తెలుగు బ్లాగుల గురించి మరి కొంచెం

హైదరాబాదులోనూ, విజయవాడలోనూ పుస్తకోత్సవాల సందర్భంగా జరిపిన బ్లాగర్ల సంరభంలాంటిది అమెరికాలో చెయ్యడం కష్టం.

పెద్దసంఖ్యలో తెలుగువారు ఒకచోట కలుసుకునేది తానా, ఆటా, నాట్స్ ఉత్సవాల్లో. ఈఉత్సవాలకి వెళ్ళే వారిలో సాహిత్యమంటే (ఎటువంటి సాహిత్యమైనా) ఆసక్తి ఉన్నవాళ్ళు కనీసం ఒకశాతం కూడా ఉండరు. బంధుమిత్రుల్ని కలుసుకుని కులాసాగా గడపడం, సినిమావాళ్ళని దగ్గర్నించి చూడ్డం, రాజకీయుల్తోనూ, వ్యాపారవేత్తల్తోనూ బుజాలు రుద్దుకోడం, స్వామీజీల పాదసేవలు చేసుకోవడం, పిల్లలకి సంబంధాలు చూడ్డం - ఇవీ ఈ సభలకి వచ్చే వాళ్ళ ముఖ్య లక్ష్యాలు. రిజిస్ట్రేషనుతోపాటు ఇచ్చే సావనీరునే చాలా మంది ఇంటీకి తీసుకెళ్ళకుండా అక్కడే వొదిలేస్తుంటారు. ఇక బ్లాగుల గురించి మనం కరపత్రాలు పంచిపెడితే వాటిగతి ఏమిటో ఊహించుకోవచ్చు.

అక్కడికీ 2007 వాషింగ్టన్లో జరిగిన తానా ఉత్సవంలో బ్లాగుల ప్రచారం చెయ్యాలని విహారి నడుము కట్టారు. ఆయన ఒక్కరే అయిపోయి ఆప్రయత్నం విరమించుకోవలసి వచ్చింది. 2009 షికాగో ఉత్సవం సమయానికి అమెరికా తెలుగుబ్లాగర్లు చప్పబడ్డారు. నాకు తెలిసి ఒక్క రాధికగారు తప్ప ఎవరూ హాజరవలేదనుకుంటా. ఇప్పుడిప్పుడే మళ్ళీ అమెరికా తెలుగుబ్లాగర్లు రాశిలోనూ వాసిలోనూ పుంజుకుంటున్నారు. తానా ఆటా స్థాయిలో కాకపోయినా, అనేక నగరాల్లో ఉగాది, దీపావళి సందర్భంగా జరిగే తెలుగువారి ఉత్సవాల్లో కూడా, వచ్చేవారి ఉద్దేశాలు ఇలాంటివే .. తమ పిల్లల పాటలు డేన్సులు చూసుకోవడం, మిత్రులతో సరదాగా గడపటం .. స్టాలు పెడితే కంప్యూటరు చూసేందుకూ, కరపత్రం చదివేందుకూ తగిన మూడ్ ఉండదక్కడ .. ఆసక్తికూడ ఉండదు.

ఏమాటకామాట చెప్పుకోవాలి. మా వూళ్ళో తరచుగా సాహిత్యసభలు జరిపే డిట్రాయిట్ తెలుగు సాహితీ సమాఖ్య వాళ్ళు గతఏడాది జరుపుకున్న పదవపుట్టినరోజు ఉత్సవాల్లో తెలుగుబ్లాగులకి ఏకంగా ఒక సెషను కేటాయించారు. నా నిర్వాకంవల్ల అది సుమారుగా మాత్రమే జరిగింది. కరపత్రాలు పంచాము. తద్వారా ఎంతమంది కొత్త పాఠకులేర్పడ్డారో, కొత్త బ్లాగులు మొదలయ్యాయో మాత్రం నాకు తెలియదు. ఇంచుమించు ఇదే సమయంలో ఈమాట జాలపత్రికలో తెలుగుబ్లాగుల గురించి వెలువడిన సంపాదకీయం కూడా కొంచెం ఆసక్తి రగిలించిందనే అనుకుంటున్నాను.

