కబుర్లు - ఎన్నికల స్పెషల్!

వీక్షణం (రాజకీయార్ధిక సామాజిక మాస పత్రిక) ఏప్రిల్ సంచిక సంపాదకీయం

ఎన్నికలు ఏం సాధిస్తాయి?

ఈ సంపాదకీయం మీరు చదువుతున్న సమయానికి రాష్ట్రంలో శాసనసభకూ, లోక్సభకూ మొదటి విడత అభ్యుర్ధులు ఖరారయిపోయి నామినేషన్లు ఘట్టం ముగిసిపోయి ముమ్మరంగా ప్రచారం మొదలయి ఉంటుంది. రానున్న రెండు మూడు వారాలలో రెండు విడతల ఎన్నికలు కూడా ముగిసిపోయి ఫలితాల కోసం నెలరోజుల నిరీక్షణ మొదలవుతుంది. ఈ మొత్తం క్రమంలో అటు చట్టసభల అభ్యర్ధిత్వం ఆశించేవారు, అంతిమంగా పోటీ చేసేవారు, వారి అనుచరగణం, ప్రభుత్వ యంత్రాంగం, ప్రచార మాధ్యమాలు చేసే హడావుడే కనబడుతోంది వినబడుతోంది. ఈ సంరంభంలో ప్రజల పాత్రగాని, ప్రజలకు అవసరమైనది గాని, ప్రజలకు దక్కేది గాని ఏమైనా ఉన్నదా అని చూస్తే చేదు నిజాలు బయటపడుతున్నాయి. ప్రజల పేరు మీద, తమ ప్రతినిధులను ఎన్నుకునే ప్రజల హక్కు పేరు మీద, వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తూ జరుగుతున్న ఈ ఎన్నికల ప్రహసనంలో ప్రజల పాత్ర నామమాత్రమే. రెండు వారాల పాటు శ్రోతలుగానూ, ప్రేక్షకులుగానూ, ఎన్నికల రోజున కొన్ని గంటలు క్యూలో నిలబడి, రెండు నిమిషాల్లో బేలట్ పై తమ ముద్ర కొట్టేవారిగానూ తప్ప అంతకన్నా ఎక్కువ పాత్ర ప్రజలకు లేదు. ఎవరి పేరు మీద ఈ నాటకం నడుస్తున్నదో వారికి ఆ నాటకంలో ఇంత తక్కువ పాత్ర ఉండడం హాస్యాస్పదమైన శోచనీయమైన విషయమని కూడ ఎవరికీ అనిపిస్తున్నట్టు లేదు. ప్రజల పాత్ర లేదంటే ప్రజల ప్రస్తావన లేదని కాదు. నిజానికి జరిగే తంతంతా ప్రజలు, ప్రజలు, ప్రజలు అనే మంత్రం జపిస్తూనే జరుగుతున్నది. కానీ ప్రజలంటే ఎవరు? వారి జీవితం ఎలా గడుస్తున్నది? ఆ జీవితాన్ని మెరుగు పరచడానికి ఏమి చేయవలసి ఉన్నది? తమ చేతికి అందబోతున్న విధాన నిర్ణ్యాధికారాన్ని, విధానాల అమలు అధికారాన్ని ఆ ప్రజాజీవితాన్ని మెరుగుపరచడానికి ఏ విధంగా ఉపయోగించబోతాము, తీవ్రమైన అంతరాలు ఉన్న సమాజంలో కనీస రాజ్యాంగ లక్ష్యాలనైనా నెరవేర్చడానికి ఎటువంటి చర్యలు చేపట్టబోతాము అనే మౌలిక ప్రశ్నలైనా ఈ ప్రజానామ జపంలో వినబడడం లేదు. అన్ని రాజకీయ పక్షాలు పేరుకు ఏవో కొన్ని వాగ్దానాలతో ఎన్నికల ప్రణాళికలు ప్రకటిస్తాయి. ఆ వాగ్దానాలను అమలు చేయనక్కరలేదనీ, చేయవలసిన బాధ్యత ఏమీలేదనీ, కేవలం ప్రజలను ఆకర్షించేందుకే ఆ వాగ్దానాలు చేస్తున్నామనీ అన్ని రాజకీయ పక్షాలకూ చాలా స్పష్టంగా తెలుసు. రాజకీయార్ధిక సామాజిక వ్యవస్థలో మౌలికమైన మాపు జరగకుండా కేవలం ఒకరి చేతినించి మరొకరికి అధికారం మారినంత మాత్రాన ప్రజాజీవితంలో ఎటువంటి మార్పూ రాదనే వాస్తవాన్ని ప్రజలు గ్రహించకుండా చూడడానికే ఈ ఎన్నికల తతంగం నడుస్తోంది. ఏదో మార్పు జరగబోతున్నదనో, జరిగే అవకాశం ఉన్నదనో ప్రజలను మోసపుచ్చేందుకే ఐదేళ్ళకోసారి ఈ ఎనికల తతంగం నడుస్తోంది. వ్యవస్థ మౌలికంగా మారాలని కోరుకునే ప్రజలకు గానీ, రాజకీయ పక్షాలకు గానీ ఈ ఎన్నికల క్రీడలో పాల్గొనే అవకాశమే లేదు. ఒకవేళ ఉన్నచోట గూడ నామమాత్రంగానైనా ప్రదర్శన వస్తువుగానైనా రాజ్యాంగం హామీ ఇచ్చిన ఆ సమాన భాగస్వామ్య అవకాశాన్ని వాడూకుని అధికారానికి వచ్చిన ప్రభుత్వాలు చేయగలిగిందేమీ లేదని చరిత్రలో అనేకసార్లు రుజువైంది. అటువంట్ ప్రభుత్వాలేర్పడి ప్రజల పట్ల నిబద్ధతతో, చిత్తశుద్ధితో ప్రవర్తించగలిగిన వ్యక్తులో, శక్తులో ఉన్నా వారిని ఎక్కువకాలం పనిచెయ్యనివ్వనంత బలమన స్వార్ధ ప్రయోజన శక్తులు, పాలకవర్గాలు ఉన్నాయి. అందువల్ల దీర్ఘకాలికంగా ఎన్నికలతో సాధించగలిగింది ఏమీలేదనే అవగాహనను కలిగి ఉంటూనే స్వల్పకాలిక ప్రయోజనాల కొరకు ఎన్నికలు ప్రజలకు ఉపయోగపడతాయా ఆలోచించాలి. ఈ సందర్భంగానయినా ప్రజలు రాజకీయ పక్షాలను అభ్యర్ధులను నిలదీయవచ్చు, ప్రశ్నించవచ్చు. వ్యవస్థ ఎవరి ప్రయోజనాల కొరకు పనిచేస్తున్నదో ఎండగట్టవచ్చు, ప్రజానామజపం బదులుగా, నిజంగా ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కొరకు ఎవరు ఏమి చేస్తారో, ఎట్లా చేస్తారో అడగవచ్చు. తమ గత ప్రజావ్యతిరేక చరిత్రకు ఎలా పశ్చాత్తాపం ప్రకటిస్తారో నిలదీయవచ్చు.

