అమెరికా అంటే నాకిష్టం - రేడియో

నా మెట్టినిల్లు అమెరికా మొన్నీ మధ్యనే పుట్టిన్రోజు జరుపుకుంది.
దాన్ని గురించి ఆలోచిస్తుంటే .. తీగ తగిల్తే డొంకంతా కదిల్నట్టు .. ఏవేవో ఆలోచనలు.
నేనీ దేశం రావడం యాదృఛ్ఛికంగా జరిగింది. నేనిక్కడికి రావాలని గొప్ప ఆరాటం లాంటిదేమీ పడలేదు. అమెరికా వెళ్ళలేక పోతే నా జన్మ వ్యర్ధంలాంటి ఆవేశాలేవీ పళ్ళేదు. నా జీవితంలో అప్పటిదాకా జరిగిన అనేక ముఖ్య పరిణామాలన్నీ నా ప్రమేయం పెద్దగా లేకుండానే జరిగిపోయినట్టే ఇది కూడా జరిగింది. అప్పట్లో నా ఉద్దేశమల్లా .. ఇదొక అవకాశం. ఉపయోగించుకుని చూద్దాం ఏమవుతుందో .. అని మాత్రమే.

మొన్నటి జూలై 4 సందర్భంగా రేగిన ఆలోచనల్తో, అమెరికాలో నాకిష్టమైన విషయాల గురించి ఇక్కడ పంచుకుందామని బుద్ధి పుట్టింది. ఆ వరుసలో ఇది మొదటి టపా. ఈ వరుసకి ఒక ప్రాధాన్యత ఏమీ లేదు. నాకు గుర్తొచ్చినవి గుర్తొచ్చినట్టు రాస్తుంటాను.

నేషనల్ పబ్లిక్ రేడియో ప్రస్తావన నా టపాల్లో ఇంతకు ముందు చూసే ఉంటారు.
ఈ సంస్థ దేశరాజధాని వాషింగ్టన్ డీసీలో ఉంది. తానే అనేక కార్యక్రమాల్ని, ముఖ్యంగా వార్తలకి సంబంధించిన వాటిని, ప్రొడ్యూస్ చేసి ప్రసారం చేస్తుంటుంది. అంతే కాక తమ నెట్వర్కులో సభ్యులైన కొన్ని స్టేషన్లు ప్రొడ్యూస్ చేసే కార్యక్రమాలని తమ సర్వీసు ద్వారా బట్వాడా చేస్తుంది.

అందులో, ఫిలడెల్ఫియా నగరంలోని WHYY స్టేషన్లో తయారయ్యే ఫ్రెష్ ఏర్ (Fresh Air) కార్యక్రమం నాకు చాలా ఇష్టం. నిర్వాహకురాలు టెరీ గ్రోస్ (Terry Gross) ఈ కార్యక్రమాన్ని ఒక ఇంటర్వ్యూ ఫార్మాట్ లో నడిపిస్తారు. అనేక సమకాలిక సమస్యల గురించి ఎవరో ఒక్క వ్యక్తితో టెరీ సంభాషిస్తారు. మనకి ప్ర్ధాన మీడియాలో ఎక్కువగా కనిపించని వినిపించని ఉద్యమకారులు, సైద్ధాంతికులు, ఈ కార్యక్రమంలో వినిపిస్తారు. నటులు, దర్శకులు, రచయితలు, సంగీతకారులు ఈ కార్యక్రమంలో మనకి వినిపిస్తారు. ఈ షో ఎప్పుడూ పనిరోజు మధ్యలో, ఏ మధ్యాన్నం పన్నెండింటికో వస్తుంది. విద్యార్ధి రోజుల్లో లాబ్ కి మనమే మహరాజులం కాబట్టి లాబ్ లో రేడియో పెట్టుకుని తప్పక వినేవాణ్ణి. ఇప్పుడు జాలం పుణ్యమాని ఇంటికొచ్చాక పాడ్కాస్టులు వింటున్నా. ఇంటర్వ్యూ చెయ్యాలి అంటే టెరీ చేసినట్టు చెయ్యాలని నాకు అదొక స్టాండర్డ్ గా ఏర్పడిపోయింది. తన అతిథులతో మాట్లాడేటప్పుడు ఆమె సమయోచితంగా వినబరిచే ఆత్మీయత, ఆర్ద్రత, కొంటెతనం, అంతలోనే వారి ఆలోచనల లోతుల్ని కొలిచే నిశిత దృష్టి .. అన్నీ నాకు చాలా ఇష్టం. వియత్నాం యుద్ధం సమయంలో అమెరికా రక్షణమంత్రిగా పనిచేసిన మెక్నమారా ఇవ్వాళ్ళ చనిపోయారుట. ఆయనతో టెరీ 1995లో జరిపిన ఇంటర్వ్యూ పునః ప్రసారం ఇవ్వాళ్టి విశేషం.