వ్యాప్తికి సంబంధించి కొన్ని ఆలోచనలు:
1. అమెరికాలో కరపత్రాల వల్ల ప్రయోజనం లేదు. ఆకరపత్రాన్ని తీసుకున్న వ్యక్తి తనఇంటోనో, ఆఫీసులోనో కంప్యూటరు ఎదురుగా కూర్చునే సమయానికి ఆకరపత్రం కచ్చితంగా అందుబాటులో ఉండదు. యాదృఛ్ఛికంగా కరపత్రంలో చదివిన యూఆరెళ్ళు (కూడలి, జల్లెడ లాంటి సులభమైనవి కూడా) వాళ్ళకి గుర్తుండే అవకాశం చాలా తక్కువ.

2. మెయిల్లోనో, జాలంలోనో ఒక లంకె నొక్కితే బ్లాగు దొరికేంత సులువుగా ఉండాలి చేసే ప్రచారం ఏదైనా. చాలా మంది బ్లాగర్లు తమ బ్లాగులంకెని సిగ్నేచరుగా వాడుతుంటారు ఈమెయిల్లో. ఇది మంచి పద్ధతి. ఇట్లాగే, జాలవిహరణ చేసే తెలుగు వారు, తెలుగు చదివే ఆసక్తి ఉన్నవారు ఎక్కువగా చూసే సైట్లలో బ్లాగులకి సంబంధించిన లంకెలు ఉంచే ప్రయత్నం చెయ్యాలి. ఈ పద్ధతి ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తుంది. జనాలు ఎక్కువ చూసేది వార్తా పత్రికలు, సినిమా సైట్లు - అవన్నీ కమర్షియల్ సైట్లు. వాళ్ళ ప్రకటనల రేట్లు కళ్ళు తిరిగేలా ఉన్నాయి. ఇంకేవైనా సైట్లలో ఖర్చు లేకుండా ఇలా లంకెలు ఉంచడం సాధ్యపడుతుందేమో అన్వేషించాలి.

3. ఇప్పుడిప్పుడు స్థానిక తెలుగుసంఘాలు కూడా చక్కటి వెబ్సైట్లు చేసుకుంటున్నారు. ఉదాహరణకి డిట్రాయిట్. అంతేకాక, వారి సంస్థ సమాచారాన్ని నెలకోసారో, మూణ్ణెల్లకోసారో ఈ-న్యూస్ లెటరుగా పంపుతున్నారు. ఈ స్థానికసంస్థల సైట్లలోనూ, ఈ-న్యూస్ లెటర్లలోనూ బ్లాగుల లంకెలు ఉండేట్టు ప్రయత్నం చెయ్యాలి. ఇది ఖర్చు లేకుండానో, కొద్ది పాటి ఖర్చుతోనో సాధించ గలిగిన పని. ఫలితం బాగుంటుందని నాకనిపిస్తోంది.

4. ఇప్పుడు అనేక నగరాల్లో తెలుగు సాహిత్య వేదికలు ఏర్పడుతున్నాయి. నాకు తెలిసి డిట్రాయిట్, షికాగో, టొరాంటో, అట్లాంటా, హ్యూస్టన్, డాల్లస్ నగరాల్లో ఇలాంటి వేదికలు తరచుగా జరుగుతున్నాయి. ఆయా నగరాల్లో ఉన్న బ్లాగర్లు ఈ సభలకి హాజరయి, ప్రతి సభలోనూ బ్లాగుల గురించి రెండు నిమిషాలు చెబుతూ ఉండాలి. ఈ సభలకి వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువే అయినా, వీళ్ళు ఆల్రెడీ తెలుగు పఠనాసక్తి కలిగి ఉన్నవాళ్ళు, సొంతంగా రచన చేసే అలవాటున్నవాళ్ళు, అంచేత బ్లాగుల వేపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువ.

