తెలుగు పాఠం - మే 11

పాఠంలోకి వెళ్ళేముందు ఆంధ్రభారతి వారికి జేజేలు చెబుదాము.

ఆంధ్రభారతి ఇప్పటికే కొన్నేళ్ళుగా జాలంలో సాంప్రదాయ తెలుగు సాహిత్యానికి గొప్ప నిధిగా భాసిల్లుతోంది. నారాయణతీర్ధుల కృష్ణలీలా తరంగిణి, అనేక త్యాగరాజకృతులు, కొన్ని ప్రబంధాలు సంపూర్ణంగాను, కొన్ని సెలెక్షన్సుగాను, సులభంగా లభ్యం కాని ఆధునిక కావ్యాలు ఇవన్నీ సేకరించి, ఎంతో శ్రద్ధతో తెలుగు టైప్ సెట్ చేసి (నేను చూసినంతలో ఎక్కడా అచ్చుతప్పు కనబ్ళ్ళేదు) మనకి అందుబాటులోకి తెచ్చారు. ఇదంతా పాత కథే. దీనికే మనం వారికెంతో ఋణపడి ఉన్నాం.

ఇప్పుడు జేజేలు చెబుతున్నది అందుక్కాదు. వీరు సరికొత్తగా జాలనిఘంటువుని వెలువరించారు. ఇవ్వాళ్ళే దీన్ని ఓ పట్టుపట్టాను. అద్భుతంగా ఉంది. DSAL వాళ్ళ జాలనిఘంటువుకంటే కనీసం మూడు మెట్లు పైనుంది. శేషతల్పశాయిగారు, అద్భుతంసార్! సవినయంగా టోపీలు తీసేశ్శాం!!

మరీ ప్రతీపాఠంలోనూ తప్పులెంచితే భక్తులకి బోరెక్కుతుందని ఈ సారి నేనే ఒక వాడుకని పరిచయం చేస్తున్నా. ఇదీ పాతవాడుకే, కానీ ఈ మధ్య అంతగా కనిపించడం లేదు. మొన్న చేరాగారి పాత వ్యాసం ఏదో చదువుతూంటే కళ్ళకి తగిలింది, వేంటనే పట్టేశాను ఈ వారం తెలుగుపాఠానికి. ఈ వారం వాడుక -

కరతలామలకం.

హమ్మ్ హమ్మ్. నిజం చెప్పాలంటే ఇది సంస్కృతం అనుకోండి, ఐనా తెలుగు వచనంలోనూ, రెఠొరిక్ లోనూ చాలా విరివిగా వాడుతుంటాము. కరతలం అంటే అరచెయ్యి. ఆమలకం అంటే ఉసిరికాయ. కరతలామలకం అంటే అరచేతిలో ఉన్న ఉసిరికాయలాంటిది. ఒక వ్యక్తికి ఏదైనా ఒకవిద్య చాలా సులభంగా అలవడింది, పిలిస్తే పలుకుతుంది అనే అర్ధంలో ఈ పదబంధాన్ని వాడుతాము. బాలమురళీకృష్ణగారికి చిన్నవయసులోనే కర్నాటకసంగీతం కరతలామలకమైంది. సచిన్ టెండుల్కర్‌కి ఎటువంటి బౌలింగ్‌ని ఎలా ఎదుర్కోవాలి అనేది కరతలామలకం. దీన్నే, శంకరాచార్యుల భజగోవిందశ్లోకాలని పరిచయంచేస్తూ చక్రవర్తి రాజగాపాలాచారిగారు .. Sri Adi Sankara who drank the ocean of jnaana as easily as one sips water from the palm of one's hand .. అంటారు. కానీ మన వాడుకలో అది ఉసిరికాయ అయింది. ఉసిరికాయే ఎండుకయింది? ఆచార్యులవారన్నట్టు నీటిగుక్క ఎందుకు కాలేదు? పోనీ ఘనపదార్ధమే కావాలంటే ఓ మావిడిపండో, జాంపండో ఎందుక్కాలేదు? అలోచించండి.

