వింత అనుభవాల ఒక వేసవి అపరాహ్నం

మా వూరికి సుమారు అరవై మైళ్ళ ఉత్తరంగా ఫ్లింట్ అనే ఊరుంది. అక్కడ దక్షిణాది పద్ధతిలో ఒక చక్కటి శివాలయం కట్టారు. ఈ క్షేత్రాన్ని పశ్చిమ కాశీ అని పిలుస్తారు. ఆధ్వర్యమూ నిర్వహణా అంతా కన్నడం వారిది. ఒక వేసవి శనివారం ఏదో ప్రత్యేక హోమం అభిషేకం జరుగుతున్నాయని తెలిసి వెళ్ళాను.

సాధారణంగా ఆలయానికి వెళ్ళేప్పుడు ఉండే వేషధారణే .. పట్టు లాల్చీ, అత్తాకోడలంచు జరీ పంచ, పైన మేచింగ్ ఉత్తరీయం .. వెళ్ళేది శివాలయానికి కాబట్టి నుదురంత వెడల్పున వీబూధి పట్టీలు, నొసట కుంకుమ బొట్టు.

ఆలయానికి అనుబంధంగా ఉన్న చిన్న హోమశాలలో అప్పటికే హోమం జరుగుతోంది. ఆలయ పూజారులు శ్రీరుద్ర మంత్రాలు పఠిస్తుండగా, కమిటీ అధ్యక్షులు, వారి సతీమణి యజమాని హోదాలో కూర్చుని హోమం చేస్తున్నారు. నేను హోమశాలలో ప్రవేశించగానే ఆ పెద్దమనిషి గబుక్కుని లేవబోయి, మళ్ళీ అంతలోనే తన పరిస్థితి గుర్తొచ్చి, కూర్చునే నా వేపు గౌరవ పురస్సరంగా చూశి, దయచెయ్యెండి అన్నట్టు మౌనంగానే తలపంకించారు. వార్నీ, మన గెటప్ కి ఏకంగా కమిటీ అధ్యక్షుల వారు కూడా ఇంప్రసై పోయారే అని ఆశ్చర్యపడుతూ నేనూ హోమగుండానికి ఒక పక్కగా కూర్చుని, అర్చకస్వాములతో కలిసి నాకు చాతనైన నమకం చమకం యథా శక్తి చదవడం సాగించాను. ఒక గంటలో హోమం ముగిసింది. అందరం ప్రసాదం తీసుకుని లేచాము. అధ్యక్షుల వారు గబగబా నా దగ్గరికి వచ్చి, రెండు చేతులూ జోడించి నమస్కారం చేస్తూ రండి రండి దయచెయ్యండి, మీరు ఇవ్వాళ్ళ రావడం చాలా సంతోషం అన్నారు మొహమంతా నవ్వుతో. ఆహా, ఆలయానికొచ్చే భక్తులంటే ఈయనకి ఎంత భక్తి అనుకుని, అబ్బే దాందేముందండీ, రాగలగడం నిజంగా నా అదృష్టం అన్నా. ఆయన నా మాట వినిపించుకోకుండా .. ఇలా దయచేయండి, అక్కడ కాళ్ళూ చేతులూ కడుక్కోవచ్చు. ఇటుపైన అభిషేకం, ఆ తరవాత పూజా ఇక్కడ గర్భ గుళ్ళొ జరుగుతాయి, ఇటు దయచెయ్యండి అంటూ ఏవిటో హడావుడి పడిపోతున్నారు. నా బుర్రలో ఒక చిరువిత్తనం లాంటి అనుమానం నాటుకుని మొలకెత్తి అతివేగంగా మొక్కై సాగింది. ఇంతలో ఆయన తన ధోరణిలో సాగిపోతూ .. ఇంతకీ డాల్లస్ నించి మీ ప్రయాణం హాయిగా జరిగిందా? నిన్న రాత్రే డాల్లస్ ఆలయ నిర్వాహుకులతో మాట్లాడినప్పుడూ మీరు బహుశా ఇవ్వాళ్ళ రాలేరేమో అన్నారు. పొద్దున మళ్ళీ వాళ్ళతో మాట్లాడ్డం కుదర్లేదు .. అని చెప్పుకు పోతున్నారు. నేను ఆయన రెండు చేతులు పట్టుకుని ఊపి, ఆయన దృష్టి నా వేపు మరల్చి .. అయ్యా, మీరు నన్ను చూసి ఎవర్నో అనుకుంటున్నారు. నా పేరు ఫలానా. నేను డాల్లస్ నించి రాలేదు, ఇక్కడే ఒక అరవై మైళ్ళ దూరం నించి వచ్చాను.. అని సాధ్యమైనంత మృదువుగా చెప్పాను. ఆయన తొలి ఉత్సాహం చూసి, నేనా డాల్లస్ మనిషి కాదని తెలిస్తే ఆయన ఏమైపోతారో అని భయపడ్డాను. ఆ పరమేశ్వరుడి దయవల్ల ఏమీ కాలేదు. ఆయన కొద్దిగా మాత్రం హతాశుడయ్యారు.

