కబుర్లు - నవంబరు 16

వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ వారంవారం కబుర్లు మొదలెట్టి ఏడాదైపోయింది. 52 కాదుగానీ ముప్ఫై రెండో ముప్ఫైమూడో లెక్కకొచ్చినాయి ఈ యేడాదిలోనూ .. సుమారు అరవై శాతం .. పర్లేదు.

మొన్న టెక్సస్ ఫోర్ట్ హుడ్‌లో జరిగిన ఘాతుక చర్య తరవాత మరోసారి బుర్ర స్తంభించింది. ఒకటి రెండేళ్ళకోసారి ఇలాంటి ఘాతుకాలు జరిగి జరిగి బుర్ర మొత్తం, ఇక స్పందన అనేది మిగలకుండా, శాశ్వతంగా స్తంభించిన స్థితిలో ఉండిపోయేలా .. పదేళ్ళ కిందట కోలంబైన్ .. మొన్నటికి మొన్న వర్జీనియా టెక్, ఇప్పుడిది, మధ్యమధ్య చిన్నా చితకా సంఘటనలు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా మీడియా తైతక్కలు చిరాకు పుట్టిస్తున్నాయి. విర్జీనియా సంఘటన జరిగినప్పుడు వాళ్ళ కథనం .. కాల్పులు జరిపినతను కొరియెన్ సంతతికి చెందిన అమెరికను. అలాగే ఈ ఫోర్ట్ హుడ్ సంఘటనలో వారి కథనం .. ముస్లిము అయిన అమెరికను. అతను ముస్లిము అవడం వల్ల ఈ పని చేశాడా, లేక మతి స్థిమితం లేక చేశాడా? పైగా అతను వర్జీన్యాటెక్ లో చదివాట్ట .. ఇదిగో పులంటే అదిగో తోక అన్నట్టుగా ఉంటుందిక ఆ కథనం.

ఏదేమైనా, ప్రస్తుత అమెరికను సమాజం ఒక సంక్లిష్టమైన సంక్షోభం దిశగా పరిగెత్తుతున్నది. ప్రతీ విషయాన్నీ ఏకీలుకాకీలుగా విడగొట్టి పరిశీలించే పరిశీలకులకీ, వారి సలహాల మీద ఆధార పడే పాలకులకీ, ఈ సంఘ్టనలు భద్రతా సమస్యలుగాను, దేశ ప్రజల్ని పట్టి పిండుతున్న ఆర్ధిక సమస్య కేవలం వాలువీధి సమస్యలాగాను కనబడుతుంటే అది చూపు మందగించిన హ్రస్వదృష్టి తప్ప మరోటి కాదు. రక్తమజ్జలో పట్టి దేహమంతా వ్యాపిస్తున్న చీడని గుర్తించుకోలేక అక్కడో పట్టీ, ఇక్కడో కట్టూ వేసుకుంటూ వైద్యం చెయ్య చూస్తున్నారు.

మిషిగన్ రాష్ట్రంలో స్థానిక ఆర్ధిక పరిస్థితి మహాఘోరంగా పరిణమించింది. ఆహారం, రాబోయే చలికాలాన్ని తట్టుకునేందుకు వెచ్చదనం వంటి కనీసావసరాల కోసం ప్రజలు ఎప్పటికంటే పెద్దసంఖ్యలో ప్రభుత్వ సహాయంకోసం ఎదురుచూశ్తున్న పరిస్థితుల్లో, బడ్జెటు బేలెన్సు చెయ్యాలనీ, కొత్తపన్నులు వెయ్యకూడదనీ, ఇంకేదో పిండాకూడనీ ఇరు రాజకీయ పక్షాలూ బిర్రబిగుసుకుని కూర్చుని, ఉన్న పరిస్థితిని ఇంకా అధ్వాన్నం చేస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో అసలు మూడో ప్రత్యామ్నాయం ఒకటుండాలి, లండీ వెధవల్లారా, మీ ఇద్దర్నీ ఎన్నుకోము, అసలు ఒక నాలుగేళ్ళ పాటు రాష్ట్రానికి గవర్నరూ, అసెంబ్లీ రెండూ లేకుండా వుంటే అందరికీ సుఖంగా ఉంటుంది, మీ అందర్నీ (ఈ రాష్టరంలో ఉద్యోగాలు కోల్పోయిన లక్షలాది ప్రజల్లాగే) మీమీ ఉద్యోగాల్నించి తొలగిస్తున్నాం. పోండి, పోయి అనెంప్లాయ్‌మెంటు ఆఫీసులో నమోదు చేసుకోండి అని ఇంటికి పంపించాలి వెధవల్ని.

