శనివారం కబుర్లు

సీరియల్ కథ ముగిసింది.
చనువున్న మిత్రులు కోప్పడ్డారు, ఈ సీరియల్ ఏంటి, అంతా ఒకేసారి పెట్టొచ్చుగా అని. ఒకరైతే ఏకంగా నాలుగు భాగాల్నీ క్రోడీకరించి పీడీఎఫ్ చేసి scribDలోకెక్కించి ఆ కోడ్ కూడా పంపించారు. వారి అభిమానానికి నమస్తే!

ఏంటి కథచదివిన భక్తజనులెవరూ మాట్లాడ్డం లేదు? మరీ షాకిచ్చేంత ఘోరంగాలేదనే నేననుకున్నా. బాగుందనో, లేక ఫలాని పార్టు నప్పలేదనో ఒక ముక్క చెబితే చాలా సంతోషిస్తా. ఇది కామెంట్లు దండుకునే ట్రిక్కు కాదు, నిజంగా పాఠకుల అభిప్రాయం తెలుసుకునేందుకే.

తోచీ తోచనమ్మ తోటికోడలు పుట్టింటికెళ్ళిందని సామెత.

శ్రావణమాసంలో ఆడాళ్లందరూ ఇంచక్కా శుక్కురార పేరంటాలకీ, ఆడా మొగా కలిసి పెళ్ళిళ్ళకీ హాజరైపోతూ ఉంటే, ఇక్కడ ప్రవాసంలో ఏ సంబరాలూ లేకుండా కూచున్న నేను, శనారం పొద్దున్నే లేచి కూచుని, ఏమీ తోచక, నా బ్లాగుల్నే పాత టపాలన్నీ ఒకసారి తిరగేస్తూ ఉంటే ..

ఏంటో నా రివ్యూల బ్లాగుని చూస్కుని కడుపు తరుక్కు పోయింది. నాకిష్టమైన వ్యాపకాలు, సంగీత శ్రవణం, పుస్తక పఠనం, సినిమా వీక్షణం .. వీటిని గురించి రాసుకోడానికి పెట్టుకున్న బ్లాగది. సినిమాలు చూసేస్తున్నాను గానీ ఏవీ రాయట్లేదు. పుస్తకాలు చదివేస్తున్నాను గానీ ఏవీ రాయట్లేదు. సంగీతం .. హమ్మ్, నా జీవితంలో అకస్మాత్తుగా ఏర్పడిన సంగీత లేమిని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇంతోటి రాయనిదానికి మళ్ళీ వీటికోసం వేరేగా ఇంకో బ్లాగెందుకు, ఈ ఖాళీ బ్లాగుని చూసినప్పుడల్లా కడుపు ఇంకాస్త తరుక్కు పోడానికి కాకపోతే నని .. విన్నవీకన్నవీ బ్లాగుని ఆపేస్తున్నా ఇవ్వాళ్టితో. ముందు జాగ్రత్తగా అందులోని టపాలన్నీ ఈ బ్లాగులోకి ఎక్కించేశా కామెంటుల్తో సహా.

మొన్ననే ఈ పుటల్లో నమ్మకం గురించి మాట్లాడుకున్నాం. ఒక్కోసారి అవతలి వాళ్ళకి మనమీదున్న నమ్మకం భలే పట్టి కుదిపేస్తుంది. ఒక స్నేహితుణ్ణి అతను బసచేసిన చోటినించి కారెక్కించుకుని ఇంకోచోటికి తీసుకు వెళ్ళల్సొచ్చింది. ఆయనకి పొద్దుటే కాల్చేసి ఫలాని సమయానికి అక్కడ ఉంటాను అన్నా. మళ్ళీ ఎందుకన్నా మంచిది అని ఇంటో బయల్దేరేముందు కాల్చేస్తానన్నా. మొదట చెప్పిన సమయానికి గంట ఆలస్యంగా చేరాను ఆయన ఉన్న చోటికి. ఆయన కనబడుతూనే, ఏమైందంటే .. అని మొదలెట్టాను. చెయ్యెత్తి నన్ను ఆగమన్నట్టు సైగచేసి, మీరేం చెప్పక్కర్లేదు, మీరు లేటయ్యారంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అన్నారాయన. డంగైపోయా. పోయిన శనారం ఇలాగే పొద్దున్నే లేచి డాన్సు క్లాసుకెళ్ళాలి. అస్సలు లేవబుద్ధి కాలా. మా గురువుగారికి కాల్చేసి, చేతికందినంత నిద్రని గొంతులో నింపుకుని, రాలేనండీ అన్నా. ఆవిడ ఎంతో హుందాగా, పోనీలే ఇంకోపూట కలుద్దాం అన్నారు. నాకే కొంచెం కూట్టి, ఏమైందంటే .. అని మొదలెట్టా. ఆవిడ వెంటనే, ఏం పర్లేదోయ్, ఇంకో పూట కలుస్తాముగా! అన్నారు. మళ్ళీ అవాక్కయ్యా.
మొన్ననే చెప్పుకున్నట్టు, నమ్మకం నిలబెట్టుకోడం అంత సులభం కాదు.