ఇంకో గంట గడిచాక డాల్లస్ నించి రావలసినాయన రానే వచ్చారు. ఆయనొక స్వాములవారు. బారెడు గడ్డం పెంచుకున్న కాషాయాంబర ధారి!
నన్ను చూసి స్వాములవా రనుకున్నందుకు నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు.

మొత్తానికి అభిషేకం, అలంకారం, పూజ అన్నీ ముగించుకుని, వాళ్ళు పెట్టిన రుచికరమైన ప్రసాదం సుష్టుగా సేవించి ఇంటికి బయల్దేరాను. మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతం. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. మా వూరింకా ఇరవై మైళ్ల దూరంలో ఉండగా .. పొద్దుణ్ణించీ పూజల్లో పాల్గొన్న అలసట, ప్రసాదంతో పొట్తనిండిన భుక్తాయాసం, ఎండ వేడి, అన్నీ కలిసి కళ్ళు నిద్ర కూరుకుపోతున్నై. ఈ పరిస్థితిలో కారు తోలితే మనం చేరేది ఇంటీకి కాదు, తిన్నగా కైలాసానికే అని చెప్పి, కాస్త కాఫీ గొంతులో పడితే తప్ప మెలకువగా ఉండదని, హైవే దిగి ఒక పక్క రోడ్డులోకి మళ్ళించాను. దగ్గర్లో ఉన్న గేస్టేషను (పెట్రోలు బంకు)లో ఆగి, ఒక కప్పు కాఫీ కొనుక్కున్నా. మళ్ళీ హైవే ఎక్కనక్కర్లేకుండా నేనున్న సైడు రోడ్డే మా వూరికి చేరుస్తుంది, కాకపోతే కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటుంది, ఇరవై నిమిషాలు పట్టేది అరగంట పడుతుంది. ఇంటికెళ్ళి చేసేది ఏముంది లెమ్మని ఈ సైడు రోడ్డెమ్మటే బయల్దేరాను.