మొన్న స్నేహితులొకరు ఆసక్తికరమైన ప్రతిపాదన చేశారు - బ్లాగుల్లో నాస్టాల్జియా, హాస్యం, ఇలాంటి టైంపాస్, ఫీల్‌గుడ్ టాపిక్కులకి వచ్చిన స్పందన, ఏదైనా సీరియస్ విషయం కూలంకషంగా చర్చించడానికి ప్రయత్నించే టపాలకి అస్సలు రాదు అని. నాకు బ్లాగులంటే ఉన్న ఇష్టంతో యధావిధిగా నేను బ్లాగుల తరపున వాదించబోయాను. కానీ కొంచెం నింపాదిగా ఆలోచిస్తే వారు చెప్పింది నిజమే అనిపించింది. తరచూ రాస్తుండే వందలాది బ్లాగర్లలో, ఏమాత్రమైనా సీరియస్ అని చెప్పుకోగల బ్లాగులు పదో పన్నెండో ఉన్నాయి. వాటిలోకూడా, రాజకీయం, లేదా సమకాలీన విషయాల మీద రాసే బ్లాగుల్లో హాస్యం, వ్యంగ్యం ఫలించినంతగా విశ్లేషణ ఆలోచన కనబడవు. ఏదన్నా విషయాన్ని గురించి ఎవరన్నా కొంచెం లోతైన ఆలోచన చెయ్యబూనుకున్నా, అత్యవసరంగా అప్పటికి ఆ టాపిక్కు గొప్ప కాంట్రవస్రీ అయి కూర్చుంటుంది. దానికి వచ్చే వ్యాఖ్యలు, వాదోపవాదాలు, అతిత్వరగా ఎకసెక్కాల్లోకి, ఎత్తిపొడుపుల్లోకి, ఆఖరికి మూతి విరుపుల్లోకి దిగజారిపోతాయి. వుట్టినా కబుర్లు చెప్పుకుందాం అని కాకుండా, ఏమన్నా కాస్త విషయం మాట్లాడదాం, చర్చిద్దాం అని బ్లాగుల్లోకి వచ్చేవారికి ఏం ఉత్సాహం మిగుల్తుంది ఇలాంటి పరిస్థితుల్లో? ఆలోచించాల్సిన విషయమే.

మొన్న జరిగిన స్టార్నైట్లో సినీకవి జొన్నవిత్తుల రామలింగేశ్వర్రావుగారు తెలుగువాణ్ణుద్దేశించి మాతృభాషని పట్టించుకోనాయనా అని దండకం రూపంలో ఉద్బోధించారు. అద్భుతంగా ఉంది. నాకు పాడ్డం చేతగాదు గానీ దీని అచ్చుప్రతి సంపాయించి భట్టి వేసే ప్రయత్నం చేస్తాను. దీని ప్రతి ఎవరికన్నా అందుబాటులో ఉంటే దయచేసి నాకో మాట చెప్పండి. మావూరి బ్లాగరి, బహుముఖ ప్రజ్ఞాశాలి జేప్స్ ఒకటిరెండేళ్ల కిందట రూపొందించిన ఈ లఘుచిత్రం మొన్ననే నా దృష్టికి వచ్చింది. మీరూ ఓ లుక్కెయ్యండి.

