కబుర్లు జూలై 20

మూడున్నర గంటల సేపు తెలుగు సాహిత్య ప్రవాహంలో ఓలలాడి, గుండె బరువెక్కేలా మునకలేసి, మళ్ళీ అంతలోనే తేలికపడే చతురోక్తుల హాస్యంతో పైకి తేలి, కథసాహితివారి కథ 2008 సంకలనాన్ని తరచి చూసి, బోలెడు మధురానుభూతులు మూటగట్టుకుని ఇప్పుడే ఇల్లు చేరుకున్నాను.

ఆరెం ఉమామహేశ్వర్రావు ముఖతః తన కథల నేపథ్యాన్ని వినే అదృష్టం ఇంతవరకూ ఎవరూ పొందలేదేమో. ఇప్పటిదాకా రాసినవి ఎనిమిది కథలే అయినా, అందులో వొంటేపమాను, నోరుగల్ల ఆడది లాంటి కథల్ని సులభంగా మరిచిపోలేం. నిజజీవితంలోంచి పుట్టిన కథ, సజీవమైన వ్యక్తుల్లోనుంచి మలచిన పాత్రలే కథకి ఇటువంటి మరిచిపోలేని గుణాన్ని కలిగిస్తాయని మరోసారి గ్రహింపుకొచ్చింది ఆరెం చెప్పిన తన కథల కబుర్లు వింటే.

కథాసాహితి సంపాదక ద్వయం పాపినేని శివశంకర్, వాసిరెడ్డి నవీన్ కథ 2008 గురించి మా సభ చదువరులు చేసిన విశ్లేషణని సహృదయంతో విన్నారు. తమ సమాధానంలో, కథల ఎంపికలో ఎప్పుడూ రాజీ పడలేదనీ, ఎన్నో వొత్తిళ్ళూ వ్యక్తి విమర్శలూ ఎదురైనా తాము పెట్టుకున్న లక్ష్యం స్పష్టంగానే ఉన్నదనీ చెప్పారు. ఎప్పటికప్పుడు ఈ వార్షిక సంకలనాన్ని ప్రామాణికంగా మలిచేందుకే తమ కృషి జరుగుతొందన్నారు.

గతవారంలో సుప్రసిద్ధ ఏనార్బరు కళాసంత (Art Fair) జరిగింది ఓ నాలుగు రోజుల పాటు. మొత్తానికి నిన్న చివర్రోజున వెళ్ళి చూడగలిగాం. రచయిత ఆరెం, మిత్రుడు శ్రీనివాస్ (తెలుగు సినిమా నిర్వాహకుడు)ల తోడు అదనపు ఆహ్లాదాన్ని కలిగించింది. అమెరికాలో ఒక నగర వీధుల్లో అంతటి జనసందోహాన్ని చూడ్డం నాకెప్పుడూ ఒక గొప్ప థ్రిల్లునిస్తుంటుంది. ఆర్ధికమాంద్యం ఉంటే ఉంది గానీ, ఇదివరకన్నా ఆర్భాటంగానే సంత జరిగింది. ఆహ్లాదం, ఉత్తేజం కలిగించే మంచి కళాఖండాల్ని చూశాం.
కందిపప్పు పట్టుచీర

రాముడు శబరి ఎంగిలి తిన్న దృశ్యాన్ని హృద్యమైన పద్యమాలలో చిత్రించారు కొత్తబ్లాగరి సనత్ శ్రీపతి. చాలా పెద్ద విరామం తరువాత గొప్ప కామెడీతో గుండె డొల్ల సెంటిమెంటు కథతో మన ముందుకొచ్చారు లలితగారు. మీరూ ఒక లుక్కెయ్యండి.