రోడ్డెక్కి డ్రైవు చేస్తున్నా. రోడ్డెమ్మడి ఉండే సైడ్ వాక్ మీద, నా ముందు ఒక వంద గజాల దూరంలో ఒక స్త్రీ ఆకారం నడిచి వెళ్తోంది ఆ ఎండలో. అంత ఎండలోనూ ఫుల్ చేతుల షర్టూ, జీన్సూ ధరించి ఉండడమూ, మూరెడు పొడుగున్న జడా చూసి ఈమెవరో మనదేశపు మనిషిలా ఉందే అనుకున్నా అంత దూరన్నించీ. మామూలుగా అయితే నా దారిన నేను పోయేవాణ్ణి. ఆ క్షణానికి అలా ఎందుకు బుద్ధి పుట్టిందో ఇప్పటికీ చెప్పలేను. కానీ నా కారు ఆమెని చేరుకునే ఆ క్షణంలోనే తోచింది, ఆమె వేరే విధిలేక ఆ ఎండలో నడుస్తోందని. ఆమె పక్కగా కారు ఆపి, అవతలి కిటికీ అద్దం దించాను. ఆమె కూడా ఆగింది, ఆశ్చర్యంగా చూస్తూ. నేనూహించినట్టు ఇండియనమ్మాయే. సుమారు పాతికేళ్ళుంటాయి. మర్యాదైన ఆంగ్లంలో కారెక్కమని ఆహ్వానించాను. నా వేషధారణా గట్రా చూసి ఆమె బిత్తరపోయిందని నా అనుమానం. చాలా మొహమాటంగా ఏం పరవాలేదు, మా ఇల్లిక్కడే, దగ్గర్లోనే అంది. నడిచేస్తాను అని ధైర్యంగా చెప్పింది. సరే కానిమ్మని కారు కోంచెం ముందుకు పోనిచ్చా. కానీ వెళ్ళబుద్ధి కాలే. బహుశా ఆ కొద్ది సేపట్లోనే ఆ అమ్మాయి మొహంలో చూసిన అలసట కావచ్చు. బయట నిప్పులు చెరుగుతున్న ఎండ కావచ్చు. మళ్ళీ ఆగి, ఈ సారి తలుపు కూడా నేనే తెరిచి, ఇల్లు దగ్గరయినా పరవాలేదు, నేను దింపుతాను, ఎక్కండి అన్నా .. కొంచెం మేష్టారిలా ధ్వనిస్తూ. మొత్తానికి ఏమనుకుందో ఏమో, ఎక్కి కూర్చుంది. బయల్దేరాం.

ఈమె కొత్త పెళ్ళికూతురు. కన్నడ దేశస్తురాలు. ఈ దేశానికొచ్చి రెణ్ణెల్లయింది. కారు డ్రైవింగ్ నేర్చుకోవాలని డ్రైవింగ్ స్కూలు వాడి కారులో బయల్దేరింది. మామూలుగా ఈ స్కూళ్ళ వాళ్ళు మనింటిదగ్గర పికప్ చేసుకుని, పాఠం పూర్తయాక మనకెక్కడ కావాలంటే అక్కడ దింపేస్తారు. మరి ఈమె ఇంటి దగ్గర దిగకుండా ఆ పెట్రోలు బంకు దగ్గర ఎందుకు దిగిందో ఆమె చెప్పిన కథ నాకర్ధం కాలేదు. మొగుడు ఇంట్లోనే ఉన్నాడు గానీ కాల్ చెయ్యడానికి చేతులో పైసా లేదు. కలెక్ట్ కాల్ చెయ్యొచ్చని ఆమెకి తోచినట్టు లేదు.

ఆమె చెప్పిన సూచనలని బట్టి వాళ్ళ అపార్టుమెంట్ల బ్లాకు చేరుకున్నాము. అక్కడికింకా నయం, తన ఇల్లెక్కడుందో తెలుసామెకి, దారి బాగానే చెప్పింది.
కానీ అసలు తమాషా ఇది - నేనామెని కారెక్కించుకున్న దగ్గర్నించి వాళ్ళింటికి ఆరు మైళ్ళు!