పొద్దుణ్ణించీ ముసురు, సన్నగా వాన. ఇవ్వాళ్టికి వొదిలేలా లేదు. ఏంటో అసలీ సంవత్సరం వేసవి వచ్చినట్టే లేదు. పట్టుమని ఒక్క రోజు కూడా తొంభై డిగ్రీలు దాటిన పాపాన పోలా. మళ్ళి చూస్తూ చూస్తుండగానే ఆకురాలు కాలం వచ్చేస్తుంది.

ఇవ్వాళ్ళ సొన్యా సొటొమయోర్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. తొలి లటీనో మహిళ. వారికి అభినందనలు. ఆవిణ్ణి ఈ పదవికి ధృవపరిచే తతంగం వ్యక్తిగత కంకాళాల బీభత్స దృశ్యాలేవీ బయటపడకుండా జరిగినందుకు హమ్మయ్య అనుకున్నా.

ఈ మధ్యన కొత్తవీ పాతవీ అన్నీ కలిపి చాలా తెలుగు కథల పుస్తకాలు చదివా. కథకులుగా కొమ్ములు తిరిగిన వాళ్ళవీ, పేర్గాంచిన వాళ్ళవీ, అభ్యుదయులవీ, విప్లవులవీ, ఇంకా ఎదుగుతున్న వాళ్ళవీ .. కానీ చాలా వెల్తిగా అనిపించింది. ఏంటీ చెత్త కథలు అనికూడా అనిపించింది చాలా సార్లు. ఇంతలో మొన్న నవోదయ నించి వచ్చిన బంగీలో పాలగుమ్మి పద్మరాజు గారి కథల సంపుటం బయటపడింది. ఈయన్ని గురించి గాలివాన, పడవప్రయాణం కథలు తప్ప వేరేమీ తెలీదు ఇప్పటిదాకా. ఓ ఉదయంపూట టీ చప్పరిస్తూ, కొత్త బ్లాగులేం కనబడక యధాలాపంగా పుస్తకం మధ్యలోకి తెరిచి ఒక కథ చదివాను. ఆ పూట ఆఫీసుకెళ్ళడం ఆలస్యమయింది.

అదీ సంగతి ప్రస్తుతానికి. మళ్ళీ కలుద్దాం

Comments

మురళి said…
నాకు పాలగుమ్మి పద్మరాజు గారి కథల పుస్తకం పూర్తి చేయాలనిపించడం లేదు.. మళ్ళీ ఇలాంటి పుస్తకం దొరుకుతుందో దొరకదో అన్న బెంగ లాంటిది కలుగుతోంది.. అందుకే అప్పుడోటి, ఇప్పుడోటి చదువుతున్నా..
ముందుగా కధని ముక్కలుగా చదవడం నాకైతే ఇబ్బందిగా అనిపించింది. అందుకే అన్ని భాగాలు పూర్తయ్యాక ఒకదగ్గర పెట్టుకుని చదువుకున్నాను. ఇక ఈ కధలో పదసూచిక ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో చెప్తారా?? సీరియస్సుగా కధ చదువుతూ ఈ మీనింగులెవరు తెలుసుకోవాలనుకుంటారు? ఏదో స్కూలు పాఠాలంటే తప్ప. వాడుక భాషలోని పదాలు రాతలోకి వచ్చేటప్పుడు అలాగే ఉండాలంటారా? దానివలన కాస్త తేడాగా అనిపించదా? మీరు మాట్లాడినట్టు అందరూ మాట్లాడరు కదా. ఇవి మీ రచనలోని తప్పులు ఎత్తి చూపడంకాదు. నాకు కలిగిన సందేహాలు మాత్రమే.
Anonymous said…
కథ మొత్తం చదివాక ఇంతేనా అనిపించింది కొత్త పాళీ గారు. బంగీ అంటే? పాలగుమ్మి పద్మరాజు గారి కథల సంపుటం పుస్తకం పేరు వివరాలు చెప్పరూ.
Anonymous said…
జెర్సీ లో ఒక సభలో గోరేటి వెంకన్న గారిని పరిచయం చేసింది మీరేనా?
మురళి, అందుకే నేను కథల సంపుటుల్ని వరసగా కాకుండా అక్కడోటి అక్కడోటి చదూతుంటా, ఒకేళ అన్ని కథలూ చదివేసినా ఆ విషయం మనకి తెలీడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతూంది. ఈ లోపల పుస్తకాన్ని మరికొంచెం ఆస్వాదించవచ్చు.

