నీవేనా నను తలచినది - 02

March 10, 2008 Monday 11:45 AM

మిడ్‌టౌన్ నించి ఐదో ఎవెన్యూ వెంబడి అప్‌టౌన్ వేపు నడక సాగించాడు.
ఎదురుగా వస్తున్న ట్రాఫిక్. ఎక్కడికో ఆ పరుగులు. తనొక్కడికేనా తీరిక?
నిమిషమంటే డాలర్లుగా, డబ్బే ఊపిరిగా, లాభాలు ఆర్జించడమే జీవిత ధ్యేయంగా, క్షణం తీరిక లేకుండా గడిపిన జీవితం. కొద్ది గంటల క్రితం వరకూ, తానూ ఆ బిజీ స్రవంతిలో ఒక పాయ. ఇప్పుడు .. అకస్మాత్తుగా .. ఉన్నదంతా తీరికే.
ఇక్కణ్ణించి కనుచూపు మేర బోలెడు తీరిక. భరించలేనంత తీరిక. ఏం చేసుకోవాలో తెలియనంత తీరిక.
ఇంకా చలికాలం పూర్తిగా పోలేదని గుర్తు చేస్తూ చిరు చలి. మబ్బు తెరల్ని చీల్చుకుని మీద పడుతున్న పల్చటి ఎండలో వడివడిగా నడుస్తుంటే బాగుంది.
ఎర్ర లైటు దగ్గర ఆగాడు. ఎనభై రెండో వీధి. అప్పుడే నలభై బ్లాకులు నడిచాడా? నలభై బ్లాకులంటే ఎన్ని మైళ్ళు?
ఎడమ పక్కగా మెట్రోపాలిటన్ మ్యూజియం. రెండేళ్ళుగా న్యూయార్కులో ఉన్నా, ఎప్పుడూ వెళ్ళలేదు. వేరే పనేముంది? కాసేపు మ్యూజియంలో గడుపుదామా?
ఆకలేస్తోంది. మ్యూజియం ముందు సైడ్ వాక్ మీదున్న ఒక బండి వాడి దగ్గర ఒక హాట్ డాగ్ కొనుక్కుని, అక్కడే నిలబడి తినేశాడు.
ఒక ఐస్ టీ సీసా కొనుక్కుని మ్యూజియం దాటి సెంట్రల్ పార్కులో అడుగు పెట్టాడు.
సోమవారమైనా, లంచి సమయం కావడం వల్ల కాబోలు పార్కు దారుల వెంబడి మనుషుల అలజడి బాగానే ఉంది. అలా కాలికి దొరికిన దారి వెంబడి నడిచి, ఒక బెంచి ఖాళీగా కనబడితే
దాని మీద కూర్చుని చుట్టు చూస్తున్నాడు.
చుట్టూతా పల్చగా మనుషుల అలజడి. తీరిగ్గా కబుర్లాడుకుంటూ బెంచీల మీద లంచిలారగిస్తున్న వాళ్ళు. లంచి ముగించుకుని తిరిగి తమ కార్యాలయాలకి వెళ్ళేవాళ్ళు. అటూ ఇటూ తిరిగే వాళ్ళు. వ్యాయామం కోసం నడకలూ పరుగులూ సాగించే వాళ్ళు. ఇంకా ఎక్కడో దూరంగా పిల్లల కేరింతలు. ఈ చప్పుళ్ళన్నిటికీ నేపథ్యంగా ఐదో అవెన్యూ మీద దూసుకు
పోతున్న ట్రాఫిక్ హోరు.
నా బేంకు కూలిపోయింది. ఐనా ఈ ప్రపంచం బాగానే ఉందే. వీళ్ళంతా ఇంత హాయిగా దిలాసాగా ఉన్నారే? వీళ్ళకేం పట్టదా?
బెంచి మీద తన పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపించి కొద్దిగా తల తిప్పి ఇటు చూశాడు. ఎవరితో మాట్లాడాలని లేదు. వాళ్ళు గనక పలకరిస్తే అక్కణ్ణించి లేచి వెళ్ళిపోదాం అనుకున్నాడు.
ఆ కూర్చున్నది ఎవరో అమ్మాయి.
భుజాల కింది వరకూ ఫేషన్ గా కత్తిరించుకున్న నల్లటి జుట్టు మాత్రం కనిపిస్తోంది. జీన్స్ మీద నల్లరంగు కాటన్ టాప్. దాని మీద ఏదో మెరిసే దారంతో కుట్టిన ఇండియన్ డిజైన్లు.
ఇదేంట్రా ఈ అమ్మాయి కనీసం జాకెట్టైనా స్వెట్టరైనా లేకుండా ఉత్తి చొక్కాలో ఇలా తిరుగుతోంది అనుకున్నాడు. ఇంతలో ఆ అమ్మాయి తల పైకెత్తి తేజాకేసి చూసి పలకరింపుగా నవ్వింది.
కచ్చితంగా ఇండియన్ మొహమే.
అదుగో, ఆ కనుబొమల మధ్య చిన్న మెరిసే బొట్టు బిళ్ళ. కానీ అది కొంచెం వంకరగా, ఒక పక్కకి ఉంది. అప్రయత్నంగా ఆ బొట్టుబిళ్ళని సరి చెయ్యడానికి కుడిచెయ్యి చాచాడు.
చేతి వేళ్ళకి పాత చెక్క బెంచీ గరుగ్గా తగిలి మెలకువొచ్చింది. చుట్టూ చూశాడు. అమ్మాయి లేదు.