Comments

కొత్త పాళీ గారూ, బాగున్నారా? మీరన్నట్లు సీరియస్ గా రాసే నాక్కూడా హాస్యరచన కనబడితే ముందు అదే చదువుతాను, హాస్యానికి వ్యంగ్యానికికి రీడర్స్ ఎట్రాక్త్ అవుతారన్నమాట వాస్తవమే....... నూతక్కి
ఉభయ కుశలోపరి. NIT మీద నేను రాసిన దానికి వచ్చిన వాఖ్యల్లో మీ వాఖ్యలు, మీ సంబోధన ఎంతో స్వాంతన చేకూర్చాయి. ధన్యవాదాలు. ఇక ఈ నాటి మీ కబుర్ల విశయానికి వస్తే, మీతో ఏకిభవిస్తాను. హాస్యానికి, వెటకరానికే పెద్ద పీట. సీరియస్ విశయాలు రాస్తే ఇంకేముంది వాదోపవాదాలె.

--విజయ
రాఘవేంద్ర గారు .. నిజమే. అదే సంగతి పాలగుమ్మి పద్మరాజు గారు రంగనాయకమ్మ స్వీట్‌హోం మొదటి ముద్రణకి రాసిన ముందుమాటలో చెప్పారు. కానీ అదలా ఉండగా, బ్లాగుల్లో లోతైన ఆలోచనకి, విశ్లేషణకి, చర్చకి కూడా స్థానం ఉండాలని నా కోరిక.

విజయ (లేదా భారతి) గారు .. మీరిద్దరూ ఇలా జాయింటు ఉనికితో టపాలూ వ్యాఖ్యలూ రాస్తే మాబోటి వారికి కష్టమే. నా బ్లాగుకి స్వాగతం. స్వాంతన కాదు, సాంత్వనము. సంబోధన దేముంది లేండి.
Kottapali said…
భలే చెప్పారు. ఎవడికి పట్టింది సీరియస్ విషయాలు పట్టించుకునేదానికి. ఏదో టైంపాస్ కోసమనేగా ఈ బ్లాగులుండేది.
తృష్ణ said…
మీరు రాసినది చాలా కరక్ట్ అండీ.బ్లాగులో సరదా కబుర్లకీ,వ్యంగ్యానికీ వచ్చిన స్పందన ఒక ఆలోచనకో విశ్లేషణకో రావు...
బహుశా నా ఉద్దేశమ్లో చాలా మంది టైమ్ పాస్ కోసం బ్లాగులు చూస్తారు.వాళ్ళకి చదివి ఆనందించాలనే ధ్యాస ఉంటుంది తప్ప చర్చలకి, ఆలోచనల్లోకీ వెళ్లే ఆసక్తి ఉండదని నాకనిపిస్తుంది...
రవి said…