అసలు ఏ ధైర్యంతో ఆమె ఆ యెండలో, ఆరుమైళ్ల దూరం నడవగలను అనుకుందో? ఎన్ని యాదృఛ్ఛిక సంఘటనల పరంపర పర్యవసానంగా ఆమెని నా కారెక్కుంచుకోవడం జరిగింది? నేను గుడికి వెళ్ళాలని ముందుగా అనుకోలేదు. తిరిగి వచ్చేప్పుడయినా, ఆ రోడ్డు నేను సాధారణంగా వచ్చే రోడ్డు కాదు. కాఫీకోసం ఆ పెట్రోలు బంకులో ఆగి ఉండకపోతే ఆమెని గమనించి ఉండేవాణ్ణి కాదు. తీరా ఆమెని కారెక్కమన్నాక, ఆమె నిరాకరిస్తే వదిలి వెళ్ళేందుకు సన్నద్ధమైన వాణ్ణి మళ్ళీ ఆగి, కారెక్కమని దృఢంగా ఎందుకు చెప్పానో?

ఈ విచిత్రం ఇలా ఉండగా, నా వేషధారణ చూసి ఆమె ఏమనుకుని ఉంటుందో అనేది కూడా నాకో తీరని సందేహం. నా మొహం చూస్తేనే నేను భారతీయుణ్ణని తెలుస్తూనే ఉండి ఉండాలి. పైగా మొహమ్మీద విబూధి కుంకుమలూ, ఇతర వేషధారణా .. మరి కొంచెం గౌరవ భావాన్నే కలిగించి ఉండాలి కదా! లేకపోతే, ఆడపిల్లల్ని ఎత్తుకు పోయి ఏ క్షుద్ర దేవతలకో బలిచ్చేవాడిలాగా కనిపించి ఉంటానా? అట్లాంటి వేషధారి అమెరికాలో ఒక సబర్బను రోడ్డుమీద కార్లో అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం ఆమెని ఏదోరకమైన దిగ్భ్రాంతికి గురి చేసి ఉండాలి మొత్తానికి.

ఇదంతా జరిగి ఐదారేళ్ళవుతోంది. ఆమె మళ్ళీ నాకెక్కడా తారసపళ్ళేదు. బహుశా తారసపడినా నే గుర్తు పట్టలేనేమో! ఆలయ కమిటీ అధ్యక్షులు మాత్రం గుడికెళ్ళినప్పుడల్లా కనిపిస్తూనే ఉంటారు, కానీ ఆయన నన్ను గుర్తు పట్టినా గుర్తు పట్టనట్టు నటిస్తారని నాకింకో అనుమానం!!

Comments

హి...హి...హి...

మీ వేషధారణ కళ్లకు కట్టినట్టు కనపడుతోందండి.. అదే ఇక్కడైతే ఖచ్చితంగా అమ్మాయిలను ఎత్తుకుపోయే క్షుద్రమాంత్రికుడు అనుకుంటారు. తరవాత సీను మీరే ఈస్ట్ మన్ కలర్లో ఊహించుకోండి. ఎందుకంటే గుళ్లో పూజారులు కూడా అంత నీటుగా తయారై విభూతి నామాలు పెట్టుకోరు మరి??
మురళి said…
అబ్బ.. ఎన్ని అనుమానాలో... నేను 'ఆరి సీతారామయ్య' గారు రాసే కథల్లో ఉండే ట్విస్టు లాంటిది ఉంటుందని ఊహించి, ఉండకపోడంతో కించిత్ డిసప్పాయింట్ అయ్యి, పోనీలే ఆ అమ్మాయి సంతోషంగానే ఉంది కదా అని సంతోష పడి... అయ్యబాబోయ్..నేను కూడా మీలా ఆలోచించేస్తున్నా :-) :-)
>>లేకపోతే, ఆడపిల్లల్ని ఎత్తుకు పోయి ఏ క్షుద్ర దేవతలకో బలిచ్చేవాడిలాగా కనిపించి ఉంటానా?

