంలోనే ఎక్కడో చూసాను గానీ ఎవరో గుర్తు రాలేదు. శ్రీనివాసు గారిని కలిసాను కాబట్టి, గుర్తుపట్టేసాను.
Anonymous said…
మొత్తానికి ఏదయితేనేమి మిస్సయ్యా. రాక పోవడానికి కారణం నా సినిమా కష్టాలే. ఎన్నని చెప్పమంటారు లెండి. కడుపు కట్ చేస్తే మ్యాటర్ కాళ్ళ మీద.. ప్చ్..ఉపుచ్..ఉప్చ్.

అక్కడ కండువా/జుబ్బా/కోటు వేసుకొని బ్లాగు ఢంకా మోగించినందుకు మీకు, పాల్గొని తలా రెండు దెబ్బలు వేసిన మిగతా బ్లాగర్లకు అభినందనలు.నేనుండుంటే వికీపీడియన్సు కోసం ఇంకో పది దెబ్బలు వేసుండే వాడిని.

ఇంత బాగా కూచో బెట్టి తెరేసి చూపిస్తారని అనుకోనేలేదు. అంత సెటప్ కు, మాట్లాడుకోడానికి మైక్ సమయం కేటాయించారంటే మీ సాహితీ సమితీ వాళ్ళను మెచ్చుకోవాలి ముందర.

ఆడియో/వీడియో వుంటే పెట్టండి (అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళూ వింటున్నారా?)

మీరు పంచిన కర పత్రాలు కూడా ఇక్కడ పెట్టండి. దాన్నే వచ్చే ఆటా లోనో, బాటాలోనో, తానా లోనో, తామాలోనో పంచితే మరింత మందికి చేరువవొచ్చు.

ఫోటోల గురించి : వైజాసత్య సన్నగయా టేంటబ్బా? అదీ పెళ్ళయిన తరువాత. చాలా అపచారం.
కాలాస్త్రికి వాళ్ళమ్మాయి 'దియ' బుగ్గలొచ్చాయి. స్వర్ణ ముఖి లో నీటి బుగ్గలెక్కువయ్యాయేమో.
మిగతా వాళ్ళందరూ మామూలుగానే వున్నారు. ముఖ్యంగా ఆడియన్సు :-)

చివరగా: ఈ బ్లాగర్లు ఎన్ని సార్లు ఇంగ్లీషులో మాట్లాడారో కూడా చెప్పండి.

చిట్ట చివరగా: అన్నీ సరే సాయంత్రాల్లో అందరూ కలిసి ఏం చేశారో చెబితే నేను(మేము) కూడా ఓ పెగ్గు ఫీలవుతా(మ్‌).

ఆ ఆరుగురు: రానారె, అందం, తాడేపల్లి, చదువరి, తోటరాముడు, జ్యోతక్క.

-- విహారి
cbrao said…
The report is nice but where are the photographs? Pl give link to photos of DTLC meet.
ఉత్సవాలు ఘనంగా జరిగినందుకు సంతోషం. మీ నివేదిక కళ్ళకు కట్టినట్లుగా ఉంది. ఇక్కడే ఉంటూ ఇంత చక్కని కార్యక్రమంలో భాగస్తుణ్ణి కాలేకపోయినా, మరోసారి మీ అందరినీ కలుసుకుంటానన్న ఆశ మాత్రం తప్పకుండా ఉంది.
శరత్ said…
మీ విజిటింగ్ కార్డ్ చూసాక మీరు డ్యాంసర్ అని కూడా అర్ధమయ్యింది. అది కూడా అయ్యుంటుంది - సి బి రావ్ & వైజాసత్య గార్లు మీలో దర్శించిన మరో కోణం - నాకూ చూపిస్తె 4వ నివేదిక లో ప్రత్యక్ష ప్రసారం చేసేవాడిని కదా :)
హ్మ్ మిస్ అయినందుకు బాధ గా ఉన్నా ఫోటో లతో సహా విశేషాలు చదివి చాలా సంతోషించాను, అన్ని వివరాలు ఇక్కడ పంచుకున్నందుకు బోలెడు నెనర్లు కొత్త పాళీ గారు.
Unknown said…
అద్భుతం.
చొరవగా బ్లాగుల గురించి అందరికీ పరిచయం కలిగించడం సంతోషకరమయిన విషయం.