5. మనపనికి సంబంధించిన బిజినెస్ కార్డు లాగానే, మన బ్లాగు ఎడ్రసు, కూడలి, జల్లెడ ఎడ్రసులతో ఒక విజిటింగ్ కార్డు తయారు చేసుకుని, మనం కలిసిన తెలుగువారందరికీ ఇస్తూ ఉండాలి. విస్టా ప్రింట్ వంటి సంస్థలు ఉచితంగా 200 కార్డులు ఇస్తాయి. ఒకవిధంగా ఇది కూడా కరపత్రం లాంటిదే, కానీ ఇది పుచ్చుకున్నవారి కంప్యూటరు డెస్కుని చేరే అవకాశం ఎక్కువ. ఈ పని నేను సంవత్సరం పైగా చేశాను. నాబ్లాగులో కొత్తటపాకి వచ్చే హిట్లలో కనీసం 25% డిట్రాయిట్ పరిసరప్రాంతాల నించి ఉండటం గమనించాను. వారిలో కొందరైనా ఇలా నాకార్డు చూసి నాబ్లాగుకి అలవాటైనవారని నా నమ్మకం.

6. గతటపా వ్యాఖ్యల్లో బోనగిరి గారన్నట్టు కూడలి జల్లెడలని ప్రచారం చెయ్యడంలో ఒక సుళువుంది. దానికి తోడుగా ఒక సమస్య కూడా ఉంది. అసలు బ్లాగులంటే తెలియని వ్యక్తి ఒక శుభముహూర్తాన ఏదో ఒకకారణంగా కూడలికి వస్తే, ఖర్మకాలి ఆ పూట అక్కడ కనిపించిన కొత్తటపాలన్నీ చెత్తగానో, లేక ఆమనిషికి ఏమీఆసక్తి లేని విషయంగానో ఉంటే .. ఇక అంతే .. ఆ మనిషి పనిగట్టుకుని మళ్ళీ కూడలికి వచ్చే అవకాశం తక్కువ. కూడలి జల్లెడ మొదటి పేజీలో పాథకులకి ఆసక్తికరమైన టపాలు కనిపించడమనేది యాదృఛ్ఛికమైన ఘటన.
అందుకని, కూడలి-జల్లెడలని ప్రచారం చెయ్యడం కంటే, మన దృష్టిలో consistentగా మంచి టపాలు వస్తాయి అనుకున్న ఒక అరడజను బ్లాగుల్ని ప్రచారం చెయ్యడం ఉత్తమం అని నా ఖచ్చితమైన అభిప్రాయం. అవి ఏవో ఎవరికి వారే నిర్ణయించుకుంటారు.

7. బ్లాగర్లు ఇతరత్రా జాలంలో వేరే పనులు చేస్తూ ఉండినా, ఫేస్ బుక్, ట్విటర్ వంటి ఇతర వేదికల మీద పాల్గొంటూ ఉండినా, అక్కడ తెలుగు బ్లాగుల ప్రస్తావన పెద్దగా తీసుకు రాము. బ్లాగరులందరూ తాము పాల్గొనే ఇతర సామాజిక జాల వేదికలన్నిటిలోనూ అతిగానో మితంగానో తమ శక్తి కొలదీ తెలుగు బ్లాగుల ప్రస్తావన చేస్తుండాలి. ఉదాహరణకి మీకు ఫేస్ బుక్ ఉంటే, అందులో మీబ్లాగు తాజా టపాలు కనబడేట్టు చెయ్యొచ్చు. చాలా కాలంగా జాలంలో తెలుగువారి కూడలిగా ఉన్న రచ్చబండ యాహూ గ్రూపులో వారానికోసారి నాకు నచ్చిన తెలుగు బ్లాగుల ప్రస్తావన చెయ్యడం మొదలు పెట్టాను.

మరి మీ ఆలోచనలూ పథకాలూ ఏంటో చెప్పండి. ఇక్కడ వ్యాఖ్య రాసినా సరే, మీ బ్లాగులో టపా రాసినా సరే. మీ బ్లాగులో రాస్తే, లంకె ఇస్తూ ఇక్కడ ఒక వ్యాఖ్య పడెయ్యడం మరిచిపోకండి.

