నేను చాలా రిస్క్ తీసుకుంటాను

ఇటీవలనే కంట పడిందీ పద్యం.
అనేక కారణాల వల్ల ఇది నాకు చాలా నచ్చింది.
చదివి మీకేమనిపిస్తోందో చెప్పండి.
చాతనైతే ఎవరు రాసి ఉంటారో ఊహించొచ్చు.
****
రిస్క్ తీసుకుంటాను.

మొదటి పెగ్గు
మొగుడు సీసాలో ఉన్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను
సాయంత్రం రొట్టెలోకి తైలం లేక నేను రోడ్డెక్కిన సమయానికి తను నిండుసీసాతో ఇల్లు చేరుకుంటాడు
జరగబోయేదేవిటో నా జ్ఞానదంతం సలపరించి చెబుతుంది
సోడాకోసం లోపలికొచ్చి అనవసరంగా నవ్విపోతాడు
గోడ మీద తెగకావిలించుకుని దిగిన హనీమూన్ ఫోటో వింత చూస్తూ వుంటుంది
సత్యనారాయణవ్రతం మాదిరి సరంజామా సిద్ధం చేసుకుని ఎంతో తన్మయంతో సీసా మూత తిప్పుతాడు
బుసబుసబుసా మైకం గ్లాసులోకి దూకుతుంది
శూన్యంలోకి ఛీర్స్ కొట్టి ఒక గుక్క తాగుతాడు
అఫ్కోర్స్! ఎంత తొందరలో ఉన్నా గానీ ఛీర్స్ మర్చిపోడు
పిల్లల కళ్ళకి గంతలు కట్టడం ఎలాగా అని నేను దారులు వెదుకుతూ వుంటాను
ఈ చెవి మాట ఆ చెవికి వినబడదు
ఎందుకంటే రెంటికీ మధ్య జానీవాకర్ ఉంది
అన్నట్టు నీ కొత్త చెప్పులు ఇంకా కరుస్తున్నాయా? వాడి ప్రశ్న
కరిచినా తప్పదు కదా, వాటితోనే కాపురం చేస్తున్నా! నా జవాబు.

రెండో పెగ్గు
మొగుడు సీసాలో ఉన్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను
మూతి ముందుకు చాపి రెండో పెగ్గు అందుకుంటాడు
హోంవర్కు మానేసి స్కేళ్ళతో బాదుకుని ఏడుస్తున్న పిల్లల తిక్క కుదరడం కోసం టీవీలో హారర్ సినిమా పెడతాను
కళ్ళు తేలేసి ముగ్గురూ అక్కడే పడివుంటారు.
ఇంట్లో ఈ సంత నాకొద్దు - గరిట విసిరి కొడతాను
నీ యిల్లు కాదిది, నా యిల్లు - ధడాల్న తలుపు మూస్తాడు
నీ యమ్మ నీ యక్క నీ యబ్బ మృదు సంభాషణ జరుగుతుంది
ఈ బూతు మాట ఆ బూతు మాటకి ఆనదు
ఎందుకంటే ఇద్దరి నాల్కల మీదా ఒకే ఉప్పు తిన్న రోషం వుంది
ఏ తప్పూ లేకూండా మా ఇద్దరి అమ్మ అక్క అయ్యలు వాళ్ళ వూళ్ళల్లో శీలం పోగొట్టుకుని నిలబడతారు
తెగకావిలించుకుని దిగిన హనీమూన్ ఫోటో భయంతో గోడని కరుచుకుంటుంది

మూడో పెగ్గు
ఇల్లంతా నిద్రకు జోగుతూ వుంటుంది
వున్నాడో పోయాడో చూడ్డం కోసం లోపలికి వెడతాను
పొట్ట చీల్చిన మిర్చీ బజ్జీ మాదిరి ప్రాణనాథుడు పొర్లుతూ వుంటాడు
తిండికి రమ్మని భుజం తట్టి చెబుతాను
చెప్పుల్ని మొగుడితో పోలుస్తావా ఎంత పొగరు - అంటూ చెయ్యి విసురుతాడు
అదే చేతిని వెనక్కి విరిచి గోడకేసి కొడతాను
ఈ దెబ్బ మాట ఆ దెబ్బకి చాలదు
ఇద్దరి మీదా ఒకే బ్రాండు సిగరెట్టు పొగ గొడుగు పట్టి వుంటుంది

నాలుగో పెగ్గు
కళ్ళు నిద్రపోతున్నా నేను మెలకువగానే వుంటాను
చెప్పుల్ని మొగుడితో కరిపిస్తావా ఎంత పొగరు
సీసాభూతం మొరుగుతూ వుంటుంది
మొరిగి మొరిగి మూలాలు తెగి పడేట్టు వాంతి చేస్తాడు
తెమడ తెమడగా అతని వ్యక్తిత్వం ఉట్టిపడుతుంది
పైజమా తడిసి ప్రభుత్వం మడుగు కడుతుంది

మొగుడు సీసాలో ఉన్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను
సిద్ధంగా వున్న నీళ్ళ బక్కెట్టు నెత్తిన దిమ్మరించగానే ఇటు సర్కారూ అటు జానీవాకరూ ఒకర్నొకరు తోసుకుంటూ తూములోకి పరిగెడతాయి
ఈ తూములో మాట ఆ తూముకి వినిపించదు
రెండింటి మీదా ఒకే మంత్రి వాగ్దానం అట్టకట్టి వుంటుంది
తెగకావిలించుకుని దిగిన హనీమూన్ జంట తటాల్న విడిపోయి ఇంకెవరితోనో లేచిపోతారు

