ఇది సమీక్ష కానీ విమర్శ కానీ కాదు, కేవలం పరిచయం మాత్రమే.
పురాణ ప్రలాపం .. వ్యంగ్యవినోద ప్రసంగం:
పుస్తకం వెనక అట్ట నించి .. ఆధునిక మైథిలీ సాహిత్యంలో హాస్యావతారంగా వ్యంగ్య సమ్రాట్ గా ప్రసిద్ధికెక్కిన హరిమోహన్ ఝా విలక్షణా రచన ఇది. ఇందులో ఆయన సృష్టించిన అపూర్వమైన పాత్ర వికటకవి చిన్నాన్న, కావ్యశాస్త్ర వినోదానికి అపూర్వభంగిమలు ప్రసాదిస్తాడు. అన్ని వేద శాస్త్రాలూ ఆయన జిహ్వాగ్రాన ఉంటాయి. ఆయన శాస్త్రాలను బంతుల్లా ఎగరేసి ఆడుకుంటాడు. విశుద్ధ వినోద భావంతో మనోవినోద ప్రసాదం పంచి పెడతాడు. అందువల్ల అందరికీ ప్రేమపాత్రుడు. అంతేకాక ఆయన మన గుప్తజ్ఞాన సంపదను సాక్షాత్కరింపచేసే కన్ను కూడా!
నామాట: ఝాగారు మైథిలీ భాషలో రాసిన పుస్తకాన్ని ఆచార్య జె. లక్ష్మిరెడ్డి గారు చక్కటి తెలుగులోకి సరసమైన అనువాదం చేశారు. భాష హాయిగా సాగుతుంది, ఎక్కడా నట్లు పోకుండా. మూలంలోని వ్యంగ్యాన్ని, విరుపుల్ని వొడుపుగా పట్టుకున్నారు లక్ష్మిరెడ్డిగారు. ఇందులో వికటకవి చిన్నాన్న నిజంగానే రామాయాణాది కావ్యాలనుండీ, అనేక పురాణాలనుండీ, కొన్ని చోట్ల సాక్షాత్తూ వేద సంహితల నుండీ ఉదాహరణలు ధారగా కురిపిస్తూ తనదైన శైలిలో విశ్లేషిస్తూ, ఆధునిక జీవితానికి అన్వయిస్తూ అనర్గళంగా మనోహరంగా ఉపన్యసిస్తుంటాడు. ఒక గుప్పెడు సెన్సాఫ్ హ్యూమరు కూడా ఉంటే మంచిది. మచ్చుకి ఒక చురక - వికటకవిచిన్నాన్న శ్రీరామచంద్రుణ్ణి ఎడాపెడా దులిపేసి వాయించేశాక, నోరెళ్ళబెట్టిన కుర్రాడు అడుగుతాడు, అదేంటి చిన్నాన్నా, రాముడంతటివాణ్ణి ఇలా దులిపేశావే అని. చిన్నాన్నా అంటాడు చిద్విలాసం చిందిస్తూ .. రాముడి అత్తవారింటి పండితుణ్ణి, అల్లుడుగార్ని ఆమాత్రం హాస్యం చేసే అధికారం నాకుంది!
అదీ చమత్కారమంటే.
భారతీయ సనాతన సాహిత్యాన్ని గురించి ఆసక్తి ఉన్నవారికి ఈ పుస్తకం ఒక గొప్ప వరం. ఐతే, ఈ పుస్తకం చదివి జీర్ణించుకోవాలంటే గుండె ధైర్యం మెండుగా ఉండాలి. పిరికివారికీ ఉఫ్ఫంటే ఉలిక్కిపడేవారికీ కాదు ఈ పుస్తకం.
వివరాలు:
వేమన ఫౌండేషన్
హైదరబాదు - 040-2763 8527
260 పేజీలు, వంద రూపాయలు.
నవతరం తెలుగు కథ (1998 - 2008)
ఆధూనిక తెలుగు సాహిత్యానికి ఆటపట్టులైన కవిత, కథ, నవలలని పుస్తకాలుగా ప్రచురించడం అసాధ్యమై కూచున్న ప్రస్తుత వాతావరణంలో .. ఈ సమస్యని వొంటరిగా ఎదుర్కోనక్కర్లేదు, సమిష్టిగా సాధించుకుందాం అని కొందరు నవతరం కథా రచయితలు నడుంకట్టారు. వారధి సహకార రచయితల వేదికగా ఏర్పడ్డారు. వారి కృషికి తొలిఫలం, నవతరం తెలుగు కథ అనే సంకలనం, ఇటీవలనే వెలువడింది.
ఇరవై నాలుగు కథలున్నాయిందులో. గోపిని కరుణాకర్, స.వెం. రమేశ్ వంటి అనుభవజ్ఞుల రచనల సరసనే ఇప్పుడిప్పుడే తమ గొంతుల్ని వినిపిస్తున్న కె. ఎన్. మల్లీశ్వరి, కె. సుభాషిణి, ప్రశాంత్ వంటి వారి కథలూ ఉన్నాయి. ప్రతి కథ చివరా రచయిత ఫోన్నెంబరో, ఈమెయిలు ఎడ్రసో ఇచ్చారు .. ఇదొక అదనపు ఆకర్షణ. నవతరం రచయితలు పాఠకుల్ని వినడానికి సన్నద్ధులైనా రనుకోవచ్చు.
నామాట: నేనింకా పూర్తిగా చదవలేదు. అక్కడక్కడా రెండు మూడు కథలే చదివాను. బాగున్నై. పుస్తకం చక్కటి రూపంతో ముచ్చటైన అక్షరాలతో ముద్రితమైంది. కథల కోసమే ఈ పుస్తకాన్ని కొనుక్కోవచ్చు. మన కొనుగోలుతో రచయితల సహకార వేదికని బలపరుస్తున్నామనే ఆనందం అదనపు తృప్తినివ్వాలి మరి!
287 పేజీలు, 60 రూపాయలు.
అన్ని ప్రముఖ సాహిత్య పుస్తకాల షాపుల్లోనూ దొరకవచ్చు.
Comments