Comments

మురళి said…
మీ లాంటి రచయితలు బ్లాగులని నేపధ్యంగా తీసుకుని కొన్ని కథలు రాస్తే మంచి ఫలితం ఉంటుందని నాకు అనిపిస్తోంది.. కథ చదివిన పాఠకుల్లో బ్లాగంటే తెలియని వాళ్ళలో తెలుసుకోవాలన్న ఆసక్తి కలుగుతుంది.. ఏమంటారు?
Unknown said…
మొన్నను నేను నా విజిటింగ్ కార్డులు ప్రింటు కిచ్చినపుడు వాటి వెనకాల నా బ్లాగుల వివరాలు url లతో సహా ప్రింటు చేయించి ఉంచుకున్నాను. అప్పటినుండి విజిటింగ్ కార్డ్ అడిగిన వారందరికీ నా కార్టు వెనకాల కూడా చూడమని కోరుతూ కుతూహలం చూపిన వారికి బ్లాగులగురించి ఉపన్యాసం ఒకటి దంచి మరీ చూపిస్తున్నాను. ఎవరికి వారు ప్రచారం చేసుకోవటంలో తప్పేమయినా ఉందంటారా ? నా మటుకు నాకు ఇదో మంచి మార్గంగా తోచి అమలు పరుస్తున్నాను రెండు మూడు నెలలుగా. మీరు సంవత్సరం నుంచీ ఈ పద్ధతిని పాటిస్తున్నారని తెలిసి ఆనందించాను. మొన్నామధ్య హైదరాబాదులో కృష్ణకాంత్ పార్కులో మీటింగ్ కు వెళ్ళినపుడు కూడా ఆ కార్డులు అందరికీ పంచిపెట్టానండోయ్. గ్రూప్స్ లో సంతకం క్రింద బ్లాగుల వివరాలు పొందుపఱచటం కూడా మంచి అయిడియానే. బ్లాగర్లందరూ వారి వారి సూచనలు ఈ విషయమై తెలియపరిస్తే బాగుంటుందనిపిస్తున్నది.
Anonymous said…
తెలుగు తెల్సిన/వచ్చిన స్నేహితులకి, చుట్టాలకీ తెలుగులోనే ఈ మెయిల్ పంపించడం వల్ల వాళ్లకి ఇంట్రస్ట్ కల్గుతుందనేది నా సొంత ఎక్స్ పీరియన్స్. ఎట్టెట్టా? ఇది ఏ ఫాంట్ వాడుతున్నారు? అని అడుగుతున్నారు నన్ను, తెలుగులో హాట్ మెయిల్లో ఈ మెయిల్ పంపిస్తే. ఒకసారి వాళ్లకి ఆ ఇంట్రస్ట్ వచ్చిందంటే బ్లాగులు చదవడం, తెలుగులో రాయడం అనే మిగతావి వాటంతటవే వస్తాయి అని నేను అనుకుంటున్నాను. అదీ కాక ఒకసారి ఇది యూనికోడ్, ఫాంట్ అక్కర్లేదని తెలియగానే ఇంట్రస్ట్ బాగా పెరుగుతుంది.

బ్లాగు మొదలుపెట్టే ప్రతివారూ అంతర్జాలంలో తెలుగు ఎలా రాయొచ్చో, ఏ సాఫ్ట్ వేర్ ఎక్కడ ఉచితంగా దొరుకుతుందో అనే లింకులన్నీ బ్లాగుల్లో పెడితే మరీ బ్లాగు. ఇప్పుడు కొత్తగా వచ్చే బ్లాగుల్లో జల్లెడ, కూడలి లింకులు తప్ప బరహ, తెలుగు వికి మొదలైన తెలుగు రాయడం (అదే ఫ్రీగా)/ లింకులు కనపడ్డం లేదు. మరి చదివిన ప్రతీవారు బ్లాగు మొదలెడతారా అనేది చెప్పడం కష్టమే కానీ తెలుగు చదవడం/రాయడం మాత్రం బాగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక పోతే బ్లాగులు రోజు చదవడం కుదురుతుందా అంటే వారి వారి ఇష్టాల్ని బట్టి ఉంటుంది. రోజూ సీ ఎన్ ఎన్ న్యూస్ చూసినట్టు కూడలి చూస్తారా? అనే ప్రశ్నకి బ్రహ్మదేవుడు కూడా సమాధానం చెప్పలేడు.