కోటు జేబులో ఐఫోన్ చప్పుడు చేసింది. రాబర్ట్ నించి టెక్స్ట్ మెసేజ్.
రేపు సాయంత్రం ఆరింటికి మర్ఫీస్‌లో కలుద్దామని.
***

March 25, Tuesday, 7:15 PM

మర్ఫీస్ ఖాళీగా ఉంది. రాబర్ట్, తేజా ఒక మూలగా ఉన్న బల్ల దగ్గర కూర్చునున్నారు. ఇద్దరూ నిశ్శబ్దంగా తమ తమ గ్లాసుల్ని చప్పరిస్తున్నారు, రాబర్ట్‌కి రెండో మార్టినీ, తేజాకి ఒకటే ఐస్ టీ.
ఉన్నట్టుండి రాబర్ట్ బల్ల మీద చరిచాడు. తేజా ఉలిక్కిపడి తలెత్తి మిత్రుడికేసి చూశాడు.
"స్క్రూ బేర్ స్టెర్ణ్స్ .. స్క్రూ వాల్ స్ట్రీట్ .. స్క్రూ ద హోల్ డాం థింగ్. నేను అయోవా(1) తిరిగిపోయి పొలం దున్నుకుంటా."
తేజా తన మిత్రుడికి పిచ్చెక్కిందేమో నన్నట్టు చూశాడు.
"రాబ్, నీకు షాక్ తగిలి తాత్కాలికంగా మతి భ్రమించి నట్టుంది. కూల్ మేన్."
"లేదు తేజా, నేను నిశ్చయానికొచ్చేశాను."
"ఇంత మాత్రానికే? బేర్ స్టెర్ణ్స్ కాకపోతే ఇంకా చాలా బేంకులున్నై. మనకి ఆ మాత్రం ఇంకో ఉద్యోగం దొరక్క పోదు."
"దొరకొచ్చు, దొరక్క పోవచ్చు. అది కాదు విషయం. ఈ సబ్ ప్రైం, ఈ లొసుగులు, ఈ దొంగ లావాదేవీలు, ఈ అబద్ధాలు .. ఈ విషాన్నించి కొన్నాళ్ళు దూరంగా ఉండాలి."
"ఏంటీ? స్టార్ బ్రోకర్ రాబర్ట్ లుప్చోవ్స్కీయేనా ఈ మాటలు మాట్లాడేది?"
"అక్షరాలా .. అసలు మొత్తానికి బేంకింగ్ వొదిలేస్తా ననడంలేదు. కొన్నాళ్ళు బ్రేక్. జరిగిందేదో మన మంచికే జరిగింది. కొన్నాళ్ళు ఈ పిచ్చి గోల నించి దూరంగా ఉండి, అప్పుడు, మళ్ళీ తిరిగి రావాలనిపిస్తే వస్తా."
"కొన్నాళ్ళు? ఎన్నాళ్ళు?"
"ఏమో, ఒక ఏడు, రెండేళ్ళు."
"ఏం చేస్తావ్ అంత సమయం?"
"ఏదో ఒకటి, మనసుకి నచ్చింది. చూడూ, మనిద్దరికీ ప్రస్తుతానికి డబ్బుకి ఇబ్బంది లేదు. మరీ హై స్టేక్స్ పోకర్ గేములాడాకపోతే, ఒక ఏడాది రెండేళ్ళు హాయిగా కాలక్షేపం చెయ్యొచ్చు. దేశమంతా సైకిలు మీద తిరగొచ్చు. ఈజిప్టుకెళ్ళి పిరమిడ్లు చూడచ్చు. బుద్ధి పుడితే మా నాన్న పొలంలో ట్రాక్టర్ తోలచ్చు. అసలేమీ చెయ్యకుండా చెట్టు నీడన హేమక్ లో పడుకోవచ్చు."
"నీకు నిజంగా పిచ్చెక్కింది."
"..."
"యు నో? నిన్న మా అమ్మతో మాట్లాడితే, తను కూడా అదే అంది .. కొన్నాళ్ళు మిషిగన్ రమ్మని."
"మరింకేం? చూడు, నేను చెప్పిందే కరక్ట్. ఈ న్యూయార్క్ లో ఉండి, ఉద్యోగం దొరక్క పోతే అదొక నరకం. దొరికితే ఇంకో నరకం. నో! పద పోదాం. బైదవే, మీ అమ్మక్కూడా పొలముందా? మిషిగన్లో?"
"హ హ్హ హ్హ. అమెరికాలో ఇండియన్లు పొలాలు దున్నర్రా ఇడియట్. మా అమ్మ కొమెరికా బేంక్ లో వైస్ ప్రెసిడెంట్."
"చచ్చాం పో."