సీరియస్ బ్లాగుల గురించి మీరు చెప్పిన విషయం ఆసక్తికరం. ఏకాభిప్రాయానికి రావాలన్న ఆకాంక్ష కొరవడి - నా వాదన నెగ్గాలన్న తపనో, నా సూచనే ఆమోదించబడాలన్న మొండి పట్టుదలో, దీనికి కారణమని నాకనిపిస్తుంటుంది.
భావన said…
సీరియస్ విషయాలంటే..???????
ఒక వైపు మొగ్గు చూపకుండా సీరియస్ విషయాలు రాయటం జరుగుతుందా, అలా రాసినప్పుడు ఇంకో వైపు మొగ్గు చూపించే వాళ్ళు వుండరా, అప్పుడు ఆర్గ్యుమెంట్ మొదలవ్వదా మొదలయ్యాక అది పరస్పర నిందా భూషణాలను దరించదా వ్యక్తి గతం మయ్యి వ్యక్తి గత సామాజిక దూషణ మొదలవ్వగానే అసలు విషయం పోయి కొసరవ్వదా... రాద్దామనుకునే వాళ్ళు వెనుకంజ వెయ్యారా.. కాదా మనం తెలుగోళ్ళం లేదా మనకు ఆ మాత్రం శూరత్వం...
మురళి said…
గత ఏడాదిగా నాకు 'కబుర్లు' అన్న మాట చెవిన పడ్డప్పుడల్లా అప్రయత్నంగా మీరే గుర్తొస్తున్నారు.. విజయవంతంగా సంవత్సరం పూర్తయిందన్న మాట కబుర్లకి..
అదేంటంటే.. అందరికీ ఏదో ఒక కష్టం, సమస్య ఉంటుంది. టీవీ చూద్దామంటే పనికిరాని వార్తలు, చెత్త సీరియల్లు, సినిమాలు. పేపర్లు కూడా ఎప్పుడూ ఎవరో ఒకరికి తానా తందానా అంటుంటాయి. సినిమాలు , షికార్లు ఆలోచించేట్టు కూడా లేవు. ఇక ఇక్కడ బ్లాగుల్లో కూడా సీరియస్ విషయాలంటే ఎంతమందికి ఆసక్తి ఉంటుంది?.కాస్త సరదాగా ఉందామని ఎవరికుండదు?. అందుకే సీరియస్ విషయాలపై చర్చ, వ్యాఖ్యలు ఎక్కువ ఉండవు. ఒకవేళ చర్చ జరిగినా అది ఎక్కడికి దారితీస్తుందో అందరికీ అనుభవమే. ఊరుకున్నంత ఉత్తమం లేదు అని చాలా మంది ఆసక్తి ఉన్నా కూడా ఇలాంటి వాటిలో తొంగి చూడరు. అలాంటి వారిలొ నేను కూడా ఉన్నాను.
కబుర్లు విజయవంతంగా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు. కమెంటినా, మెంటకపోయినా క్రమంతప్పకుండా చదువుతాను.