పోనీ జల్లెడ/కూడలి బదులు సొంత ఇష్టాంశం గా బ్లాగులని ఉంచుకుంటారా అంటే, తెలుగుబ్లాగులన్నీ ఇష్టాంశాలుగా పెట్టుకోవాలంటే ఇష్టాంశాల పట్టీ కొండవీటి చేంతాడంత అవుతుంది కాబట్టి అదీ కష్టమే. ఏది ఏమైనా మానవ ప్రయత్నం అన్నారు కదా? అదిచేసి ఊరుకోవడమే.
మురళి .. మంచి ఐడియా. మరెప్పుడు రాస్తున్నారీ కథ?

నరసింహ .. చాలా సంతోషం. అభినందనలు.

యెనానిమస్ .. పేరు (తెర పేరయినా) చెప్పి ఉంటే బాగుండేది. మీ సూచనలు బాగున్నాయి. అందరితో బ్లాగులు మొదలు పెట్టించడం కాదు మన ఉద్దేశం. బ్లాగులు ఉన్నాయి, వాటిల్లో మంచి రచనలున్నాయి, హాయిగా చదువుకోవచ్చు అని జనాలకి తెలియాలి, అంతే. కంప్యూటరు మీద తెలుగులో రాయడం, బ్లాగు మొదలెట్టడం వీటన్నిటికీ సులభమైన సూచనలు ఈతెలుగు సైటులో అందుబాటులో ఉన్నాయి.
Vani said…
I think we can also use telugu wiki pages.
Anonymous said…
కొత్తపాళీ గారు, మీరన్నట్లు కూడలి, హారం, జల్లెడ లాంటివి తెరిస్తే ఎక్కువగా కనపడేది చెత్త టపాలు, చెత్త కామెంట్లే.
వీళ్ళళ్ళో ఎవరో ఒకరైనా ఆ చెత్త బ్లాగర్లని బహిష్కరిస్తే బ్లాగు సంకలనాలు సంస్కారవంతంగా ఉంటాయి.
అప్పుడు వీటిని ప్రచారం చేసుకోవచ్చు.
@ bonagiri .. ఈ బహిష్కరణ చర్చ తెమిలేది కాదు లేండి. బహిష్కరణల మీద నాకు నమ్మకమూ లేదు. ఎట్లాగూ ప్రచారం చేసేది వ్యక్తులే కాబట్టి ఆ వ్యక్తులకి నచ్చిన ఒక 10-15 బ్లాగుల్ని ప్రచారం చేసుకుంటే సరి.
Chandra Latha said…
కొత్త పాళీ గారికి,
నమస్కారం.
అరే,
అప్పుడే ఏడాది దాటి పోయిందా మిమ్మల్నందరిదిని కలిసి .మాట్లాడి. బోలెడన్ని కబుర్లు చెప్పుకొని.
మీరు కష్టపడి వండి వారిస్తే.. అథిదుల్లా దర్జా వెలగబెట్టి మరీ .. మాంచి భోజనాలు లాగించి..!
అరరే,
అప్పుడే ఏడాది అయిపోయిందా మీరు బ్లాగులను గురించి అరటి పండు వలిచి పెట్టి నంత సులువుగా వివరించి చెప్పి.
భాష భవిష్యత్తుకూ ఇ-జ్ఞానానికి గల సంబంధాన్ని విశ్లేషించి చెప్పి.
ఏమైనా అనుకోండి.. ఇది నిజం.
ఇక్కడ నేనొక చిన్న ప్రయత్నం .." మడత పేజీ" .. మొదలు పెట్టగల ధైర్యం చేయగలిగా నంటే , అది మీ ఆనాడు మీరందరూ .. వేదిక మీద నుంచి .. పలహారాల మధ్యా.. వసారాల నడుమా.. చక్కగా చేసిన వివరణలే.
అందుకు , మీ అందరికీ అనేక ధన్యవాదాలు .
పోతే,
తెలిసో తెలియకో నా బ్లాగు బాధితులుంటే ..వారికివే విన్నపములు..
"తప్పు నాది కాదంటే వొప్పుకోరూ..:-)"
డెట్రాయిట్ సాహితీ సమావేశాలు మరింత ఫలప్రదం కావాలని ఆశిస్తూ .. అభిమానంతో ..స్నేహంతో..
శుభాకాంక్షలు.
చంద్రలత
http://www.jalleda.com/index.php?order=7