మొగుడు సీసాలో ఉన్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను
***

Comments

జ్యోతి said…
భలే ఉంది :))
teresa said…
sad!
పద్యం మాత్రం అద్భుతంగా ఉంది. రాసింది మీరేనా?
జ్యోతి said…
hmm..ఇక్కడో తీగ తగిలింది. కొత్తపాళీగారు భార్య రిస్క్ గురించి చెప్పారు. నేను భర్త రిస్క్ చెప్పనా??

http://outsider2012.blogspot.com/2008/07/blog-post_26.html


దీని మూలం ఇంగ్లీషులో చూసినట్టు గుర్తు. దొరకగానే పట్టుకొస్తా. కాని రెండింటిలో యధావిధిగా భార్య ఇస్టోరీనే బెస్ట్. కదా తెరెసా... :) పాపం మందుబాబులు..
రాసింది నేను కాదోచ్!
ఇది చదవగానే జ్యోతిగారు లింకులో ఇచ్చిన "... రిస్క్ తీసుకోను" కవితే గుర్తుకొచ్చింది. ఆ కవిత ఆంధ్రజ్యోతిలో చదివినట్టు గుర్తు. ఆ కవిత స్ఫూర్తితోనే యీ కవిత, స్త్రీవాద కవయిత్రి ఎవరో రాసి ఉంటారని ఊహించాను. గూగులించేసరికి నా ఊహ నిజమే అని తెలిసింది. ఇదికూడా ఏదైనా పత్రికలో పడిందేమో తెలీదు.
నాకు మాత్రం మూల కవితే బావుందనిపించింది :-)
జ్యోతి said…
గూగులమ్మని అడిగితే ఈ పద్యం రాసింది ఎవరో తెలిసింది.. :)))
కొత్తపాళిగారు... మీరు పోస్ట్ చేసిన పద్యం చదివాక నాకు ఇది గుర్తొచ్చింది... వీలైతే ఒకసారి చూడండి...

ఎందుకంటే.. మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం...
జ్యోతి said…
ఒక మందుబాబు చెప్పిన కందం ఇది..

తాగనివాడజ్ఞానుడగు
తాగిన మనసు ఊయలలూగి తన్మయమయ్యెన్
తాగిన సర్వము తెలుయును
తాగుము బీర్, వైన్, విస్కీ తారకరామా...

అదన్నమాట సంగతి.. :)
పేరడీకన్నా అసలు కవితలోనే విషాదం హాస్యంతో కలిసి మనసుకు పట్టేలా వుంది.
బావుంది, మందు మాటలు మాబాగా చెప్పారు.

ఇలాంటి వచన కవిత ఓ సారి ఈనాడు లో ప్రచురితమైంది.ఎవరో మరాట కవి రాసారు అనుకుంట. చైతన్య గారి లింక్లో వున్న పోస్ట్ అదే.
చాలా చక్కగా చెప్పారు.మంచి కలేచ్షనండి.
harish said…
The original poem is in Marathi but the poet's identity is unknown. After translating it in whatever Telugu i knew [my mother tongue is Kannada], i showed it to my friend Prasada Murthy [30 minutes on TV 9 fame] who inturn read it to k. shiva reddy garu, shikhamani garu, aasha raju garu and gorati venkanna garu in the press club hyd. shiva reddy garu suggested to send it to andhra jyothi and to my surprise the poem got published on 28th july 2008, within 10 days of my sending it.

As Kamaeshwar Rao garu rightly pointed out, a poem by Kondepudi Nirmala garu, titled "risk teesukuntaanu" was published in andhra jyothi the very next week in response to my poem.

now my doubt is - is Kotta pali, the blog name of nirmalaji?
please clarify
ఈ కవితను తెనుగీకరించిన కన్నడ యువకుడు హరీష్ నా మిత్రుడు. ఇద్దరం మైసూర్లో కలిసి చదివాం. అభినందనలు.
@Harish - The parody which I republished here, is indeed by Kondepudi Nirmala. I am not her, nor does my blog have any connection with her. I found this in a poetry anthology, was fascinated by it, and wanted to share it.
rākeśvara said…
ఈ కవితని తెలుగులో మూడు అనువాదాల ద్వారా ఆంగ్లంలో ఒకటి ద్వారా చదవడం జరిగింది.
ఒక సారి ఎవరో రచ్చబండలోననుకుంట ఇమేజ్ రూపంలో పంపారు. అసలు మరాఠి అని విన్నట్టుగుర్తు.
ఎవరు రాశారు అన్నది కాదు ఎంత కిక్కెక్కింది అన్నది పాయింట్.

ఒక్క పెగ్గు తాగకుండా కింద పడి దోర్లుతున్నాం నవ్వలేక. లీలగా విషాదం ఉన్నా హాస్యం డామినేట్ చేసింది.

జ్యోతి గారి పద్యం కూడా బాగుంది. మందు బాబులెంత వేదాంతులో కదా.
Venhu said…
ఏమీ చెప్పలేకుండా ఉన్నాను.
బాలేదు అని చెప్పటానికి మనస్సాక్షి ఒప్పుకోదు.
బావుంది అంటే ఫ్రెండ్స్ పార్టీ ఇస్తున్నారానో, క్లైంట్ పేరు మీదో వంక చెప్పి తాగే మందు ఒప్పుకోదు.
అందుకే నేను సైలెంట్.
Unknown said…
ఇది రాసింది కొండేపూడి నిర్మల గారు...