ఫోటోలు చూస్తుంటే అందరూ యంగ్ అండ్ డైనమిక్కులే :-)
Anonymous said…
బ్లాగడం అంటే వాగడం/ఉబుసుపోక అని ఎక్కడో ఓ మూల కుశంక ఉండేది నాకు. ఇది చాలా తప్పు అని అనిపించింది, ఈ సమావేశం గురించి మీరు చెప్పిన తర్వాత. హృదయ పూర్వక కృతఙ్ఞతలు.

@ప్రవీణ్, బెంగళూరు సభ ఎప్పుడు మొదలవుతుంది? కనీసం లాల్బాగ్ లో శనక్కయలు తింటూ అన్నా బ్లాగర్లు కలవాలి. ఇక్కడ మాత్రం నువ్వు, త్రివిక్రం లాంటి ఓల్డ్ అండ్ బద్ధకిష్ట్ లే పూనుకోవాలి.
ramya said…
తెలుగు బ్లాగర్ల సంరంభాన్ని పంచినందుకు ధన్యవాదాలు, ఫొటోలు బావున్నాయి.
(అవును విహారిగారనట్లు ఇంగ్లీష్ లో ఎన్నిసార్లు మాట్లాడారో చెప్పండి).
మీరు చెప్పిన బ్లాగులు..జ్యోతి,రానారె, స్వాతి,అందం,కలగూరగంప,(నా భాగం బహుమతి పంపించండి)

అక్కడ మీరంతా మళ్ళీ మళ్ళీ ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ..
కొత్తపాళీగారు,
ఇలా సగం సగం చెప్పి ఊరించడం బాలేదు.
అవునూ ఇంతమందికి బ్లాగుల గురించి చెప్పారుకదా.. మీ శ్రీమతిగారు కూడా సమావేశానికి వచ్చారు. మరి ఆవిడ బ్లాగు మొదలెడతానన్నారా?? లేకా మాలా సోది రాయడం ఇష్టం లేదా..
సదభిమానంతో వ్యాఖ్యానించిన సహృదయులందరికీ ధన్యవాదాలు. బ్లాగులంటే ఎవరికి వారు రాసుకునేవి. ఆసక్తి ఉంటే రాసుకుంటారు, లేకపోతే లేదు అనే దృష్టి ఉండేది నాక్కూడా. కానీ ఈ సమావేశం తరవాత .. మన సమిష్ఠి కృషితో కొన్ని మంచి పనులు సాధించగలము అని ఒక కొత్త విశ్వాసం వచ్చింది.