గతవారపు పదాలు


ధారాళం = అడ్డులేకుండా .. పంపులో నీళ్ళు ధారాళంగా వస్తున్నాయి. రమేషు తమిళం ధారళంగా మాట్లాడుతాడు.
చూడామణి = చూడము అంటే నడినెత్తిన ఉండే జుట్టు. ఆ నడినెత్తిన జుట్టులో ధరించే ఆభరణం చూడామణి. సుందరకాండలో రాములవారు హనుమంతునికి తన ఆనవాలుగా తన ముద్రిక (ఉంగరం) ని ఇచ్చి పంపితే తిరుగుటపాలో సీతామ్మవారు తన చూడామణిని ఇచ్చి పంపుతుంది. చంద్రుణ్ణి శిరోభూషణంగా ధరించిన శివుణ్ణి చంద్రచూడుడు అంటాము. ఏదైనా సమూహంలో అతి శ్రేష్ఠమైన వస్తువు, లేదా వ్యక్తి అని సూచించేందుకు కూడా చూడామణి (దీని పర్యాయపదాలు కూడా) అంటాము .. "గోపస్త్రీ పరివేష్ఠితో విజయతే గోపాల చూడామణీ."
చమురు = నూనె. ఇది బహుశా మాండలికమేమో. ఆధునిక పత్రికల పరిభాషలో పెట్రోలియమ్ని సూచించడానికి వాడుతున్నారు.
బోలెడు = బోలె అన్నా బొచ్చె అన్నా ఒకటే .. ఒక పాత్ర. అది కూడా పెద్ద పాత్ర ఏమీ కాదు, ఒక మాదిరి పరిమాణమున్న పాత్ర. మరి బోలెడు బొచ్చెడు అంటే చాలా అనే అర్ధం ఎలా వచ్చిందో. నాకు బోలెడు పాటలొచ్చు. మా అమ్మాయికి బోలెడు ధైర్యం, వాళ్ళమ్మని కూడా ఎదిరించి మాట్లాడుతుంది!
మిసిమి = మెరుపు, కాంతి

ఈ కింది పదాలకి అర్ధాలు చెప్పండి .. అతి సులభం అన్నీ రెండక్షరాల పదాలే .. నిఘంటువులు వెతక్కుండా!
గోము
నీటు
తాట
వేల్పు
వెన్ను

Comments

గోము = ముద్దుగా, గోముగా అడిగింది అంటారు.
తాట = చర్మం
వేల్పు = దిక్కు
వెన్ను = వెన్నెముక (back bone)
మీ తెలుగు పాఠం బాగుందండీ నా ’అ’ఙ్ఞానాన్ని మరోసారి పరీక్షించుకుంటాను :-)

గోము : గారం, ముద్దుగా
నీటు : శుభ్రం (ఇది తెలుగు పదమా !! English Neatness కి ఆంధ్రీకరణ అనుకుంటున్నాను వేరే అర్ధాలున్నాయా)
తాట : చర్మం
వేల్పు : వెలసిన, ఉన్న
వెన్ను : spine
రవి said…
ఆమలం - ఉసిరి, ఆమలకం - అంటే చిట్టి ఉసిరి కాయ అనుకుంటున్నాను.మృచ్ఛకటికం లో శకటం-బండి, శకటికం - చిన్నబండి లాగ. :-)

ఆమలకమే ఎందుకనే ప్రశ్న బావుంది. ఎందుకో మరి?

చూడామణికి మీ వివరణ బావుంది.