సీరియస్ విషయాలమీద రాయాలని ఉండీ, దానికి తగ్గ సమయం వెచ్చించలేక వెనకంజ వేసేవారుకూడా ఉన్నారనుకుంటా. దానికితోడు ఆ వెచ్చించే సమయంలో సింహభాగం అపార్ధాలనూ, మొండి వాదనలనూ తిప్పికొట్టడానికే వెచ్చించాల్సివస్తే చివరికి మిగిలేది అసంతృప్తే.
మేధ said…
కబుర్లు దిగ్విజయంగా సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు..

సీరియస్ విషయాలు రావడం లేదా అంటే, రావడానికి వస్తున్నాయి కానీ ఆ చర్చ చాలా త్వరగా ప్రక్కదారి పడుతోంది.. ఎవరో ఒకరు ఏదో అంటారు, ఇక అంతే సంగతులు, అక్కడితో సరి..

మనం ఎలాంటి విషయాలు వ్రాసినా, చదివేవాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. కాకపోతే, సీరియస్ విషయాలకి కామెంట్లు తక్కువ ఎందుకు అంటే మళ్ళీ పైన సమాధానమే, కామెంటేవాళ్ళు ఒక ఆలోచనలో వ్రాస్తే, చదివేవాళ్ళకి వేరే రకం గా అనిపించి అర్జెంట్‌గా వేరే డిస్కషన్ మొదలవుతుంది.. దాంతో, వ్రాయడం కంటే మౌనంగా ఉండడం బెటర్ అనుకునేవాళ్ళు చాలామంది..
Anonymous said…
అబ్బా....పోనిద్దురూ, మనం చర్చించి ధీర్గంగా ఆలోచించీ మార్చేసే విషయాలుఏవుంటాయ్ ! అనవసర తలనెప్పులు తప్ప.
నామటుకు నేను సీరియస్ పోస్టులు చదువుతాను ( కామెంట్ వెయ్యను) . నా బ్లాగులో మాత్రం సరదా పోస్టులు రాయటానికే ఇష్టపడతాను.
Vasu said…
దండకం భలే ఉంది. స్టార్ నైట్ లో బావున్నవే ఒకటి రెండు. అవే మిస్ అయ్యానన్న మాట.
జేప్స్ గారి షాడోస్ బావుంది. హిందీ లో ఈ మధ్య వచ్చిన న్యూ యార్క్ ఈ అంశం మీదే తీసారని విన్నాను.
Vasu said…
అన్నట్టు మర్చిపోయా. విజయవంతంగా ఏడాది పాటు క్రమం తప్పకుండా(ఇంచు మించు) కబుర్లు చెప్పినందుకు అభినందనలు.
అవున్నిజమే. సీరియస్ విషయాల్ని గురించి మనం ఆలోచించి చర్చించినంత మాత్రాన వూడబొడిచేదేమీ ఉండదు బహుశా. కానీ ఆ మేరకు మన ఆలోచన పరిధి పెరుగుతుంది. మనం ఉంటున్న సామాజిక పరిస్థితుల్లో అది కోంతవరకూ అవసరమని నా వుద్దేశం.
అదలా ఉండగా, ఈ ప్రశ్న ఉద్భవించడానికి కారణం ఉంది. అంతర్జాలపు తొలిరోజుల్లో Usenet groups అని ఉండేవి, SCI, SCIT, RMIC ఇలాగ. వీటన్నిట్లో చాలా రసవత్తరమైన చర్చలు జరుగుతండేవి, అన్ని రకాల విషయాల మీదా. అప్పుడూ యెడ్డెమంటే తెడ్డెమనే వాళ్ళుండేవాళ్ళు. చర్చలు అసలు దారి వదిలి డొంకల్లోకి దూరిపోయేవి. ఐనా, చాలా మట్టుకి మర్యాదగానే జరిగేవి. ముఖ్యమైన పాయింటేంటంటే ఒక చర్చ లేవదియ్యడానికి ఎవరూ జంకే వాళ్ళు కాదు. బ్లాగుల్లో, ఆ ఎందుకొచ్చిన గొడవలే, మెదలకుండా ఉంటే పోతుండి అన్న లాంటి ఒక నిర్లిప్తత కనిపిస్తూ ఉంటుంది. అది బాధ కలిగిస్తూంటుంది. అఫ్కోర్సు, అన్ని విషయాలూ అందరికీ కాదనుకోండి. అసలు బ్లాగుల పరిధి అంతదాకా విస్తరించలేదని నా అనుమానం. అప్పట్లో కంప్యూటర్ల వాడకం అందుబాటులో ఉన్నవారు కొద్ది మందే అయినా, వారికి కంప్యూటరు మీద ఇండియా, తెలుగు సంబంధిత వ్యాపకం మరొకటి లేనందున, ఉన్న వాళ్ళందరూ ఈ గ్రూపుల్లోనే ఉండేవారు. ఇప్పుడేమో మరి సవాలక్ష వ్యాపకాలు. బ్లాగుల విస్తృతి పెరిగితే గానీ ఇలాంటి పరిణామం జరగదేమో.
___________________

మొన్న స్నేహితులొకరు ఆసక్తికరమైన ప్రతిపాదన చేశారు - బ్లాగుల్లో నాస్టాల్జియా, హాస్యం, ఇలాంటి టైంపాస్, ఫీల్‌గుడ్ టాపిక్కులకి వచ్చిన స్పందన, ఏదైనా సీరియస్ విషయం కూలంకషంగా చర్చించడానికి ప్రయత్నించే టపాలకి అస్సలు రాదు అని.

