అర్ధాంతరపు కబుర్లు

చెప్పాపెట్టకుండా మాయమైపోయినందుకు ఈ బ్లాగు క్రమం తప్పకుండ చదివే బ్లాగ్మిత్రులందరినించీ క్షమాపణ వేడుతున్నాను. అకస్మాత్తుగా అనేక పనులు ఒక్కసారే చుట్టుముట్టి కొంచెం ఊపిరిసలపని పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ సర్దుకుంటోంది ఇప్పూడిప్పుడే. ఇకనించీ తిరిగి సోమ గురువారాల్లో క్రమంతప్పకుండా టపాలు ప్రచురిస్తాను. తెలుగు పాఠాలకి మాత్రం ప్రస్తుతానికి శలవు (ఎంతైనా వేసంకాలం కదా!). కొత్తపాఠాల్ని తయారుచేసేంత తీరిక ఓపిక ప్రస్తుతానికి లేవు.

నాతో నెట్‌లో మాత్రమే టచ్‌లో ఉండే మిత్రులందరికీ ఒక గమనిక. నేను జీటాక్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో కనబడక పోయేసరికి కొందరు మిత్రులు నేనేదో వారిని block చేశానని భావిస్తున్నట్టు తెలిసింది. అలాంటిదేమీ లేదు. నేనెవర్నీ block చెయ్యలేదు. కొంతకాలంగా ఫేస్‌బుక్ ఒక చిరాకుగా మారింది, అందుకని దాంట్లో ఫీచర్లన్నీ అచేతనం చేశాను. సమయాభావం వల్లనే జీటాక్‌లో కూడా లాగిన్ అవడం లేదు. అంతే విషయం.

నేను ఆబ్సెంటయిన ఈ నాలుగువారాల్లోనూ ఎన్నెన్నో కొత్త సంఘటనలు, వార్తలు, స్వంత అనుభవాలు .. ముచ్చటించుకుందాం అన్నీ తీరిగ్గా.

ఒక్క మాట మాత్రం చెప్పేసి ప్రస్తుతానికి ఈ టపా ముగిస్తా. పాలపిట్ట అనే కొత్త మాసపత్రిక ప్రస్తావన బ్లాగుల్లో చూసే ఉంటారు. ఫిబ్రవరిలో తొలిసంచిక వెలువడింది. తొలి నాలుగు సంచికలూ నాకు నిన్ననే అందాయి. ఒకే ఒక్క మాట - సర్వాంగసుందరం!!! సంతృప్తి కలిగించే ఒక మంచి తెలుగు పత్రిక చదవాలి అనుకుంటే సందేహించకుండా ఈ పత్రికకి చందా కట్టండి! ఎందుకనో ఈ పత్రిక పంపిణీ వ్యవస్థ ఇంక పటిష్ఠంగా ఏర్పడలేదు. అందుకని కొత్త సంచిక విడుదల అయినప్పుడల్లా మిస్సవకుండా పొందడానికి చందా కట్టడంకంటే మంచి మార్గం లేదు. ఇదేదో పత్రికని బతికించండి అన్న వేడికోలుగా చెప్పట్లేదు నేను. ఉత్తమ అభిరుచి గల పాఠకులు ఒక మంచి పత్రికని మిస్సవకూడదనే తపనతో చెబుతున్నాను. తప్పక చందాకట్టండి.
వివరాలకు
ఎడిటర్, పాలపిట్ట మాసపత్రిక
House No 16-11-20/6/1/1,403
విజయ సాయి రెసిడెన్సీ
సలీం నగర్, మలక్ పేట్
హైదెరాబాద్-500036
ఫోను-9848787284


సోమవారం నాడు కబుర్లతో కలుసుకుందాం. వారాంతపు ఆనందం మీసొంతం!!