గోము = గారాబం
నీటు (పెద్ద నీటుగాడా అని ప్రయోగం. అర్థం తెలీదు)
తాట = చర్మం (తాట ఒలుస్తా, తాట తీస్తా)
వేల్పు = ఏలెడి వాడు (అనుకుంటున్నాను)
వెన్ను = పృష్ట భాగం. (వెన్నుడు అంటే కృష్ణుడని ఓ అర్థం ఉండాలి)
గోము - భావం మెదడులో ఈ పక్క నుండి ఆ పక్కకి పరిగెడుతోంది కాని అక్షరాల రూపంలో బయటకు రావట్లే...:)
నీటు - ....
తాట - అంటే చర్మమే కదా, తాట తీస్తా
వేల్పు - దైవమా? ఇలవేల్పు అంటారు
వెన్ను - వీపు, వెన్ను చూపని వీరులు
వ్యాఖ్యలను ఫలితాలు వెలువడే వరకు దాచగలరు(కనీసం ఒక రోజు)
Anonymous said…
గోము = గారాబంగా, ముద్దుగా

తాట = తోలు, చర్మము

వేల్పు, వేలుపు = దేవత

వెన్ను = వెన్నెముక, ఆధారం, వరి మొదలైనవాటి కాండము.(దీనికి కంకులు వస్తాయి)
బలేగ చెప్పారాండి మి ఎక్ష్ప్లనతిఒన్
నాకు తెలుగు అంథ బగ రధు. కాని ట్రై చెస్థను
గోము = తెలిదు
నీటు = clean?
తాట = skin
వేల్పు = god, కధ
వెన్ను = తెలిదు
వేణు అజ్ఞానం ఏమి లేదు. Educate and entertain is the policy here. నీటు ఆంగ్లపదానికి అంధ్రీకరణ కాదు.

రవి .. అమలకం .. చిన్న ఉసిరికాయ .. బాగుంది. మీరు చెప్పింది సరైనదే అనిపిస్తున్నది.

కన్నగాడు .. జవాబులు రాసే వ్యాఖ్యల్ని దాచమంటారా? ఇదేమీ పోటీ కాదే. సరే, వచ్చే వారం గుర్తు పెట్టుకుంటాను.
@ మిరియప్పొడి .. మీ పేరు బాగుంది :)
ఇంగ్లీషుని తెలుగు లిపిలో రాసేప్పుడు ఇంగ్లీషు స్పెల్లింగులో రాస్తే కుదరదు. జాగ్రత్తగా చూడండి.
Sanath Sripathi said…
పండిన తర్వాత రాలే పళ్ళల్లో చేతిలో పట్టే ఫలాల్లో చిన్నది ఉసిరిక మాత్రమే అయి ఉండచ్చేమో. మామిడి, జామ, సపోట, ఇత్యాది వన్నీ ఉసరిక కన్నా పెద్దవే. ఓకవేళ ద్రాక్ష అందామనుకున్నా అవి గుత్తిగా ఉంటాయి కనుక ఏకవచనం సంబోధనకి దానిని అనువుగా భావించి ఉండకపోవచ్చు. (Quality భాష లో చెప్పాలంటే Measurable గా ఉండాలి కదా)

A bird in hand is better than two in bush అన్నట్టుగా కరతలామలకం అన్నారేమో కూడా అని నా అనుకోలు.
రవి said…
@సనత్ గారు: మీ ఆలోచనే నాకూ వచ్చింది. అయితే బదరీ ఫలం (రేగు పండు) కూడా చేతిలో పడుతుంది.

కొ.పా గారు: ఆమలం అన్న ప్రయోగం ఎక్కడా గుర్తు రావట్లేదు. ఆమలకం అన్న వాడుకే ఎక్కువనుకుంటాను.