Comments

మురళి said…
కొంచం అసూయగా ఉండండి.. ఆరెం ఏమన్నారో కొంచం వివరంగా రాయండి తర్వాతి టపాలో.. లింక్స్ ఒకసారి సరి చూడండి..సరిగా పనిచేయడం లేదు..
నిజంగానే ఆ సభలో లేనివాళ్ళు అసూయ చెందాల్సిన అనుభవమది మురళీ. తనవారి కథల్ని కథలుగా రాయాలి, నిజాయితీగా రాయాలి అని తపనపడే రచయిత ఎట్లాంటి అంతర్మథనానికి లోనవుతాడో వింపించింది ఆరెం మాటల్లో.
నేను రాసిందానికన్నా ఒక్క ముక్క ఎక్కువ చెప్పగలిగినా తప్పక చెప్పి ఉండేవాణ్ణే. ఆరెం చెప్పిన మాటల్ని శుకానువాదం చెయ్య ప్రయత్నించినా, లేక క్లుప్తంగా చెప్ప ప్రయత్నించినా అతను చెప్పిన విషయానికీ, చెప్పిన తీరుకీ రెంటికీ తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అందుకే ఏమీ చెప్పలేక అలా ప్రస్తావించి ఊరుకున్నాను.
శ్రీ said…
ఉమామహేశ్వరరావు గారి కథల నేపథ్యం గురించి వినే అదృష్టం నాకు కలిగింది.తన కథలతో నన్ను కూడా సూళ్ళూరుపేట,మన్నారు పోలూరు,కాలాస్త్రి కి తీసుకువెళ్ళారు.
teresa said…
Do you folks have an Audio record? I missed it :(
Sanath Sripathi said…
కొత్తపాళీ గారూ, మళ్ళీ దొరకదన్న విషయం తెలిసిన తర్వాత కూడా దొరకని దానిని గురించి ఊరించటం మీవంటి వారికి భావ్యమా?

ఊరకే అన్నను గానీ ఎన్నో సార్లు చాలా మందికి ఇట్లానే జరుగుతూంటుంది. అవధానాల్లో కూర్చున్నప్పుడు అప్రస్తుతప్రసంగం, పద్యంలో చమత్కృతి మళ్ళీ వర్ణిద్దాం అని చూసినా, అట్లాంటి ప్రయత్నం చేసినా ఆ అనుభూతి మాత్రం దొరకదు. చేసుకున్నవారికి చేసుకున్నంత అన్నట్టు "ఆ టైము లో, అక్కడ, అప్పుడు " అంతే. కాకపోతే మీ టపా వల్ల ఇట్లాంటి అవకాశం వస్తే మాత్రం మిస్స్ చేసుకోవద్దు సుమీ అన్న హెచ్చరిక అనిపించింది.

నా పద్యాల గురించి పరిచయం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. చిన్న సవరణ. "రాముడు శబరి ఎంగిలి తిన్న దృశ్యం" కన్నా.. అది "శబరి ఆశ్రమం లో పళ్ళ మనోవేదన"

నమస్సులతో సనత్
రాధిక said…
ఆ సభలో నేను లేనందుకు బాధగా వుంది.కొత్తపాళీ గారు ఇలాంటివి చెప్పి మేము కుళ్ళుకునేలా చేసున్నారు.
కధా సాహితి వారి కధ 2008 నేనూ కొన్నాను.ఒకట్రెండు కధలు చాలా నిరాశపరిచాయి.ఉత్తమ కధా సంకలనం అంటే మరి అన్ని కధలూ బాగుంటాయని ఆశించడంలో తప్పులేదనుకుంటాను.గుండెగోదారి లాంటి కధలు చాలా బాగున్నాయి.మళ్ళా ఇంకొక్క సారి తీరుబడిగా చదవాలి.
ఎంత అమెరికాలో వుంటున్నా ఒక కధల పుస్తకాన్ని 15$ పెట్టి కొనాలంటే కొంచెం కష్టమే.పుస్తకం మీద 5$ అని రాసి 15$ తీసుకున్నారు.అంత పెట్టి కొన్నందుకేమో కధలు ఇంకా బాగుంటే బాగుండును అనిపించింది.
సనత్ .. నిజం.
రాధిక .. అందుకే మా వూరొచ్చెయ్యండి. చలీ, గాలులూ, మంచూ మీ వూరికంటే తక్కువే. డె.తె.సా.స. సమావేశాలు అదనపు ఆకర్షణ. సెప్టెంబర్లో మళ్ళీ పెద్దయెత్తున సభలు జరుగుతాయట. ముందే చెప్తున్నా.
5$ అని పెట్టిన పుస్తకం 15 కి ఎవరు అమ్మారు? ఎక్కడ కొన్నారు? తానా సభల్లోనా? ఆ అమ్మే వాళ్ళని మీరు నిలదీసి ఎందుకడగలేదు?
Afsar said…
కొత్త పాళీ గారూ:

సభ వివరాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సాధారణంగా ఆరెం నోరు విప్పడు. నోరు లేని కథకుడు. అతని నోరు విప్పేలా చేసినందుకు సాహితీ మిత్రులకి కూడా థాంక్స్ చెప్పుకోవాలి.