జ్యోతి, మీ అభ్యంతరాలు గమనించాను. డయలాగుల్ని మాట్లాడినట్టుగా రాయాలి అనేది నాకున్న తిక్కల్లో ఒకటి. ఆ స్పెల్లింగులు పాథకుల్ని కాస్త ఇబ్బంది పెట్టొచ్చునేమో మరి. ఫుట్ నోట్సుల వల్ల కథని ఇంకోంచెం బాగా ఆస్వాదిస్తారేమో ననిపించింది. ఉదాహరణకి అమెరికా ఎన్నికల పోరు కథకి కీలకం. మిత్రులిద్దరూ మాట్లాడుకుంటూ రాబర్ట్ అయోవాకి వెళ్లిపోయి పొలం దున్నుకుంటా అంటాడు. ఆ జోక్ అర్ధం కావాలి అంటే అయోవా వ్యవసాయ రాష్ట్రం అని తెలియాలి కదా. అదీ నా వుద్దేశం, అంతేగాని జనాలకి చరిత్ర, జాగర్ఫీ పాఠాలు చెప్పాలని కాదు.

ఇద్దరు, ఇంతేనా అనిపించిందా? హ హ హ. మొత్తానికి నిర్మొహమాటంగా ఒక్కరు చెప్పారు :) ధన్యవాదాలు. పద్మరాజు కథల పుస్తకం గురించి వివరంగా వేరే రాస్తాను. జెర్శిలో సభ అంటే అది కవి నారాయణస్వామి (ప్రాణహిత పత్రిక నిర్వాహకుడు) అయుంటారు. గోరేటి వెంకన్న పాట విన్నారా? ఐతే దాన్ని గురించి కొంచెం రాయొచ్చుగా.
sunita said…
మధ్యలో వదిలేసినట్లు అనిపించింది
GKK said…
మా గురువుగారికి కాల్చేసి చేతికందినంత నిద్రని గొంతులో నింపుకుని,
నా జీవితంలో అకస్మాత్తుగా ఏర్పడిన సంగీత లేమిని --
అన్నా! ఈ నీ trade mark sense of humour నాకు బాగా నచ్చుతుంది
Anonymous said…
!!!!???? కధ అర్థం కాలేదు.అర్థం చేసుకోగల పాండిత్యం నాకు లేదేమో!

పద సూచిక విషయంలో, అన్ని భాగాలు చదివాక కూడా మొదటిభాగంలోని నా వ్యాఖ్యకు కట్టుబడి ఉన్నాను.
పొలం దున్నుకుంటాననటం ముఖ్యం కానీ అది ఎక్కడ అనేది కధకు అవసరం లేదని నా అభిప్రాయం.వివరణ అక్కడికక్కడే ఇస్తే బాగుండేది.

తల్లి పాత్ర బాగా కొత్తగా ఉంది. సుడి గాలిలా రావటం...!!
పాండిత్యం కొద్దీ వ్యాఖ్యానం అన్నారు మీలాంటి పెద్దవారు.అన్యధా భావించరని ఆశిస్తున్నాను.రెండు మూడు సార్లు చదివి అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను.
వేమన said…
కొత్తపాళీగారూ,