_____________________

మీ స్నేహితుడు చెప్పినది, నాకు సబబే అనిపిస్తుందండి. అంతెందుకు, విఫలయత్నమైన నా బ్లాగులో కూడా నోస్టాల్జియా నే ఏడిచింది. అందుకే దాన్ని అటక ఎక్కించాను. కానీ, బ్లాగ్లోకంలో అడుగు పెట్టిన తరువాత నాకు తెలియని విషయాలు చాల తెలిసాయి. నా ఆలోచనా దృక్పథం మీద చాలా ప్రభావం చూపాయి. ఉదాహరణకు, తాడేపల్లి గారి, నిరుద్యోగం పురుష లక్షణం. మీరు చెప్పినట్టే యూజ్నెట్ గ్రూపుల్లో జరిగినట్టు చర్చలు జరగటంలేదు.
>> ఫీల్‌గుడ్ టాపిక్కులకి వచ్చిన స్పందన,

దైనందిన జీవిత వత్తిళ్ళు, సమస్యలు తప్పుకునే మార్గాల్లో ఒకటి బ్లాగింగ్ కాదంటారా చాలా వరకు? సమయాభావం ఎందరికి వేటువేయదు?

వేజెళ్ళ సత్యనారాయణ సినిమాలు ఎంతమందికి గుర్తున్నాయంటారు? అలాగే కొంతమందికి చర్చలో పాల్గొనటం పట్ల ఆసక్తి వుండకపోవచ్చు. చదివి మౌనంగా వెళ్ళిపోతారేమో? మనం పత్రికలు కొని చదువుతాం, కానీ ఎన్నిసార్లు ఆ సంపాదకులకో, రచయితకో మన అభిప్రాయం తెలిపివుంటాము? ఇవి నేను వేసుకున్న ప్రశ్నలే. పైన ఎవరైనా చెప్పారేమో కూడా.
కొత్తపాళీ గారూ,
మీ కబుర్లు చాలా బావున్నాయి. వింటున్నట్లే ఉంది తప్ప చదువుతున్నట్లనిపించలేదు. బహుశా మన పరిచయం కూడా కావచ్చు. ఇంత అనర్గళంగా రాతలో కబుర్లు చెప్పటం చదివినంత , విన్నంత సుళువయితే కాదని తెలుస్తోంది. అలాగే బ్లాగుల గురించి నాకు మీరిచ్చిన ప్రోత్సాహానికి, సూచనలకు చాలా చాల థాంక్స్.
మల్లీశ్వరి
sreenika said…
నిజమేనండి,
సీరియస్ రచనలని ఎవరూ చదవడం లేదనాలో లేదా రాయడం లేదనాలో అర్ధం కాకుండా ఉంది. అధవా రాసినా..ఎన్నో విమర్శలని ఎదుర్కుంటూన్నారు.
ఇపుడంతా టైం పాస్ కి మాత్రమే బ్లాగులు నడుపుతున్నారు. సీరియస్ విషయాలు సీరియస్గా చర్చించి ఏదో తెలుసుకుందామనేవారు కరవైపోయారు.
sreenika said…
కబుర్ల ప్రస్ఠానం సాఫీగా ఏడాది పూర్తయిన సంధర్భమ్లో
శుభాకాంక్షలు.
@ మల్లీశ్వరి, కామెంటినందుకు నెనర్లు. కబుర్లు రాసినట్టుగా కాక చెప్పినట్టుగా ఉండాలని సంకల్పిత ప్రయత్నమే. ఆ భావన మీలో కలిగిందంటే నా ప్రయత్నం సఫలమయినట్టే. కాకపోతే మన పరిచయం మాత్రం ఎంత చెప్పండి, ఒక సందర్శనమూ, రెండు ఫోను సంభాషణలూనూ. తమాషాగా, ఈ టపాలో ప్రస్తావించిన సీరియస్ విషయాల చర్చకి మీ బ్లాగు ఇప్పటికే ఒక వేదిక అవుతూండడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.