"ఐ నో. బట్ మై మాం ఇస్ కూల్. యు నో, మిట్ రామ్నీ ప్రైమరీ బరిలో దిగినప్పుడు నాకు చాలా ఉత్సాహం వేసింది. ఆయన కేంపేన్ కి వాలంటీర్ చేద్దామనుకున్నా. అఫ్కోర్సు, ఇన్నాళ్ళు మనకి టైము లేదనుకో. పోనీ ఇప్పుడు చేద్దామంటే గురుడు ఆల్రెడీ మెక్కెయిన్ కి సరెండరైపోయాడు. హమ్మ్."
"హే తేజా, తేజెష్టర్, తేజుమేన్ .. ఏలోకంలో ఉన్నావ్ మై డియర్? ఇది ఒబామా సంవత్సరం. ఇది ఒబామా ఎన్నిక సమయం. నీకు ఏ మాత్రం సివిక్ సెన్సున్నా ఒబామా కేంపేన్ కి పనిచెయ్."
"హ హ హ. ఇంతకు ముందు దాకా ఏవన్నా డౌటుంటే అది కాస్తా ఇప్పుడు పోయింది. నీకు సెర్టిఫైడ్ గా స్క్రూ లూజ్. పోయి పోయి ఆ సోషలిస్ట్ కా? ఈ జన్మలో జరగదు? మెక్కెయిన్(2) ఒట్టి తిక్కలాడు, పార్టీ సిద్ధాంతాలకి ఎల్లప్పుడూ కట్టుబడి ఉండడు, ముఖ్యంగా ఆర్ధిక విధానాలకి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డెమోక్రాట్లతో కలిసి వోటేస్తూంటాడు. అతని కేంపేన్‌కి పని చెయ్యాలనే ఉత్సాహం ఐతే నాకు లేదు గానీ, పోయి పోయి ఒబామాకి సాయం చెయ్యడమా? నో వే!"
"యెస్ వే టూ! హే, అయోవా నించొచ్చిన నేనే ఒబామాని సపోర్ట్ చేస్తున్నా? మిషిగన్ వాడివి నీకేంటోయ్? ఈ దేశం ప్రస్తుతం కూరుకుంటున్న ఊబిలోంచి ఎవడన్నా బయటికి లాగ గలడంటే అది ఒబామా ఒక్కడే."
"హే రాబ్ .. ఏంటిది, ఆయనేదో కొత్త మెస్సయ్యా(3) లాగా .."
"హీ ఈజ్ దా మెసాయా. యు బెటర్ బిలీవిట్. ఇందాక అసలు విషయం మర్చిపోయా .. ఇన్నాళ్ళుగా కోమాలో పడున్న మన రొమాంటిక్ లైఫ్ ని నిద్ర లేపేందుక్కూడా ఇదో ఛాన్సనుకో! ఇప్పుడు అమ్మాయిలందరూ పిచ్చ పిచ్చగా ఒబామా అంటే పడి చస్తున్నారు. మనం కూడా ఒబామా కేంపేన్ ‌లో పని చేస్తే .. అమ్మాయిలే అమ్మాయిలు!"
"..."
"ఏంటో ఆ వంకర నవ్వు? ఓ, గాట్ ఇట్! మీ ఇండియన్స్‌లో మీ పేరెంట్సే ఎరేంజ్ చేస్తారంటగా? డోంటెల్మీ .. మీ అమ్మ నీకప్పుడే ఒకమ్మాయిని మిషిగన్లో సెటప్ చేసిందని!"
"నో నో .. అలాంటిదేం లేదు. గత రెండు వారాల్లో నాలుగు సార్లు నాకు ఈ విచిత్రమైన కలొచ్చింది. కలలో ఒకమ్మాయి .."
"ఫిగరు బావుందా?"
"ఏమో నేను గమనించలేదు. కానీ .. ఈ తమాషా చూడు .. ఇండియన్ అమ్మాయి."
"ఇంకేం? చూసుకో నేంచెప్పేస్తున్నా నీ ఫ్యూచర్ .. గుర్తు పెట్టుకో. నువ్వు మిషిగన్ వెళ్ళేప్పటికి మీ మమ్మీ నీకుమాంఛి డాక్టర్ పిల్లని సెటప్ చేసేసి ఉంటుంది. నువ్వు అక్కడ దిగిన రెండు వారాల్లో ఎంగేజ్మెంట్, మూణ్ణెలల్లో పెళ్ళి."
"అంతేనంటావ్. ఐతే నువ్వు అయోవాకీ, నేను మిషిగన్ కీ తప్పదంటావ్?"
"ఏమో ఎవరు చూడొచ్చారు? నీకు సెటప్పయ్యే స్వీట్‌హార్ట్‌కి మాంఛి బేబెలిషియస్ బెస్ట్ ఫ్రెండ్ ఉందనుకో, ఒక్క టెక్స్ట్ మెసేజ్ కొట్టేయ్, రెక్కలు కట్టుకుని నేను కూడా మిషిగన్‌లో వాల్తా."
***