:)) మీరు మరీనండీ..
Rani said…
మీరు పంచె కట్టుకుని గాస్ స్టెషన్ కి వెళ్ళి కాఫీ తెచుకున్నారా.హాట్సాఫ్. మా ఇంత్లొ ఐతె చీర కాని చుడిదార్ కాని కట్టుకున్నప్పుదు కార్ దిగనివ్వరు, అందరిలొ ప్రత్యెకంగ కనిపిస్తానని. ఎవరేం అనుకుంటె మనకెందుకు, వీళ్ళలా డ్రెస్ చెసుకున్నప్పుడు మాత్రం మనం ప్రత్యెకంగా కనిపించమా అని వాదిస్తుంటాను.
@ జ్యోతి .. నిజమే. అమెరికాలో ఎప్పుడూ ఫీలవని ఇబ్బంది హైదరాబాదు వీధుల్లో కచ్చితంగా పడ్డాను, పంచె కట్టుకుని బయటికి వెళ్ళడంలో.

@ మురళి .. నిజమే, అనుమానాలు మోతాదు మించాయి కదా? :) అవునూ, సీతారామయ్యగారు చాలా రియలిస్టిగ్గా రాస్తారనుకున్ణానే కథలు .. ట్విస్టులెక్కడ చూశారు మీరు?

@ రాణి .. ఇలాంటి ఎడ్వెంచర్లు చాలా చేశా, చేస్తూ ఉంటా. ఈ విషయంలో మావిడదీ మీ వారిదీ ఒకటే మతం.
Unknown said…
సరిపోయింది...
భలే అనుభవమే!
భావన said…
హి హి హి... హ హ హా... ఏమిటో ఈ రోజంతా కామెడి ఎక్కువ ఐపోయింది రా బాబోయ్... మిమ్ములను ఒక సారి ఆఖరి పోరాటం లో అమ్రేష్ పూరి టైప్ లో "అహం బ్రహ్మసి" అనుకుంటూ దిగి కారెక్కండి అని గద్దించటం తలుచుకుని హి హి హి హ హ హ ... వుండండీ బాబోయ్ నవ్వి నవ్వి కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి...
అదే యాధృచ్చికం అంటే దైవ ఘటన అని కూడా అనుకోవచ్చు.. అమెరికా కొత్త కాబట్టి మిమ్ములను చూసి అమ్మోయ్ అనుకుంటుందేమో కాని కొంచం కాలమైతే అనుకోరు లెండి ఇదేమన్నా ఇండియా నా ఏమిటి పూజారి గారు కూడా క్రాఫెట్టుకుని బొట్టు ఐనా లేకుండా తిరగటానికి. గుడికి మా వూర్లో ఐతే అందరు అలానే వస్తారు, శివరాత్రి కి నాకైతే చలి పుట్టి చస్తాను వాళ్ళను చూసి.
@రాణి గారు ఇప్పుడు అంతా మాములై పోయింది కదండి చీర లు కట్టుకుని నగలేసుకుని పేద్ద బొట్లు పెట్టుకుని ఎక్కడకు బడితే అక్కడికి తిరిగేసి రావటం, మా ఆఫీస్ లో ప్రతి శుక్రువారం మేము చూడీదార్ లు వేసుకుని వెళతాము, తెల్ల అమ్మయిలందరు కుళ్ళుకుని చస్తారు ఆ రంగులు పేట్రన్స్ చూసి...
మురళి said…
ట్విస్ట్ అంటే.. కార్లో మీరు లిఫ్ట్ ఇచ్చిన ఇండియన్ అమ్మాయిక అక్కడ ఫ్యామిలీ ప్రోబ్లమ్స్ ఉండడం లాంటిదేదో.. ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గర డబ్బు లేక పోవడం, మీరు వర్ణించిన పరిస్థితులు చూసి అలాంటి ఇబ్బంది ఏమైనా ఉందేమో అన్న సందేహం.. సీతారామయ్య గారి కథల్లో ఇదే వస్తువు (ఇండియన్ అమ్మాయి అమెరికాలో ఇబ్బందులు పడడం) రకరకాల రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది కదా.. ఆ అర్ధం తో అన్నానండి..
gabhasthi గారు, దయచేసి వ్యాఖ్యని పూర్తిగా తెలుగులో కానీ పూర్తిగా ఆంగ్లంలో కానీ రాయమని మనవి.