జల్లెడలో ఉన్న ఓటు హక్కు ఉపయోగించుకోని మనకు నచ్చినవాటికి ఓటు వేస్తూ , నచ్చని వాటికి కూడా 1 అని ఓటు వేస్తూ ఉంటే పైన చెప్పిన లింకును ప్రచారానికి ఉపయోగించుకోవచ్చు.
@జాలయ్య .. నిజమే. జల్లెడలోని ఈ ఫీచరు నన్ను బాగా ఆకర్షించింది. మొదట్లో ఉత్సాహంగా మార్కులు పెట్టేవాణ్ణి కూడాను. కానీ మిగతా వాళ్ళెవరూ పెడుతున్న సూచనలు కనబళ్ళేదు. శ్టాటిస్టికల్లీ సిగ్నిఫికంట్ ఉండేంతమండి ఇందులో పాల్గొంటే తప్ప ఇది కొద్దిగానైనా నమ్మ దగిన రిజల్టు ఇవ్వదు :(
అవును, కనీసం ఓ పది మంది అన్నా ఉత్సాహంగా ఓట్లు వేస్తే తప్ప ఇది తగు ఫలితాలు ఇవ్వదు. ప్రస్తుతం ఓ ముగ్గురు మాత్రమే ఓటేస్తున్నారు :(
kiranmayi said…
కొత్త పాళీ గారు,
మీరు ఇంత systematic గా వ్రాసిన తరవాత మేము మళ్ళి ఇంకో టపా దేనికి లెండి. ఇక్కడే కామెంటుతాం. మనం ఇంకో పని చెయ్యొచ్చు. మనకి తెలిసిన నాలుగైదు university ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ websites లో కూడలి, జల్లెడ లాంటి లింక్స్ పెడ్తే, బాగుంటుంది. లేదా ఎవరి బ్లాగ్ లింక్ వాళ్ళు తమ ఫ్రెండ్స్ ఉన్న university కి పంపించినా సరే. ప్రతి university లో కనీసం పది పెర్సెంట్ తెలుగు స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తే బ్లాగ్స్ గురించి ప్రచారం అవుతుంది.
Anonymous said…
ఆంధ్రజ్యొతి ఆదివారం అనుబంధం ప్రత్యేక సంచికలా వేసి ప్రతి వారం ఒక పోస్టుని ప్రచురిస్తోందిగా ఇప్పుడు తెలుగు బ్లాగులు ప్రచారంలో ఒక స్థాయి దాటిపోయాయనిపిస్తోంది నాకు.
Anonymous said…
ఆంధ్రజ్యొతి ఆదివారం అనుబంధం ప్రత్యేక సంచికలా వేసి ప్రతి వారం ఒక పోస్టుని ప్రచురిస్తోందిగా ఇప్పుడు తెలుగు బ్లాగులు ప్రచారంలో ఒక స్థాయి దాటిపోయాయనిపిస్తోంది నాకు.
గాదిరాజు మధుసూదన రాజు said…

తల్లిదండ్రులలో ఎవరు ముందు ఎవరు వెనుక
ప్రశంసలందు కొనడం లో అంటూ..చర్చించి రేటింగు పెంచుకునే స్థాయికి వి వి ఐ పీ లూ ప్రాకటం బావోలేదనిపించి నేను వ్రాసిన కామెంట్

*నాన్నా మీ అమ్మే గొప్పది కాదా?*

*రచన : గాదిరాజు మధుసూదన రాజు*

తల్లి గొప్పతనాన్ని కనుగొనడంలో
తనికెళ్ళకూడా తప్పులో కాలేశాడు.