నాకు అమితంగా నచ్చే ఇంకో కార్యక్రమం డయాన్ రీం షో (Diane Rehm Show). దీన్ని వాషింగ్టన్ డీసీలోని అమెరికన్ విశ్వవిద్యాలయపు రేడియో స్టేషన్ WAMU వారు నిర్మిస్తున్నారు. ఇది కూడా సంభాషణల ప్రోగ్రామే కానీ దీన్ని డయాన్ నడిపే విధానం ఫ్రెష్ ఏర్ కంటే భిన్నంగా ఉంటుంది. ఎక్కువగా ఈ కార్యక్ల్రమంలో సమకాలీన జాతీయ అంతర్జాతీయ సమస్యల మీద ముగ్గురు నలుగురు మేధావుల్ని అతిథులుగా పిలుస్తారు. డయాన్ సంభాషణకి దిశ నిర్దేశించడం, ఎప్పుడు ఎవరు మాట్లాడాలని సూచిస్తుండడమే కాక, మధ్య మధ్యలో ఆయా అతిథులు వెలిబుచ్చే అభిప్రాయాలకి సానబెట్టేలాంటి ప్రశ్నలు కూడా వేస్తుంటారు. అంతే కాక, శ్రోతలు కూడా ఈ కార్యక్రమంలో, ఫోను ద్వారా కానీ, ఈమెయిలు ద్వారా కానీ పాల్గొనవచ్చు, అతిథుల్ని ప్రశ్న లడగొచ్చు, లేదా చర్చ గురించి మన అభిప్రాయం చెప్పొచ్చు. అప్పుడప్పుడూ డయాన్ కూడా కళాకారుల్నీ రచయితల్నీ అతిథులుగా ఆహ్వానిస్తుంటారు. ఇవ్వాళ్టి కార్యక్రమంలో ఆఫ్రికన్ నవలా రచయిత్రి చిమమందా అడీచీ వెలిబుచ్చిన అభిప్రాయాలు నాకు చాలా నచ్చాయి.

అమెరికాలో నేషనల్ పబ్లిక్ రేడియోలో ఈ రెండు కార్యక్రమాలూ అంటే నాకు చాలా ఇష్టం.

Comments

hmmmm..మంచి ఆలోచన. అమెరికా కబుర్లన్నమాట.. చదువుతున్నాం...
మురళి said…
మన రేడియో వాళ్లెవరైనా ఇలాంటి ఆలోచన చేస్తే బాగుండును.. బాగున్నాయండి కబుర్లు..
శ్రీ said…
బాగున్నాయండీ కబుర్లు!

టైటిల్ "నేషనల్ పబ్లిక్ రేడియో అంటే నాకిష్టం" అని పెడితే బాగుండేదేమో?

--)
Anil Dasari said…
'మన రేడియో వాళ్లు ఇలాంటి ఆలోచన చేస్తే బాగుండు'

ఎంత దురాశ! ముందు వాళ్లని మాట్లాడటం నేర్చుకోమనండి. పది రోజుల క్రితం మొట్టమొదటి (& చిట్టచివరి) సారిగా అదేదో తెలుగు ఎఫ్.ఎమ్. ప్రసారం విన్నా (ఇంటర్నెట్‌లో). ఆ కుర్రాడు చక్కగా 'సంగీతం శ్రీనివాసరావు' (అచ్చు తప్పు కాదు. సంగీతమే) అనబడే దర్శకుడి సినిమాల విశిష్టత గురించి వివరిస్తున్నాడు!

అదే కార్యక్రమంలో కమల్ హసన్ మరియు 'రాధ' నటించిన స్వాతిముత్యం సినిమా విశేషాలు కూడా వివరించాడు ఆ కుర్రాడే.

అయ్యా. అదీ కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న మన రేడియో స్టేషన్ల నాణ్యత.
మీరు యాదృచ్చికంగా చెప్పిన అమెరికా కబుర్లు బాగున్నాయి.మీకు "నేషనల్ పబ్లిక్ రేడియో" అంటే ఇష్ట మైతే, నాకు నేను ౩ లో వుండగా వూరి రచ్చబండ రేడియో లో వినిపించే " ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కందుకూరి సూర్యనారాయణ" నాకిష్టం.