కబుర్లు - జనవరి 4

సరిగ్గా క్రిస్మసు రోజున వాడెవడో నవరంధ్రాల్లోనూ ఏవేవో దోపుకుని మా డిట్రాయిటొచ్చే విమానం ఎక్కేశాట్త. మొత్తానికి పెద్ద ప్రమాదమైతే తప్పింది గానీ, ఇహ ఏంస్టెర్డాములోనూ యెమెన్‌లోనూ రాజుకుంటోంది రావణ కాష్టం. చల్లటి కాలం కదాని కాస్త మాతృదేశ సందర్శనానికి వెళ్ళొచ్చే అమెరికా ప్రవాసులందరికీ అక్కడ తెలంగాణా దిగ్బంధం, ఇలాగ దారిలో రక్షణ వలయ దుర్బంధం.

రెండు మంచి సాహిత్య చర్చలు ఊపందుకున్నాయి బ్లాగుల్లో ఈ మధ్య. మీరూ గొంతు కలపండి ఆసక్తి ఉంటే. కల్పన గారి బ్లాగులో స్వర్గీయ కవి అజంతా గురించి కవి విమర్శకుడు అఫ్సర్ గారి వ్యాసం మొదలుకొని కవిత్వం ఏవిటనే మూలాల్ని గురించి మంచి చర్చ జరుగుతోంది.

కథలకి సంబంధించిన కొన్ని మౌలిక విషయాల్ని చక్కగా అరటి పండు వలిచి పెట్టినట్టు విశదపరిచే బ్లాగు మాలతి గారి తెలుగు తూలికలో రచయితా - కథకుడూ .. ఒకరేనా, వేర్వేరా అని చర్చ జరుగుతోంది.

హైదరాబాదు పుస్తక ప్రదర్శన ముగిసిందో లేదో, విజయవాడ పుస్తకాల పండుగ మొదలైంది. జనవరి 1 నించీ 11 దాకా జరుగుతోంది. అనేక సాయంత్రాలు చక్కటి సాహిత్య సభలు జరుగుతున్నాయి. వివరాలిక్కడ. అప్పుడే పోయిన వారాంతం ఈ-తెలుగువారు సంరంభం జరిపించారు.

అన్నట్టు ఇప్పుడే యువమిత్రుడు వాసు చెప్పాడు, శ్రీపాద వారి కథలు కొత్త సంపుటాలుగా విశాలంధ్రలో దొరుకుతున్నాయిట. హైదరాబాదు ఎల్. బి. నగర్ కి చెందిన ప్రగతి పబ్లిషర్స్ వారు ప్రచురించారు. వీళ్ళు ఇదివరకే పుల్లంపేట జరీచీర అనే పెద్ద సంపుటి ఒకటీ, నిలువు చెంబు అనే చిన్న సంపుటి ఒకటీ ప్రచురించి ఉన్నారు. ఇప్పుడు వడ్లగింజలు, కలుపుమొక్కలు, మార్గదర్శి అనే పేర్లతో మూడు సంపుటాల్ని తీసుకొచ్చారు. విశాలాంధ్ర వారు ఇదివరలో ప్రచురించిన మూడు కథా సంపుటాలు కొన్నేళ్ళుగా అందుబాటులో లేని విషయం విదితమే. కథా సాహిత్యాన్ని ఇష్టపడే మిత్రులందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తాను. తెలుగువారైన ప్రతివారు చదివి తీరవలసినవి శ్రీపాదవారి కథలు. మునుపు నేను ఆ మహానుభావుని ఒకానొక కథని తలుచుకున్న వైనం ఇక్కడ. మార్గదర్శి కథ శ్రవ్యకం నా గొంతులో ఇక్కడ వినొచ్చు.

ఇద్దరు సాహిత్య ప్రముఖులు బ్లాగులు ప్రారంభించారు ఇటీవల. ఆంధ్ర జ్యోతి ప్రధాన సంపాదకులు కె. శ్రీనివాస్ గారి బ్లాగుని ఇక్కడ చూడచ్చు.

మృదుభాషి, సున్నితంగా స్పందించే కవి వంశీకృష్ణ గారి విదేహ ఇక్కడ.

మీరూ ఓ లుక్కెయ్యండి.

Invi New Size

Comments

మొత్తానికి సాహిత్యావలోకనం వంటి కబుర్లు. ఇక మూ వూర్లో కూడా తెలంగాణ ఆంధ్ర వాదోపవాదనలు మహజోరుగా సాగిపోతున్నాయి.
కొత్తపాళీ గారు మీ బ్లాగుని ఈమధ్యనే చూసాను. ఇద్దరు యువ రచయిత్రులు రచించిన పుస్తకం గురించి చెప్పారు. ప్రకృతితో ఆడవాళ్లు మాత్రమే ఇంతగా మమేకం ఎలా అవగలరో అర్థం కాదు అన్నారు. ఆ పుస్తకం గురించి వివరాలు చెప్పండి. కొని చదువుతాను. ఎక్కద దొరుకుతుందో చెప్పండి. మీ బ్లాగులోనే చూసాను. ఎక్కడ చూసానో గుర్తు రావత్లేదు. వివరాలు చెప్పండి.
@ సవ్వడి .. యువరచయిత్రులు రాసిన పుస్తకమా .. ఈ మధ్యన అటువంటిది చదివిన గుర్తు లేదండీ.
మురళి said…
ప్రగతి వారి పుస్తకాలు చాలా రోజులుగా స్టాండ్స్ లో ఉన్నాయండీ.. కాకపొతే 'అనుభవాలు, జ్ఞాపకాలూను..' వేయకపోతారా అని ఎదురు చూస్తున్నాను నేను.. అన్నట్టు విశాలాంధ్ర వాళ్ళు బుచ్చిబాబు కథల సంపుటం, అడివి బాపిరాజు 'గోనగన్నారెడ్డి' తెచ్చారు, కొత్తగా..