కనబడకున్నా కడుపు
నిలబడిందనగానే
బిడ్డనుకాచుకోవటానకి
నోరుకట్టేసుకున్న అమ్మ
నాన్నకన్నాముందే రుచులు మరచింది మనకోసం!

చూలువార్త తో ఇంటాబయటా నాన్నకు ప్రశంసలు
అమ్మకు అన్నింటా ఆంక్షలు

తొమ్మిదినెలలు అమ్మకడుపే
నా ఉయ్యాల
దెబ్బలుతిట్లుఅగచాట్లుంటే
అమ్మకే తెలియాల!!
నాన్న పడ్డాడా అమ్మవెనకాల?

ఆడో? మగో? అమ్మకు బిడ్డే కావాల!
ఆ వివరాలు మాత్రం ఇతరులకు కావాల!
వెనకబడ్డాడేమో నాన్న ప్రశ్నల వెనకాల?
కడుపులోఉన్న నా కోసం
ఆస్పత్రి క్యూలో కష్టాల్లో..
ఎన్నిసార్లున్నాడో వెనుక కనబడ్డాడో నాన్ననే అడగాల?

టీకాళ్ళూ సూదులు ఎన్నేసుకుందో అమ్మ నాకోసం
కనీసం వెనుకనిలబడ్డాడేమో నాన్ననే అడగాల!

నిండుతున్న నెలలతో
బరువులూనొప్పులు పెరుగుతూంటే
పండుతున్నాయి కలలంటూ
మురిసిపోతూన్న అమ్మ
వెనకాల ఎన్నిగంటలు నిలబడ్డాడో నాన్ననే అడగాల!

కాన్పునొప్పులు యమగండాలై
అమ్మఊపిరిని చుట్టేసినప్పుడు
సానుభూతితో వెనకనిలబడ్డాడో?
వారసుడిరాకకై ఆరాటపడ్డాడో?
సత్యసాక్షిగా నాన్న ఆత్మనడగాల!

మలమోమూత్రమో
మరేదైనా కుడిఎడమలుచూసుకోకుండా
చేతులుచాచి నన్ను శుభ్రంగా ఉంచేస్తున్నప్రతిసారీ
వెనకాలనిలబడ్డాడేమో ?నాన్ననే అడగాల!

నా కంటికి తానే రెప్పై
నా ప్రాణమే తనకు ప్రాణమై
నా వెంటే తోడైనీడై
నన్ను నడిపించుకున్న అమ్మకుతోడై.....
ఏమాత్రం వెనుకనిలబడ్డాడో నాన్ననే అడగాల!

ఉదయం మాకోసం డబ్బుకై బయటపడి
సాయంత్రం అలసటతో ఇంట్లో అడుగిడి కష్టపడే నాన్న గొప్పా?

పగలూరాత్రీ నాపై ప్రేమతో అలసటనువిసుగును ఆనందంగా మార్చుకుంటూ ముద్దుమనసుతోనన్నుమోసేఅమ్మ గొప్పా?

అంటూ అనుమానాలా?

అమ్మముందు! నాన్న వెనకాల!
అంటూ ప్రశ్న లెందుకు పుట్టాల?

అమ్నైనా నాన్నైనా
అమ్మకే పుట్టాల!

అమ్మకు పుట్టిన ఏ బిడ్డయినా
అమ్మనే ముందుచూడాల!

అమ్మకు నాన్నకు మధ్యపోటీలా?
నాన్నను గెలిపించేదీ అమ్మే ఎల్లవేళలా!!

*గాదిరాజు మధుసూదన రాజు*