మీ కధ నేను పూర్తిగా చదివాను..మీరు పాత్రల్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఇహపోతే కధా వస్తువు కొంచెం సన్నగా ఉండడం వల్ల నేరేషన్లో మీ 'కబుర్లు' వాయిస్ తొంగి చూసింది. అవి నచ్చే నాలాంటి వాళ్ళకి కధ కూడా నచ్చుతుంది :) పద సూచిక అవసరమే. అఫ్కోర్స్ ఇవన్నీ నా అభిప్రాయాలు మాత్రమే.
sat .. మీరు వ్యాఖ్యానించినందుకు సంతోషం. మీ వ్యాఖ్య నన్ను చాలా ఆలోచింప చేస్తున్నది. పండిత్యం అర్హత అని మిమ్మల్ని మీరు కించపరుచుకోకండి దయచేసి. తల్లిపాత్ర కొత్తగా ఉండడం ప్రయత్నపూర్వకంగా చేసినదే. నిజజీవితంలో మనుషులు ఎంతో పురోగతిని సాధించాక కూడా మన కథల్లో పాత్రలు (సహాయ పాత్రలు ముఖ్యంగా) ఇంకా ముప్ఫయ్యేళ్ళ వెనకాల ఉన్నట్టుంటాయి.
sunita .. కథ అర్ధాంతరంగా ఆగిపోయింది అంటారా? ఆశ్చర్యంగా ఉంది.
వేమన .. ధనయ్వాదాలు. నేరేషన్లో కబుర్లు వాయిస్ తొంగి చూసిందా? హమ్మ్. ఆలోచించాల్సిన విషయమే.
మేధ said…
సీరియల్ బావుంది..కానీ ఎందుకో సడెన్ గా అయిపోయిందనిపించింది.. అంటే సీరియల్ గా వ్రాస్తున్నారు అంటే ఇంకొన్ని రోజులు ఉంటుందేమో అని ముందే ఫిక్స్ అవడం వల్లనేమో.. :)

పైన వేమన గారు అన్నట్లు, మీరు ప్రక్కనుండి మాట్లాడుతూ చెబుతున్నట్లనిపించింది.. ఎందుకో కధ చదువుతున్నాను అనిపించలేదు.. మీలోని రచయిత ఎక్కువ డామినేట్ అయినట్లున్నారు పాత్రధారుల కంటే..

ఇక పదసూచిక.. నా వరకూ, అలా ఇవ్వడం అవసరమనిపిస్తుంది.. కధలో లీనమైనప్పుడు మిగతా విషయాలు అనవసరమనిపించినా, వాటి గురించి ఇంకొంచెం తెలిస్తే, కధకి అన్వయించుకోవడానికి ఉపయోగపడుతుంది..
అయితే మీ సీరియల్ లో, అసలు కధ కంటే పదకోసమే ఎక్కువ ఉంది.. Just Kidding.. Plz dnt mind it.. :))
ఒకటే వానా! వేసవి వచ్చినట్టే లేదా!

'బయట యండ ఈజ్ బెల్టింగ్' అనుకున్నాను నిన్న కిటికీలోనుంచి బయటకు చూస్తూ. ఈసారి వర్షాలు దాదాపు లేవనే చెప్పొచ్చు.
ఊరించేస్తున్నారు. ఐతే ఆ కథ చదచాల్సిందే మరి. :-)
నేనైతే సీరియల్ గా కాక కధ మొత్తం ఒకేసారి చదవాలని మొదటి భాగం తోనే ఆపేశాను.

కధ మొత్తం చదివాక ఆర్ధిక రాజకీయ ప్రేమ కధ అని ఊరించి తేలిగ్గా తేల్చేశారా అనిపించింది. హీరో హీరోయిన్ల ని ఒకరికొకరు పరిచయం చేసి, కట్ చేస్తే తర్వాత సీన్లో క్లైమాక్స్ చాలా క్రిస్ప్ గా భిన్నం గా ఉంది, అలానే తల్లిపాత్ర కూడా.

పదసూచిక ఖచ్చితంగా అవసరమే... అవి కధని మరింత బాగా అర్ధం చేసుకుని ఆస్వాదించడానికి తోడ్పడతాయి.