మురళి .. నాక్కూడా ఆ అమ్మాయి విషయంలో కంటికగుపించని లోతులేవో ఉన్నాయని అనుమానం (ఇంకో అనుమానం!) వేసింది. కొత్తగా పెళ్ళయిన వాళ్ళు కదా, ప్రణయకలహమయ్యి ఉంటుందని నాకు నేనే సర్ది చెప్పుకున్నా.

భావన .. కదా!:)
asha said…
మీరు చెప్పినదాని ప్రకారం చూస్తే ఆ అమ్మాయి కధ అతుకులబొంతలానే ఉంది మరి. అప్పటికి ఏమనుకున్నాసరే తరువాత స్వయంగా దేవుడే మిమ్మల్ని అక్కడికి పంపించాడని అనుకొనుంటుందిలెండి.
అమ్రేష్ పురి గుర్తుకు వచ్చాడండి ;) ఇకపోతే మేమొకసారి స్కూటర్ మీద వచ్చి నేను సిద్దయ్య గారి అబ్బాయిని అన్న ఒక అపరిచితుడిని మా సిద్దయ్య చిన్నాన్న గారి అబ్బయనుకుని అథితిమర్యాదలతో ఉక్కిరిబిక్కిరి చేసాము, ఇంకా ఆ స్టీలు కాను విప్పి స్వీట్స్ పంచడేం అని తహతహలాడాము. తీరా అమ్మ వచ్చి వివరాలడిగితే వాళ్ళ నాన్నకి నలతగా వుందని పాలు పోయటానికి వచ్చిన మా పాలబ్బాయి కొడుకని తెలిసి చిన్నబోయాము. మీరన్నట్లే వస్తధారణ ధరించిన ఆస్తేలియన్ నన్ను చూసి "నమస్తే" అన్నపుడు నేను కూడా తృళ్ళిపడ్డాను, తర్వాతి సంభాషణలో అతని అమ్మమ్మ స్వామి వివేకానందతోకలిసి ప్రాయాణించదని తెలిసి అతని కరచాలనమే నాకొక మహా భాగ్యంగా తలచాను. మీ టపాతో టప టపా ఇంకా తొలుచుకొస్తున్నాయి కాని వేళ్ళుమొరాయిస్తున్నాయండి, శుక్రోరం కూడానా అమ్మీ అని గునుస్తున్నాయి.... :)
kiranmayi said…
మీరు మరీ విబూధి, బొట్లు పెట్టుకుని JV Somayajulu లాగ "కారెక్కు(శారదా)" అన్న టైపు లో గద్దిస్తే భయం వెయ్యదా మరి? మీరు మరీను. ఇంతకి నాకో పెద్ద డౌట్. ఈ మధ్యన కొత్తగా వచ్చే స్టూడెంట్స్ లాంటి పేద వాళ్ళు కూడా అన్నల్నో, అక్కలనో, మామయ్యలనో అడిగి సెల్ ఫోన్స్ తో దిగుతున్నారు, అలాంటిది ఆ అమ్మాయి విత్ అవుట్ సెల్ ఫోన్ బయటకి ఎలా వెళ్ళింది?
ఉష .. మీ కవిత్వాలు సీరియళ్ళతో పాటు ఇలాంటి అనుభవాళ కథలు కూడా బ్లాగులో రాస్తూంటే బావుంటుంది.