పద సూచిక
(1) అయోవా - అమెరికా నడిబొడ్డున ఉన్న రాష్ట్రం. వ్యవసాయం ఇక్కడి ముఖ్య వృత్తి. రాజకీయంగా ఎప్పుడూ రిపబ్లికన్ పార్టీని సమర్ధించే రాష్ట్రాల్లో ఒకటి. అధ్యక్ష ఎన్నికలకి ముందు అభ్యర్ధుల ఎంపికలో మొట్టమొదటి కాకస్ ఈ రాష్ట్రంలో జరుగుతుంది.
(2) జాన్ మెక్కెయిన్ - అమెరికను రాజకీయ వేత్త, సెనేటు సీనియర్ సభ్యుడు, అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.
(3) మెస్సాయా - హిందూ మతంలో కల్కి అవతారం లాగా రాబోయే దివ్య రక్షకుడు. కొన్ని ఆచారాల్లో ఏసుక్రీస్తుని కూడా ఇలా అంటారు. హేండెల్ అనే జెర్మను సంగీత వాగ్గేయకారుడు ఏసుక్రీస్తు జననాన్నీ, జీవితాన్నీ కీర్తిస్తూ ఈ పేరిట రచించిన గొప్ప గాత్ర సంగీతం చాలా పేరు పొందినది.

Comments

గురువుగారూ,

వీలైతే ఓ మధ్య తరగతి నడి వయస్కుడిని సెంటర్ పాయింట్ గా చేసి మరో కధ్ వ్రాయండి. ఓ విన్నపం మాత్రమే!!
asha said…
కధ చాలా బాగుంది. తరువాయి భాగం కోసం ఎదురుచూస్తుంటాను.
sunita said…
మధ్యస్తం గా వదిలేసారు. పూర్తిగా వ్రాయండి.
డోంటెల్మీ .. మీ అమ్మ నీకప్పుడే ఒకమ్మాయిని మిషిగన్లో సెటప్ చేసిందని!


ఇలాంటి వాక్యాలను గమనిస్తున్నాను. ఏ ప్రాంతపు కథకు ఆ ప్రాంతపు సంభాషణల యాసను వాడటమే మంచిదేమో.