నన్ను నమ్ము!

అశోకవనంలో దుఃఖంలో మునిగిపోయున్న సీతని గమనించాడు హనుమంతుడు.

రావణుడు ఆమె ముందుకి వచ్చి ఎడాపెడా పేలడాన్నీ చూశాడు చెట్టుమీద సూక్ష్మరూపంలో దాక్కుని. రాక్షస స్త్రీలు నయానా భయానా సీత మనసు మార్చ ప్రయత్నించడమూ గమనించాడు. రావణుడు నిష్క్రమించాక, రాక్షస స్త్రీలు నిద్రకి పడ్డాక .. ఆలోచించాడు. నేనిప్పుడు ఏ రూపంతో ఎదుటబడినా సీత నన్ను రామదూతగా నమ్మదు అని గ్రహించాడు. ఎలా ఆమెని నమ్మించడం. ఆమెకి అత్యంత ప్రీతి పాత్రమైన రామకథని గానం చెయ్యడం ఆరంభించాడు.

కథాగానం పూర్తయినాక ఆమె ముందు తన నిజ రూపంతోనే నిలబడ్డాడు. తనని తాను పరిచయం చేసుకున్నాడు. రామ సుగ్రీవుల మైత్రి గురించి చెప్పాడు. తన రామభక్తిని చెప్పుకున్నాడు. ఇంత చెప్పినా అతను అనుమానించినట్టే సీత నమ్మలేదు. చివరికి తల్లీ నన్ను నమ్మవమ్మా అని ఆక్రోశించాడు. అప్పటికి గానీ అతనికి రామ ముద్రిక సంగతి గుర్తు రాలేదు.

సీత హనుమంతుని గుర్తించిన తరవాత .. అదింకో సంగతి.

రాముడు నీయందు ఎంతో ఆర్తితో ఉన్నాడన్నాడు. రాముడి వెనక అఖండమైన వానర సైన్యం ఉందన్నాడు. నేనీవార్త వెనక్కి తీసుకు వెళ్ళగానే రాముడు ఆ సైన్యంతో లంక మీద దండెత్తుతాడన్నాడు. రావణుణ్ణి వధించి తీరుతాడు, నిన్ను చెర విడిపిస్తాడన్నాడు.

సీత సహజంగానే ఈ మాటలూ నమ్మలేదు.
ఈ సారి ఆమెని నమ్మించేందుకు అతని దగ్గర ముద్రిక ఏదీ లేదు.

చేసి చూపించాడు. తన నమ్మకం నిలుపుకున్నాడు.

మాటలు చెప్పడం తేలికే. చేసి చూపించడం కష్టం. కానీ నమ్మకం నిలుపుకునేందుకు అంతకు మించిన మార్గం మరోటి లేదు.

Comments

"మాటలు చెప్పడం తేలికే. చేసి చూపించడం కష్టం. కానీ నమ్మకం నిలుపుకునేందుకు అంతకు మించిన మార్గం మరోటి లేదు."
బహు చక్కటి మాట చెప్పారు గురూ గారూ..!
teresa said…
అవును గదా మరి!
పండుగ శుభాకాంక్షలు :)
>>మాటలు చెప్పడం తేలికే. చేసి చూపించడం కష్టం. కానీ నమ్మకం నిలుపుకునేందుకు అంతకు మించిన మార్గం మరోటి లేదు
అవునండీ నిజమే!! కానీ అన్నిసార్లు నమ్మకం కలిగించడం కోసం చేసి చూపించటం సాధ్యం అవుతుందంటారా? ఒక వేళ అలాంటి సందర్భం వస్తే? వితండవాదం(సరైన పదమేనా?) చేస్తున్నానని అనుకోవద్దు. చివరి లైను చదివిన వెంటనే నాకు స్పురించిన ఆలోచనను యధావిదిగా ఉంచుతున్నాను.
మోహన said…
సీత "హనుమంతుడి" మాటలు నమ్మలేదేమో కానీ... "రాముడు నీ చెర విడిపిస్తాడు" అన్న మాటను నమ్మలేదని ఎవరైనా అంటే... నేను నమ్మను. :)

టపా చదివి చాలా ఆనందం కలిగింది. ధన్యవాదాలు.
శేఖర్ .. వితండవాదమేం లేదు. జీవితంలో చాలా రకాల సందర్భాలు వస్తై. మాటల్తో నమ్మినట్టే కనిపిస్తారు, కానీ అది నిజమైన నమ్మకం కాదు. సరే నీ మాట విని నీకో ఛాన్సిస్తున్నా, నిన్ను నువ్వు ఋజువు చేసుకునేందుకు అనడం అన్న మాట. తరవాత మన చేతలు మన మాటల్ని బలోపేతం చేసినప్పుడే అసలైన నమ్మకం ఏర్పడుతుంది.
మోహన .. మీ సీతకి మీ రాముడి మీద అంత నమ్మకం ఉంటే మంచిదే! మా సీత కొంచెం ప్రపంచం చూసి, తెలుగు ఫెమినిస్టు సాహిత్యం చదివింది లేండి. అందుకని, రాముణ్ణే కాదు, ఎవర్నీ గబుక్కుని నమ్మెయ్యదు :)
మంచి మాట చెప్పారండి. "మన చేతలు మన మాటల్ని బలోపేతం చేసినప్పుడే అసలైన నమ్మకం ఏర్పడుతుంది" ఇది ఇంకా నిజం.
భావన said…
బాగుందండి కథ. ఈ కథ లో సీత కుంచెం ఫెమినిస్ట్ అన్నమాట, రాముడి కోసం ఏడవటం మానదు.. కాని వుట్టినే ఎవరిని నమ్మదు అన్నమాట.. :-)
మీ టపా చదవగానే నాకు మొల్ల రామాయణంలోని ఈ పద్యం గుర్తొచ్చింది:

ఉన్నాడు లెస్స రాఘవు
డున్నాడిదె కపులగూడి యురుగతి రానై
యున్నాడు, నిన్ను గొనిపో
నున్నాడిదె నిజము నమ్ము ముర్వీ తనయా!

ఈ ఒక్క పద్యాన్నే రెండు పీరియడ్లపాటు చెప్పారు మా తెలుగు టీచర్. అందుకే అలా గుర్తుండిపోయిందది.
చంద్రమోహన్, పద్యం బాగుంది.
మాటలకేంటి ఉచితంకదా. ఎవరైనా ఇష్టమొచ్చినట్టు మాట్లాడొచ్చు. కాని వాటికి చేతలు కూడ తోడైతే ఆ మాటలు కలకాలం నిలిచి ఉంటాయి. ఎవరైనా నమ్ముతారు. రైట్.

కాని ఈ కధ ఎందుకు చెప్పినట్టో అర్ధం కాలేదు.
మాట, చేతలు...???
Purnima said…
LOL! :)

మాటలూ - చేతలూ - ఒకరిపై ఒకరి నమ్మకాలూ! హమ్మ్..

చేతల్లో చాలా బలముందనుకున్నాను. But even actions got to be backed by words. చెప్పిన పని చెప్పినట్టు చేసేస్తే సరిపోదు, "చేశాను!" అని చెప్పగలగాలి, "చేయగల్గాను" అని చెప్పుకోగలగాలి. లేకపోతే అపార్థాలు, అనర్థాలు! చేతల వల్ల నమ్మకాలు నిలుస్తాయేమో, మాటలు లేకపోతే నమ్మకాలు ఏర్పడనే ఏర్పడవూ అని తెలుస్తున్న క్షణాన, ఈ టపా చదవకుండా ఉండుంటే బాగుండేది!