ఆమలం కరెక్టేనా?
malli said…
కన్నగాడు said...
గోము - భావం మెదడులో ఈ పక్క నుండి ఆ పక్కకి పరిగెడుతోంది కాని అక్షరాల రూపంలో బయటకు రావట్లే...:)"
సున్నితమైన హాస్యం...హాయిగా నవ్వుకున్నాను
Sanath Sripathi said…
మా అబ్బాయికి భోగి పళ్ళు పోద్దాం అనుకున్నప్పుడు బదరీ ఫలాల్లో పెద్దవి (జామ కాయ సైజువి) నేనెరుగుదును. (హాస్చర్య పోయాననుకోండి. ఉసిరికాయల్లో రాచ ఉసిరి తీసుకున్నా అది అరచేతిలో పట్టేంతే ఉంటుంది.

కాకపోతే అరచేతిలో పట్టేంతే సైజుల్లో బాదం పళ్ళు ఉన్నాయనుకోండి..
Ravi said…
తాట = తొక్క అనే అర్థం కూడా వస్తుంది
మాలతి said…
బాగున్నాయండీ మీపాఠాలు.
నాకో సందేహం. నీటు అన్నది తెలుగు పదమేనా. నీటూ గోటూ అంటాం కానీ నీటు అన్నది నీట్ కి తెలుగైజేషన్ అనుకున్నా ఇంతకాలం.
సనత్ - బాగుంది. కానీ ఈ వాడుకకి A bird in hand అన్వయం సరిపోదు. పెద్దవైన బదరీ ఫలాలు - హ హ, నాకు అనుభవమే.

రవిచంద్ర - వోకే.

మాలతిగారు - నీటు తెలుగు పదమేనండి. వివరణ రేపటి పాఠంలో
అర్థాలు దాదాపుగా అందరూ కలిసి చెప్పేశారు. మళ్ళీ నేను చెప్పటం అనవసరం. నీటు అని తెలుగు పదంఉందనీ తెలీదు. దాని అర్థమూ తెలీదు.
ఇకపోతే ఉసిరికాయ వైద్య పరంగా చాలా విలువైనది. మంచి ఆరోగ్యానికి ఉసిరి ఉపయోగ పడినట్టు ఇంకేదీ ఉపయోగపడదంటారు. అందుకనే అర చేతిలో పట్టుబడిన విద్య సమాజానికి ఉపయోగపడేదై ఉండాలని (అమలకం ఆరోగ్యానికి ఉపయోగపడినట్టు) యోగ్యమైన ఉసిరినే ప్రతీకగా తీసుకున్నారు.
శబ్బాష్ మందాకిని గారు - నా మనసులో నేననుకున్నది చెప్పారు అమలకం గురించి
కొత్తపాళీ గారూ,
అమలకము, ఆమలకము రెండు సరి ఐన ప్రయోగాలేనా?
రవి గారు "ఇక" చేర్పు గురించి చెబుతారనుకున్నాను. ప్రత్యయం అంటారేమో. రాజగోపాలాచారి గారు ఔపోసన పట్టారు అనే అర్ధం లో వాడారనుకుంటాను.
భవదీయుడు
ఊకదంపుడు
@ వూకదంపుడు .. రవి, సనత్ ఇద్దరూ దీన్ని గురించి హెచ్చరించినా గమనించలేదు. ఇప్పుడు మీ పిలుపుతో మెలకువొచ్చింది. ఆమలకము (aamalakamu) సరైనది. టపాలో కూడా సవరించాను.
చూడుము - అర్ధం ఇప్పుడే తెలిసింది, Thank you.
'మల్లగుల్లాలు పడుట ' =?; మల్లచరుపులు, తొడకొట్టుట, మల్లబంధం, ఆ కుస్తీ ఆటలోని షరతులు, పట్టుల నామావళి- గురించి తెలుపగలరా?
గిల్లిదండ - లేక- కన్నడ పదాలు ఏదైనా మూలమా? - కాదంబరికుసుమాంబ
Unknown said…
Sir, దోసెట్లోఇముడ్చుకోలేనివాటిని బోలెలో, బొచ్చెలో పోస్తాము. అందుకే బోలెడన్ని అంటే చాలా ఎక్కువ అనే అర్థము వచ్చి ఉండ వచ్చును.