kiranmayi .. that too struck me as odd about her .. not having a cell phone. BTW, the incident was from about 5 yrs ago.
జయ said…
మిమ్మల్ని అమ్మాయిల్ని ఎత్తుకు వెళ్ళే వాడిగా కాదు, 'ఏవిటో, ఈయనకి చాదస్తం ఎక్కువలాగ కనిపిస్తున్నాడు. దారిపొడుగూనా, ఏఏ ప్రశ్నలతో విసిగిస్తాడో ఏవిటో, నా తిప్పలు నేను పడటమే మంచిది ' అనుకుందేమొ పాపం అని నా అనుమానమండి!
sreenika said…
మీరు భలే రాస్తున్నారండి. చదువుతూంటే, చదువుతున్నట్లులేదు..కళ్ళతో చూస్తూన్నట్లుంది.
జయ, నేను కొన్నాళ్ళు మేష్టారి ఉద్యోగం చేసిన మాట నిజవే కాని, నా క్లాసు పిల్లలు నా పాఠాల్ని బాగా ఇష్టపడేవాళ్ళు. ఐనా నిజం పాఠం వినడానికి, ఇమేజి చూసి భయపడ్డానికీ తేడా ఉండనుకోండి.
Sreenika .. that is the point :)
నేను ఎప్పుడు అమెరికా కి వెళ్ళినా చుడీదార్ లోనే వెళ్తాను (ఎందుకో నాకు కూడా తెలియదు), పోయిన సారి వెళ్ళినప్పుడు హొటల్ రూం లో చెక్-ఇన్ చేస్తుంటే ఒకాయన నా దగ్గరకి వచ్చి ఇండియానా? ఆంధ్రా నా? నేనూ తెలుగే, డిన్నర్ కి వెళ్ళేటప్పుడు కాల్ చేస్తాను, కలిసి వెళ్దాము అన్నారు (పాపం కొత్తగా వచ్చి ఉంటాను, యేమి తెలియదు అన్న ఉద్దేశం అయ్యుండచ్చు), కానీ నాకు మాత్రం ఇండియా లో ఉండి ఉండి మనుషులని నమ్మే అలవాటు పోయి సింపుల్ గా "నో థాంక్స్" అని చెప్పి రూం కెళ్ళి తలుపులు బిడాయించేసుకున్నా. ఆయనెవరో బ్లాగు రాస్తే మీలాగే రాసుకుంటారేమో, నేను అమ్రీష్ పురి లాగనో, శక్తి కపూర్ లాగనో కనిపించి ఉంటాను అని. మొత్తనికి భలే ఉంది మీ టపా
కళ్ళకు కట్టినట్లు రాశారు. మీ ఎడ్వంచర్స్ బాగున్నాయ్. మరి పంచెకట్టు నామాలు హఠాత్తుగా అమెరికా నడి రోడ్డు పై కనిపిస్తే ఎవరినైనా ఓ క్షణం తటపటాయించేలా చేస్తుంది కదా :-) అదీ అయిదేళ్ళ క్రితం.

ఆ కొత్త పెళ్ళి కూతురు అసలు దూరం గురించి ఆలోచించి ఉండదు లెండి. కలహం లో ఎదుటి వారి పై కోపం, ఏమీ చేయలేని ఉక్రోషం వెరసి విచక్షణా శక్తి ని కాస్త తగ్గించేస్తాయ్ కదా.
లక్ష్మి .. హ హ. ఈ సారి చీర ట్రై చెయ్యండి.

వేణు శ్రీకాంత్ .. రైటాన్!
తృష్ణ said…
హమ్మయ్య ఇన్నాళ్ళకి దొరికింది నా ఉడతా స్థాయికి వ్యాఖ్య రాయగల టపా..ఎంత వెతికినా వ్యాఖ్య రాద్దాం అంటే మీరు రాసే విషయాల్లో వేళ్ళే కాదు కళ్ళు కూడా పెట్టలేని పరిస్థితి...ప్రతిసారీ నిరాశగా వెనక్కు తిరగటమే...

బాగుంది అనుభవం.ఈ కాలంలొ మామూలు వాళ్లనే కాదు,అసలు వీభూతి,బొట్లు పెట్టుకునే వాళ్ళనే అసలు నమ్మలేకుండా ఉన్నాము..