Comments

హమ్మయ్య మీరు మళ్ళీ ఫార్మ్ లో కి వచ్చారు, ఆనందంగా ఉంది.
Hima bindu said…
నేను ఈ రోజే అనుకున్నాను కొత్తపాళీ గారు కనబడటం లేదేమా అని.
అదేదో సావెజ్జెప్పినట్టు .. చాన్నాళ్ళ తరవాత నా బ్లాగు తెరుచుకుని ఏదో రెండు ముక్కలు రాసుకుని పోబోతుంటే ఈ బ్లాగరు వెధవ టట్టడాయ్ ఇప్పుడు ఇక్కడే మీరు మీ టెంప్లేట్లని మార్చుకోవచ్చు అని జెండా ఊపితే ఉన్న చెయ్యి ఊరుకోక ఆ జెండ నొక్కా. దాంతో ఉన్న టెంప్లేటు కాస్తా ఊడింది. ఏదో హడావుడిగా దొరికిన దాన్నొకటి తెచ్చి ఇక్కడ అతికించా. కళ్ళకి మరీ శ్రమ కలిగితే చెప్పండి. వారాంతంలో మారుస్తా.
భావన said…
హలో అండీ చాలా రోజులయ్యింది. ఎలా వున్నారు? మీ వూరు ఏదో సూపరని మా అబ్బాయి ని అక్కడ యూనివర్సిటీ కు పంపితే అదేమిటండి అలా మెరుపు వురుములతో భయపెడతారు... :-(
మీకేమి ప్రాబ్లమ్ లేదు కదా మొన్నటి టోర్నడో అలార్మ్ లతో.
ఏం సామెతండీ? :)

అంటే మీ బ్లాగు టెంప్లేట్ గురించి నిజం చెప్పమంటారా అబద్దం చెప్పమంటారా బ్లాగుయజమానీ?

నిజమయితే చీకట్లో టార్చిలైట్ పెట్టి అక్షరాలు తడుముకుంటూ చదువుతున్నట్టు ఉంది.

అబద్దమయితే బ్లాగుల్లో అలా అలా తేలిపోతున నన్ను మీ బ్లాగ్ టెంప్లేట్ లాగి తెచ్చి ఇక్కడ పడేసింది, అందంతో కట్టిపడేసింది

ఇక మార్చాలో మార్చకూడదో మీ ఇష్టం :D
సౌమ్య .. మార్చానండీ. :)
భావన .. అదేంటి, ఉరుములు మెరుపులు మీ వూళ్ళొ రావా? పిల్లాణ్ణి ఒక కాలేజివాణ్ణి చేసిన సందర్భంగా అభినందనలు.
చిన్ని .. thank you
Sandeep P said…
"అచేతనం చేశా" -- ఈ పదం బాగుందండి. అచేతనం (deactivate) :-) Welcome back!)
Vasu said…
హమ్మయ్య వచ్చేసారా. నేను రోజూ చూసే రెండు బ్లాగ్లు (మీది, నెమలికన్ను) ఒకే సారి బోలెడు విరామం తీసుకున్నాయి. ఏం చెయ్యాలో తెలియలేదు. వెయిట్ చేశా.

ఔను ఆ మాస పత్రిక అమెరికా లో చందాదారులకి ప్రతీ నెలా పంపారా. నాలుగు నెలలవి కలిపి అందాయన్నారు.

నాకు పాత టెంప్లేటే బావుంది.
@sandeep .. నా సృష్టికాదు, మనవాళ్ళే ఎవరో చెప్పినదే.

@Vasu .. చందాదారులకి క్రమం తప్పకుండా పంపుతారా? మంచి ప్రశ్న. నిజానికి నాకు తెలియదు సమాధానం. బైదవే, చందాకట్తమన్న నా సలహా ఇండీయాలో ఉన్న పాఠకులకోసం. ఆంధ్రానుండి పుస్తకాలు పత్రికలూ తెప్పించుకునేందుకు నాకు వేరే మార్గం ఉంది.
అర్థాంతరపు కబుర్లా, అంతర్థానమైపోయిన కబుర్లా! :)
cbrao said…
పాలపిట్ట లో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గురించిన మీ వ్యాసం చూశాను. మీకు నల్లవాళ్ల పై సానుభూతి కి తోడ్పడిన అంశాలేమిటి?
cbrao
Mountain view (CA)
సీబీరావుగారు నాకు నల్లవాళ్ళపై సానుభూతి అనేది అర్ధం లేని ప్రతిపాదన నా దృష్టిలో. ఒక జాతిని గురించి అకారణంగా సానుభూతి చూపించడానికి నేనెవర్ని? పైగా సానుభూతి చూపించాలి అంటే వాళ్ళకంటే కనీసం ఒక్క మెట్టయినా పైన ఉండాలి - అలా ఉన్నానని నేను అనుకోను. ఎటొచ్చీ నాకు ఉన్నది ఈ దేశంలో మనం మైనారిటీలము అనే స్పృహ. దాంతో, దేశంలోని అతి పెద్ద మైనారిటీ జాతి పట్ల ఒక గౌరవం, ఒక కుతూహలం.