మనలో మనమాట మొత్తానికి ఒబామా ఇలా అందమైన అమ్మాయిల క్యాంపెయినింగ్ వల్లే గెలిచాడంటారా :-) (just kidding)
ఆయనకి పొద్దుటే కాల్చేసి -> ఆరుద్ర అమెరికా పద్యాలలో - బాపుగారి కార్టూనొకటుంటుంది, ఈ కాల్చేయటం మీద :)
మీకు అక్కడ ఎండలు లేవు
మాకు ఇక్కడ వానలు లేవు, (మీ) విజయవాడ లో ఎండ ఇంకా నలబదులకి దగ్గరలోనే ఉన్నది.
విన్నవీ కన్నవీ మూసేయటం అన్యాయమండి అనేకాంశాలపై వ్రాసే మీరు సమీక్షలు ప్రత్యేక బ్లాగులోనే ఉంచటం సమంజసమేమో
నా మాట మన్నించి కథ గురించి తమ తమ అభిప్రాయాల్ని చెప్పిన అందరికీ సర్వదా ఋణపడి ఉంటాను.
ఒక్క విన్నపం .. విమర్శగా ఏదన్నా ఒక్క మాట అనడానికి అందరూ చాలా సంకోచిస్తున్నట్టుగా ఉంది. అంత సంకోచించాల్సిన పనేమి లేదు. సద్విమర్శవల్లనే రచన పదును తేలుతుందని నమ్ముతాన్నేను. ఇప్పుడే కాదు, ఇక మీదట అయినా, నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలు చెప్పొచ్చు.

వూకదంపుడు .. విన్నవీకన్నవీ పూర్తిగా మూసినట్టు కాదు. ఆ పరిచయాలు, సమీక్షలు, విశ్లేషణలు కొనసాగుతూనే ఉంటై కొత్తపాళి బ్లాగులోనే. వేరే బ్లాగు అనవసరం అనిపించింది, అంతే.

రానారె, వూకదంపుడు .. అమెరికా దేశంలోనే ఒక వంక అతివృష్టీ ఇంకో వంక అనావృష్టీ ఉండడమూ సర్వసాధారణమే. మేము అప్పుడే రాబోయే చలికాలం ఎంత భయంకరంగా ఉంటుందో అని వొణుకుతున్నాం.
Vamsi Krishna said…
కథా వస్తువు కాని కథనం కాని మరీ గొప్పగా లేదు. శీర్శిక, ఉప శీర్శిక చదివేసి వదిలేయడానికి, కథ మొత్తం చదవటానికి పెద్ద తేడా లేదనిపించింది.బహుసా మీ నుంచి ఎక్కువ ఆశించడం వల్ల ఇలా అనిపించి వుండవచ్చు.
asha said…
ముందు చదివిన విషయాలు పెంచిన ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్‌ని సంతృప్తి పరచకుండానే కధ అయిపోయినట్లుగా అనిపించింది.
Vamsi Krishna, భవాని .. thank you.
పాలగుమ్మి పద్మరాజు కథలు నేనూ చదువుతున్నాను — మీలాగే అప్పుడోటీ ఇప్పుడోటీ. నేనూ ఇదివరకూ "గాలివాన", "పడవ ప్రయాణం" తప్ప మరేమీ చదవలేదు. ఈ సంపుటిలో ఇప్పటివరకూ చదివిన కథల్లో ఏదీ వాటి స్థాయి దాటినట్టనిపించలేదు గానీ, కొన్ని కథల వెనుక వున్న ambition మాత్రం (అంతిమంగా కథలు దాన్ని సాధించగలిగినా సాధించలేకపోయినా) ఆకట్టుకుంటోంది.
@మెహెర్ .. I hear you. I feel the same. Yet I also have a distinct feeling that this book would remain on my bedside table for some time to come.

@తెలుగు అభిమాని .. తంబీ, మీకో బ్లాగున్నట్టు గుర్తు. తరచూ కాకపోయినా అడపాదడపా అయినా మీరందులో కొరడా ఝళిపిస్తున్న గుర్తు. ఏమాయే? ఏమి ఈ మాయ? మీరు మీరేనా? ఏమైనా, ఏ మాయైనా, మీ అభిమానానికి ధన్యుణ్ణి. బైదవే, జీవితంలో సంగీతం లేకపోవడం సెన్సాఫ్ హ్యూమరు కాదు, ఘోరమైన విషాదం. ఈ మానవ జీవితంలో దైవత్వానికి దగ్గరగా వచ్చేవి అంటూ ఏవన్నా ఉంటే, అవి రెండే .. ఒకటి .. ఇంకా ఏ పాపప్మూ ఎరుగని పసి పిల్లలు. రెండోది సంగీతం. అందులోనూ కర్నాటక సంగీతం!