ఆరెం ప్రసంగాన్ని ఈమాటలోనో ఎక్కడో రికార్డు చేస్తే బాగుంటుంది. లేకపోతే, ఆరెం తనే స్వయంగా కాగితం మీద పెట్టినా బాగుంటుంది.
రాధిక said…
డెట్రాయిట్ తెలుగు సమావేశాలా?తప్పక ప్లేన్ చెయ్యాలి.మావారికి ఇలాంటివి అస్సలు నచ్చవు.ఇప్పటినుండన్నా కాకాపట్టి ఒప్పించుకోవాలి :)
ఏమోనండి ఎవరమ్మారో తెలియదు.20$ ఇస్తే చిల్లర లేదు తరువాత ఇస్తామన్నారు.తరువాత పిలిచి ఐదు ఒక డాలర్ కాగితాలు చేతిలో పెట్టారు.ఇంకో పదొస్తాయి అంటే ఏమో ఇంతే అన్నారు.గొల్లపూడివారి మాటల్లో ములిగిపోయి వున్నానేమో ఇంక గొడవపడాలనిపించలేదు.కానీ ఆ ఎఫెక్టు చదివేటప్పుడు పడుతుందని అస్సలు అనుకోలేదు :) పిల్లాట]
అఫ్సర్, ధన్యవాదాలు. ఈ సభలూ హడావుడీ ముగిసినాక నేను సాధించిన ఒక ఘనకార్యం ఏంటంటే ఆరెం ఉమామహేశ్వర్రావుతో ఒక బ్లాగుకి శ్రీకారం చుట్టించడం. బ్లాగు ఉండడం వల్ల కలిగే లాభాలు, ఆయనలాంటి వాళ్ళు రాయాల్సిన అవసరాన్ని గురించి కూడ తెగ పోరాను. చూద్దాం, ఈ కథల కథల్ని తన బ్లాగులో ఏవన్నా రాస్తారేమో!

రాధిక, మీ క్షోభ పూర్తిగా అర్ధమయ్యింది. అందుకని నా వంటి అనుభవజ్ఞులు తిన్నగా నవోదయ దగ్గర్నించి కొనుక్కుంటారు. మరో మాట .. ఉత్తమ కథల సంకలనం అని వాళ్ళు చెప్పుకున్నా, వాళ్ళు కాక ఇంకెవరు చెప్పుకున్నా, ఆ సంకలనంలో ఉన్న ప్రతీ కథా, పుస్తకం కొన్న అందరికీ నచ్చడం అసంభవం. మొన్న మా సమితి చర్చలో దాదాపు అందరూ ఒప్పుకున్న విషయం ఒక మూడు కథలు స్టాండర్డుకి కొంచెం దిగువగా ఉన్నాయని.
Unknown said…
కొత్తపాళీ గారు అన్నట్లు - "పుస్తకం కొన్న అందరికీ నచ్చడం అసంభవం".
దీనికి ఒక మంచి ఉదాహరణ. రాధిక గారికి గుండెగోదారి బాగా నచ్చింది అన్నారు. చర్చలో పాల్గొన్న చాలా మందికి ఆ కథ అంతగా నచ్చలేదు. దాదాపు అలాంటి విషయం తోనే ఇంకా 2 కథలు ఉన్నాయి. మిగతా రెండింటికి దీనికన్నా మంచి మార్కులు వచ్చాయి.
ఉమామహేశ్వర రావు గరు బాగా మాట్లాడారు అనడం కన్నా ఆయన తన హృదయాన్ని పరిచారు అనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. బహుశః ఆయన కూడా ఆనాటి ఆ ఉద్వేగాన్ని అక్షరాల్లో పెట్టే సాహసం చెయ్యలేరేమో. నాకయితే వింటూ ఉంటే కన్నీరు ఒక్కటే తక్కువ.
ఇంక మీరు మా సెప్టెంబరు సమావేశానికి రాకుండా ఉండే సాహసం చెయ్యలేరేమో..