తెలుగెలా నిలుస్తుంది?

బ్లాగర్లు కొందరు తెలుగు భాష మనుగడ గురించి బాగా లోతుగా ఘాటుగా చర్చించారు ఇటీవల.
ఆ సందర్భంగా కొన్ని ఆలోచనలు. ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నది రాసే భాష గురించే, మాట్లాడే భాష గురించి కాదు.

ఆంగ్లం మూలంగానూ హిందీ మూలంగానూ తెలుగు మరుగున పడిపోతున్నది అనే ఆక్రోశం ఈనాటిది కాదు. 30లు 40లలో వచ్చిన అనేక కథల్లో వ్యాసాల్లో నవలల్లో కూడా ఈ ఆక్రోశం చూడచ్చు మనం. బాబోయ్, తొందరగా ఏమన్నా చెయ్యకపోతే మన కళ్ళముందే తెలుగు భాష కనుమరుగైపోతుందో అన్నంత ఆందోళన వ్యక్తపరిచారు ఆ తరం రచయితలు. మరి ఆ తరం దాటి డెబ్భయ్యేళ్ళ పాటు తెలుగు మనడమే కాక, ఈ గ్లోబలైజుడు కంప్యూటరైజుడు యుగంలో కూడా సజీవంగా మన నాలుకలమీద, మన కీబోర్డుల మీద, మన కంప్యూటరు తెరల మీద నాట్యమాడుతోంది గదా!

అలాగని ఆందోళన కలిగించే పరిస్థితులు లేవని నేననడం లేదు. ఏవిటా ఆందోళన కలిగించే పరిస్థితులు, వాటిని గురించి ఏమి చెయ్యాలి, ఎంత చెయ్యగలం .. ఇవన్నీ కొంచెం స్పష్టంగా ఆలోచించుకోవాలి, ఉద్యమాలకి ఉపక్రమించేముందు.

భాష సజీవం. జీవానికి గుర్తు మార్పు. అందుకని అది నిరంతరం మారుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఇదింక మారకూడదని శాసిస్తామో, ఇక ఆ భాషకి సమాధి కట్టినట్టే.

మన మనసుల్లో ఉన్న మాట చెప్పుకోడానికి, మన ఆలోచనలు పంచుకోడానికి, ప్రస్తుత పరిస్థితుల్ని చర్చించుకోడానికీ భాష ఉపయోగ పడాలి. ఈ ప్రయోజనం నెరవేర్చలేక పోయినప్పుడు భాష పాతబడిపోతుంది. ఇలా పాత బడినప్పుడు అది సమాధికి ఒక అడుగు దగ్గర వేసినట్టే. ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నది రాసే భాష గురించే, మాట్లాడే భాష గురించి కాదు.

గతమంతటా భాష ఒకేరకంగా లేదు. పద్య సాహిత్యంలోనే, నన్నయ భాష వేరు, శ్రీనాథుడి భాష వేరు, పెద్దన భాష వేరు. ఆధునిక యుగం వచ్చాక కూడా గురజాడ దగ్గిర్నించీ ఇప్పటి వరకూ భాష మారుతూనే ఉంది, ఆయా కాల పరిస్థితులకి తగినట్టు.

శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు రాసిన వ్యాసాలు చదువుతున్నానీమధ్య. అకస్మాత్తుగా ఒక విశేషం కనబడింది వారిద్దరి రచనల్లోనూ. ఆంగ్లాన్ని చాలా తక్కువ ఉపయోగించారు వారు. వారిద్దరి ఆంగ్ల భాషా పరిజ్ఞానం, సాహిత్య పరిజ్ఞానం ఏమీ తక్కువకాదు మళ్ళీనూ. సంక్లిష్టమైన అనేక సామాజిక సాహిత్య విషయాల్ని చక్కటి తెలుగులో రాశారు, ఆంగ్లమ్మీద ఆధారపడకుండానే. మనమేమో, ఏదో రోజువారీ సంభాషణ కాక కొద్దిగా జటిలమైన విషయం గురించి ఒక్క వాక్యం రాయాలన్నా, హమ్మో ఇంగ్లీషు వాడకుండా ఎలాగు? అనుకుంటూ అందోళనలో పడిపోతున్నాం.