ప్రశ్నించడమే ప్రజలకు మిగిలి ఉన్న ఏకైక మార్గం.

ప్రతులకు:
veekshanam2003 at gmail dot com
reachcdrc at yahoo dot com
040-6684 3495

Comments

Unknown said…
చీకట్లో చిరుదీపం లాగా 'లోకసత్తా' కనిపిస్తోంది. ఈనాటి ఈ చిన్ని దీపం మరిన్ని దీపాల కాంతులను జత చేసుకొని అందరికీ వెలుగులు పంచే కొండంత దీపంగా వెలుగొందుతుందన్న ఒక చిన్ని ఆశ.
asha said…
పైన చెప్పినట్లుగా నా ఆశలన్నీ లోక్ సత్తా పైనే ఉన్నాయి.
ఫలితాలు కొంచమైనా అనుకూలంగా వస్తాయని ఆశిస్తున్నాను.
ప్రశ్నించడమే ప్రజలకు మిగిలి ఉన్న ఏకైక మార్గం. బాగా చెప్పారు
Hema said…
బావున్నాయండి మీ బ్లాగులు .

నేను ఒక కొత్త కధ/సంఘటన రాసాను . Hope u ll like it .
Anonymous said…
I like your blog and its contents.
But for this article, i have seen many complaining about politics...
I'd appreciate if you have given your vote!! with out that no one has the right to blame anyone.