@ independent - మీ దగ్గర నా మెయిలు ఐడీ ఉంది. మీరు తరచు ఉపయోగించే మెయిలు నుండి దయచేసి నన్నొక సారి కాంటాక్ట్ చెయ్యండి.
@thatchedhuttales - మీ ఐడీని అర్ధవంతంగా చదవడానికి నాకు సరిగ్గా ఒకటిన్నర సెకన్లు పట్టింది. :) అక్కడ కూడా కొన్ని ఎరుపు కలలు (సభలోనూ, సభ అయ్యాకా) చెలరేగాయి.వివరాలు తరవాత.
@అబ్రకదబ్ర - అవును, ఇటువంటి కరపత్రం ఒకటి హైదరబాదు ఈ-సంఘం వారు చేశారు చాన్నాళ్ళ క్రితం. ఐతే ఎప్పటికప్పుడు దీన్ని నవీకరించుకుంటూ ఉండాలి.
@సిసిము గారు - ఇది మరీ అన్యాయమండీ. నేను బెత్తం ఎక్కడ పట్టుకున్నానండీ?
@చదువరి & వంశీ - అవును. మొదటి ఫొటోలో ఉన్నది పరుచూరి శ్రీనివాసు మరియూ కొడవళ్ళ హనుమంతరావు గారలే. కొడవళ్ళ వారి ఫొటోని ఈమాటలో చూసి ఉండొచ్చు. మీరు ఊహించిన బ్లాగుల్లో రెండు కరక్టు.
@రానారె - ప్రస్తుతం నడుస్తున్న సంరంభాలు సద్దుమణిగాక కచ్చితంగా అటువంటి లక్ష్యాల గురించి అబ్లాసం కొంచెం ఆలోచన చెయ్యాలి. అమెరికాలో పొద్దు రిప్రజెంటేటివ్ గా ఈ విషయాన్ని జనాలకి పదే పదే గుర్తు చేసే బాధ్యత నీ మీదే పెడుతున్నా :)
@విహారి - పెగ్గు ఫీలింగుల గురించి మనం ప్రైవేటుగా మాట్లాడుకుందాం.
@ప్రవీణ్ - కింద రవి రాసిన కామెంటు చూడు :)
@రమ్య - ఇంగ్లీషు అస్సలు దొర్ల కూడదు అన్న లాంటి నియమాలేవీ లేవు. అందరి స్పీచిల్లోనూ కొద్దో గొప్పో ఇంగ్లీషు వచ్చింది. రవి, సీబీరావు గార్ల ప్రెజెంటేషనులో వాళ్ళు కంప్యూటరు అంశాలు కొన్నిటికి మనం ఇక్కడ తరచూ వాడే తెలుగు మాటలు వాడినప్పుడు సభలో కొంచం కలకలం రేగింది. మీ లిస్టులో కూడా రెండే కరక్టు.
@జ్యోతి - ఏమి సగం సగం చెప్పాను? మొత్తం సభ నివేదిక రాయాలంటే ఒక్కళ్ళ వల్ల అయ్యే పని కాదు. సమగ్ర నివేదిక తయారు చెయ్యడానికి ప్రయత్నాలు ఆల్రెడీ జరుగుతున్నై.
మంచి ప్రయత్నం. నిన్న ఇదే విషయం రాస్తే కామెంటు మోడరేషన్ లో ఉంది అని కనిపించింది - కానీ ఇప్పటిదాకా రాలే. ఆఆరుగురూ ఎవరో చెప్పలేదు. రావుగారి ఉత్సాహాన్ని - ఏమని పొగడుదునే...
sneha said…
కొత్తపాళి గారు, క్షమించండి రావడం కుదరలేదు.పాప తో కష్టం గా వుండి రాలేకపోయాను.
'ఆ ఆరుగురి'లో నేనుండకూడదు. ఎందుకంటే నేను కంప్యూటరు వాడకానికీ తెలుగు రాయటానికీ కొత్త కాదు. ఎవరైవుంటారో రెండుపేర్లు తప్ప నేను కూడా ఊహించలేకున్నాను.
Anonymous said…
తెల్లుగు బ్లాగర్లందరకీ నా అభినందనలు. తెలుగు బ్లాగర్ల పయనంలో ఇది ఒక మైలు రాయి. ఇలాంటి మైలు రాళ్ళు మరిన్ని మనం చేరుకుంటూ మన పయనం సాగించాలి.
Anonymous said…
నమస్కారం..
నేను ఒక పోస్ట్ రాసాను..
ప్లీజ్ ఒకసారి నా పోస్ట్ చదివి వీలుంటే మీకు నచ్చితే spread it..ప్లీజ్
ధన్యవాదాలు..
లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
http://prakamyam.blogspot.com/2008/10/blog-post.html