తెలుగులో కంప్యూటరు, ఫైలు, ఇత్యాది పదాల్ని వాడాలా వొద్దా అని ఒక వివాదం. ఆ సామర్ధ్యం ఉన్నవారు ఇటువంటి అనేక పదాలకి తెలుగు సమానార్ధకాల్ని ప్రతిపాదించి వాడుతున్నారు. వాటిల్లో కొన్నిటికి కొంత జనాదరణ లభిస్తున్నది కూడా, కనీసం బ్లాగర్లలో. ఈ గోలంతా ఎందుకూ, ఆంగ్లపదాలనే ఉపయోగిస్తే పోలేదా అని కొందరి వాదన. వాదన, చర్చ మంచిదే కానీ అది అవహేళనకి దారి తీస్తే మొదటికే మోసం వస్తుంది. ఇలా ప్రతిపాదిస్తున్న పదాలేవీ మాంత్రికుడు హాంఫట్ అని మాయాదర్పణంలోంచి పుట్టించినవి కావు, ఎప్పటినించో ఉన్నవే. వాడుక లేక మరుగున పడిపోయాయి. ఉదాహరణకి ఫైలుకి కవిలె, దస్త్రం అనే పదాలు వాడుకలో ఉండేవి. ఇప్పుడు మళ్ళీ వాటికి బూజు దులిపి కంప్యూటరు ఫైలు అనే అర్ధంలో వాడితే, కొన్నాళ్ళు కొత్తగా ఉండొచ్చుగానీ అందులో ఎగతాళి చెయ్యాల్సినదేమీ లేదు.

ఈ విషయంలోనే రెండు ముచ్చట్లు చెప్పాలి. కథలకి కావలసిన భాష వేరు, కవిత్వానికి కావలసిన భాష వేరు, సాంకేతిక శాస్త్రీయ వ్యాసాలకీ చర్చలకీ కావలసిన భాష వేరు. శాస్త్ర చర్చల్లో భాష జనసామాన్యానికి అందుబాటులో ఉండే భాష కాదు. మనలో నాకు బాగా ఇంగ్లీషు వొచ్చు అనుకున్న వాళ్ళలోనే ఒక ఆంగ్ల సాహిత్య విమర్శని, ఒక సామాజిక శాస్త్ర చర్చని, ఒక ఆర్ధిక శాస్త్ర విశ్లేషణని ఎంతమందిమి క్షుణ్ణంగా అర్ధం చేసుకో గలం? అందుకని మనం చర్చిస్తున్నది సాంకేతిక పరిభాష గురించి కాదు. కాస్తో కూస్తో చదువుకున్న వారందరికీ నాలుగు విషయాలూ మాట్లాడుకునేందుకు అందుబాటులో ఉండే భాష గురించి. శాస్త్ర చర్చలకి కావలసిన పారిభాషిక పదాల్ని ఆయా వర్గాలు సృష్టించుకుంటాయి.

రెండో ముచ్చట, మనం గుర్తు పెట్టుకోవాల్సింది, మార్పు ఒక్కోసారి పని గట్టుకుని ప్రయత్న పూర్వకంగా తేవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వాడుక భాషలో రాసుకుంటున్నాం అంటే, దానికి సుమారొక వందేళ్ళ క్రితం ఒక కురుక్షేత్ర సంగ్రామమే జరిగింది. ఆ యుద్ధంతో పోలిస్తే, ఇప్పుడు భాషగురించి జరుగుతున్న చర్చలు, వాదోపవాదాలూ పిల్లలాటలాగా ఉంటాయి.

Comments

Purnima said…
Point well made!
Anonymous said…
well said
teresa said…
తెలుగులోనే కామెంటాలనే రూలు సడలించినట్టున్నారు! అదీ తెలుగు భాష మీది టపాకి :)
వ్యాఖ్యలు పూర్తిగా తెలుగులో కానీ పూర్తిగా ఇంగ్లీషులో కానీ ఉండాలని నా మనవి
ఓప్పేసుకున్నా!
అసలు తెలుగు భాష కనుమరుగైపోతోందన్న ఊహే ఒక పెద్ద అపోహ. ఇంత దర్జాగా బ్రతికేస్తుంటే సమస్య ఎక్కడుంది?